Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
manchi ekkadunna

ఈ సంచికలో >> శీర్షికలు >>

ద్రవ్యానికి విలువ, వినియోగంలోనే ఉంటుంది - టీవీయస్. శాస్త్రి

value of money is in spending

మా స్వగ్రామం, గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతం. పిడుగురాళ్ళ వద్ద ఉన్న మాచవరం అనే కుగ్రామం. ప్రస్తుతం అది మండల కేంద్రమైందనుకోండి. అయితే,. మాకు ఊహ తెలిసనప్పటి నుంచి, మా నాన్నగారి ఉద్యోగ బాధ్యతల రీత్యా, ఆ గ్రామంలో మేము ఎక్కువగా గడపలేక పోయాం. నా చదువంతా గురజాల, సత్తెనపల్లి, రేపల్లె, నరసరావుపేట, గుంటూరులలో జరిగింది. ఇన్ని ఊళ్ళు తిరగటం చేత, నాకు స్నేహితులు కూడా ఎక్కువే! ఫస్ట్ ఫారం నుండి చదువుకున్న చాలా మందితో నాకు ఇప్పటికీ స్నేహ బాంధవ్యాలు ఉన్నాయి. స్నేహాన్ని, నేను, తొందరగా, వదులుకోలేను! అదీ, నా స్నేహితుల గొప్పే! ఎందుకంటే! వాళ్ళు ఇంతకాలం నన్ను భరిస్తున్నారు కనుక! ఇకపోతే, మా నాన్న గారు, శ్రీ తెలదేవలపల్లి వెంకటేశ్వర్లు గారు. వారు Judicial డిపార్టుమెంటులో Sheristadar గా చాలాకాలం పనిచేసారు. ఎక్కువకాలం, గుంటూరులోనే పనిచేసారు. చివరికి ఏలూరులో 1983లో పదవీ విరమణ చేసారు. వారు ఇద్దరు అన్నదమ్ములు. చెరి 50 ఎకరాల వ్యవసాయ భూమి ఉండేది. అది కౌలుకి ఇచ్చేవారు. కౌలు రైతులు ఎంత ఇస్తే అంతే తీసుకునేవారు!

మా నాన్నగారు బహు కుటుంబీకులు. మేము తొమ్మిదిమంది సోదరీ, సోదరులం. మా అమ్మగారు చాలా ఓర్పుగల ఇల్లాలు. ఎప్పుడూ, ఇంట్లో అతిధులో, చుట్టాలో ఉండేవారు. ఏదో పని మీద మా నాన్నగారి సహాయం కోసం వచ్చే వారు. ఎందుకంటే, మా బంధువులందరిలోనూ, మా నాన్నగారు కార్యదక్షులు, సహాయకారి. ఆ రోజుల్లో ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించారో! ఇప్పటికీ, నన్ను'వెంకటేశ్వర్లుగారి అబ్బాయి' గానే చాలామంది పిలుస్తుంటారు. అలా పిలిపించుకోవటానికి, నేను చాలా ఇష్ట పడతాను, గర్వపడతాను. అలా పిలిపించుకున్నప్పుడల్లా, నా కళ్ళు చెమ్మగిల్లి, మా నాన్నగారు గుర్తుకొస్తారు. ఇలా ఇప్పటికీ, ప్రతిరోజు ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అలా నాతో పాటుగా, మిగిలిన వాళ్ళు కూడా వారిని రోజూ స్మరించుకుంటాం. మా నాన్న గారు చేసే ఏ functions అయినా చాలా భారీగా ఉండేవి. ఆయనకు ఆశ్రితులు కూడా సహజంగానే ఎక్కువ మంది ఉండేవారు. డబ్బు కూడా ఎక్కువగా ఖర్చు చేసేవారు. అది అనవసరమైన ఖర్చు కాదు. ఎవరైనా ఆశ్రితులు వస్తే వారి అవసరాన్నిబట్టి ధనసహాయం చేసేవారు.

నాకు అతి చిన్న వయసులోనే పెళ్లి చేసారు. అప్పటికి నా వయసు 22 ఏండ్లు మాత్రమే! ఇంకా నేను ఉద్యోగంలో చేరలేదు. 1973లో నేను ఉద్యోగంలో చేరాను. ఇలా వచ్చిన వారందరికీ, విపరీతరంగా ఆర్ధిక సహాయం చేయటం వల్ల ఏమిటి లాభం(ఉపయోగం)? అని నేను ఒకసారి మా నాన్నగారిని అడిగాను. అప్పుడు, మా నాన్న గారు చెప్పిన విషయాలు నాకు ఇప్పటికీ, ఎప్పటికీ గుర్తుంటాయి! అవి ఏమిటంటే! "చూడు, బాబూ! (నన్ను బాబూ అని పిలిచేవారు) ద్రవ్యానికి విలువ, వినియోగంలోనే ఉంటుంది. అది సద్వినియోగం అయితే, అంత కన్నా కావలసినదేముంది!". ఇదేదో ఆర్ధికశాస్త్రంలోని పాఠంలాగా నాకు అనిపించి, కొద్దిగా, వివరించి చెప్పమన్నాను. అప్పుడు, శ్రీ రామతీర్థస్వామి వారు చెప్పిన ఒక కథ చెప్పారు. అది ఏమిటంటే, ఒక ఊళ్ళో, పూర్వం ఒక పిసినారి ఉండేవాడు. వాడు తినీతినకుండా చాలా ధనం సంపాయించాడు. ఆ ధనాన్నిఅంతటినీ వాడు ఒక బంగారు ఇటుకగా మార్చాడు, దాచుకోవటానికి, సులభంగా ఉంటుంది కనుక. అయితే, ఆ గ్రామంలో, దొంగల భయం ఎక్కువ. పిసినారులకు చాలా అవలక్షణాలు ఉంటాయి. వాటిలో ముఖ్యమైనవి అసత్యాలు పలకటం, ఎవరినీ నమ్మక పోవటం. అందుచేత, వాడికి ఈ బంగారపు ఇటుకను ఎలా దాచుకోవాలో తెలియక ఎన్నో రాత్రులు నిద్రలేకుండా గడిపేవాడు. ఆఖరికి, వాడికే ఒక ఆలోఅచన వచ్చింది. అది ఏమిటంటే! రాత్రి బాగా పొద్దు పోయిన తర్వాత, వాడి ఇంటిపక్క ఖాళీ స్థలంలో చిన్న గోతి తీసి, అందులో, ఆ ఇటుకను పెట్టి, మట్టి కప్పి వచ్చేవాడు. తెల్లవారకమునుపే, లేచి వెళ్లి చూసుకొని మళ్ళీ మట్టికప్పి వచ్చేవాడు. ఇదీ వాడి దిన చర్య. వీడు అలా రోజు పోయి రావటం ఒకడు గమనించి, ఆ ఇటుకను తస్కరించాడు. యధావిధిగా, వాడు వెళ్లిచూసుకుంటే, అక్కడ ఇటుక కనపడక, భోరున ఏడవటం మొదలు పెట్టాడు. ఆ దారినే పోతున్న ఒక యోగి అతన్ని చూసి "నాయనా! ఎందుకు ఇంత భోరున విలపిస్తున్నావు?" అని అడిగితే అప్పుడు వాడు అంతా పూస గుచ్చినట్లు వినిపించాడు. అందుకు ఆ యోగి "చూడు నాయనా! నీవు ఆ ధనాన్ని ఎప్పుడూ ఉపయోగించుకోలేదు, ఎవరికోసం ఉపయోగించలేదు. అందుచేత అది పొతే ఎందుకంత బాధ! నీకు ఈ విషయం చెప్పిన తర్వాత కూడా, బాధ తీరకపొతే, ఒక పని చెయ్యి! ఒక బండరాయిని ఆ గుంటలో పెట్టి పూడ్చి రోజూ చేసినట్లే చెయ్యి! ఆ బండరాయే బంగారపు ఇటుక అనుకో!" ఇదీ ఆ కథ. రామతీర్థుల వారి కథలన్నీ, ఇలాగే నీతిదాయకంగా ఉంటాయి.

మా నాన్నగారు, ఆ కథ చెప్పగానే నాకు అంతరార్ధం అర్ధం అయ్యింది. అప్పుడు మా నానాన్నగారు, "చూడు బాబూ! తండ్రి కుమారునికి ఇచ్చేవి మూడే! అవి, దేహం, విజ్ఞానం, బ్రహ్మోపదేశం. మిగిలినవన్నీ, ఎవరికి వాళ్ళు సంపాదించుకోవలసినవే! అందరికీ త్రోవ చూపించే, Board అది అక్కడే ఉంటుంది. త్రోవ మొత్తం నీకు చూపించటానికి నీ వెంట రాదు. తండ్రీ, గురువులు కూడా అంతే! ఇక ధనం, అంటావా, దాని పేరే చరాస్తి. నీవు ఎంత ప్రయత్నం చేసినా అది నీ వద్ద ఉండదు. ఎంతమంది ఇనప పెట్టెల్లో దాన్ని బంధించి జాగ్రత్తగా ఉంచుకున్న వాళ్ళు దరిద్రులు కాలేదు! చేతనైనంత వరకు మనం, ధనాన్ని సద్వినియోగం చేయటం ఎంతో మంచిది. దాని ఫలితం, నీకు వెంటనే, తెలియకపోవచ్చు. గుప్పెడు విత్తనాలను బురదలో చల్లటం వలన, నిరుపయోగం ఎలా అవుతుంది? కొద్దికాలంలోనే ఆ విత్తనాలు బంగారు పంటను అందిస్తాయి. విత్తనం నాటగానే కాయలు వెంటనే ఎలా రావో, అలాగా!" ఇప్పటికీ, నన్ను 'వెంకటేశ్వర్లు గారి అబ్బాయి, వారి నాన్నగారి లాగే చేతనైన సహాయం చేస్తారు.' అని తెలిసినవారు మిగిలిన వారికి పరిచయం చేస్తున్నప్పుడు, నాకు కళ్ళు చెమ్మగిల్లటమే కాకుండా, కొంత వినయంతో కూడిన గర్వం కూడా వస్తుంది. నాకు కొద్దిగానైనా అబ్బిన ఈ మంచితనం, సంస్కారానికి వారే కారకులు. మా నాన్నగారికి భారీగా షష్టిపూర్తి సన్మానం చేయాలనుకున్నాం. మాకు ఆ అదృష్టం లేకపోయింది. ఎందుకంటే! ఆయన తన 59వ ఏటనే దేహయాత్ర చాలించి, 1986 లో 'శిబి' చక్రవర్తి వలెనే పరలోకాలకు వెళ్ళిపోయారు. వారు ఎక్కడున్నా, "లోకా సమస్తా! సుఖినోభవంతు!" అనే వారి ఆశీర్వచనం అందరితో పాటుగా మాకూ వర్తిస్తుంది. ప్రాతః స్మరణీయులైన మా నాన్నగారిని గురించి కళ్ళు చెమ్మగిల్లి ఇంక వ్రాయలేకపోతున్నా.....

వారి ఆశయాలు, కోరికలు తీర్చటంతో పాటుగా వారికి నచ్చేటట్లు నడుచుకోవటమే మేము ఆయనకు ఇచ్చుకునే నిజమైన నివాళి!!!

మరిన్ని శీర్షికలు
Kaakoolu by Sairam Akundi