'చీరలోని గొప్పతనం తెలుసుకో.. ఆ చీర కట్టి ఆడతనం పెంచుకో..' అన్నాడు ఓ మహా రచయిత. కానీ, ఆ చీరకట్టుకు ఇప్పుడు ఎన్ని పాట్లు వచ్చాయో. చీర కడితే, ఆడతనం రావడమేమో కానీ, ట్రెండ్ పేరు చెప్పి కడుతున్న చీరకట్టులతో ఆడా, మగా అనే తేడా తెలుసుకోవడమే కష్టమైపోయిందిప్పుడు. రోజుకో కొత్త ట్రెండ్ పుట్టుకొస్తున్న ఈ తరుణంలో చీరకట్టుకు కొత్తర్ధాలు చెప్పేస్తున్నారు నేటి అమ్మాయిలు. 'మమకారమనే దారంతో నేసిందీ చీర..' అనే అందమైన మాటకు వెటకారం అద్దేస్తున్నారు.
చీర కాని చీర, కానీ చీరే.. అనేలా కట్టి కళ్లు చెదరగొడుతున్నారు. డిఫరెంట్ మోడల్స్‌లో చీర కట్టులు ఫ్యాషన్ ట్రెండ్ అయిపోయాయ్. రోజూ, జీన్స్‌లు, టీ షర్టులూ, మోడ్రన్ చిట్టి పొట్టి దుస్తులు ధరించే ఈ ట్రెండ్ అమ్మాయిలు ఇప్పుడు ఎక్కువగా చీరకట్టుల్లోనే దర్శనమిస్తున్నారు. అయితే, మన అమ్మలు కట్టే చీరకట్టు కాదది. అదో రకం. వారికి నచ్చిన జీన్స్ మాత్రం వదలడం లేదండోయ్. ఆ జీన్స్‌నే చీర కట్టుకు వాడేస్తున్నారు. అవును జీన్స్‌పై చీరన్నమాట. జీన్స్, టీషర్టుపై అలా అలా చీరను అందంగా చుట్టేస్తూ వయ్యారాలు పోతున్నారు. కర్మరా బాబూ, చీరకట్టుకు ఎన్ని పాట్లు వచ్చాయిరా బాబూ.. అని వాపోయినా, అమ్మాయిలు దిస్ ఈజ్ ది న్యూ ట్రెండ్ అన్నట్లుగా పోజులు కొడుతున్నారు. అమ్మాయిలే ఏంటీ.. ఆ మాటకొస్తే, ఆంటీలు ఏం తక్కువ తినడం లేదండోయ్. టీనేజ్ పాపలకు ధీటుగా ఫ్యాషన్ ఫాలో చేస్తున్నారు.
ఇక అబ్బాయిల విషయానికి వస్తే, ఫెస్టివల్స్‌కీ, ట్రెడిషనల్ పార్టీలకీ ట్రెడిషనల్ వేర్‌నే ఎక్కువగా ధరిస్తున్నారు. కుర్తీలు, షల్వార్‌లతో పాటు పంచె కట్టుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పంచె కాని పంచెలు ధరించి అబ్బాయిలూ హొయలు పోతున్నారు. మన భారతీయ సాంప్రదాయంలో చీరకట్టుకు, పంచెకట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. ఆ స్థానాన్ని యూత్ నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళ్తున్నారులే అని సరదా పడాలో లేక, ఫ్యాషన్ పేరు చెప్పి, మన సాంప్రదాయాన్ని పొల్యూట్ చేస్తున్నారనుకోవాలో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. యువత జోరు చూసి, మన ఫ్యాషన్ డిజైనర్లు కూడా తమ చేతికి ఏ డిజైన్ వస్తే అదే న్యూ ట్రెండ్ అని మార్కెట్‌లోకి వదిలేస్తున్నారు. ఇంకేముంది.. యూత్ చేతిలో పడి, అది కాస్తా నయా ట్రెండ్‌గా మారిపోతోంది.
అమ్మాయిలు లంగా వోణీల్లో కనిపిస్తే చక్కగా బుట్టబొమ్మలా ఉన్నావమ్మా.. అని ముచ్చట పడేవారు. కానీ, ఆ లంగా వోణీల్ని కల్తీ చేసేసి, వాటి స్థానంలో గాగ్రా చోళీలు తెచ్చేశారు. పోనీలే అది కూడా కొంత వరకూ ఓకే అని సరిపెట్టుకున్న సమయంలో ఇదిగో ఇలా చీరకట్టును వెర్రి పుంతలు తొక్కిస్తున్నారు. ఈ ఫ్యాషన్ ట్రెండ్ ఇంకెన్ని లెవల్స్‌కి వెళుతుందో, ఫ్యాషన్ అంటూ మన ట్రెడిషన్‌లో ఎన్ని వింతలు ఆవిష్కరిస్తారో అలా చూస్తూ ఉండాల్సిందే.
ఇదిలా ఉంటే, ఈ చీర - పంచె 'కట్టు'బాట్ల ఫాలోయింగ్ ఈ రేంజ్‌లో ఉండడాన్ని గమనించిన యువత దీన్నే ఉపాధి మార్గంగా ఎంచుకుంటోంది. కొత్త కొత్త ట్రెండ్స్‌ని కనిపెట్టడంలో తమ మెదడుకు పదును పెడుతోంది. ఎలాగూ ఆన్‌లైన్ బిజినెస్ ఉండనే ఉంది. ఇక్కడే కదా సరికొత్త ట్రెండ్స్ కొలువై ఉండేది. అందుకే ఆన్‌లైన్ వేదికగా ఈ ఫ్యాషన్ 'ట్రెడిషన్' లో అత్యంత వినూత్న ఆవిష్కరణలకు అంకురార్పణ చేసేందుకు యువత మరింత దూకుడు ప్రదర్శిస్తోంది.
|