నయనానంద రూపావళి - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

నయనానంద రూపావళి - దీపావళి .
భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్యమే దీపావళి. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుడినిసంహరించి శ్రీరాముడు సతీసమేతంగా
అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెపుతోంది.

చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీప మాళికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా చప్పుళ్ళు, ఈ దివ్య దీపావళి సోయగాలు.

ఈ పండుగ ప్రతియేటా ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్థశి. దీన్ని నరక చతుర్థశిగా జరుపుకుంటారు.

దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ |
దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమోஉస్తుతే ||

దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. మహిళామణులంతా ఆశ్వీయుజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో మట్టి ప్రమిదలలొ దీపాలను వెలిగిస్తారు. చివరకు ఈ దీపాలను ముత్తయిదువులు కార్తీక పౌర్ణమికి సముద్ర స్నానాలను ఆచరించి జీవనదులలో వదులుతారు. ఇవి సౌభాగ్యానికి, సౌశీల్యానికి, సౌజన్యానికి ప్రతీకలుగా భావిస్తారు. పైగా ఈ దీపావళి శరదృతువులో అరుదెంచటం విశేషం. మనోనిశ్చలతకు, సుఖశాంతులకు అనువైన కాలమిది.

దీపాల పండుగ అయిన దీపావళి రోజున మహాలక్ష్మీ పూజను జరుపుకోవడానికి ఓ విశిష్టత ఉంది. పూర్వం దుర్వాస మహర్షి ఒకమారు దేవేంద్రుని ఆతిథ్యానికి సంతసించి, ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు. ఇంద్రుడు దానిని తిరస్కార భావముతో తన వద్దనున్న ఐరావతం అను ఏనుగు మెడలో వెస్తాడు అది ఆ హారాన్ని కాలితో తొక్కివేస్తుంది. అది చూచిన దుర్వాసనుడు ఆగ్రహము చెంది దేవేంద్రుని శపిస్తాడు. తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యమును కోల్పోయి, సర్వసంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు. ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు. దానికి తృప్తిచెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వసంపదలను పొందాడని పురాణాలు చెబుతున్నాయి.

ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నించాడు. తల్లి నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? నీ భక్తులను కరుణించవా? అంటాడు. దీనికి ఆ మాత సమాధానమిస్తూ.. త్రిలోకాథిపతీ.."నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభీష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మీ రూపంగా, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మీగా, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మీగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మీగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలౌతానని" సమాధానమిచ్చింది. అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించేవారికి సర్వసంపదలు చేకూరుతాయని విశ్వాసం.

ఈపండుగను దక్షణాదిన మూడురోజులు అంటే ఆశ్వయజ బహుళ చతుర్ధశి , అమావాస్య , కార్దిక శుధ్ధ పాడ్యమి .మొదటిరోజు నరక చతుర్ధశి , రెండో రోజు దీపావళి , మూడవరోజు బలిపాడ్యమిగా వ్యవహరిస్తిం .ఉత్తర భారత దేశాన దీపావళిని అయిదు రోజులు జరుపుకుంటారు . అవి ఆశ్వయజ బహుళ త్రయోదశి , చతుర్ధశి , అమావాశ్య , కార్తీక శుధ్ధ పాడ్యమి , విదియ. మోదటి రోజు ధన త్రయోదశి (లేక) యమ త్రయోదశిగా ,రెండవరోజు నరక చతుర్ధశిగా , మూడవ రోజు దీపావళిగా , నాలుగోరోజు బలి పాడ్యమిగా , ఐదో రోజు యమద్వితీయగా జరుపుకుంటారు.

దీపావళి జరుపుకోవడం వెనుక పలుకథలు ప్రచారంలో ఉన్నాయి.
1)నరకాసురవధ. 2) బలి చక్రవర్తి రాజ్య దానం.3) భరత్ మిలాప్ .4) విక్రమార్కుని పట్టాభి షేకం . 5) నరకాసుర వథ.బలిరాజ్య దానం .కథలు మనకు తెలిసినవే! భరత్ మిలాప్ కథలో రావణ సంహారం అనంతరం అయోధ్యలో శ్రీరామునికి పట్టాభిషేకం జరిగిందని ఉత్తర భారత ప్రజలు నమ్మూతారు . విక్రమార్కుని పట్టాభిషేకం కార్తిక శుక్ల పాడ్యమి నాడే జరిగిందని వారి నమ్మకం.
ఈ పండుగ విదేశాలలో పలు పేర్లతో చేసుకుంటారు.ఈజిఫ్టు ,యమన్ దేశాలలో దీపావళిని సూర్యదేవత జన్మదినంగా డిసెంబర్ 25 న దీపారాధనలు చేస్తారు.

చైనాలో ఫిబ్రవరి మాసంలో ఒకసారి సెప్టెంబర్ మాసంలో మరో సారి జరుపుకుంటారు.ఈ రెండు పెద్దలను స్మరించుకునే పండుగలే ! అమెరికాలో హాలోవిన్ పేరిట నవంబర్ 1 వ తేదిన జరుపుకుంటారు. రోమన్ ,బ్రిటీష్ వారు కూడా ఈపండుగ జరుపుకుంటారు. క్రైస్తవులు జరుపుకునే క్యాండిల్ ఫెస్టివల్ దీపావళిని పోలి ఉంటుంది. ముస్లిం సోదరులు జరుపుకునే షబేభరాత్ పండుగలో బాణాసంచా కాల్చుతారు. ఈపండుగను తెలంగాణాలో దివిరి పండుగగా,ఆంధ్రాలో దివ్వెల పండుగ దీపావళిగా ఆచరిస్తారు. చీకటి తామసానికి ప్రతీక .అందరం వెలుగు దిశగా పయనించాలి.ప్రకృతి మాత ఒడిలో జీవించేమనం వెలుగును ఆహ్వానిధ్దాం ! . నిత్య నూతన శోభాయమానమైన ఈ ఆనందాల హరివిల్లు అయిన దీపావళిని సాదరంగా ఆహ్వానిద్దాం!.