Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nothing

ఈ సంచికలో >> శీర్షికలు >>

మంచి ఎక్కడున్నా స్వీకరించాలి - మూర్తి

manchi ekkadunna

ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు వున్నాయి అన్నాడు ఆత్రేయ. అది కూడా నిజమే అనిపిస్తుంది ఒక్కోసారి మనని మనం తేరిపార చూసుకుంటే. బైక్ మీద వెళుతుంటే వెనక నుంచి కారువాడు హార్న్ కొడితే గుర్రుగా చూస్తాం. అదే కారులో మనం వెళ్తుంటే, అటొచ్చిన బైకువాడిని తినేసాలా చూస్తారు. తమ తమ నెలవులు మారేసరికి భావనల్లో తేడా వచ్చేస్తుంది. హిందువులు ఆకాశదీపం పెట్టకున్నా, క్త్రైస్తవులు క్రిస్మస్ నెల రోజులు స్టార్ వెలిగించనా, ఒకటే అని అనుకోవడంలోనే వుంది సామాజిక జీవనంలోని ఆనందం. పెద్దలకు దారి చూపినా, జ్ఞానులకు దారి చూపినా దీపం పరమార్థం వెలుగుదారి చూపడమే.

పూజా పురస్కారాలైనా, వాస్తు, జ్యోతిషాలైనా మరే శాస్త్రమైనా దాని పరమావథి ప్రజా క్షేమమే కావాలి. వాటిని అధ్యయనం చేసి, నలుగురికి పంచే పెద్దలు ముందుగా దీన్ని దృష్టిలో పెట్టుకొవాలి. పొద్దునే టీవీల్లో ల్యాప్ టాప్ లు ముందేసుకుని, కుండలినో మరోటో స్టాఫ్ట్ వేర్ లు లోడ్ చేసుకుని, రెండు మూడు సంగతులు పుక్కిట పట్టి, జనాలకు జోస్యం చెప్పేవారు వీలయినంతగా వారికి మేలు చేసి, జీవనం సాగించాలి తప్ప, వ్యాపారం సాగించకూడదు.

పెద్దల మాట
మనకు అంటే భారతీయతను అభిలషించేవారికి, హిందూత్వాన్ని ఆచరించేవారికి కూడా ఓ రాజ్యాంగం లాంటిది. ఇండియన్ పీనల్ కోడ్ లాంటిదే ఇదీనూ. అదే మను ధర్మశాస్త్రం. అనేకానేక వివాదాలకు లోనైనది ఇది. కానీ ఇది కాలానుగుణ మార్పులకు నోచుకొనకపోవచ్చు. మన రాజ్యాంగం మాదిరిగా మారుతున్న పరిస్థితులకు, అవసరాలకు అనుగుణంగా సవరణలు జరిగి వుండకపోవచ్చు. పీఠాధిపతులు, ధర్మం తెలిసిన పెద్దలు ఈ తరానికి తగినట్లు తగిన మార్పులు చేసినా తప్పులేదేమో ఇందులో. ఎందుకంటే పలు కుల ఫ్రస్తావనలు, స్త్రీలకు సంబంధించి కొన్ని అభ్యంతరకర సూచనలు ఇందులో వున్నాయి కనుక. కానీ దానివల్ల ఇది అన్ని విధాలా అనర్హమని అంటే ఎలా అనిపిస్తుంది. ఎందుకంటే మనుధర్మశాస్త్రం అన్నది ఇవ్వాల్టి, నిన్నటి సంగతి కాదు, సాక్షాత్తూ మనుపు దీనిని భృగు మహర్షి చెప్పాడంటారు. అది పుక్కిటి పురాణం కావచ్చు... కాకపోవచ్చు. కొన్ని వందల వేల ఏళ్ల కిందటి వ్యవహారం అని మాత్రం కచ్చితంగా అంగీకరించవచ్చు. అలా అన్ని ఏళ్ల క్రితమే మానవ మనుగడ సక్రమ మార్గంలో సాగాలని, మంచి నడవడిక అలవర్చుకోవాలని పెద్దలు అభిలషించి చేసిన సూచనల్లో ఈ కాలానికి పనికి వచ్చేవి, అమలు చేసుకోవడం కోసం కాదు, కనీసం తెలుసుకోవడం కోసమైనా మను ధర్మశాస్త్రాన్ని ఓ సారి చూడ్డంలో తప్పు లేదు. చిత్రమేమిటంటే మనుధర్మశాస్త్రంలోనే, కాలాన్ని బట్టి ధర్మాలు మారతాయని స్పష్టంగా పేర్కొన్నాడు.

అన్యే కృతయుగే ధర్మా స్త్రేతాయాం ద్వాపరే పరే
అన్యే కలియుగే న్రూణాం యుగహ్రా సానురూపత:


యుగాలను బట్టి ధర్మాలు మారుతుంటాయని మనువు ముందే చెప్పేసాడు. అలాగే ఏ యుగానికి ఏ ధర్మం ప్రాధాన్యత సంతరించుకుంటుందో చెప్పాడు కానీ, అది రోజు రోజుకు మారుతున్న కాలానికి వర్తించదు. చాలా మంది మనుధర్మశాస్త్రం అగ్రవర్ణ పక్షపాతంతో, స్త్రీ ద్వేషంతో నిండివుంటుందని అంటారు. కొన్ని కొన్ని విషయాలు అలా అనిపించడం సహజం కూడా. కానీ చిత్రమేమిటంటే, అగ్రవర్ణాల్లో ఒకటైన బ్రాహ్మణులకు ఎంతటి ప్రాధాన్యత వుందో, నియమ నిబంధనల్లో అంతకు రెట్టింపు కఠిన వ్వవహారాలు వుండడం గమనించాలి. అంటే పెద్దరికం సంతరించుకుంటే సరిపోదు, ఆ స్థానంలో వున్నవారు తప్పు చేస్తే దండన కూడా అంత కఠినంగానూ వుండాలని చెప్పాడన్నామాట. తప్పు చేసిన వారికి విధించే శిక్షలను మనువు చాతుర్వర్ణ నియమం ప్రకారం ప్రవచించాడు. అందులో అగ్రవర్ణలకు అందరికన్నా ఎక్కువ శిక్షలు సూచించాడు. ఒకటే నేరానికి కూడా. అంటే పెద్దరికం తీసుకున్నవారు, మరింత జాగ్రత్తగా వుండాలని. అంటే ఇప్పటి కాల వ్యవహారాలను తీసుకుంటే అధికారం చెలాయించేవారు తప్పు చేస్తే మరింత ఎక్కవ దండన విధించాలనేగా. కానీ జరగుతున్నది వేరుగా వుంది. అధికారంలో వున్నవారు, అధికారం చెలాయించగలిగినవారు నేరం నుంచి సులువుగా తప్పించుకోగలుగుతున్నారు. బలహీనులు,బడుగులు చిన్న నేరం చేసినా దండనకు గురవుతున్నారు. ఇటీవల ఫేస్ బుక్ లో ఎక్కువగా షేర్ అయిన విషయం ఒకటి వుంది. అయిదువేలు అప్పు చేసిన రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. అయిదు వేల కోట్లు అప్పు చేసిన వారు హాయిగా తిరుగుతున్నారు అని. ఇలాంటి వ్యవహారం చూస్తే, మనువు నిర్దేశించిన రాజ్యాంగానికి ఎంత దూరంగా జరిగిపోయామో అర్థమవుతుంది. అలా అని ఆ రాజ్యాంగం అవశ్యం, అని అభిలషనీయమని కాదు నేను చెప్పదలచింది. అందులోని మంచి విషయాలు కొన్ని గుర్తు చేసుకోవాలనుకోవడం మాత్రమే. వచ్చేవారం అలాంటి విషయాల్లో మరొకటి చూద్దాం.

వస్తువు-గుణము
ప్రతి ఇంట్లో వుంచుకోవాల్సిన మంచి పుస్తకాలు కొన్ని వుంటాయి. అవసరమైన పుస్తకాలు కూడా వుంటాయి. మంచి వేరు అవసరం వేరు. భారత రామాయణాలు మంచివి కావచ్చు. ఢిక్షనరీ అవసరం. అలాగే వస్తుగుణదీపిక అనే పురాతన పుస్తకం ఒకటి వుంది.

మనం ఏం తింటున్నాం... అది మనకి మేలు చేస్తుందా... కీడు చేస్తుందా అన్నది తెలియడం ఎవరికైనా అవసరం. ఈ అవసరం ఈ రోజుల్లో మరింత పెరిగింది. ఎందుకంటే, ఈ కాలంలో వైద్యానికి లక్షలు చాలవు. ఆరోగ్యమే మహా కాదు... మహా మహా మహా భాగ్యమై కూర్చుంది నేడు. కూర్చుని తింటే కొండలు కరగడం కాదు ఆసుపత్రికి వెళ్తే ఆస్తులు కరిగిపోతాయి. అందువల్ల తినేటపుడే మంచి తిండి... వీలయినంత అనారోగ్యం కలిగించనది తినడం మేలు. అందుకే వస్తుగుణ దీపిక లాంటి పుస్తకాలు అప్పుడప్పుడు, ఖాళీ అయినపుడ్డయినా చూడాలి. ఏ వస్తువు గుణం ఏమిటి అని వివరించే డిక్షనరీ లాంటిది ఈ పుస్తకం. వీలయినంత పాత ప్రతి దొరికితే సంపాదించడం మంచింది. స్వంతపైత్యం జోడించి కొత్తగా రాసిన వాటి కంటే. ఇందులో ఏమిటి? ఎలా వుంటుంది అన్న అనుమానం లేదా, ప్రశ్న తలెత్తవచ్చు. అందుకే వారంవారం ఒకటి రెండు విషయాలు పరిచయం చేస్తే ఎలావుంటుంది అని ఆ ఆసక్తి.

ఉదాహరణకి పప్పుచారు అందరికీ తెలిసిందే కదా... దాని గురించి వస్తుగుణ దీపిక ఏం చెబుతోంది.
అసలు పప్పచారు అంటే చారులో ఏదైనా ఒక రకం ఉడికించిన పప్పు కలిపి, పచ్చిమిర్చి, ఉల్లిపాయముక్కలు, ఏవైనా కూరగాయాలు జోడించేది. ఇది రుచిగా వుంటుంది. కానీ వాతము చేస్తుందట. కఫాన్ని పెంచుతుందట,. ఎక్కవగా తీసుకుంటూ వుంటే గుండెల్లో భారంగా వుంటుందట. అందువల్ల అప్పడప్పడే తీసుకోవాలి.

ఇలా తెలిస్తే మనం జాగ్రత్త పడతాం కదా. వచ్చేవారం మరొకటి చూద్దాం.

మరిన్ని శీర్షికలు
value of money is in spending