స్వాతంత్య్ర దినోత్సం శుభాకాంక్షలు తెలుపుతూ 'సైరా' టీమ్ మేకింగ్ వీడియోని రిలీజ్ చేసింది. తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాధ ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోన్న సంగతి తెలిసిందే. న భూతో న భవిష్యతి అనేలా యాక్షన్ ఘట్టాలు ఉండబోతున్నాయని మేకింగ్ వీడియోలో చెప్పకనే చెప్పేశారు. కీలక పాత్రధారుల పాత్రలను పరిచయం చేస్తూ కట్ చేసిన మేకింగ్ వీడియో మెగా అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. హాలీవుడ్ స్టంట్ టెక్నీషియన్ల భారీ పనితనం, రత్నవేలు సినిమాటోగ్రఫీ ప్రతీ ఫ్రేమునీ అత్యద్భుతంగా చూపిస్తోంది. అమిత్ త్రివేది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వెంట్రుకలు నిక్కబొడుచుకునేలా చేస్తోంది.
భారీ విజువల్స్, ముఖ్య తారాగణాన్ని పరిచయం చేసిన తీరు ఆకట్టుకుంటోంది. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ పాత్ర మొదలుకొని, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, నయనతార, తమన్నా, రవికిషన్, నిహారిక.. ఇలా ఒక్కొక్కరి పాత్రను అత్యద్భుతంగా తీర్చి దిద్దారు. వీడియో చివర్లో మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లింది. ఇంతవరకూ ఈ సినిమాపై ఉన్న అంచనాలే అద్భుతం అంటే, ఈ మేకింగ్ వీడియో చూశాక, మాటల్లేవ్, మాట్లాడుకోవడాల్లేవ్ అనే రీతిలో అభిమానులు సంబరపడిపోతున్నారు. అన్నట్లు ఈ మేకింగ్ వీడియోలో బిగ్‌బీ అమితాబ్‌తో కలిసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కనిపించిన తీరు ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది.
|