డబుల్ హ్యాట్రిక్ హీరోగా రాజ్ తరుణ్‌కి మంచి పేరుంది. కానీ, ఈ మధ్య ఆయన్ని వరుస ఫెయిల్యూర్స్ వెంటాడుతున్నాయి. హీరోగా తన స్థానం పదిలపరుచుకోవాలంటే, అర్జెంటుగా ఓ సూపర్ హిట్ కావాలి. ఆ సూపర్ హిట్ తాజా చిత్రం 'ఇద్దరి లోకం ఒక్కటే' చిత్రంతో దక్కుతుందని రాజ్ తరుణ్ ఆశిస్తున్నాడు. 'అర్జున్ రెడ్డి' బ్యూటీ షాలినీ పాండే ఈ సినిమాలో రాజ్‌తరుణ్‌కి జోడీగా నటిస్తోంది. లేటెస్ట్‌గా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ట్రైలర్ ప్రామిసింగ్‌గా ఉంది. ఒకే ఆసుపత్రిలో ఒకే బెడ్‌పై పుట్టిన అమ్మాయి, అబ్బాయి స్నేహంగా పెరుగుతారు. ఒకానొక సందర్భంలో విడిపోయి మళ్లీ వయసుకొచ్చాక ఒక్కటవుతారు. ఇద్దరి మధ్యా స్నేహం ప్రేమగా మారి, వయసుతో పాటే పెరిగి పెద్దదవుతుంది. ఒకానొక సందర్భంలో విడిపోవాల్సి వస్తుంది.
కానీ ఎందుకు.? అనేది తెలియాలంటే 'ఇద్దరి లోకం ఒక్కటే' చిత్రం చూడాల్సిందే. ఇద్దరి మధ్యా లవ్ మాత్రం అలాగే ఉంటుంది. కానీ, ఎందుకని ఒకర్ని ఒకరు అవైడ్ చేసుకోవల్సి వస్తుందనేది సస్పెన్స్. అయితే, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం 'గీతాంజలి' తరహాలో సేడ్ క్లైమాక్స్ ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైతేనేం, ఎమోషనల్ లవ్ స్టోరీతో రాజ్ తరుణ్ టచ్ చేసేలా ఉన్నాడు 'ఇద్దరి లోకం ఒక్కటే' సినిమాతో. తనకు సెంటిమెంట్ అయిన డిశంబర్ 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
|