Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
naa jnaapakaallonchi

ఈ సంచికలో >> శీర్షికలు >>

చమత్కారం - భమిడిపాటి ఫణిబాబు

chamatkaram

గుర్తుందా మనదేశంలో ఏ ప్రాంతంలోనైనా సరే, ఊళ్ళో రెండుమూడేళ్ళకోసారి రోడ్లు వేస్తూంటారు. ఒకానొకప్పుడు మట్టిరోడ్లు, ఆ తరవాత కంకర, ఇప్పుడైతే ఏక్ దం కాంక్రీటులోకి దిగిపోయారు. ఒకప్పుడు వర్షాలువచ్చినప్పుడు ఆ నీళ్ళు  ఇంకడం, దానిద్వారా భూజలసంపద  పెరగడం, దానివలన ఎక్కడైనా ఓ చెరువో, నుయ్యో తవ్వినప్పుడు, నీళ్ళు పడడం  లాటివన్నీ కథల్లో చదువుకోడమే.. ఈరోజుల్లో మట్టి అనేదే కనిపించదు.. అయినా ఇప్పుడు ఆ గొడవంతా ఎందుకులెండి– కాంక్రీటు రోడ్లకి అలవాటు పడిపోయారు జనాలు.. దానికి సాయం పంచాయితీ బోర్డులూ, మునిసిపాలిటీలూ, కార్పొరేషన్లూ కూడా ఈ రోడ్లు వేయడమనే ప్రక్రియకి ప్రాధాన్యత ఇస్తున్నారు. రోడ్లు వేయడంవరకూ బాగానే ఉంది..  ఆరోడ్డువేసేది ఓ శాఖవాడు, తీరా ఆరోడ్డు వేసిన తరువాత ఇంకో శాఖవాడికి గుర్తొస్తుంది– అరే అక్కడ నీళ్ళ పైపుకి ఏదో రిపేరీ వచ్చిందీ అని– ఆ వేసిన రోడ్డేదో తవ్వేసి వాడిపని వాడు చూసుకుంటాడు.. అలా వివిధశాఖలవారూ– అంటే టెలిఫోను, ఎలెట్రీ, వీళ్ళు కాకుండా ప్రెవేట్ కంపెనీల వాళ్ళూ ( కేబుల్స్ వేయడానికి).. ఎవరిదారిన వాళ్ళు , ఒకరితరవాత ఇంకోరు  వేసిన రోడ్డుని తవ్వుకుంటూ పోతారు. మధ్యలో  BRTS  అంటారు,  Metro  అంటారు.. ఇలా చెప్పుకుంటూ పోతే, మనరోడ్లు లక్షణంగా ఎప్పుడూ ఉండవు. అన్ని శాఖలవాళ్ళూ coordinate  చేసుకుని పని ఎందుకుచేయరో ఛస్తే అర్ధమవదు.  అవునులెండి ..ఈ పనులకి టెండర్లూ.. అస్మదీయులూ, తస్మదీయులూ.. ఎంత కథ నడవాలీ?

ప్రభుత్వాల ముఖ్యోద్దేశమేమిటంటే, ఏదోలాగ జనాల్ని సుఖంగా బతకనీయకూడదని… ఏమిటేమిటో  welfare statట్టూ సింగినాదం అంటూంటారు. అప్పుడెప్పుడో UPA   ప్రభుత్వం, నందన్ నీలెకేనీ గారి నేతృత్వంలో ,    ఆధార్  గుర్తింపు కార్డులు మొదలెట్టారు.. వాటిని మొదలెట్టినప్పుడు, ప్రస్తుత అధికార ( ఆనాటి ప్రతిపక్షం )పార్టీవారు.. హాత్తెరీ ఇంత ఖర్చు అవసరమా, ఇదేమైనా అమెరికాయా ప్రతీ పౌరుడికీ గుర్తింపు కార్డెందుకూ, ఏదో ఎన్నికల టైములో పట్టించుకుంటే సరిపోదా…  blah..blah..  అని ఏవేవో అనేసారు., ఆ కార్డుల ప్రక్రియ పూర్తయేసరికి  UPA  వారి పుణ్యకాలం కాస్తా పూర్తయిపోయింది…   BJP  అధికారంలోకి రావడమేమిటి, ఇదివరకటి  సంక్షేమ పథకాల పేర్లన్నీ మార్చేసి, కొత్త పేర్లు పెట్టేసారు   Old wine in New bottle… పైగా ఇవన్నీ ” అచ్చే దిన్ ” అన్నారు.. ఓహో నిజమే కాబోసనుకున్నారు జనాలు. ఆధార్ గుర్తింపు కార్డుదగ్గరకొచ్చేసరికి, ఏం చేయాలీ  తీసేద్దామా పోనీ, అని తర్జనభర్జనలు చేసేసి, మళ్ళీ ఖర్చెందుకూ అనుకుని, ఏదో ఘనకార్యం చేసినట్టు , తీసేయకుండా కొనసాగించారు.పోనీ ఉంచినవాళ్ళు శాంతంగా ఉండాలా, అబ్బే, ప్రతీదానికీ లింకు చేయాలన్నారు. అసలు మన అస్థిత్వం , ఆ ఆధార్కార్డ్ లో నిక్షిప్తం అవాలన్నారు.. అసలు ఏవేంకావాలో, ఆ కార్డ్ చేసినప్పుడే అడిగేస్తే గొడవుండేది కాదు… అబ్బే ప్రభుత్వ నిర్వాకం కదా, రోడ్లు వేసేటప్పుడు, ప్రాంతీయ స్థాయిలో ఎలా ఉంటుందో, అదే జాతీయ స్థాయిలో  మొదలెట్టారు..  ఓవైపున  మొబైల్ లో కొత్త సిమ్ వేసుకోడానికి,  biometeric  ఎలాగూ చేస్తారు.. అది   TRAI  కి సరిపోదుట, మన ఆధార్ కార్డుకీ, మన మొబైల్ నెంబరు జోడించడం అనివార్యం అని మొదలెట్టారు…

ఇలా చెప్పుకుంటూ పోతే, ప్రభుత్వం వారూ ఏ పనైనా సరే అంచెలంచెలుగానే చేస్తారని తేలిపోయింది.. వివిధ శాఖలవారికీ ఏదో ఒక పని ఉండొద్దూ? ఏదైనా చెప్పులు కుట్టేవాడిదగ్గరకు వెళ్తే, అతను, మనం అడిగిన చెప్పుకే రిపేరీ చేస్తాడు.. రెండో చెప్పుకూడా సరీగ్గా లేదని తెలుసు, అయినా సరే చెయ్యెట్టడు.. ఎలాగూ మరోసారి అతని దగ్గరకే వస్తామూ అని తెలుసు.. బేరం పోగొట్టుకోవడం ఎందుకూ? అలాగే  ఏ దంతవైద్యుడిదగ్గరకు వెళ్ళినా, ఏదో కదులుతున్న పన్నుకో దంతానికో వైద్యం చేయమంటే, పనిలో పనిగా, పక్క పన్నునో, దంతాన్నో కూడా కెలుకుతాడు.. ఎలాగూ తనదగ్గరకే కదా వచ్చేదీ… అలాగే ఏదో అనారోగ్యం చేసి ఏ పేద్ద డాక్టరు దగ్గరకో వెళ్తే, రకరకాల టెస్టులు  చేయించి, మన వంట్లో ఉండే రోగాల చిఠ్ఠా తయారైతే చేస్తాడు, కానీ వైద్యం మాత్రం అంచలంచలుగానే… తను ఏర్పాటు చేసుకున్న ఖరీదైన యంత్రాల వాయిదాలు (  E M I లు)  తీరొద్దూ?...

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని శీర్షికలు
endaro mahanubhavulu andarikee vandanaalu