Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఏది జరిగినా - కందర్ప మూర్తి

edi jarigina

ఉత్కళ రాజ్యాధీసుడు శరభూపాలుడు సుభిక్షంగా రాజ్యాన్ని పాలిస్తున్నాడు . దానికి కారణం ఆయన ప్రధానమంత్రి సుబుద్ధి ఆలోచనా విధానం , చక్కటి కార్యాచరణే. అనేక యుద్ధాల్లో ప్రధాన మంత్రి బుద్ధి కుశలతతో విజయాలు సాధిస్తున్నారు. ఏ సంఘటన జరిగినా మన మంచికే అంటూ మహామంత్రి తేలిగ్గా తీసుకుంటారు. అందుకు ఒక్కొక్కసారి మహరాజు విభేదిస్తుంటారు.  ఒక సంవత్సరం రాజ్యంలో మిడతల దండు కారణంగా పంటలు నాశనమయాయి.అదీ మంచికే జరిగిందని  ప్రధానమంత్రి సంతోషం ప్రకటించారు. అందుకు మహరాజు ఉగ్రుడయాడు. కాని ఫలితం మంచిగానే వచ్చింది. చీడపీడలతో పంటలు దిగుబడి తగ్గిన సమయంలో మిడతల దండు  దాడి కారణంగా చీడపీడలు నాశనమై పంటల ఉత్పత్తి పెరిగి ఖజానాకు ఆదాయం పెరిగింది. మహరాజు ఏకైక పుత్రుడు మకరంధుడు , మహామంత్రి కుమారుడు బుద్ధిదేవుడు బాల్య మిత్రులు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగి పెద్దవారయారు. యుద్ధ తంత్రం , ఖడ్గ యుద్ధం, విలువిద్య కలిసి అబ్యసించేవారు. ఎక్కడికెళ్లినా కలిసే వెళ్లేవారు. 

ఒకసారి మిత్రులిద్దరూ కత్తి యుద్ధం అబ్యసిస్తున్న సమయంలో బుద్ధి దేవుడి కత్తి తగిలి మకరంధుడి చేతి చిటికెన వేలు తెగిపోయింది. అది తెలిసి మహరాజు బాధ పడుతూంటే మహామంత్రి సుబుద్ధి అదీ మంచికే  జరిగి ఉంటుందని వ్యాఖ్యానించాడు. అందుకు మహరాజు ఆగ్రహం చెంది మంత్రి కుమారుణ్ణి చెరసాలలో బంధించమని ఆదేసించాడు.దానికి కూడా మహామంత్రి చింతించకుండా ఏది జరిగినా మంచికే  అయి ఉంటుందని ఊరట చెందాడు. మకరంధుడు మిత్రుణ్ణి క్షమించమని మహరాజును వేడుకున్నా ప్రయోజనం లేకపోయింది.

మిత్రుడు వెంట లేకపోవడం యువరాజుకి ఎంతో లోటు కనబడేది. యువరాజుకి  అడవిలో వేట అంటే  ఇష్టం. ఒకసారి యువరాజు మకరంధుడు ఒంటరిగా రాజభటులు వెంట రాగా అడవికి  జంతువుల వేటకు బయలుదేరాడు. ఒక లేడిని వేటాడుతూ సైనికుల నుంచి వేరుపడి  దారి తప్పాడు. సాయంకాలమైంది.రాజ భటులు ఎంత వెతికినా యువరాజు జాడ తెలియలేదు.  వెతికి వెతికి   రాజభటులు విచార వదనాలతో రాజ్యానికి వచ్చి ఆ వార్త మహరాజుకు చెప్పారు. మహరాజు ఖిన్నుడయాడు.మంత్రి ఊరడించి సైనికుల్ని అడవికి పంపి యువరాజుని రక్షిస్తానని ధ్యైర్యం  చెప్పాడు. దారి దొరక్క అడవిలో తిరిగి అలసిపోయిన యువరాజు మకరంధుడు అశ్వం దిగి పెద్ద చెట్టుకింద శ్రమిస్తున్నాడు. అటుగా వచ్చిన అడవి కోయలు యువరాజును బంధించి గూడెంలోని కోయదొర దగ్గరకు తీసుకువచ్చారు. బలిష్టంగా యువకుడిగా ఉన్న మకరంధుడిని చూసి కోయదొర  కొండదేవతకి నరబలి ఇద్దామని, బలికి సిద్ధం చెయ్యమన్నాడు.

 వారి సంప్రదాయ ప్రకారం కోయలు యువరాజును శరీరానికీ ముఖానికీ వివిధ రంగులు పూసి పక్షిఈకలతో, ఆకులు పువ్వులతో అలంకరించి చేతులు వెనక్కి బంధించి బండి మీద వెదురు బొంగుతో నిలబెట్టి డప్పులు కొమ్ముబూరాలు వాధ్యాలతో నాట్యం చేస్తూ కొండ దేవత మోద కొండమ్మ  గుడి దగ్గరున్న బలిపీఠం ఎక్కించారు. శిరచ్ఛేదం చేయనున్న కోయపూజారి పూజ నిర్వర్తిస్తున్న సమయంలో యువరాజు చేతిని చూసి " దొరా ! ఈ చిన్నోడి చేతికి ఒక వేలు లేదని " గట్టిగా అరిచాడు.  కోయ ఆచారం ప్రకారం కొండదేవతకి బలిచ్చే ప్రాణికి అంగలోపం
ఉండకూడదు.  కోయదొర ఆజ్ఞానుసారం నరబలి ఆగిపోయింది.

మహామంత్రి పంపిన సైనికులు అడవిలో యువరాజు కోసం గాలిస్తూంటే యువరాజు అశ్వం కంటపడింది.దారిలో దొరికిన వస్త్రాన్ని బట్టి కోయగూడేనికి చేరుకుని  యువరాజును రక్షించి కోటకు చేర్చారు సైనికులు.కుమారుణ్ణి చూసి  మహరాజు పరమానంద భరితుడయాడు.   యువరాజు అడవిలో జరిగిన వృత్తాంతం చెప్పగానే మహరాజు శరభూపాలిడికి మహామంత్రి ఆంతర్యం అర్థమైంది. యువరాజు చేతికి వేలు లేనందున  ప్రాణాలతో బయట పడ్డాడని అవగతమైంది.  వెంటనే మహామంత్రి సుబుద్ధిని ఆహ్వానించి తన తప్పిదం వల్ల మంత్రి కుమారుడు కారాగారానికి వెళ్లవలసి వచ్చిందని విచారించసాగాడు.

అందుకు మహామంత్రి రాజును ఓదారుస్తూ " మహరాజా ! మీరు మంచే చేసారు. నా కుమారుడిని మీరు కారాగారంలో ఉంచడం కూడామంచికే జరిగింది , లేదంటే యువరాజు వెంటుండే నా కుమారుడు కొండదేవతకి బలై పోయేవాడు.మీరు కారాగారంలో ఉంచబట్టే ప్రాణాలతో మిగిలాడు " అని సంతోషాన్ని ప్రకటించాడు మహామంత్రి  సుబుద్ధి.

మరిన్ని శీర్షికలు
naa jnaapakaallonchi