మందస ఔషధాలపాలకోవా - టేకుమళ్ళ విజయలలిత

Mandasa Aushadala Palakova

ఆత్రేయపురం-పూతరేకులు
తాపేశ్వరం-కాజా
అలమండ-తాండ్ర
జగన్నాధపురం-జిలేబి
మాడుగుల --హల్వా
గుంటూరు-- వంకాయ బజ్జి
ఇలా చెప్తూ పోతే ఎన్నెన్నో నోరూరించే రుచులు. ఆ కోవకు చెందినదే మందస ఔషధాల పాలకోవా.

ఉత్తరాంధ్రలో చివరి జిల్లా,  ఆమాటకొస్తే ఆంధ్రప్రదేశ్ లో మొదటి జిల్లా అయిన శ్రీకాకుళం జిల్లాలోని మండల కేంద్రమైన మందస ఔషధాల పాలకోవా గురించి కొన్ని అక్షర చెక్కెర గుళికలు......

మీకోసం.....

సాధారణంగా కోవా అనగానే మనకు గుర్తుకు వచ్చేది కోవా బిళ్ళలు, లేదా కోవా ముద్ద.
కానీ మందస పాలకోవాకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది చిక్కని ద్రవరూపంలో, గమ్మత్తైన సువాసనతో మాధుర్యాన్ని పంచుతూ నోరూరించే రుచిని కలిగి ఉంటుంది.

మందస తూర్పు కనుమల ముంగిట నిలిచిన ఒకప్పటి కళింగ రాజుల సంస్థానం. ఆనాటి నుండే విభిన్న రుచులతో రకరకాల ఆహార పదార్ధాలు తయారుచేసే సామర్థ్యం కలిగిన వంటవారు ఇక్కడ ఉండేవారు. ఆ విభిన్న రుచులలో పేరెన్నికగన్నది మందస ఔషధ పాలకోవా.

దీనికి దాదాపు 300 ఏళ్ల చరిత్ర ఉందని తెలుస్తోంది. తూర్పు కనుమలు అనేక ఔషధ మొక్కలకు, చెట్లకు నిలయమై విలసిల్లుతున్నాయి. ఇంకా చెప్పాలి అంటే ఈ ప్రాంతంలో మొలిచే గడ్డి కూడా ఔషధ గుణాన్ని కలిగి ఉంటుంది అని ఈ ప్రాంతం వారు చెప్తూ ఉంటారు.ఈ ప్రాంతంలోని గోవులన్నింటినీ ప్రతిరోజూ ఆ కొండల వైపు మేతకు తీసుకువెళతారు. ఔషధ గుణాలు కలిగిన మొక్కలను,గడ్డిని తినడం వలన ఆ పశువులు ఇచ్చే పాలు కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. అందువలననే మందస ఔషధ పాలకోవా అంతగా ప్రసిద్ధి చెందినది.

గ్రామంలో దాదాపు 10 కుటుంబాలు కోవా తయారీయే ప్రధానవృత్తిగా చేసుకొని తరతరాలుగా జీవిస్తున్నాయి. మిగిలిన కుటుంబాలలో కూడా కొంతమంది తయారైన కోవా రవాణా, విక్రయం మొదలగు వృత్తులను ఉపాధిగా ఎంచుకున్నారు.సాధారణ కోవా తయారీ మాదిరిగానే పాలు, పంచదారతో ఈ కోవాను తయారు చేస్తారు. అయితే దానికి ముద్ద రూపం రాకముందే తీసి విక్రయానికి సిద్ధం చేస్తారు. ఇలా చేయడం వలన ఆ పాలలోని ఔషధగుణాలు మెండుగా ఉంటాయని తయారీదారులు చెప్తుంటారు.

 ఇతర కోవాలతో పోలిక లేని రుచి ఈ కోవకు సొంతం. శీతాకాలం, మరియు వర్షాకాలాలలో దాదాపు 15, 20 రోజుల పాటు ఈ ద్రవరూప కోవా పాడైపోకుండా ఉంటుంది.

ఈ ఔషధ గుణ కోవాను స్థానికులు విరివిగా కొంటారు. ఆప్తులకు అరుదైన బహుమతిగా ఇస్తూ ఉంటారు. సాధారణంగా తీపి పదార్ధాలు తింటే షుగర్ వస్తుంది అని అనుకుంటాం కానీ ఈ కోవా వలన ఎటువంటి సమస్య ఉండదు, కాస్త ఎక్కువ తిన్నా  కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు.

చాలా సందర్భాలలో ఈ కోవా ఇక్కడ నుండి దేశ విదేశాలకు ఎగుమతి అవుతున్నప్పటికీ ఆ స్థాయిలో పశు సంపద, పాల ఉత్పత్తి లేకపోవడం, ఇప్పటి యువత ఈ విషయం పై అంతగా దృష్టి కేంద్రీకరించకపోవడం వలన ఈ వ్యాపారం అనుకున్న స్థాయిలో గణనీయంగా పెరగలేదు. ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలు కూడా అంతంత మాత్రమే. ప్రపంచంలో ఏ ప్రాంతానికి వెళ్లినా శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు ఉపాధి కోసం అక్కడికి వస్తారు అనే నానుడి లో ఎంత నిజం ఉందో ఈ కుటీర పరిశ్రమను అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతం వారు అత్యుత్తమ ఉపాధి అవకాశాలు పొందుతారు అన్నది కూడా అంతే నిజం.

చాలా కాలం క్రితం శ్రీ పుల్లారెడ్డి గారి సిబ్బంది కొందరు ఇక్కడికి వచ్చి కోవా తయారీ విధానము, మార్కెటింగ్ సదుపాయాలు మొదలగునవి తెలుసుకొని ఔషధీయకోవా తయారీకి, ఎగుమతికి, ఇతర అవసరమైన ప్రక్రియలకు శ్రీకారం చుట్టినట్టు స్ధానికులు చెబుతున్నారు.
అయినా ఇంకా ఈ పరిశ్రమ ఎంతో అభివృద్ధి చెందవలసిన అవసరం ఉంది

వింటే భారతం వినాలి. తింటే గారెలు తినాలి. రుచిని ఆస్వాదిస్తూ తినాలంటే మాత్రం మందస ఔషధీయ పాలకోవా తప్పక తినాల్సిందే. వీలు చేసుకొని ఒక్కసారైనా మీరు కూడా ప్రయత్నిస్తారు కదా!