కుకి సుభ్రమణ్య , హొరనాడు అన్నపూర్ణ
ధర్మస్థళ నుంచి సుమారు 53 కిలోమీటర్ల దూరంలో వుంది ‘ కుకి సుభ్రమణ్య ‘ అంతా కొండలూ అడవే , పశ్చిమ కనుమలు నాకు ఉత్తరాఖండ్ , హిమాచల్ లోని శివాలిక్ పర్వతాలు ఒకేలా అనిపిస్తాయి , దట్టమైన అడవులు , మెలికలు తిరిగిన కొండదారులు , అక్కడక్కడ ఒక్కో యిల్లు , యెంతో దూరాలు ఆ ఒంటరి బాటలో పిల్లలూ పెద్దలూ నడక , యే చిన్న వస్తువ కావాలన్నా యెంతో దూరాలు నడుస్తూ పోవడం , రోజులో ఒకటో అరో బస్సు రాకపోకలు , బస్సుని చెయ్యి చూపించి ఆపి వారు తాపీగా వచ్చి యెక్కడం , యే బస్సు స్టాపూ లేని చోట బస్సాపించుకొని దిగడం మనకి చాలా విచిత్రంగా కనిపిస్తాయి . వారికి అలవాటే . పచ్చని ప్రకృతి మధ్య యెటువంటి సుఖాలూ లేకుండా నిశ్చింతగా సాగిపోయే వారి జీవితం నాకెప్పుడూ అద్భుతంగానే కనిపిస్తుంది . ధర్మస్థళ బస్సు స్టాండు నుంచి ప్రతీ గంటకీ ‘ కుకి సుభ్రమణ్య ‘ కి బస్సులున్నాయి , చిన్నవూరు అవడం వల్ల కోవెలకి యెదురుగానే బస్టాండు . మందిరానికి వెళ్లేటప్పుడు ‘ కుమారధార ‘ నది దాటి వెళతాం . చాలా మంది భక్తులు యీ నదిలో స్నానాలు చేసుకొని దర్శనానికి వెళ్తూ వుంటారు . కోవెల లోపల గరుడ స్థంబం వెండి తాపడంతో వుంటుంది . ఈ స్థంబం గర్భగుడిలో వున్న వాసుకి పూత్కారాలవలన విషపూరితమయే గాలిని శుద్ది చేస్తుందట , ముందుగా యీ స్థంబానికి నమస్కరించుకొని గర్భగడి లోపలకి వెళ్లాలి , గర్భగుడిలో పై మండపంలో సుభ్రమణ్యుడు , వాసుకి కిందమంటపంలో శేషుడు నిత్యపూజలందుకుంటూ వుంటారు . కోవెలవున్న పర్వతాన్ని కుమారపర్వతం అని అంటారు . పర్వత శ్రేణులలో వుండే మందిరాలు చిన్నగానే వుండడం చూసేను .
ఇది కూడా చిన్న మందిరమే . స్థల పురాణం గురించి కూడా తెలుసుకుందాం . కుమారస్వామి తారక , సురపద్మాసుర అనే దానవ సంహారం కావించి సోదరుడైన గణపతి తో కలసి కుమారపర్వతానికి రాగా ఇంద్రుడు మొదలైన దేవతలు దానవసంహారియై వచ్చిన కుమారస్వామిని దర్శించుకొని అనేకవిధాల స్తోత్రించి ఇంద్రుని పుతృిక అయిన దేవసేనను వివాహమాడ వలసినదిగా ప్రార్ధిస్తారు . ప్రసన్నడైన కుమార స్వామి వివాహానికి అంగీకరించగా మార్గశిర శుద్ద షష్టి నాడు బ్రహ్మ , విష్ణు , మహేశ్వరుల సమక్షంలో ముక్కోటి దేవతల నేతృత్వంలో వివాహ వేడుకలు జరుపుతారు . దేవతలు సప్తనదుల నుంచి తెచ్చిన జలాలతో వరునకు మంగళా స్నానాలు చేయించగా ఆ నీరు నదిగా మారిందట అదే కుమారధార నది . కుమారవర్వతం కుమారస్వామి వివాహం జరిగిన ప్రదేశం .
వాసుకి గరుత్మంతుని ప్రకోపం నుంచి తప్పించుకొని కుమారపర్వత సమీపంలో ‘ బిలద్వార ‘ అనే గుహలో శివునికొరకై తపస్సుచేసుకుంటూ వుండిపోతుంది , శివుడు వాసుకి తపస్సుకి మెచ్చి వాసుకి వద్దకు కుమారస్వామిని పంపుతాడు , కుమార స్వామి వాసుకిని ఆశీర్వదించి , తనశరణులోకి తీసుకుంటాడు . పాములన్నిటికీ రక్షకుడుగా తననుతాను నియమించుకొని సుభ్రమణ్యునిగా మారుతాడు . ఇక్కడ కుమారస్వామికి , వాసుకికి , శేషునికి నిత్యపూజలు నిర్వహిస్తారు . ఇక్కడ నాగరాజుకు చేసే పూజలు సుభ్రమణ్యేశ్వరునికి చెందుతాయి .1845 వరకు స్థానిక తుళు బ్రాహ్మణ కుటుంబం వంశపారంపర్యంగా యీ మందిరంలో విధులు నిర్వహించేవారు . ఆ తరవాత శృంగేరీకి చెందిన మధ్వ బ్రాహ్మణులు పూజా కార్యక్రమాలు జరుపుతున్నారు .
ఈ కోవెలలో మిగతా విశేషపూజలేకాకుండా రెండు ముఖ్యమైనపూజలు జరుగుతాయి , అవి 1) ఆశ్లేషబలి , 2) సర్ప సంస్కార . ఆశ్లేష బలి —— ఎవరి జాతకంలోనైనా కుజదోషమున్నా లేక కాలసర్పదోషమున్నా ఈ ఆశ్లేష బలి పూజ చేసుకుంటే దోష నివారణ జరుగుతుందట . ప్రతీ నెలా వచ్చే ఆశ్లేష నక్షత్రం రోజు పగలు 7 గంటలకు మరియు 9 -30 గంటలకు రెండుసార్లు యీ పూజ యిక్కడి పూజారులు నిర్వహిస్తారు . ఈ పూజ చేయించుకో దల్చుకున్న వారు పూజా సమయానికి మందిరంలో వుండి తమ గోత్రనామాలు చెప్పించుకోవాలి , పూజ , హోమం జరిగిన తరువాత ప్రసాదం యిస్తారు . ఈ పూజకోసం ముందుగా బుక్ చేసుకోడం లాంటివి అవుసరం లేదు నేరుగా పూజ సమయానికి వచ్చి పూజా టికెట్టు తీసుకుంటే సరిపోతుంది . ఈ పూజ శ్రావణ , కార్తీక , మార్గశిర మాసాలలో చేయించుకుంటే విశేష ఫలితాలుంటాయని అంటారు .
సర్ప సంస్కార —— సర్ప సంస్కార అంటే మన పూర్వజన్మలలోగాని , తొమ్మిది తరాలలో యెవరైనాగాని సర్పాలను చంపడం చేసి వుంటే సర్పదోషం కలుగుతుంది , దీనివల్ల వంశం నిలబడకపోవడం జరుగుతుందని పెద్దలమాట , అలాంటి దోషాలు పోగొట్టుకోడానికి సర్ప సంస్కార చేయించుకుంటారు . ఇది ఓ రకంగా కర్మకాండలు నిర్వహించడం లాంటిది . ఈ పూజకి ప్రత్యేకంగా ఓ రోజు అని లేదు , యెప్పుడైనా చేయించుకోవచ్చు . గృహస్తు స్వయంగా యీ కర్మకాండలు పూజారి ఆధ్వైర్యంలో చెయ్యొచ్చు లేదా ఓ బ్రాహ్మణుని పెట్టుకొని అతని చేత చేయించొచ్చు . కర్నాటక , కేరళ భక్తులు యెక్కువగా యీ ‘ సర్పసంస్కార ‘ పూజని చేయించుకుంటూ వుంటారు . ఇక్కడ కూడా భక్తులకు ఉచిత భోజనవసతి సౌకర్యాలు వున్నాయి .
హొరనాడు అన్నపూర్ణ —— మంగళూరికి సుమారు 125 కిలోమీటర్లదూరంలోను , బెంగళూరుకి సుమారు 320 కిలోమీటర్లదూరంలోనూ బద్రానదీ తీరాన వున్న హొరనాడు కొండలూ అడవుల మధ్య వున్న చిన్న గ్రామం . గ్రామం మొదలులోనే కోవెల ద్వారం వుంటుంది . గర్భగుడిలోని అమ్మవారు రోడ్డువైపుగా వుంటుంది , బస్సులలో వెళ్లేవారు అక్కడనుంచే అమ్మవారిని దర్శించు కొనేటట్లుగా వుంటుంది అమ్మవారు . ఈ అమ్మవారిని ఆదిశక్త్యాత్మక శ్రీ అన్నపూర్ణేశ్వరి అని అంటారు . బంగారు తాపడం చేసిన నిలువెత్తు విగ్రహం , అమ్మవారు కళకళలాడుతూ వుంటుంది , భక్తులను నవ్వుతూ పలకరిస్తున్నట్లుగా వుంటుందీ విగ్రహం . మారుమూల వుండడంవల్ల యెక్కువమందికి యీ మందిరం గురించి తెలీదు . ఒకసారి దర్శించుకున్నవారు మాత్రం అమ్మవారిని ఆ ప్రదేశాన్ని మరచిపోలేరు . అన్నపూర్ణాదేవి అక్కడ కొలువై వున్న భావన కలుగుతుంది . ఈ అమ్మవారిని దర్శించుకున్నవారికి ఏడు జన్మలవరకు అన్నానికి లోటుండదని భక్తుల నమ్మకం . బస్సు ముఖద్వారం దగ్గరే ఆపుతారు , గేటులోంచి మెట్లద్వారా లోపలకి వెళితే యెదురుగా గర్భగుడి , గర్భగుడిని చుట్టుకొని ఆదిశేషుడు , చుట్టూరా వివిధ దేవతామూర్తులు , యేనుగులు మొదలయిన జంతువుల బొమ్మలు వుంటాయి , అమ్మవారు నాలుగు చేతులలో శంఖం , చక్రం , శ్రీచక్రం , గాయత్రీమాత ను ధరించి భక్తులకు దర్శనమిస్తుంది . ఈ మందిరం అగస్త్య ముని నిర్మించినట్లు చెప్తారు , ఆది శంకరాచార్యులు పునఃప్రతిష్టించినట్లు , ప్రస్తుతం వున్న ధర్మకర్త కుటుంబం 400 సంవత్సరాల క్రిందట మందిరానికి మరమ్మత్తులు చేయించి వంశపారంపర్యంగా ధర్మకర్తలుగా వుంటున్నారు . దశరా నవరాతృలు , 5 రోజులు సాగే రధాయాత్ర , అక్షయ తృతీయ అన్నపూర్ణాదేవి పుట్టినరోజుగా జరుపుకుంటారు , ఇవేకాక ప్రతీరోజూ రెండుసార్లు హారతిసేవ , పగలు 11 గంటలకు జరిగే కుంకుమ పూజలు విశేషంగా చేస్తారు . ఈ కోవెలలో అమ్మవారి దర్శనం కంటె అమ్మవారి ప్రసాదానికి ప్రాముఖ్యత యిస్తారు . పెద్దహాలులో ఉచిత ప్రసాద వితరణ పగలంతా జరుగుతూనే వుంటుంది . ఏ సమయంలో వెళ్లినా భోజనం పెడతారు . పప్పు , రెండు కూరలు , పులసు , పప్పుపాయసం ( అమ్మవారికి చాలా యిష్టం ) , తీపి బూంది , పులిహోర , నెయ్యి , పెరుగులతో చక్కని భోజనం పెడతారు . రాత్రి వుండడానికి కూడా ఉచిత బస వుంది .
స్థలపురాణం చూద్దాం ——-
ఓ సారి పార్వతీ పరమేశ్వరులు మట్లాడుకుంటూ వుంటే శివుడు పార్వతితో అంతా మాయ అని అంటూ మనం తినే తిండి కూడా మాయే అని అన్నాడట , దానికి కోపించిన పార్వతి మాయమైపోయిందట , ఆమె మాయ మవడంతో ప్రకృతి స్థంబించిపోయి , కరవు యేర్పడిందట , దేవతలు శివునకు మొరపెట్టుకొనగా శివుడు పార్వతిని వెతుకుతూ హొరనాడులో పార్వతిని కనగొని ఆమెను ప్రసన్నురాలిని చేసుకొన్నాడట , పార్వతీదేవి అన్నపూర్ణగా అవతరించి భూలోకవాసులకు ఆకలి తీర్చిందని ఓ కధనం . పార్వతీ దేవి అన్నపూర్ణగా అవతరించినది అక్షయ తృతీయ కావడంతో ఆ రోజు ఇక్కడ విశేష పూజలు జరుపుతారు . మరో కథనం ప్రకారం బ్రహ్మ నాలుగో ముఖాన్ని శివుడు ఖండించగా అది శివుని చేతికి అతుక్కుపోయిందట , ఆ కపాలంలో నిండేంతవరకు ధాన్యం పోయగలిననాడు ఆ కపాలం రాలిపోతుందని శివునకు శాపం వుంటుంది . శివుడు అందరు దేవీదేవతల వద్దకు వెళ్లి వారిచ్చిన ధాన్యం బ్రహ్మ కపాలంలో యెన్ని పోసినా కపాలం నిండదు , అలా తిరుగుతూ హొరనాడు కొండలలో తిరుగుతూ వుండగా పార్వతీ దేవి శివుని శాపవిముక్తుడను చేయగోరి అన్నపూర్ణగా అవతరించి బ్రహ్మ కపాలంలో పిడికెడు ధాన్యం వెయ్యగా అది నిండిపోయి శివుని నుండి విడిపడిందట అప్పటినుండి అమ్మవారు అక్కడే కొలువైయుండి భక్తులను కరువుకాటకాలకు దూరంగా వుంచి కాపాడు తోందట . ఈ ప్రాంతం చూస్తే నిజంగా అన్నపూర్ణ కొలువై వున్న ప్రదేశమనే అని పిస్తుంది . పచ్చని పంటపొలాలు , చక్కని పకృతి మనిషికి యింతకంటే కావలసినది యేముంది అనిపిస్తుంది . మొత్తం ఈ పశ్చిమ కనుమలు వేసవి విడుదులే , ముఖ్యంగా ‘ కుద్రేముఖ్ ‘ . జలపాతాలు , వాగులు వంకలు , కొండలు , కోనలు , అడవులు , పక్షుల కిలకిలారావాలు , జంతువుల అరపులు యెన్ని మార్లు వెళ్లినా మళ్లామళ్లా వెళ్లాలనిపిస్తుంది .
ఈ వారానికి యింతే వచ్చేవారం మరికొన్ని ప్రదేశాలు సందర్శించుకుందాం , అంతవరకు శలవు .
|