జ్యోతిర్మయం విశ్వం -
జ్యోతిర్మయం విశ్వం
దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి జనార్థన!
దీపో హరతుమే పాపం, దీపం జ్యోతి నమోస్తుతే.!!
ఆశ్వీయుజ శుక్ల త్రయోదశి మొదలు దీపావళి ఉత్సవం ప్రారంభం అవుతుంది. నరకాసుర వధానంతరం సత్యభామ సాధించిన విజయానికి లోకంలో చీకట్లు పోయి వెలుగులు ప్రారంభం కాబడ్డాయి. అఙ్ఞానాంధకారంలో మునిగిన ప్రపంచాన్ని వెలుగులతో నింపే సాంప్రదాయమే దీపావళి ఉత్సవం లేదా పండుగగా మనం జరుపుకుంటున్మాము. వళీ అనగా వరుస క్రమం, దీపావళి అనగా దీపముల వరుస. త్రయోదశి రోజున ఇంటి యజమాని దీర్ఘ ఆయుష్షుతో జీవించటానికి దక్షిణం వైపు ఆకాశం కనిపించే విధంగా మట్టి ప్రమిదలో ఆముదంతో మూడు వత్తులతో దీపం పెట్టాలి. యమధర్మరాజు అశీర్వాదంతో గృహయజమాని శతాయువు పొందుతాడు. దీపానికి క్రింద వరిపిండితో ముగ్గువేసి దీపం పెట్టి, ఆ నూనెలో ప్రకృతి ప్రసాదించిన ఒక చిన్న గవ్వ వేసి ఆ దీపం వెలుగులు ఆకాశం చూస్తున్నట్లు పెట్టాలి. ఈ త్రయోదశిని ధన త్రయోదశి అని కూడా పిలుస్తారు. స్వర్ణం ఇంటికి వస్తే లక్ష్మీదేవి వస్తుందనే భావనతో ఎంతో కొంత బంగారం ఈ మధ్య కొనుగోలు చేస్తున్నారు. ఈ సంప్రదాయన్ని మీ అనుకూలంగా పాటించవచ్చును.
రెండవ రోజు చతుర్థశి నాడు ఇల్లు శుభ్రం చేసుకుని రంగవల్లులు తీర్చిదిద్ది పనికిరాని, వాడని సామాన్లను గృహం నుండి వేరుచేసి, పిల్లల తలకు నువ్వుల నూనె వ్రాసి, దీవించి, తదుపరి అభ్యంగన స్నానం చేయించి, నూతన వస్త్రములు ధరింప చేసి పిండివంటలతో భోజనం పెట్టాలి. సాయంత్రం ద్వారబంధానికి ఎదురుగా రెండు క్రొత్త మట్టి ప్రమిదలలో కుడి ఎడమలుగా దీపం పెట్టాలి. జీవితంలో వచ్చే ఆనంద ఆగమనానికి సంకేతంగా టపాసులు కాల్చి దీపావళి పండుగను ఆహ్వానించాలి.
అమావాస్య ఉదయమే సూర్యుడు ఉదయించకుండా గృహస్తులు నిద్రలేచి, అభ్యంగన స్నానం చేసి గ్రహరాజుకి నమస్కరించి మహాధనలక్ష్మిని కలశతోగాని, లేక సంప్రదాయాన్ని అనుసరించిగాని లక్ష్మీనారాయణ ప్రతిమతో కుబేర ముగ్గులో స్థాపించి పూజాదికాదికాలు చేసి శక్తికి తగినట్లుగా నైవేద్యం సమర్పించాలి. కుబేర ముగ్గు క్రింద ఇవ్వటం జరిగింది. దీనిని పండితుల ద్వారా తెలుసుకున్నది.
27 20 25
22 24 26
23 28 21
ఓం యక్షేశాయ విద్మహే వైశ్రవణాయ ధీమహీ ! తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ !! అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేయాలి. అనంతరం మహాలక్ష్మిని సహస్రంతో గాని, అష్టోత్తరంతో గాని పూజించాలి. కుబేర ముగ్గుకు ఎదురుగా ఆవునేతి దీపం శ్రేష్టం. పై విధంగా వేసిన ముగ్గుపై ఒక్కొక్క రూపాయి బిళ్ళ ఒక్కొక్క అంకెపై అమర్చి, దానిపై విధిగా ఎర్రి పుష్పములు పెట్టవలెను. ఈ ముగ్గుపై గాని ప్రక్కన గాని లక్ష్మీనారాయణులను అమర్చి పూజించ వచ్చును. ఈ విధంగా పూజించి నట్లయితే ఐశ్వర్యం మన చెంతే నివాసం ఉండటానికి అవకాశం ఎక్కువగా వుంటుంది. విప్పనూనె లక్ష్మీ పూజకు ప్రత్యేకంగా వాడటం మంచిది. విప్పనూనె మహాలక్ష్మిని మనకు అత్యంత సన్నిహితం చేసే కారకం. ముందుగా పసుపు వినాయకుడిని తమలపాకులో స్థాపించి పూజించటం మరువకూడదు.
శ్రీ మహావిష్ణువు వామనావతారమెత్తి బలి చక్రవర్తిని పాతాళానికి పంపించాడు. అయినప్పటికి బలి శ్రీహరినే సదా ధ్యానించినందుకు విష్ణువు సంతోషించి బలి చక్రవర్తికి ఒక గొప్పవరం ప్రసాదించాడు. ఆ వరం కారణంగా ప్రతి సంపత్సరం దీపావళి రోజున బలి చక్రవర్తి పాతాళం నుంచి భూలోకానికి వచ్చి ఆ ఒక్క రోజు పరిపాలిస్తాడు. కనుక ప్రజలు సంతోషంతో ఇంటినిండా దీపాలు వెలిగిస్తే బలి చక్రవర్తిని, మహావిష్ణు సమేత శ్రీ మహాలక్ష్మిని ఆహ్వానించినట్లువుతుంది. ఆ విధంగా ధనలక్ష్మి ఐశ్వర్య ప్రదాతగా అనుగ్రహించి మనలను అశీర్వదిస్తుంది. దీనిని కౌముదీ వుత్సవంగా కూడా వ్యవహరిస్తారు.
సంధ్యా సమయంలో గృహంలో ప్రతి దిక్కుని చూసేలాగ ఇల్లంతా నువ్వులనూనె దీపం పెట్టాలి. ధనలక్ష్మికి అదే ఆహ్వనం. ముందుగా తులసికోట వద్ద కార్తీకదామోదరాయనమ: అని దీపం పెట్టి అందరికీ అందుబాటులో వుండే ఉసిరిక దీపంపెట్టాలి. ఇది లక్ష్మీనారాయణులకు అత్యంత ప్రీతికరమైనది. గోగు కర్రలకు క్రొత్త బట్ట కట్టి నూనెలో ముంచి దివిటీలుగా తయారుచేసి చిన్నారులతో కొట్టించాలి. అనంతరం వాళ్ళ పాదాలు శుభ్రంచేసి వారితో గుగ్గిలం లేదా సాంబ్రాణి వేరుంచి ఇంటిలోపలికి తీసుకుని పచ్చి మిఠారులు తినిపించాలి. ఇది కూడా మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన పని. ఆ చిన్నారులు తీపి తింటున్నప్పుడు వారి మనసుపడే ఆనందమే ధనలక్ష్మి ఆశీర్వాదం.
లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగధామేశ్వరీం!
దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం !!
అనంతరం గృహిణి నూతన వస్త్రములు ధరించి పూజాస్థానంలో ఉదయమే స్ధాపించిన లక్ష్మీనారాయణులను పూజించటం ప్రారంభించాలి. ఈ పూజ సాయంత్రం 6.30 గం. లోగా ప్రారంభించాలి. పూజలో కరివేరు లేక గన్నేరు, తామర, సన్నజాజి, విరజాజి, చామంతులు, గులాబీలు, నీలిరంగు పుష్పాలు వాడవచ్చును. కనకాంబరం, బంతి పూలను వూజలో వాడరాదు. అలంకరణలో వాడుకోవచ్చును. పూజను మంత్రపూర్వకంగా గాని, శ్లోక పూర్వకంగా గాని చేసుకోవచ్చును. పూజ పూర్తి అయిన తరువాత యధాశక్తి పలు రకాల నైవేద్యాలు సమర్పించాలి. చక్కటి కర్పూర హారతిని సమర్పించి, అ కర్పూర హారతి ఇల్లంతా తిప్పాలి. ప్రసాదాన్ని భక్తి శ్రద్ధలతో ఇంటిలోని వారంతా స్వీకరించి ధనలక్ష్మి అమ్మవారి కృపకు పాత్రులు కావాలి. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పిల్లలతో టపాసులు కాల్పించి ఇల్లంతా వెలుగులతో నింపాలి. కొన్ని ప్రాంతాలలో అర్థ్రరాత్రి సమయంలో మహాలక్ష్మికి పరమాన్నం నైవేద్యం సమర్పించే సాంప్రదాయం కూడా వుంది. ఇంటిలో అందరిలో ఆనందోత్సాహాలను నింపే పండుగ కాబట్టి, ఉత్సాహంగా కలసి మెలసి చేసుకోవాలి.
టపాసులు కాల్చే క్రమంలో ప్రకృతిని ధ్వని కాలుష్యం, పొగ కాలుష్యం నుంచి కాపాడుకోవడం అందరి బాధ్యతగా గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా ఇంటిలోని లేదా మన చుట్టు ప్రక్కల ఉండే ముసలివారి లేదా రోగుల పరిస్థితిని కూడా గమనించుకోవాలి. మనం జరుపుకునే పండుగ ఇతరులకు నరకప్రాయం కారాదు. సర్వత్ర సమతౌల్యం పాటిస్తూ పండుగ జరుపుకుంటే సర్వభూత క్షేమాన్ని కాంక్షిస్తూ పండుగ జరుపుకుంటే తప్పక మన ఇంటిలో సర్వ సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆనందోత్సాహాలతో దీపావళి జరుపుకుని, మరునాటి నుండే రాబోయే కార్తీక మాస ఉత్సవాలకు సిద్ధం కావాలి.
అమావాస్య నాటి దీపాల వెలుగులలో చీకటిని పోగొట్టి మనలో నిక్షిప్తమైన అఙ్ఞాన మనే నరకాసురుడిని తొలగించి యోగ దీపావళిగా చేసి, యోగ మిత్రుల దీపాలను వెలిగించి ఈ కలియుగంలో సత్యయుగాన్ని స్థాపిద్దాం.
సర్వేజనా: సుఖినోభవంతు.

