కాకా... ఓ అందమైన బాక! - ..... బొల్లిముంత వెంకట రమణా రావు

Kaka o andamaina baakaa

కాకా పట్టడం అనేది మనిషి కనిపెట్టిన గొప్ప షార్ట్‌కట్ సిద్ధాంతం. పని చేయడం కంటే పని చేయించుకోవడం సులభమని తెలుసుకున్న రోజే ఈ విద్య పుట్టి ఉంటుంది.

కాకాయిజం అంటే పొగడ్తకు కాస్త తెలివితేటలు జోడించిన వ్యవహారం. సాధారణంగా ఎవరినైనా పొగిడితే దాని వెనుక అభిమానం ఉండవచ్చు. కానీ కాకాయిజంలో అభిమానం కంటే అవసరమే ఎక్కువగా ఉంటుంది. పని ఉన్నంత వరకు ఎదుటివారి తెలివికి హద్దులుండవు. వారి మంచితనానికి కొలమానం ఉండదు. వారి నిర్ణయాలకు తిరుగుండదు.

కాకా పట్టేవాడి మాటలు వినడానికి చాలా బాగుంటాయి. అయితే ప్రతి పొగడ్త వెనుక ఒక చిన్న కోరికో, ఒక సిఫార్సో, ఒక అనుమతో, మరేదో ప్రయోజనమో దాగి ఉంటుంది. పని పూర్తయ్యే వరకు పొగడ్తల ప్రవాహం కొనసాగుతుంది. పని అయిపోయిన తర్వాత అదే వ్యక్తి ఎదురుగా కనిపించినా గుర్తుపట్టడానికి కొంత సమయం పడుతుంది.

పొగడ్త మోతాదులో ఉంటే సంబంధాలను మెరుగుపరుస్తుంది. మోతాదు మించితే మాత్రం కాకా పట్టేవాడి అసలు ఉద్దేశం బయటపడుతుంది. అప్పుడు ఎదుటివాడు సంతోషపడటం కంటే---

వీడికి ఇప్పుడు ఏం పని పడిందో!”

అని ఆలోచించడం మొదలుపెడతాడు. అదే కాకాయిజంలో ఉన్న అసలు ప్రమాదం.

మన దేశంలో పుట్టిన గొప్ప కళల్లో కాకా పట్టడం కూడా ఒకటి. దీనికి గురువులు ఉండరు. సిలబస్ ఉండదు. పరీక్షలు ఉండవు. కాకా డాక్టరేట్స్ వుంలాయి. నిజానికిది తెలవి తక్కువ వాళ్లపై అతి తెలివి తక్కువ వాళ్ల సిద్ధాంతం. అయినా ఇందులో ప్రావీణ్యం సాధించినవాళ్లు లక్షల్లో కనిపిస్తారు. ఈ కళకు ఒక్కటే అర్హత---ఎదుటివారి బలహీనత ఎక్కడుందో కనిపెట్టి, అక్కడే పొగడ్తలతో ముంచెత్తడం.

ఈ పొగడ్త ఒక టానిక్‌లాంటిది. ఇంట్లో భార్యైనా, ఆఫీసులో బాస్ అయినా దాని ప్రభావానికి అతీతులు కారు. దానికి కావాల్సింది కాస్తంత తీయగా మాట్లాడటం తప్ప మరేమీ కాదు. అయితే తీసిపారేసినట్టుగా మాట్లాడకూడదు. అలా మాట్లాడితే మన నట్టు బోల్టు బిగించే ప్రమాదం ఉంటుంది. అందుకే సమాజంలో ముద్దుగా మాట్లాడి బతకడం నేర్చినవాడే తెలివైనవాడని కొందరి సిద్ధాంతం.

అసలు కాకా అవసరమా?” అని ఓ పెద్దమనిషి గొణుగుతాడు.మరోకడు

మన ఆత్మాభిమానాన్ని చంపుకోవడమే కదా!” అని దీర్ఘాలు తీస్తాడు.

వేమన ఎప్పుడో సెలవిచ్చాడు---కొండ అద్దమందు కొంచెమై ఉండదా?” అని. ఎంత పెద్దవాడైనా సందర్భాన్ని బట్టి కొంచెం తగ్గాల్సి వస్తుందని దాని అర్థం తీసుకోవచ్చు. శ్రీకృష్ణుడు సైతం సత్యభామదేవి అలక తీర్చడానికి కాళ్లు పట్టాడని కథలు చెప్పుకుంటాం. కాళ్లు పట్టాడే తప్ప, కాళ్లు లాగేయలేదు కదా!

కొందరు---

పొగడ్తలు అంటే నాకు అస్సలు పడవు,” అంటారు. అవి అమాంతం మింగె అగడ్తలవంటివి అంటారు దెబ్బతిన్న అజ్ఞానులు.

అది ఉత్తుత్తి మాటే. పొగడ్తకు పూర్తిగా లొంగని మనిషిని వెతకడం కూడా ఒక పరిశోధనే! దేవుడినే స్తోత్రాలతో, ప్రశంసలతో ముంచెత్తి, చివర్లో మన కోరికల జాబితా ఆయన ముందు పెట్టే సంప్రదాయం మనది. అలాంటప్పుడు మానవమాత్రులు పొగడ్తకు లొంగరని ఎలా నమ్మగలం?నమ్మి మాత్రం ఏం చేయగలం.

ప్రతివారిలోనూ కళాపోషణ లేకపోవచ్చు. కానీ ఏదో ఒక బలహీనత మాత్రం ఉంటుంది. అది ఎవరో ఒకరి చేత కనిపెట్టబడుతుంది. దాన్ని సాధనంగా మార్చుకున్నవాడు తన పని చక్కబెట్టుకుంటాడు.

ఇంట్లో చిన్న పిల్లాడు కూడా ఈ విద్యను చాలా త్వరగా నేర్చుకుంటాడు.

“నాన్నా... నువ్వే మా హీరో!”

తండ్రి కళ్లల్లో ఆనందం మెరుస్తుంది.

“ఏమైంది రా?”

ఐస్‌క్రీమ్ తినాలి.”

హీరో నుంచి ఏటీఎంగా మారడానికి తండ్రికి ఐదు సెకన్లు కూడా పట్టదు.

ఇంట్లో భార్యాభర్తల మధ్య కాకా పట్టడం మరీ మధురంగా ఉంటుంది. అది ప్రతి నెల ఒకటో తేది టిఫిన్ డబ్బలోని జీతంలా ఉంటుంది. భార్యలకు జాక్‌పాట్. భర్తలకు పిడుగుపాట్.

ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు,” అని భర్త అన్నాడంటే భార్య వెంటనే అద్దం చూసుకోదు. ముందు భర్త ముఖం చూస్తుంది. తర్వాత అతని పర్స్ వైపు చూస్తుంది.

ఎంత ఖర్చు పెట్టబోతున్నారు?” అని అడుగుతుంది.

భర్త ముఖం చిన్నబోతుంది.

భార్య కూడా ఈ విద్యలో వెనుకబడదు.

మీరు లేకపోతే ఈ ఇల్లు ఒక్కరోజు కూడా నడవదు,” అంటుంది.

భర్త ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతాడు.

నిజమేనా?”

నిజమే. అందుకే మార్కెట్‌కు వెళ్లి ఈ లిస్ట్‌లో ఉన్నవన్నీ తీసుకురండి.”

అప్పుడు అతనికి అర్థమవుతుంది---కాకాయిజానికి ఆడామగా తేడా లేదని!

ఇంట్లో ఆలిని ఐస్ చేయడానికి భర్త చెప్పే తీయని మాటలు ఒక్కోసారి పనిచేస్తాయి. మరికొన్నిసార్లు రివర్స్ గేర్‌లో వచ్చి అతనికే తగులుతాయి. భార్య--................

మీ మగవాళ్లకే తెలుసా పొగడటం?”

అని భర్తను బోల్తా కొట్టించి తన పని చక్కబెట్టుకుంటుంది.

ఆమె సరసానికైనా, చెంగుదెబ్బకైనా బెండు కాక తప్పదేమో! లేకపోతే బెండు తీస్తుందనే భయం కూడా ఉండొచ్చు. అందుకే---

ఎంత వారలైనా కాంత దాసులే”

అని పెద్దలు ఊరికే అనలేదు!

ఆఫీసుల్లోకి అడుగుపెట్టగానే కాకాయిజం నాటుతేలుతుంది; కుర్చీలకు విలువ కంటే కీర్తనలకు విలువ ఎక్కువగా కనిపిస్తుంది . ఆఫీసర్‌గారి ముందు ఆయన సుగుణాలను పొగుడుతారు. పక్కకు వచ్చిన తర్వాత అదే నోటితో తెగడుతారు.

నాకు ఇలాంటివి నచ్చవు. పని మీద దృష్టి పెట్టండి,” అని ఆఫీసర్ అంటే కాకా పట్టేవాడు నిరాశపడడు. ఆ రాత్రంతా నిద్రపోకుండా---

వీడి పని ఎలా పట్టాలా?”అని ఆలోచిస్తాడు.

ఏదో ఆఫీసుకు వెళ్లమంటే సరదాగా వెళ్లవచ్చు. పుష్పాలు, ఫలాలు వంటి కానుకలు అందుకోవచ్చని కొందరు అనుకోవచ్చు. అలా అని అధికారులందరినీ ఒకే విధంగా ఆలోచించడం కూడా మహాపాపమే! ఎందుకంటే కొందరికి పుష్పాలు నచ్చవు. ఫలాలు మాత్రమే నచ్చవచ్చు!

మా స్నేహితుడు ఒకడు దేశముదురు. కొత్తగా వచ్చిన ఆఫీసర్‌గారి అభిరుచుల గురించి ముందుగా ఆరా తీస్తాడు. ఆయనకు ఏది ఇష్టం? ఏది ఇష్టం లేదు? ఏం తింటారు? ఏం తాగుతారు? ఏ ఆట ఇష్టం? ఏ నాయకుడు ఇష్టం? అన్నీ తెలుసుకున్న తర్వాతే రంగంలోకి దిగుతాడు.

ఆఫీసర్‌గారు---

నిమనకు ఒక బకరా దొరికాడు. చిన్న చిన్న ఖర్చులన్నీ వెళ్లిపోతాయి,” అనుకుంటాడు.

మా వాడు మాత్రం---

మనకు కూడా ఒక బకరా దొరికింది. మేపడానికి కొంత సొమ్ము పోతుంది. ఆ సొమ్ముకు తగిన లాభం రాబట్టాలి,” అనుకుంటాడు.

ఇద్దరూ ఒకరినొకరు బకరాలుగా భావిస్తూ ఉంటారు. నిజానికి ఎవరు ఎవరిని మేపుతున్నారో చివరి వరకు ఎవరికీ తెలియదు.

మరో స్నేహితుడికి తన ఆఫీసర్‌గారికి జొన్నపొత్తులు, పల్లీలు మహా ఇష్టమని తెలిసింది. ఇక రోజూ పావుకిలో పల్లీలు తీసుకెళ్లి కాకా పట్టేవాడు.

మొదట్లో ఆఫీసర్‌గారు సంతోషించారు. తర్వాత ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత అనుమానపడ్డారు. చివరకు ఈయనగారి పట్టుకు ఉక్కిరిబిక్కిరై--

ఏమిటయ్యా సంగతి?” అని అడిగారు.

మావాడు పాప ఏడ్చింది” అన్నట్టు రొటీన్ కథ చెప్పకుండా, తన అసలు ఏడుపేదో ఏడ్చాడు.

నమన ఆఫీసులో సుబ్బారావు మహా బద్ధకస్తుడు సార్. మీరు పొరపాటున కూడా అతని ప్రమోషన్ మాత్రం రికమెండ్ చేయకండి.”

ఆఫీసర్‌గారికి విషయం అర్థమైంది.

చిదానందరావూ! నీ స్వామిభక్తికి మెచ్చాను. ఆ ప్రమోషన్ నీకే రికమెండ్ చేస్తాను. సరేనా? నమ్మకంగా ఉండు... నీ పంట పండుతుంది.”

చిదానందరావు ఆనందం అంతా ఇంతా కాదు. మరుసటి రోజు మరో కిలో పల్లీలు, ఒక కిలో బెల్లం తీసుకుని ఆఫీసర్‌గారి ఇంటి గుమ్మం ముందు నిలబడ్డాడు. తన స్వామిభక్తిని ప్రకటిస్తూ వంగి వంగి నమస్కారాలు చేయడంతో ఆ ఘట్టం పూర్తయింది.

అందుకే నితినగా తినగా వేము తియ్యనుండు” అన్నారు. అవతలివాడికి రుచి మరిగిన తర్వాతే మన పని గురించి మాట్లాడాలి. ఇదే కాకాయిజంలో ఒక ముఖ్యమైన పాఠం.

ఆఫీసులో బాస్ దగ్గరకు వెళ్లే ముందు కొందరు ఫైల్ తీసుకెళ్తారు. మరికొందరు చిరునవ్వు తీసుకెళ్తారు.

ఫైల్‌తో వెళ్లినవాడికి---

“తర్వాత రా,” అంటారు.

చిరునవ్వుతో వెళ్లినవాడికి---

“కూర్చో,” అంటారు.

ఫైల్ తర్వాత చూస్తారు. ముఖం ముందే చూస్తారు!

బాస్ తుమ్మినా---

సార్... ఆరోగ్యం జాగ్రత్త!”

బాస్ నవ్వినా---

సార్... మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్‌కు సాటి లేదు!”

బాస్ కోపంతో ఆరిచినా సరే---

సార్... మీ క్రమశిక్షణే ఈ సంస్థను ఇంత గొప్ప స్థాయికి తీసుకొచ్చింది!”

ఇంతకీ బాస్ ఏం చేసినా సరైనదే. ఎందుకంటే కాకా పట్టడంలో తప్పు అనేది ఎదుటివాడిది కాదు. అవకాశం జారిపోవడమే పెద్ద తప్పు!

స్నేహితులు మాత్రం మేం తక్కువేమి కాదు అంటారు.

స్నేహితుల్లో కాకాయిజం అనేది అవసరానికి ముందే వేసే ఎర. “నీ బైక్ శబ్దమే ఒక స్టైల్!” అని పొగడ్త విసిరి... కాసేపటికి పెట్రోలు ఖర్చు మాత్రం నీ జేబులోంచే బయటకు తీస్తాడు.

మీ ఇంటి పులిహోరకు ఫైవ్ స్టార్ హోటల్ భోజనం కూడా సాటి రాదు!”

అని పొగిడినవాడు, భోజనం ముగిశాక అదే పులిహోరను డబ్బాలో నింపుకుని వెళ్లడానికి మాత్రం మొహమాటపడడు.

కాకా అనేది ఒక కాక్‌టెయిల్ పార్టీ లాంటిది. కాస్త మానాభిమానాలను ఇంట్లో ఫ్రీజర్‌లో భద్రంగా పెట్టి బయటకు రావాలి. నలుగురితో కలవాలి. నలుగురితో నవ్వాలి. అవసరమైతే నడుము కాస్త వంచాలి.

పెట్టుబడిదారీ విధానానికి కాకాయిజం అత్యంత విలువైనది, ఉత్తమమైనది” అని ఎవరైనా సిద్ధాంతం చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. పెట్టుబడి పెట్టకుండా లాభం ఆశించే వ్యవస్థల్లో మాటలే పెట్టుబడిగా మారిపోతాయి. అక్కడ తీయని మాటకు కూడా మార్కెట్ విలువ ఉంటుంది.

నాకేం సిగ్గు?” అనుకుంటే అది ఎవరి తప్పూ కాదు. లోకాన్ని చూసి నడవడం, బతకడం తప్పనిసరి అని కొందరి వాదన.

అందుకే---

కాకాకు లొంగని వాడు

క్యూలో చివర నిలుస్తాడు

కాకా పట్టిన వాడు

కుర్చీలో ముందే కూర్చుంటాడు!

నేటి ప్రేమల్లో అలకలకు, అపార్థాలకు, అనుమానాలకు కారణాలు సవాలక్ష. వాటిలో అతిగా పొగడటం కూడా ఒకటి.

ప్రేమికుల మధ్య కాకా పట్టడం మరీ కళాత్మకంగా ఉంటుంది.

బేబీ... నువ్వు నవ్వితే చంద్రుడు కూడా డ్యూటీకి రావడం మానేస్తాడు,” అని ప్రియుడు మొదలుపెడతాడు.

అంతగా పొగడకు,” అని ప్రియురాలు అంటుంది.

అంటూనే ఇంకో రెండు పొగడ్తల కోసం ఎదురుచూస్తుంది.

ప్రేమలో కాకా మోతాదులో ఉంటే గులాబీలు పూస్తాయి. మోతాదు దాటితే అనుమానాలు పూస్తాయి.

నీ నువ్వే నా ప్రపంచం,” అన్నవాడు మరుసటి రోజు ఇంకొకరి ఫోటో కింద గార్డియన” అని కామెంట్ పెడితే ప్రేమకథలో రొమాన్స్ ముగిసి, క్రాస్ ఎగ్జామినేషన్ మొదలవుతుంది.

నిన్న నేనే ప్రపంచం అన్నావు కదా?”

అవును.”

మరి ఈమె ఎవరు?”

అక్కడి నుంచి ప్రియుడికి ప్రపంచ భూగోళశాస్త్రం మొత్తం వివరించాల్సి వస్తుంది.

కాకా తీయగా ఉండొచ్చు. కానీ అది బెడిసికొడితే షుగర్ కాదు... షాక్ తగులుతుంది!

ఈ విద్య పిల్లలకు కూడా తెలియకుండానే అబ్బుతుంది.

బంటీ... నువ్వెందుకు ఫస్ట్ రావడం లేదు?” అని తల్లి అడిగింది.

బంటీ కాసేపు ఆలోచించి---

అమ్మా... నువ్వు టీచర్‌తో మాట్లాడేటప్పుడు నేరుగా విషయానికే వెళ్తావు. నాని వాళ్లమ్మ మాత్రం ముందు పది నిమిషాలు టీచర్‌ను పొగిడాకే అసలు మాట మొదలుపెడుతుంది!” అన్నాడు.

తల్లికి కొడుకు చదువులో వెనుకబడ్డాడో లేదో తెలియదు. కానీ లోకజ్ఞానంలో మాత్రం చాలా ముందున్నాడని అర్థమైంది.

ఇది కేవలం సామాన్యుడికి మాత్రమే పరిమితమైన విద్య కాదు. మన నాయకులకు కూడా ఒక్కోసారి తప్పడం లేదు.

వసుదేవుడంతటివాడు గాడిద కాళ్లు పట్టుకుంటే తప్పు లేనిది, నేను నా గాడ్‌ఫాదర్ కాళ్లు పట్టుకుంటే తప్పేమిటి?” అని సమర్థించుకునేవాళ్లూ ఉంటారు.

వాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ అసమర్థులు కారు. ఎదగాలంటే ఒదిగి ఉండటం అంటే ఇదే కాబోలు!

రాజకీయాల్లో కాకాయిజానికి ప్రత్యేక స్థానం ఉంది. నాయకుడి ముందు కార్యకర్తలు, కార్యకర్తల ముందు అనుచరులు, అనుచరుల చుట్టూ అభిమానులు---ఇలా పొగడ్తకు కూడా ఒక అధికార క్రమం ఉంటుంది.

నాయకుడు మాట్లాడకముందే---

చారిత్రక ప్రసంగం!”అంటారు.

నిర్ణయం తీసుకోకముందే---

నీ దూరదృష్టి!”అంటారు.

ఓడిపోయినా--- అదే నీ నైతిక విజయం!”అంటారు.

 

గెలిచినా చెప్పాల్సిన అవసరమే లేదు. అప్పటికే నిఘంటువులోని విశేషణాలన్నీ ఖాళీ అయిపోతాయి!

మహాభారతంలో కర్ణుడు, అభిమన్యుడు లాంటి వీరులకు యుద్ధం చేయడం మాత్రమే తెలుసు. కాకా పట్టడం తెలిసి ఉంటే కథ ఎలా మారేదో ఎవరికి తెలుసు! వాళ్లకు ఆత్మాభిమానం ఎక్కువ. అందుకే తల ఎత్తుకుని నిలబడ్డారు. కానీ నేటి కలియుగంలో తల ఎత్తి నిలబడటం కంటే, ఎప్పుడు తల వంచాలో తెలుసుకోవడమే గొప్ప విద్యగా మారిపోయిందని కొందరి నమ్మకం.

కలియుగంలో కాకాసురులకు కొదవలేదు. అందుకే కొందరు చతికిలపడుతున్నారు. మరికొందరు కాకా పట్టడం చేతకాక, ఎవరైనా నేర్పితే నేర్చుకుందామని ఎదురుచూస్తున్నారు.

వాళ్ల కోసం ఒక విశ్వవిద్యాలయం ప్రారంభించినా ఆశ్చర్యపోనవసరం లేదు.

మొదటి సంవత్సరం---ప్రాథమిక పొగడ్తలు.

రెండో సంవత్సరం---అవసరానికి అనుగుణంగా విశేషణాల ఎంపిక.

మూడో సంవత్సరం---పని పూర్తయ్యే వరకు ముఖంలో చిరునవ్వును నిలుపుకోవడం.

చివరి పరీక్ష---మనసులో తిట్టుకుంటూ, ముఖం మీద పొగడటం!

పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి ఉద్యోగం వస్తుందో లేదో తెలియదు. కానీ ఉద్యోగంలో ఉన్నవాళ్లకు మాత్రం ఉపయోగపడే అవకాశం ఉంది!

బాసు ముందర,తానా తందాన

భామ ముందర తేనెమాటలాడురా,

పొట్టకూటికై పలురూపములెత్తురా,

కాకా పట్టువాడే కలియుగ భోగిరా!

అయితే కాకా పట్టడం కేవలం ఒక అలవాటు కాదు. అది మనిషి సంబంధాల్లో పెరిగిన ఒక విచిత్రమైన సామాజిక వ్యవహారం. కొందరికి బతుకుదెరువు. మరికొందరికి ఎదగడానికి మెట్లదారి. ఇంకొందరికి మాత్రం ఆత్మగౌరవాన్ని తాకే విషయం.

కాకాయిజం బతికి ఉండటానికి కాకా పట్టేవాడు ఒక్కడే కారణం కాదు. తన గురించి నాలుగు మంచి మాటలు వినాలని ఆశపడేవాడు కూడా అందులో భాగస్వామే.

కాకా పట్టేవాడికి తాను చెప్పేది పూర్తిగా నిజం కాదని తెలుసు.

కాకా పట్టించుకునేవాడికి కూడా తాను వింటున్నదంతా పూర్తిగా నిజం కాదని తెలుసు.

అయినా ఒకడు చెబుతాడు.

మరొకడు వింటాడు.

ఒకడి పని జరుగుతుంది.

మరొకడి అహం సంతృప్తి చెందుతుంది.

ఇద్దరి అవసరాలూ తీరుతాయి.

అందుకే కాకా ఒక అందమైన అబద్ధం.

చెప్పేవాడికి అది అబద్ధమని తెలుసు. వినేవాడికీ అది నిజం కాదని తెలుసు. అయినా ఇద్దరూ ఆనందంగా అంగీకరిస్తారు.

బహుశా అందుకేనేమో---

నిజం వినడానికి మనిషి సిద్ధపడాలి.

కానీ కాకా వినడానికి మాత్రం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు!

ఎవరి అభిరుచుల ప్రకారం వారు బతకడం వారి హక్కు...

వారి లక్కు కూడా!

కాకా పట్టి చూడండి...

పని జరుగుతుందో లేదో చెప్పలేం. కానీ ఎదుటివాడు మాత్రం కాసేపు తన గురించి తాను గొప్పగా అనుకుంటాడు!

అందుకే కాకా ఒక అందమైన అబద్ధం. చెప్పేవాడికి తాను చెప్పేది అబద్ధమని తెలుసుబీ వినేవాడికీ అది నిజం కాదని తెలుసు. అయినా ఒకడు చెప్పడం ఆపడు, మరొకడు వినడం మానడు. ఎందుకంటే ఒకడికి పని కావాలి, మరొకడికి పొగడ్త కావాలి. ఇద్దరి అవసరాలు తీరుతున్నంత కాలం కాకాయిజానికి వచ్చిన ప్రమాదమేమీ లేదు. పైగా నినాకు పొగడ్తలు అస్సలు నచ్చవు” అని ఎవరైనా అంటే, నిఅదే సార్... మీలో నాకు అన్నిటికంటే నచ్చిన గొప్ప లక్షణం!” అని చెప్పగలిగినవాడికి కాకాయిజంలో ప్రత్యేక శిక్షణ కూడా అవసరం లేదు.

ఈ వ్యాసం చదివిన తర్వాత ఎవరైనా నా దగ్గరకు వచ్చి, నిఅద్భుతంగా రాశారు! కాకాయిజం మీద ఇంత గొప్ప వ్యాసం ఇప్పటివరకు చదవలేదు!” అంటే నేను వెంటనే సంతోషపడను. కాస్త అనుమానంగా అతని ముఖంలోకి చూసి ఒక్కటే అడుగుతాను---సరే... పొగడ్త బాగానే ఉంది. ఇంతకీ నాతో మీకేం పని?”అనుకోని సరిపెట్టుకోకుండా ఒక రో.ఉ చూసి నా చుట్టూ వున్న కాకరాయుళ్లను సన్మానించిం వారి కాకాప్రవీణతకు సర్టిఫికెట్టు యిస్తాను. ఇది నేను వారికి కాకపట్టడానికి కాదు. నా అయిష్టతను నిరూపించుకోవడం కోసం.

మనిషి మనుగడ గురించి .............

కార్ల్ మార్క్స్ “కష్టపడు” అన్నాడు... కాకా మాస్టర్ “కాకా పట్టు” అన్నాడు.

మరిన్ని వ్యాసాలు

Kashi Prayana Kathalu - garvam veedina raju
కాశీ ప్రయాణ కథలు - గర్వం వీడిన రాజు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
అద్దంకి శ్రీరామమూర్తి.
అద్దంకి శ్రీరామమూర్తి.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
Palatho kadigina boggu
పాలతో కడిగిన బొగ్గు!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Kaashi Prayana Kathalu - navvina naapachenu
కాశీ ప్రయాణ కథలు - నవ్విన నాపచేను..
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
భారతీయ ప్రాచీన విషిష్ట ప్రదేశాలు.
భారతీయ ప్రాచీన విషిష్ట ప్రదేశాలు.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు