Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Naa Paata 4 - Nuvvu Nenu Kalisuntene _Gangotri

ఈ సంచికలో >> సినిమా >>

హీరోయిన్ల కంటే.. క‌మెడియ‌న్ల‌తోనే నాకు ప‌నెక్కువ‌ - అల్ల‌రి న‌రేష్‌

interview with naresh
న‌రేష్ సినిమాకెళ్తే కిత‌కిత‌లు ఖాయం. కిలోల్లెక్క‌న న‌వ్వుల్ని ఇంటికి ప‌ట్టుకురావొచ్చు. క‌డుపు నిండా న‌వ్వుల విందు వ‌డ్డించి సాగనంపుతాడాయ‌న‌. మినిమం గ్యారెంటీ హీరో అన్న పేరుంది న‌రేష్‌కి. క్లాసూ, మాసూ అనే తేడాలేకుండా.. అన్ని త‌ర‌గ‌తులూ న‌రేష్ కి ఫ్యాన్స్ అయిపోయారు. అయితే కొంత‌కాలంగా న‌రేష్‌కి విజ‌యాల్లేవు. అత‌ని సినిమాలు వ‌స్తున్నాయ్‌.. పోతున్నాయ్‌.. కానీ న‌వ్వించ‌లేక‌పోతున్నాయి. అందుకే ఈసారి రూటు మార్చాడు. క్లాసీ కామెడీతో న‌వ్వించ‌డానికి రెడీ అయ్యాడు. ఆ సినిమానే బందిపోటు. ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొస్తోందీ చిత్రం. ఈ సందర్భంగా న‌రేష్ చెబుతున్న బందిపోటు క‌బుర్లు...

* బందిపోటు ఏం దోచేస్తాడేంటి..?
- దొంగ‌ల్ని దోచుకొంటాడు. వీడు అట్టాంటి ఇట్టాంటి దొంగ కాదు.. తెలివైన దొంగ‌..

* ఈ సినిమా కోసం  ఎన్టీఆర్ సూప‌ర్ హిట్ సినిమా టైటిల్‌ని దోచేశారుగా.
- ఔనండీ. ఈసినిమా కోసం ఏ పేరైతే బాగుంటుంది? అనే విష‌యంపై చాలా డిస్క‌స్ చేశారు. సాధార‌ణంగా నా సినిమా టైటిళ్లంటే బెండ‌ప్పారావు, అత్తిలి స‌త్తిబాబు, బెట్టింగ్ బంగార్రాజు.. ఇలాంటి ఫ‌న్నీ టైటిల్స్ ఉంటాయి. టైటిల్‌తోనే న‌వ్వించే ప్ర‌య‌త్నం చేస్తాం. అయితే ఈసారి డిఫ‌రెంట్‌గా వెళ్దాం అనుకొని బందిపోటు అని ఫిక్స్ చేశాం. హిట్ సినిమా పేరు పెట్టుకొవ‌డం ఎంత సుఖ‌మో... అంత క‌ష్టం కూడానండీ. ఎందుకంటే.. జ‌నాల అంచ‌నాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఎన్టీఆర్ గారు న‌టించిన బందిపోటు సూప‌ర్ హిట్‌. ఆ త‌ర‌వాత అదే పేరుతో సుమ‌న్‌గారూ ఓ సినిమా చేశారండీ. అదీ సూప‌ర్ హిట్‌. మేం కూడా హిట్టు కొట్టాలి.. అంత ప్రెజ‌ర్ ఉంది మాపై..

* మీరేమో ఊర మాసూ, ఇంద్ర‌గంటి మ‌హా క్లాసు. ఇద్ద‌రికీ ఎలా కుదిరింది?
- మా ఇద్ద‌రి పై రెండు బ్యాగేజీలున్నాయి. ఆయ‌నేమో ఏ సెంట‌ర్ డైరెక్ట‌రు. నాకు బీసీల్లో ప‌ట్టుంది. అయితే ఈ సినిమా కోసం ఆ బ్యాగేజీల‌న్నీ ప‌క్క‌న పెట్టి.. ఇద్ద‌రం ఓకే బ్యాగ్ మోశాం. ఇద్ద‌రం కూర్చుని మాట్లాడుకొని.. ఎలాంటి క‌థ కావాలో, అందులో వినోదం ఏ స్థాయిలో ఉండాలో నిర్ణ‌యించుకొన్నాం. కొన్నిసారు.. నేను క్లాస్ కామెడీ చేశా.. ఇంకొన్నిసార్లు నాటుగానూ క‌నిపిస్తా. మొత్తానికి ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ట్రెండ్‌నే ఫాలో అయిపోయా.

* ఇంద్ర‌గంటి కామెడీ చేయ‌గ‌ల‌ర‌ని ఎలా అనుకొన్నారు?
- అష్టాచ‌మ్మాలో కామెడీ సూప‌ర్బ్‌గా ఉంటుంది. అదో స్టైల్‌. క్లాసీగా అనిపిస్తుంది. స్వాతి క్యారెక్ట‌ర్‌లో ఎన‌ర్జీ అద్భుతంగా ఉంటుంది. నాకూ అలాంటి పాత్రే కావాల‌ని ఆయ‌న‌తో చెప్పా. దాంతో ఈ సినిమా మొద‌లైంది.

*  పోస్ట‌ర్ల‌పై సంపూ, స‌ప్త‌గిరిల బొమ్మ‌లు బాగానే వాడుతున్నారు...
- దాని వెనుక మార్కెట్ స్ట్రాట‌జీ ఏం లేదండీ. ఈ సినిమాలో నేను రాజునైతే.. నా సైనికులు వాళ్లు. ప్లాన్ వేసేది నేను.. అమ‌లు చేసేది వాళ్లు. స‌ప్త‌గిరి నాలుగైదు స‌న్నివేశాల‌కు ప‌రిమిత‌మైతే... సంపూ ఆద్యంతం క‌నిపిస్తాడు. అయితే సంపూ క్రేజ్‌ని వాడేసుకోవాల‌న్న ఉద్దేశం ఏం లేదు.  నేనింత వ‌ర‌కూ హృద‌య‌కాలేయం సినిమా కూడా చూళ్లేదు. నాప‌క్క‌న రెండు క్యారెక్ట‌ర్లు ర‌న్ అవ్వాలి.. అందులో ఎవ‌రైతే బాగుంటార‌నేది ఓ లిస్టు రాసుకొన్నాం. సంపూ, స‌ప్త‌గిరిల‌తో ఇది వ‌ర‌కు నేను చేయ‌లేదు. సో.. ఈ కాంబినేష‌న్ కాస్త కొత్త‌గా ఉంటుంద‌నిపించింది. అంతే. 

* ఈ సినిమాకి నిర్మాతా మీరే.. బాగా క‌ష్ట‌ప‌డిన‌ట్టున్నారు..
- అలాంటిదేం లేదండీ. నాకు నిర్మాణం కొత్త కాదు. మానాన్న‌గారి సినిమాల ప్రొడ‌క్ష‌న్ నేను ద‌గ్గ‌రుండి చూసుకొనేవాడ్ని. ఒక విధంగా నేను క్యాషియ‌ర్‌ని. అందుకే ఈ సినిమాకి ప్రొడ‌క్ష‌న్ చేస్తున్నా.. పెద్ద‌గా క‌ష్టం అనిపించ‌లేదు. మా అన్న‌య్య కూడా ఉన్నాడుగా..

* పోనీ రెమ్యున‌రేష‌న్ తీసుకొన్నారా?
- ఓ... దాని కింద అన్న‌య్య ఓ కారు కొన్నాడు లెండి..

* సినిమా ఇంత‌లోనే తీయాలి అన్న రూల్ పెట్టుకొన్నారా?
- ఈ సినిమా మా సొంత బ్యాన‌ర్‌లో వ‌స్తోంది. కాబ‌ట్టి కాస్ట్లీగానే ప్లాన్ చేశాం. ఏదో చుట్టేయాల‌న్న ఉద్దేశ్యం ఎప్పుడూ లేదు. ఎందుకంటే.. రేపొద్దుట ఈ సినిమా చూసి `మీ సినిమా చుట్టేశారు... మా సినిమాకి ఎక్కువ ఖ‌ర్చు పెట్టిస్తావా?` అని ఏ నిర్మాత ఫిర్యాదు చేయ‌కూడ‌దు. సినిమాకి ఎంత కావాలో దానికంటే ఓ రూపాయి ఎక్కువే పెట్టాం.

* మీ సినిమాల్లో హీరోయిన్ మైన‌స్ అన్న కామెంట్ వినిపిస్తుంటుంది..
- ఏం చేస్తామండీ.. అందుబాటులో ఉన్న‌వారిని తీసుకోవాలి క‌దా. పేరున్న హీరోయిన్ కోసం ఎదురుచూశామ‌నుకోండి. డేట్ల స‌మ‌స్య వ‌స్తుంది. నా సినిమాలో న‌లభైమంది క‌మెడియ‌న్లుంటారు. బ్ర‌హ్మానందం గారి డేట్ కుదిరిన‌ప్పుడు హీరోయిన్ దొర‌క‌లేద‌నుకోండి.. షూటింగ్‌లో స‌మ‌స్య‌లొస్తాయి. అయినా నా సినిమాలో హీరోయిన్ ఉంటుంది.. గానీ త్రూ అవుట్ ఉండ‌దు. తెర‌పై హీరోయిన్ల కంటే.. క‌మెడియ‌న్ల‌తోనే నా కెమెస్ట్రీ ఎక్కువ‌గా ఉంటుంది. సో.... ఎవ‌రైనా పెద్ద తేడా ఏమీ ఉండ‌దు.

* మిమ్మ‌ల్ని డైరెక్ట‌ర్‌గా చూడాల‌న్న‌ది మీ నాన్న‌గారి ఆశ‌.. అదెప్పుడు తీరుతుంది?
- త్వ‌ర‌లోనే. అయితే నేనేం ఆ సినిమా కోసం పెద్ద‌గా ప్లాన్ చేసుకోవ‌డం లేదు. ఎప్పుడు కుదురుతుందో అప్పుడే మొద‌లెడ‌తా..

* పోనీ ఎలా ఉండ‌బోతోంది?
- ఈ సినిమాకోసం రెండు రూల్స్ పెట్టుకొన్నా. ఒక‌టి.. అందులో నేను న‌టించ‌కూడ‌దు. రెండోది అది కామెడీ సినిమా కాకూడ‌దు. కామెడీ ఉంటుంది.. కానీ సున్నిత‌మైన ఎమోష‌న్స్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తా.

* 50వ సినిమా ఎవ‌రితో?
- ప్ర‌స్తుతం ఏమీ అనుకోలేదు. క‌థాచ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లో చెబుతా. 50వ‌ది క‌న్‌ఫామ్ కాలేదుగానీ 51, 52 క‌థ‌ల‌కు ఒకే చెప్పేశా..

* పెళ్లెప్పుడు?
- ఈ యేడాదే. ఇదే మాట నాలుగేళ్లుగా చెప్తున్నా ఇది మాత్రం ఫిక్స్‌... కావాలంటే రాసి పెట్టుకోండి!

 
మరిన్ని సినిమా కబుర్లు
Movie Review : Bandipotu