(దశాబ్దం పైగా ముందుకు నడచిన కాలంతో, 2040 సంవత్సరారంభం)
“శాస్త్రిగారూ, ఆడపిల్లల తల్లితండ్రులు ఈరోజుల్లో మరీ సంస్కారహీనంగా ఎలా ఉండగలుస్తున్నారో? పెళ్లి అన్నది మగపిల్లాడికి మాత్రమే అవసరం అన్నట్టు మాటలాడుతున్నారు” రుక్మిణిగారి ఆవేదన.
“మీరే ఎలాగైనా మావాడి పెళ్లి కుదర్చాలి” రంగారావుగారు నమ్మకంతో శాస్త్రిగారికి అబ్బాయి ఫోటో ఇచ్చేరు.
“మీకు సంస్కారవంతమైన ఈ అమ్మాయి కోడలిగా రావడానికి ఉండి, ఇంత ఆలస్యమైనట్టుంది” అని ఒక ఫోటో ఇచ్చి – “నేను నేరుగా ఈ అమ్మాయి వాళ్ళింటికే వెళ్తున్నాను. మీకూ వారికీ ఎలాగైనా సంబంధం కుదిర్చిపెట్టే బాధ్యత నాది” అని అభయం ఇచ్చేరు శాస్త్రిగారు.
“శ్రీధర్ గారూ, నమస్కారం. నా పేరు శృతి. శాస్త్రిగారి ద్వారా నిన్న మీ ఫోటో అందుకున్నాను. నా ఫోటో కూడా మీరు అందుకున్నారని తెలుసు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ‘గాంధీ పార్కు’కు మీరు వచ్చినట్లైతే, ముఖాముఖిగా మనం కొన్ని విషయాలు మాటలాడుకొని ఒక నిర్ణయానికి రావచ్చు” –
అని తన చరవాణికి వచ్చిన సందేశం చూసిన శ్రీధర్ ఆనందపడి –
“తప్పకుండా వస్తానండీ” అని వెంటనే శృతికి సందేశం పంపించేడు.
సాయంత్రం 4.50 సరికి శ్రీధర్ ‘గాంధీ పార్కు’ చేరుకొని, అక్కడున్న సిమెంట్ సోఫాలో కూర్చున్నాడు.
మరో 5 నిమిషాలకు, పార్కు దగ్గర ఆగిన ఆటోలోంచి పరికిణీ ఓణీతో, పిరుదులు దాటిన వాలుజటతో, తురుముకున్న మల్లెపూల దండతో, అరవిరిసిన చిరునగవుతో దిగిన అమ్మాయిని చూసి ఎదురు వెళ్తూ –
‘తలనిండ పూదండ దాల్చిన రాణి, మొలక నవ్వులతోడ మురిపించబోకే’ అని మనసులో పాడుకున్నాడు.
ఎదురుగా ఇస్త్రీ చేసిన పాంటులో, టక్ చేసుకున్న షర్ట్ తో, ఎగు భుజములు విశాలమైన వక్షస్థలముతో నవ్వుతూ హుందాగా నడచి వస్తున్న పొడగరైన మగసిరిని చూసి ముచ్చటపడి ఆ అమ్మాయి కూడా – ‘ఇంద్రుడి చంద్రుడి అందాలు ఈతని సోమ్మే కాబోలు’ అని మనసులో పాడుకుంటూ హంసలా నడుస్తూ ఎదురు వచ్చింది.
ఆ అమ్మాయి దగ్గరకు చేరుకున్న శ్రీధర్ – “నమస్కారం శృతిగారూ, స్వాగతం”
“నమస్కారం శ్రీధర్ గారూ, ఎంతసేపైంది మీరు వచ్చి”
“5 నిమిషాలే అయింది, రండి అక్కడ కూర్చుందాం” అని ముందుగా ఎంచుకున్న సిమెంట్ సోఫా దగ్గరకు శృతితో వెళ్ళిన శ్రీధర్ – “ఇలా కూర్చోండి” అని తను కూడా అక్కడే కొంచెం దూరంలో కూర్చున్నాడు.
ముందుగా ఎవరు మాటలాడాలా అనుకుంటున్న ఇద్దరి మధ్యన ఒక నిమిషం నిశ్శబ్దంగా గడచిపోయింది.
“శృతిగారూ, మీరు ఈ పరికిణీ ఓణీలో చాలా అందంగా ఉన్నారు”
“ధన్యవాదాలు. మీ అందం ముందు నేనెంతలెండి. సృష్టిలో మగజాతిదే అందం”
“నా అందం మాట ఎలా ఉన్నా, నేను మీకు నచ్చినట్టేనా”
“నిన్న రాత్రి మీ ఫోటో చూడగానే నచ్చడంతో, అప్పటికే రాత్రి పది దాటడంతో, ఈ ఉదయం మీకు మెసేజ్ ఇచ్చేను. మరి మీ సంగతో”
“మీ ఫోటో చూసి, మీ మెసేజ్ కూడా అందడంతో హిమాలయాలు ఇక్కడనుంచే అందుకున్నంత ఆనందం వేసింది. ఒకరినొకరు నచ్చుకున్న మనం - ‘నువ్వు’ అనుకుంటూ - మాటలాడుకుంటే బాగుంటుంది కదా”
“తప్పకుండా బాగుంటుంది”
“నీ మాటలు వినాలని కుతూహలంగా ఉంది. ముందు నువ్వే మాట్లాడు”
“పెళ్ళైన తరువాత మనం ఇద్దరం ఉద్యోగం చేద్దామా, ఒకరు మానేద్దామా, అలా మానేస్తే నువ్వా నేనా ఎవరు మానేయాలి” శృతి సూటిగా అడిగింది.
“భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగానికి వెళ్తే, వారిద్దరి మధ్య కొంచెం కొంచెంగా దూరం పెరిగి, సంసారంలో సరిగమలు మందర స్థాయికి తగ్గి, తకధిమలు తార స్థాయికి పెరిగే అవకాశం లేక పోలేదు. అందుకే, ఇద్దరూ ఉద్యోగం చేయడం ఆర్ధికంగా అనవసరమైనప్పుడు ఒకరు మానేస్తే, సంసారం హిందోళంలో మోహనంగా ముందుకు సాగుతుంది”
“నువ్వు భలే చక్కగా మాట్లాడుతున్నావే. అయితే, మనలో ఎవరు ఉద్యోగం మానివేయాలి”
“అది తాపీగా నిర్ణయిద్దాం. అవసరమైతే, ఉద్యోగం మానివేయడానికి నేను సిద్ధమే అని గుర్తుంచుకో చాలు”
“శాస్త్రిగారు ద్వారా నువ్వు ఇల్లరికానికి సుముఖం అని తెలిసింది, ఎందుకలా”
“భర్త ఇల్లరికం రావాలనుకున్న భార్యకు కల కారణం తెలుసుకొని, అది సరైనదనిపిస్తే, భర్త భార్యకు ఆ విషయంలో అండగా నిలబడాలి అన్నది నా ఆలోచన”
“నిజానికి, నా భర్త ఇల్లరికం రావాలని నేనెప్పుడూ కోరుకోలేదు”
“మంచిదే, ఒక సమస్య తీరింది”
“కానీ.....”
“ఆగిపోయావేమిటి, నువ్వు ఏమిటి చెప్పాలనుకుంటున్నావో చెప్పేసేయి”
“భర్తతో వేరుగా ఉంటూ కనీసం మూడు నాలుగేళ్ళు కాపురం చేయాలన్నది నా కోరిక”
“నీ కోరికలో తప్పు లేదు. అయినా, నువ్వు ఎందుకని అలా ఆలోచిస్తున్నావో తెలుసుకోవాలని ఉంది”
“నాకు చెప్పడానికి సిగ్గుగా ఉంది” అని చిరునవ్వుతో తల దించుకున్న శృతితో –
“సిగ్గుపడుతూనే చెప్పు” అన్నాడు శ్రీధర్ నవ్వుతూ.
“కొత్తగా పెళ్ళైన దంపతులు వేళాపాళా లేకుండా సరసాలాడుకోవడం సహజం కదా. అత్తమామలతో కలిసి ఉన్న ఇంట్లో అది ఎలా సాధ్యం? పైగా, సంస్కారం అనిపించుకోదు కూడా” సిగ్గుపడుతూ చెప్పింది శృతి.
“అవసరమైతే మేమే వేరుగా ఉంటాము అంటున్నారు మా అమ్మానాన్న”
“అలా చేస్తే, కోడలు వచ్చి అత్తమామలను ఇంట్లోంచి వెళ్లగొట్టింది అన్న నింద రాదూ? అంతేకాదు, మీ అమ్మానాన్నలకు కరిగిపోయిన వారి వయసు మనం తెచ్చి ఇవ్వలేము. కానీ, బాధ్యతలతో చాన్నాళ్లుగా కోల్పోయిన ఏకాంతం వారికి మనమే కలగచేస్తే, నూతన ఉత్సాహంతో వారు తిరిగి సంసారపు మధురిమలను ఆస్వాదించగలరు. ఎప్పటికైనా మనమంతా కలిసి ఉండేవారమే కదా”
“ఎంత చక్కగా ఆలోచించేవో అంత చక్కగా చెప్పేవు”
“పెళ్ళిలో మా వాళ్ళు మీకు, మీ వాళ్ళు మాకు, ఏమేమి ఇచ్చుకోవాలో ఆలోచిస్తున్నారా మీ ఇంట్లో”
“అలాటి పద్ధతులకు వీడ్కోలు పలకాలి అన్నదే మా అభిమతం” శ్రీధర్ ధృడంగా చెప్పేడు.
“అసలు విషయం చెప్పడం మరచేపోయాను, నాకు వంట అంత బాగా రాదు”
“నువ్వు నేర్చుకుంటానంటే నేను నేర్పిస్తాను. నీకు వంట బాగా వచ్చేవరకూ నేను చేస్తాను”
“నేను నేర్చుకోగలనంటావా”
“ ‘ముదితల్ నేర్వగరాని విద్యల్ కలవే, ముదమార నేర్పింపగన్’ - అన్నారు ఒక మహాకవి”
“నిజమా” అని నవ్వుతున్న శృతితో శృతి కలిపేడు శ్రీధర్.
“మనకు అంటూ కారు ఉండాలనుకుంటున్నావా, నాకైతే అనవసరం అనిపిస్తోంది” అడిగిన శ్రీధర్ కు -
“పెట్రోల్ డీజల్ ధరలు ఆకాశంలో విహరిస్తున్నాయి, ఎలక్ట్రిక్ కారుకి ఛార్జింగ్ చేయించడం తలనొప్పి. అయినా, నీకూ నాకూ కలిసి నీ స్కూటర్ చాలదా, అవసరమైతే కాబ్ లో తిరిగితే సరిపోతుంది” అని జవాబిస్తూ శృతి --
“నీకు ధూమ్రపానం మధుపానం అలవాటు ఉందా”
“ఇంతవరకూ లేవు. మన పెళ్ళికి ఆ అలవాట్లు అవసరమంటే, కష్టమో నష్టమో చేసుకుంటాను”
“ఆ పొరపాటు ఎప్పుడూ చేయవద్దు, అని చనువుగా శ్రీధర్ చేయి పట్టుకుంది శృతి.
ఆ చేయిని తన చేతిలో ఇమిడ్చుకొన్న శ్రీధర్ - “ఇక, ఏ విధంగా మన వివాహం జరగాలో నిర్ణయిద్దామా”
“ఈ రోజుల్లో, సర్కారువారు నిర్ణయించిన రుసుము కట్టి ముందుగా తెలియచేస్తే, రిజిస్ట్రారుగారు మనం తెలియచేసిన సమయానికి మన దగ్గరకే వచ్చి పెళ్లిని రిజిస్ట్రీ చేసి వెంటనే ప్రమాణపత్రం కూడా ఇచ్చేస్తారు. నీవాళ్ళు నావాళ్లు మాత్రమే ఉండగా శాస్త్రీయంగా విధివిధానాలతో పెళ్లి చేసుకొని, అక్కడే ఉన్న రిజిస్ట్రారుగారి చేత రిజిస్ట్రీ చేయించుకుంటే, మన వివాహం అయిపోయినట్టే” శృతి చెప్పింది.
“మంచిదే, మన సహోద్యోగులకు మన కుటుంబాలకు కలిపి హోటల్లో విందు ఏర్పాటు చేస్తే సరిపోతుంది”
“పరిమిత పదార్ధాలతో శాఖాహార వంటలు మాత్రమే చేయించి, ఆహారం నష్టం కాకుండా జాగ్రత్త తీసుకుందాం” “అంతేకాదు, ఎటువంటి బహుమతులు స్వీకరించబడవని మన సహోద్యోగులకు ముందుగానే తెలియచేస్తూ, త్రాగేనీరు ఎవరికి వారు తెచ్చుకోవాలని కూడా తెలియచేయడం మరచిపోకూడదు మనం”
“లేకపోతే, త్రాగేనీరు ఏర్పాటు చేయలేక పరువు పోగొట్టుకుంటాం” అని నవ్వింది శృతి.
“ఇంకేమీ చర్చించడానికి లేకపోతే ఇట్నుంచి ఇటే వెళ్ళి, మన పెద్దవారి ఆశీర్వాదం తీసుకుందామా”
“శుభవార్త మన పెద్దలకు చెప్పే ముందర నాకు నువ్వు ఒక మాట ఇవ్వాలి” శృతి అబ్యర్ధన.
“ఏమిటది”
“మనం కూడా పిల్లలను కని దేశజనాభా పెంచేకంటే, ఒకరో ఇద్దరో అనాధ శిశువులను చట్టపరంగా శాస్త్రపరంగా దత్తత తీసుకొని పెంచుకుంటే మంచిది అని నా ఆలోచన”
“అలాగే, కానీ ఏడాది నిండని పిల్లలను మాత్రమే తెచ్చుకుందాం”
“తప్పకుండా, కానీ ...”
“ఇంకా కానీ ఏమిటి”
“ఈ విషయంలో మీ అమ్మానాన్నలకు చెప్పి, బోధపరిచి, ఒప్పించే బాధ్యత నీదే మరి”
“ఆ సంగతి నాకు వదిలేసి, నా సందేహం కూడా ఒకటి తీర్చాలి నువ్వు”
“ఏమిటా సందేహం”
“మనం కలిసి పిల్లలు కనకపోయినా, నాతో సంసారం సాగించడానికి నీకేమీ అభ్యంతరం లేదు కదా”
“లేదు లేదు. అందుకు అభ్యంతరం ఎందుకుంటుంది” అని త్వరగా జవాబిచ్చి, నాలిక కరచుకొని, స్త్రీ సహజమైన సిగ్గుతో తలదించుకున్న శృతికి నవ్వుతూ అందించిన శ్రీధర్ చేయిని మనసా ఆనందంగా అందుకుంది శృతి.
**శ్రీరామ**

