సినిమా రివ్యూ:
చిత్రం: ఓ బేబీ
నటీనటులు: సమంత, లక్ష్మి, రాజేంద్రప్రసాద్, మాస్టర్ తేజ, రావు రమేష్, ప్రగతి, స్నిగ్ధ, జగపతిబాబు, నాగశౌర్య, ఊర్వశి, ప్రియదర్శి పులికొండ తదితరులు
ఎడిటింగ్: జునైద్ సిద్ధికీ
సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్
సంగీతం: మిక్కీ జే మేయర్
నిర్మాతలు: డి.సురేష్‌బాబు, సునీత తాటి, టిజి విశ్వప్రసాద్
నిర్మాణం: సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ
దర్శకత్వం: నందిని రెడ్డి
విడుదల తేదీ: 05 జులై 2019
క్లుప్తంగా చెప్పాలంటే..
సావిత్రి అలియాస్ బేబీ (లక్ష్మి)కి 70 ఏళ్ళు. చిన్ననాటి స్నేహితుడు చంటి (రాజేంద్రప్రసాద్)తో కలిసి ఓ క్యాంటిన్‌ని నిర్వహిస్తుంటుంది. వృద్ధాప్యం కారణంగా వచ్చిన చాదస్తం కారణంగా లక్ష్మి, కుటుంబ సభ్యులకు కొంత ఇబ్బందికరంగా మారుతుంది. మరోపక్క, కోడలు (ప్రగతి)కి గుండెపోటు వస్తుంది. దానికి కారణం బేబీ చాదస్తమేనని కుటుంబ సభ్యులు భావిస్తారు. దాంతో ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది బేబీ. అయితే, అలా వెళ్ళిపోయిన బేబీ, అనూహ్యంగా 24 ఏళ్ళ వయసున్న అమ్మాయి స్వాతి (సమంత)గా మారిపోతుంది. బామ్మ వయసు అలా ఎలా తగ్గిపోయింది.? అందమైన భామలా ఎలా మారిపోయింది.? భామగా మారిన బామ్మ, తన కుటుంబ సభ్యులకు దగ్గరయ్యిందా? లేదా? వృద్ధురాలైన తన తల్లి, తన కుమార్తె వయసుకు వచ్చేశాక బేబీ కొడుకు శేఖర్ (రావు రమేష్) పరిస్థితేంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
మొత్తంగా చెప్పాలంటే..
అక్కినేని సమంత మరోమారు నటిగా సత్తా చాటింది. నటన పరంగా ఆమెకు కెరీర్ బెస్ట్ అనదగ్గ రీతిలో ఈ సినిమా ఎప్పటికీ నిలిచి వుంటుంది. సమంత తప్ప ఇంకెవర్నీ ఆ పాత్రలో ఊహించుకోలేం. ఎమోషన్స్‌ని పండించడంలో సమంత మాస్టర్ డిగ్రీ సంపాదించేసిందన్పిస్తుంది. సినిమా మొత్తాన్నీ తన భుజస్కంధాలపై అత్యంత బాధ్యతాయుతంగా మోసేసింది సమంత.
సీనియర్ నటి లక్ష్మి పాత్ర ఈ సినిమాకి మరో ప్రధాన ఆకర్షణ. ఎన్నో సినిమాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రలు చేసేసిన లక్ష్మి, ఈ సినిమాలో తన అనుభవాన్నంతా రంగరించారు. వృద్ధురాలైన బేబీ పాత్రలో లక్ష్మి కాకుండా ఇంకెవర్నీ ఊహించుకోలేం. ఈ సినిమాకి మూడో ప్రధాన ఆకర్షణ రాజేంద్రప్రసాద్. సినిమా అంటటా బేబీతోపాటే దాదాపుగా కన్పిస్తారాయన. రాజేంద్రప్రసాద్ తనదైన టైమింగ్‌తో అదరగొట్టేశారు.
రావు రమేష్, తేజ, నాగశౌర్య.. ఇలా ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రల్లో చాలాబాగా చేశారు. జగపతిబాబు, అడివి శేష్ అతిథి పాత్రల్లో మెరిశారు. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర బాగా చేశారు.
కథ మనకి పెద్దగా పరిచయం లేనిది. కొరియన్ సినిమా 'మిస్ గ్రానీ'ని తెలుగులోకి రీమేక్ చేశారు. కథనం బావుంది. డైలాగ్స్ ఆకట్టుకుంటాయి, నవ్విస్తాయి, ఆలోచింపజేస్తాయి కూడా. ఎడిటింగ్ ఓకే. సంగీతం ఆకట్టుకుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది. సినిమాటోగ్రఫీ సూపర్బ్. ఆర్ట్, కాస్ట్యూమ్స్ సినిమాకి అవసరమైన మేర ఉపయోగపడ్డాయి. నిర్మాణపు విలువలు చాలా బాగున్నాయి.
రీమేక్ సినిమాలన్నీ నల్లేరు మీద నడక.. అని చెప్పలేం. కానీ, క్లాసిక్ సినిమాల్ని రీమేక్ చేసేటప్పుడు అందులో 'సోల్' చెడిపోకుండా, నేటివిటీని యాడ్ చేస్తే.. ఆ కిక్ చాలా బావుంటుంది. ఇక్కడ, ఈ సినిమా విషయంలో దర్శకురాలు నందిని రెడ్డికి మంచి మార్కులే పడ్డాయి. అయితే సెకెండాఫ్‌లో కొంత సాగతీత అన్పిస్తుంటుంది. అదొక్కటీ సినిమాకి కొంత మైనస్. ఓవరాల్‌గా సినిమా అందరూ మెచ్చేలానే తీర్చిదిద్దారు. నటీనటుల్ని ఎంపిక చేసుకోవడంలోనే దర్శకురాలు మంచి మార్కులు కొట్టేశారు. కొంచెం ట్రిమ్ చేయగలిగి వుంటే, 'సాగతీత' అన్న అపవాదు నుంచి తప్పించుకునేదే. ఓవరాల్‌గా ఓ మంచి సినిమా చూసిన అనుభూతిని అయితే మిగుల్చతుందీ చిత్రం.
అంకెల్లో చెప్పాలంటే..
3/5
ఒక్క మాటలో చెప్పాలంటే..
బేబీ.. అదిరిందిలే.!
|