ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి మొదలగు అన్ని దినపత్రికలలో దిన ఫలాలు, వారపత్రికలలో వార ఫలాలు మాసపత్రికలలో మాస ఫలాలు ఇంకా సంవత్సరంకు ఒకసారి వచ్చే పంచాంగంలో వార్షిక ఫలాలు, ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం అవమానాలు ఇలా అన్నింటినీ చదివి చిన్నప్పటినుండి తన భవిష్యత్తు ఎలా ఉంటుందోనని ఊహించుకొనే వాడు ఆనందరావు. మేమిద్దరం సోంపేట జిల్లా పరిషత్ హైస్కూలులో సహ విద్యార్థులం.
“ఒరే రుషి, ఇవాళ నా దిన ఫలాలలో ‘సంతోషకరమైన కాలం గడుపుతారు, ప్రయాణం సుఖంగా సాగుతుంది, సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి’ అని ఉంది, ఇది నిజమేరా, ఇవాళ నీ సైకిల్ మీద నేను స్కూల్ కి సుఖంగా వచ్చాను, మన మేథ్స్ టీచర్ ఇచ్చిన మార్కుల్లో నాకు ఫస్ట్ వచ్చింది అంటే క్లాసులో నా కీర్తి ప్రతిష్టలు పెరిగాయి. ఈ రోజంతా నేను సంతోషంగా ఉన్నాను.” అన్నాడు ఆనంద్.
“ఓకే, గ్రేట్ రా ఆనంద్. కాని ఇవి అన్ని రోజులు నిజం కావురా”
“నిజంగా జరుగుతాయిరా, లాస్ట్ వీక్ వార ఫలాల్లో నాకు ‘విందు వినోదాలు’ అని ఉంది. అలాగే జరిగింది. మా బావగారు బరంపురం నుండి వచ్చి నాకు బారువ బీచ్ కు తీసుకెళ్లారు తరువాత రాత్రికి మన ఊరి ఉడిపి హోటల్ లో డిన్నర్.”
“ఏవో కొన్ని యాదృచ్ఛికముగా మనకు జరిగినా అవి ఎల్లవేళలా జరగవురా, మా నాన్నగారి స్నేహితుడు ఒకాయన విశాఖపట్నంలో ఉంటారు. ఆయన కొన్ని పత్రికలకు వార ఫలాలు రాస్తుంటారట. అవి ఎలా రాస్తారో చెప్పమని మా నాన్న గారు అడిగితే ‘ప్రతి వారం ఏముంటాయండి, అటువిటు ఇటువటు రాసిస్తాను. ఈ జాతక ఫలాలు పత్రికల్లో రాయడం మొదట ఎవరు ప్రారంభించారో గాని అప్పటినుండి ప్రజల్లో ఈ పిచ్చి మొదలయింది’ అన్నారట”.
మేము టెంత్ క్లాస్ చదువుతున్న రోజుల్లో నాకు ఆనంద్ కు మధ్య తరచుగా జరిగే సంభాషణ ఇది. రాశిఫలాలు చదువుతూ అందులో రాసిన విషయాలు తనకోసమే రాసారన్నట్టు తనకు అన్వయించుకునే వాడు ఆనంద్.
ఆనంద్ నాతో డిగ్రీ వరకు చదివాడు తరువాత తమ కుటుంబ ఆర్ధిక స్థితి బాగులేదని పై చదువులు చదవలేదు. నేను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పిజి చేసి వైజాగులో ఎ వి ఎన్ కళాశాలలో లెక్చరర్ గా ఉద్యోగం లో చేరాను.
——-///——-
కొన్నేళ్ల తరువాత ఒక రోజు సెవెన్ హిల్స్ హాస్పిటల్ కు వెళ్లిన నాకు ఆనంద్ తారస పడ్డాడు. తాను ఇప్పుడు మెడికల్ సేల్స్ మేనేజరుగా పనిచేస్తున్నాను అని, పనిలో భాగంగా డాక్టర్లను సంప్రదించడానికి వచ్చానని తాను కూడా వైజాగ్ లో మా ఇంటికి దగ్గరలోనే ఉంటున్నానని చెప్పాడు. నా అడ్రసు తీసుకుని వచ్చే ఆదివారం కలుస్తానన్నాడు.
చెప్పినట్లే ఆదివారం నాడు వచ్చాడు. తనని చూస్తే దేనికోసమో బాధ పడుతున్నాడు అనిపించింది.
“ఏరా ఆనంద్ ఆర్ యు ఓకే?” అడిగాను. నేనూహించినట్లే తల అడ్డంగా ఊపాడు.
“నలభై ఏళ్లు దాటినా ఇంకా స్థిరపడలేదురా నేను. గవర్నమెంట్ ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేశాను కానీ దొరకలేదు. “గుమ్మడి కాయంత తెలివి కంటే గురివిగింజంత అదృష్టం మేలు” అంటారు కదా. నాకు రెండోది తక్కువయిందిరా. అందుకే చివరికి ఇలా ఈ ఉద్యోగంలో చేరాను. ఇది కూడా ఎప్పుడు ఊడుతుందో తెలియదు. నా జాతక చక్రంలో ఏదో దోషం ఉందనిపిస్తుంది.”
“అంటే నీకు ఇంకా ఆ జాతకాల పిచ్చి పోలేదన్న మాట. అలా ఎందుకురా ఆలోచిస్తున్నావు, గవర్నమెంట్ ఉద్యోగం గొప్పది కాదు అలాగని ఈ ఉద్యోగం చిన్నది కాదు. ‘రాజుని చూసిన కన్నులతో మొగుడిని చూస్తే చులకన’ అంటారు కదా, అలా ఉంది నీ వ్యవహారం. అంతలా ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు, ఎవ్రిథింగ్ విల్ బి ఆల్రైట్” అన్నాను నేను.
“కాదురా, ఎవరైనా మంచి జ్యోతిష్యుడు నీ దృష్టిలో ఉంటే చెప్పు, నా జాతకం ఒకసారి చూపిద్దాం” అన్నాడు.
“సరే, మా కాలేజీలో తెలుగు లెక్చరర్, రామకృష్ణ ఉన్నారు. మా స్టాఫ్ అందరూ ఇలాంటి విషయాల్లో ఆయన సలహా తీసుకుంటారు. సాయంత్రం వెళ్ళి ఆయనకొకసారి చూపిద్దాం”
——-///——-
“నమస్తే రామకృష్ణ గారు, ఈయన మా క్లాస్ మేట్ ఆనంద రావు. ఈయన ఏవో ఇబ్బందులులో ఉన్నాడు. కొద్దిగా జాతకం పరిశీలించి దోషాలుంటే ఉపశమనాలు చెప్పండి.”
“రండి సార్, రండి రండి” రామకృష్ణ గారు ప్రతి నమస్కారం తో ఆహ్వానించారు.
“ఆనంద్ గారు, మీ జన్మ తేదీ, సమయం మరియు జన్మస్థలం చెప్పండి”అన్నారు రామకృష్ణ గారు. ఆనంద్ చెప్పిన తరువాత జాతకాన్ని పరిశీలించి “ఏడు శనివారాలు ఆంజనేయ స్వామి గుడిలో పదకొండు ప్రదక్షిణలు, మరియు రాహుకాలంలో దుర్గాలమ్మ గుడిలో పూజలు చేయండి. ఇలా చేస్తే మీకు మనోబలం వృద్ధి చెందుతుంది. మనసులో ఆందోళన స్థానంలో ప్రశాంతత కలుగుతుంది.” అన్నారు. అలాగే పనిలో పనిగా మీకు అయిదేళ్ల నుండి ‘ఏలినాటి శని’ నడుస్తుంది కాబట్టి వచ్చే శనిత్రయోదశి నాడు శని పీడా పరిహారార్థమై మందపల్లి శనీశ్వరునికి తైలాభిషేకం జరిపిస్తే మంచిది.” అని వివరించారు. ఆనంద్ అలానే చేసాడు కానీ పీడ విరుగుడవ్వలేదు. పైపెచ్చు ‘పులి మీద పుట్రలా’ ఉద్యోగంలో మార్పులు జరిగి విశాఖపట్నం నుండి ముంబాయికి బదిలీ జరిగింది.
విసిగిపోయిన ఆనంద్ ఉద్యోగం నుండి వైదొలిగి విశాఖపట్నంలో హోల్ సేల్ మెడికల్ వ్యాపారం మొదలుపెట్టాడు. పదేళ్లు గడిచాయి గాని వ్యాపారం పుంజుకోలేదు. నష్టాలు చవి చూసింది. దాంతో ఆ వ్యాపారం మూతపడింది. ఈలోగా కుటుంబ బాధ్యతలు ఎక్కువయ్యాయి. భార్య ఆరోగ్యం కూడా క్షీణించింది. కొడుకు కష్టపడి చదివి బి టెక్ లో ఫ్రీ సీటు సాధించినా హాస్టల్ ఫీజు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఆనంద్ కు తన జాతకంలో దోషం వలనే ఇలా జరుగుతుంది అని ప్రగాఢ నమ్మకం.
ఇది గమనించిన నేను ఆనంద్ కు మా ఊరి ‘ ఓ పి సిద్ధాంతి’ గురించి చెప్పాను. ఆనంద్ మా ఊరు విడిచి సుమారు నలభై ఏళ్లయంది. నేను విశాఖపట్నం లో స్థిరపడినా నెలకోసారి మా అమ్మానాన్నలను చూడడానికి మా ఊరు వెళ్తుంటాను. నేను వెళ్ళిన ప్రతిసారీ ‘ఓ పి సిద్ధాంతి’ గారి గురించి అక్కడున్న ఫ్రెండ్స్ ద్వారా వింటుంటాను. అందుకే ఆనంద్ ని తీసుకుని మా ఊరు వెళ్ళాను.
——///——
"శివజ్యోతి జ్యోతిష్యాలయము
బ్రహ్మశ్రీ ఓరుగల్లు పార్వతీపరమేశ్వర సిద్ధాంతి
వివాహం జరగడం లేదా
ప్రేమించిన వ్యక్తి దూరమౌతున్నారా
భార్యాభర్తల మధ్య మనస్పర్ధలతో మనశ్శాంతిని
కోల్పోతున్నారా
ఇచ్చిన డబ్బులు తిరిగి రావడం లేదా
వ్యాపారంలో నష్టాలా
ఉద్యోగం రావడం లేదా
నిత్యం అనారోగ్యంతో బాధపడుతున్నారా
కుటుంబంలో ఏ సమస్యకైనా నూటికి నూరు శాతం
పరిష్కారం
ఆలస్యం చేయకుండా వెంటనే సంప్రదించండి
అయిదేళ్ళ క్రితం ఈ జ్యోతిష్యాలయం మా ఊరిలో వెలసింది. జ్యోతిష్యాలయము వద్ద బోర్డు పై విధంగా కనిపిస్తుంది.
అయిదేళ్ళ క్రితం వరకు మా ఊరిలో ఉన్న ఏకైక సిద్ధాంతి “బీహార్ పంతులు" గారు. ఊరిలో జరిగే అన్ని శుభ కార్యాలకు, తద్దినాలకు, అలాగే జాతక విషయాలకు ఆయనొక్కడే దిక్కు. ఆయన పూర్వీకులు ఆంధ్రప్రదేశ్ నుండి బీహార్ వెళ్లి ‘గయ’ లో స్థిర పడ్డారట. ఆ తరువాత మా ఊరిలో ఉన్న బంధువుల మాటతో వెనక్కి వచ్చిన పంతులుగారు ఇక్కడ నివాసం ఏర్పరచుకున్నారు కనుక ఆయన ‘బీహార్ పంతులు’ గానే అందరికీ పరిచయస్తులు. ఆయనకు ఒక్కతె కూతురు. ఆమె భర్త ఈ సిద్ధాంతి గారు. అంటె బీహార్ పంతులు గారి అల్లుడన్నమాట. బీహార్ పంతులు గారు తన చివరి రోజుల్లో, ఇక్కడైతె ఆదాయం పుష్కలముగా వస్తుందని చెప్పి అల్లుడు గారిని వారి స్వంత ఊరు పార్వతీపురం విడిచి మా ఊరికి రమ్మని చెప్పి ఇక్కడ ఈ జ్యోతిష్యాలయం ఏర్పరిచారు. మా ఊరిలో షాహుకార్లెక్కువ. వాళ్ళు సంభావన కూడ విరివిగా ఇస్తారు. ‘కాళ్ళ దగ్గరకు వచ్చిన బేరం కాశీకి వెళ్ళినా దొరకదు’ అన్నది బాగా ఆకళింపు చేసుకున్న సిద్ధాంతి గారు, తన వద్దకు వచ్చిన ప్రతి వారిని ఏదో ఒకటి చెప్పి ఒప్పిస్తారు. అందువలన సిద్ధాంతి గారు అనతికాలములోనే బాగా పేరుతో పాటు ధనాన్ని కూడ పోగేసుకున్నారని అంటారు.
——-///——-
ఆరుద్ర నక్షత్రం ఆఖరి పాదం, తల్లికి దోషం"
"సరిగ్గా చూడండి సిద్ధాంతి గారు. మొన్న పెద్ద పండక్కి ముందొచ్చిన పున్నమి రోజున పుట్టింది. శనివారం మధ్యాహ్నం రెండు గంటలప్పుడు"
"అవునండి షాహుకారు గారు, అదే చూస్తున్నాను ఆ రోజు ఆరుద్ర నక్షత్రం. మీ మనవరాలు పుట్టింది ఆఖరి పాదంలో. ఆ కారణంగా తల్లికి దోషం. అంటె మీ కుమార్తెకు దోషమన్న మాట. దానికేం బాధ పడనక్కరలేదు. జాతకాలలో ఇవన్నీ సహజమే. అయినా అన్నింటికీ నేనున్నాను కదండీ…”
"ఏమి చెయ్యాలో చెప్పండయ్యా?"
"చిన్న దోషమే. నక్షత్ర జపం, నవగ్రహ శాంతి, దానములు, హోమ శాంతి, రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, సువర్ణ దానం జరిపించినచో దోషము తొలగి ఆయురారోగ్య సుఖ శాంతులతో వర్ధిల్లెదరు."
"చిన్న దోషమన్నారు. ఇంత పెద్ద లిస్టు చెప్పారేమిటండి?"
"శాస్త్రం చెప్పిందే నేను చెబుతున్నాను అయినా మీ లాంటి షాహుకార్లకు ఇదేమి ఎక్కువ కాదండి. సరే జన్మ నక్షత్రంలోనే దోషముంది కాబట్టి. నక్షత్ర జపం తప్పని సరి. ఇకపొతే నవగ్రహ రుద్రాభిషేక పూజలు జరిపించి దానములు ఇచ్చుకుంటె మీ ఇంట్లో సుఖ శాంతులు తిష్ట వేసి కూర్చుంటాయి."
"అవి తరువాత చేద్దాం లెండి. ప్రస్తుతానికి ఆ నక్షత్ర జపం జరిపించండి."
"ఆడపిల్లండీ, అంటే మీ ఇంటికి లక్ష్మీదేవి వచ్చిందండీ. అమ్మవారికి కుంకుమార్చన, సువర్ణ దానం కూడ చేస్తె మంచిది."
"సరే మీ ఇష్టం. అలాగే చేద్దాం. పిల్లకు ఇరవై తొమ్మిదో రోజున నామకరణ మహోత్సవం పెట్టుకుందామనుకుంటున్నాం. అది కూడ మీ చేతుల మీదుగా జరిపిద్దాం లెండి. ఈ పూజలు కూడ ఆ రోజు చేస్తె సరిపోతుంది కదా, ఈ లోగా పిల్లకు మంచి పేరు చూసి చెప్పండి."
ఇంతసేపు సిద్ధాంతి గారి సహాయకుని సలహా మేరకు నేను, నా ఫ్రెండ్ ఆనంద్ బయట కూర్చుని ఉండటం వలన పై సంవాదం విన్నాం.
సిద్ధాంతి గారితో మాటలాడి బయటకు వస్తూ "ఏంట్రా ఇలా వచ్చావ్” అని పలకరించాడు హైస్కూల్లో మా సీనియర్ అయిన కోదండం.
"ఏం లేదురా, ఇదిగో నా క్లాస్ మేట్ ఆనంద్ కు ఏదో అవసరమంటె వచ్చాను."
కోదండం బంగారం వర్తకుడు. మా ఊరిలో ధనవంతులలో ఒకడు. అందుకే సిద్ధాంతి గారు "మీలాంటి షాహుకార్లకు ఇదేమి ఎక్కువ కాదండి" అన్నారు.
బయట వేచివున్న మాకు అవకాశం రాగానే లోపలికి వెళ్ళాం.
——-///——-
“నమస్కారమండి సిద్ధాంతి గారు, నాపేరు రుషి. మాది ఈ ఊరే, ఉద్యోగరీత్యా విశాఖపట్నం లో ఉంటున్నాను. ఈయన నా ఫ్రెండ్ ఆనంద్. ఈయన జాతకం మీరు పరిశీలించాలి” నన్ను నేను పరిచయం చేసుకుని, వచ్చిన విషయం చెప్పాను.
“మీ జన్మ తేదీ, సమయం, స్థలం చెప్పండి ఆనంద రావు గారు”
సిద్ధాంతి గారు అడిగిన విషయాలకు ఆనంద్ బదులు చెప్పాడు.
“మీ జాతకం ప్రకారం మీకు బుధ మహాదశ నడుస్తోంది. బుధుడు బలహీనంగా ఉండటం వలన వ్యాపారంలో నష్టాలు కలిగి మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఈ దశ పదిహేడు సంవత్సరాలు ఉంటుంది. ఈ గ్రహ శాంతి కోసం, బుధ మంత్రం “ఓం బ్రాం బ్రీం బ్రౌం సః బుధాయ నమః” పదిహేడు వేలు జపించాలి.”
“పదిహేడు వేలా!” ఆశ్చర్యంతో నోళ్ళు వెల్లబెట్టాం.
“చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి” అన్న సామెత విన్నారు కదా, భయపడకండి, అయినా అన్నింటికీ నేనున్నాను కదండీ”
“అసలు ఈ జప మంత్రం అర్ధమేమిటి స్వామీ” అని అడిగాను నేను.
“ ఇది బుధ గ్రహ బీజ మంత్రం. బుధుని కీర్తిస్తూ సంపూర్ణ భక్తి శ్రద్ధలతో నమస్కరించడం. ఆ గ్రహ అనుగ్రహం కోసం మనం జపిస్తున్నాం. గ్రహాధిపతులకు అర్థమవుతుంది, అది చాలు” అన్నారు సిద్ధాంతి గారు.
“సరే జరిపించండి. మీ ………” అని నేను అంటుండగానే
“పదిహేడు వేలు అవుతుంది. మీరు తక్షణమే చెల్లిస్తే, రేపు బుధవారం గనుక రేపటి నుండి జపం మొదలు పెడతాం”
ఆనంద్ కు దిమ్మ తిరిగింది. “తక్షణం పదిహేడు వేలు ఎలా?”అనుకుంటూ, అనాలోచితంగా చిన్నప్పటి నుండి మెడలో ఉన్న ఆంజనేయస్వామి బంగారు బిళ్ళ పైకి చెయ్యి వెళ్ళింది.
“వద్దురా” అన్నాను.
“ఈ స్వామి ఇలా మనకు మేలు చేస్తున్నార్రా” అన్నాడు ఆనంద్.
వెంటనే కోదండం దగ్గరికి వెళ్లి దాన్ని విక్రయించి ఆ డబ్బుని సిద్ధాంతి గారికి చెల్లించాం.
ఆనంద్ ఊపిరి పీల్చుకున్నాడు. “ఇక మీదట అంతా మంచే జరుగుతుందిరా” అన్నాడు.
“యద్భావం తద్భవతి” అని సంస్కృతంలో ఒక సూక్తి ఉందిరా, మనం ఎలా తలిస్తే అలాగే జరుగుతుంది అని అర్థం. మనిషి ఆలోచనా సరళిని బట్టి జీవిత గమనం సాగుతుంది. మంచి ఆలోచనలు చేస్తే మంచే జరుగుతుంది.” అన్నాను.
మేము బయటకు వస్తుండగా ఆనంద్ కొడుకు దగ్గర నుండి ఫోన్ వచ్చింది. తాను కేంపస్ ఇంటర్వ్యూలో జాబ్ సంపాదించానని చెప్పాడు. ఆనంద్ కు కలిగిన పుత్రోత్సాహానికి అవధులు లేవు.
“కష్టాలు కలకాలం కాపురం ఉండవురా ఆనంద్, కష్టసుఖాలు కావడి కుండలు అని పెద్దలు చెప్పారు కదా” అన్నాను.
——-///——-

