రాంబాబు - రాకెట్టు బాంబు - ఓట్ర ప్రకాష్ రావు

Rambabu rocket bomb

రాంబాబుకు దీపావళి అంటేనే భయం. చిన్న బాంబు శబ్దం వినబడినా వణికిపోతాడు. దీపావళి  పండుగరోజు చెవిలో దూది పెట్టుకొని ఇంటిలోనే ఉంటాడు. ఏదైనా పెళ్లిలోనో, చావులోనో బాంబులు కాలుస్తున్నట్లు తెలిసిందంటే వెళ్లడం మానుకొంటాడు. రాంబాబు గురించి తెలిసిన వారు సొంత మనుషుల పెళ్ళికి   రాకున్నా కోప్పడటం మానుకొని జాలిగా చూసేవారు. రాంబాబు హైదరాబాదులో ఒక గుమస్తా వుద్యోగం చేస్తున్నాడు .

రాంబాబు ఎందుకలా బాంబులంటే భయంతో వణికిపోతున్నాడంటే గత చరిత్రను ఒక్కసారి చూడాలి . రాంబాబు ఆరవ తరగతి చదివే సమయాన దీపావళి రోజు  టపాకాయలు కాలుస్తూ సరదాగా గడుపుతున్నప్పుడు ఒక రాకెట్ బాంబు పైకి వెళ్లకుండా నేలమీదనే వెళ్లి రాంబాబు నిక్కరుకు వెనుకవైపు దూరి ఒక్కసారిగా ఢాం అంటూ పేలింది. వెనకుబాగంలో ఏర్పడిన బాంబు గాయం వలన పాపం రాంబాబు వారం రోజులు కూర్చొనలేక పోయాడు. ఆ సంఘటన వలన  రాంబాబు అలా మారిపోయాడు .

రాంబాబు లోని బాంబుల శబ్దం  బలహీనత  పోగొట్టడానికి  మానసిక వైద్యుడి దగ్గరకు వెళ్ళమని   వెంకటరమణ అన్నయ్య,  ఊరిలో గంగమ్మ గుడి దగ్గరున్న భూత వైద్యుడు  దగ్గరకు వెళ్ళమని  లక్ష్మవ్వ ,  మసీదు కెళ్ళి మంత్రం వేయించుకొమ్మని  మిత్రుడు  జబ్బార్,  చర్చ్ ఫాథర్ దగ్గరకు వెళ్తే లోపలున్న  సైతాన్ని వదలగొడతాడంటున్న మరో మిత్రుడు సైమన్ బలవంతం చేసినా, అదొక పెద్ద సమస్య కాదంటూ నిర్లక్ష్యం చేసాడు .

ఆ సమస్య రాంబాబు జీవితానికి అణుబాంబులా మారుతుందని అనుకోలేదు. చిన్న మిరపకాయ  టపాకాయకు  బయపడేవాడికి పెళ్లేందుకు అంటూ అందరూ చెప్పుకొనసాగారు.  

రమణన్నయ్య దగ్గరకువెళ్లి "అన్నయ్యా ,మీరు  చెప్పిన విధంగా మానసిక వైద్యుడిని చూడాలని   నిర్ణయించుకున్నాను "అన్నాడు

"రాంబాబూ, నీ వ్యాధి గుణపరిచినా ఎవరూ నమ్మరు .నీకు టపాకాయల భయం వున్నదన్న సంగతి ఈ లోకానికి తెలుసు. ఆ వ్యాధి గుణపరిచి నీ పెళ్లి జరిపించాలని కొన్ని సంవత్సరాల క్రితం నీకు  ఆ సలహా ఇచ్చాను. అప్పుడు నీవు వినలేదు .ఇప్పుడు నీ వ్యాధి గుణపరిచినా ఎవరూ అంటే పిల్లనిచ్చేవారు  నమ్మే స్థితిలో లేరు." అన్నాడు రమణ.

ఇంతవరకు  పెళ్లి చూపులు ఒక్కసారి కూడా జరగలేదు . ఇక పెళ్లి జరగదన్న ఆలోచనతో వేదాంత ధోరణికి  రాంబాబు  వచ్చేసాడు.

గడ్డంతో చినిగిన పేంటుతో , బాగా నలిగిన దుస్తులతో ఇంటిముందు కూర్చొన్నాడు.  రాంబాబు  చేతిలోని  బ్రేడ్  ముక్క కోసం వీధి కుక్క పక్కనే నిలబడి ఆశగా చూస్తోంది.

మిత్రులు  రాంబాబును  చూడగానే  ఆశ్చర్యంతో గెంతులేశారు.

" ఏంట్రా  రాంబాబూ,   చాలా సంతోషంగా వున్నావు   ప్రియురాలు  దొరికిందా.. లేక పెళ్లి కుదిరిందా " అన్నారు

రాంబాబు  అసలు విషయం తెలుసుకొన్నాడు. ఈ కాలంలో పెళ్లి పీటలమీద పెళ్ళికొడుకు గడ్డంతో కూర్చొంటున్నాడు, గడ్డంతో నటించే హీరోల సినిమాలే హిట్ కావడం, ప్రేమికులు చిరిగిన దుస్తులతో తిరుగుతున్న సంగతి గుర్తుకు వచ్చింది. మానసికంగా బాధలో వున్న నేను ఇలా వుండకూడదనుకొంటూ గడ్డం తీసుకొని మంచి దుస్తులు వేసుకొని ఇంటిముందు కూర్చొన్నాడు.

'పాపం  పెళ్ళికాలేదని అలా అయ్యాడు' అనుకొంటూ స్నేహితులు  సానుభూతి మాటలు చెప్పారు.

***     ***      ***

సీతాలు డిగ్రీ చదివింది .ఎలాగైనా ఐ టీ  కంపెనీలో నెలకు లక్ష  రూపాయల జీతంతో వుద్యోగం చేయాలనుకొంది. ఉద్యోగం కోసం ప్రయత్నించసాగింది. ఉద్యోగం దొరికితే సీతాలు అన్న పేరు బాగోలేదని ముందుజాగ్రత్తగా  నీతూ అన్న పేరు మార్చుకొని, చట్టపరంగా ఉండేలా  గెజిట్‌లో వచ్చేలా చేసింది.

నీతూ అనబడే సీతాలుకు ఉద్యోగం దొరకలేదు .నెలకు లక్షరూపాయల జీతంతో అనుకొంటూ కట్టిన  ఎన్నో పేక మెడలు ఒక్కసారిగా కూలిపోయింది. ఉద్యోగం లేకపోవడంతో నీతూకు పెళ్లి సంబంధాలు రాలేదు .

రాంబాబుకు పెళ్లి కాలేదన్న సంగతి తెలిసి నీతూ తల్లితండ్రులకు తెలిసింది . రాంబాబు ఇంటికి  కబురు పెట్టారు . ఒక శుభముహూర్తాన పెళ్లి చూపుల ఏర్పాటు జరిగింది. అందులో భాగంగా రాంబాబు, నీతూ ఏకంగా కలుసుకొని మనసు విప్పి మాట్లాడుకొనడానికి అవకాశం కల్పించారు .

"టపాకాయలు అంటే నాకు వున్న భయం వలన ఇంతవరకు నాకు పెళ్లి సంబంధాలు రాలేదు .మొదటి సారి పెళ్లి చూపులు..  నీవే ..."అంటూ చిన్ననాటి సంఘటన వివరించి చెప్పాడు రాంబాబు

"నాకు రెండే రెండు కోరికలు ఉండేవి .రెండూ నెరవేరేలా లేవు "అంది బాధగా

"ఏం కోరికలు" అడిగాడు

"పెద్ద ఐ టీ కంపెనీలో  నెలకు  లక్షరూపాయల జీతంతో వుద్యోగం చేస్తూ జాలీగా వుండాలనుకొన్నాను . మొదటి కోరిక నెరవేరనందు వలన నా రెండవ కోరిక నెరవేరడానికి అవకాశం లేదు " అంది

"ఏమిటా రెండవ కోరిక "

"లక్షరూపాయల జీతం అనే కల కరిగిపోయింది. రెండవకోరిక నెరవేరే అవకాశం లేదు. మీకు వణుకుడు రోగం ఎక్కువగా ఉన్నట్లు చెప్పి ఈ పెళ్లి నిలుపదలచుకొన్నాను "

"ఇంతకూ నీ రెండవ కోరిక చెప్పలేదు " అన్నాడు రాంబాబు

"నాలోనూ  కొత్త  బావాలు వున్నాయి .పెళ్ళిలో నా చేత భర్త కు తాళి కట్టాలనుకొన్నాను"అంది

"నీతూ, నాకు పెళ్లి జరగదు అనుకొంటున్న సమయాన మొదటిసారి నీతో జరుగుతున్న ఈ పెళ్లి చూపులే ఒక అదృష్టంగా భావించాను .నిజం చెప్పాలంటే నాకు మరో పెళ్లి చూపులే జరుగదు .నీకు  అభ్యంతరం    లేకుంటే నీ చేతులతో నా మేడలో తాళి కట్టించుకొంటాను "అన్నాడు

ఆ మాటలు వినగానే రాకెట్టులా ఒక్క సారిగా పైకెగిరిందీ ,బాంబులా   పేలివుంటే   మన రాంబాబు గుండె కూడా డాం అంటూ ఆగివుంటుందేమో .

"మరో సంగతి నా మొదటి కోరిక సగమే చెప్పాను.అంత్య నిష్టూరం కన్నా అది నిష్ఠూరం మేలు అంటారుగా నా మొదటి కోరిక పూర్తిగా విన్న తరువాత మీ నిర్ణయం చెప్పండి "

"మొదటి కోరిక లోని  రెండవ భాగం ఏమిటి "అదురుతున్న గుండెతో అడిగాడు రాంబాబు

"నాకు తప్పకుండా వుద్యోగం దొరుకుతుందన్న గర్వంతో వంట చేయడం నేర్చుకోలేదు.నిజం చెప్పాలంటే టీ  తయారుచెయ్యడం కూడా రాదు.ఇంటిపని చేసే ఓపిక పోయింది . మీరు వంట పని, ఇంటిపని చేయడానికి సిద్ధపడితే ఈ వివాహానికి అంగీకరించండి .లేదంటే నేను ఇలాగే వుంటాను ." అంది

"తాళికట్టించుకొన్నాక ఆ పని చేయకుండా వుంటానా..  మొదటి సారి నేను చేసిన తప్పు గ్రహించాను ."

“ ఏమిటి”  అనుమానంగా అడిగింది

"ఇక్కడ  మల్లె  చెట్టు పెట్టమని మా అమ్మ చెబితే ఆరోగ్యానికి మంచిదని మునగచెట్టు నేనే నాటాను. ఇప్పుడు ఆ చోటున  మల్లె  చెట్టు వుండి  వుంటే మల్లె పూలు   మీ పాదాల మీద పోసి నా అంగీకారం చెప్పివుండేవాడిని ."

"థాంక్ గాడ్. నా కోరికలను మన్నించి  మీరు నన్నుచేసుకొనడానికి అంగీకరించినందుకు నాకు సంతోషముగా వుంది . నెరవేరదనుకొన్న రెండు కోరికలతో ఒక కోరిక అయినా నెరవేరింది "అంది   

“మొదటి కోరికలో రెండవభాగాన్ని మరిచావా"అన్నాడు

"మీరు చాలా తెలివైన వారు .నా రెండు కోరికలతో ఒకటిన్నర కోరిక నెరవేరింది .ఇక వెల్దామా"   చిరునవ్వుతో అంది

చిరునవ్వుతో  వారు చెప్పింది వినగానే ఇరువైపు తల్లితండ్రులలో వందేమాతరం ఎక్సప్రెస్సు వేగంలా  ఉక్రోషం   నరనరాల్లో వెళ్ళసాగింది.   

ఆలోచిస్తే  ఈ సంబంధం వదిలితే ఈ జన్మలో  పెళ్లి కాదన్న సంగతి  ఇరువైపు వారికి అర్థమయింది . ఆముదం తాగిన వారిలా ముఖం పెట్టుకొని ఇరువైపు  వారు పెళ్లి చేయడానికి అంగీకరించారు

అనుకున్న విధంగానే  రాంబాబు  మెడలో నీతూ  తాళికట్టింది.  రాంబాబు ,నీతూల  కొత్తకాపురం  హైదరాబాదులో  మొదలైంది .

ఇప్పుడు   రాంబాబు  వంట చెయ్యడం లేదు . నీతూ  వంట చేస్తోంది. రాంబాబు  భార్యను మాటల్తో చిత్రహింస పెడుతున్నాడు. నీతూ  వణుకుతూ అతను చెప్పినట్లు వింటోంది.

కొత్తగా ఏర్పడిన  తనలోని ధైర్యాన్ని రాంబాబు గుర్తించాడు.  

రాంబాబు దీపావళికి అత్తగారింటికి వెళుతూ బాంబులు, రాకెట్లు తీసుకొని వెళ్ళాడు.

రాకెట్లు, బాంబులు అందరిలాగా దూరంగా ఉంచి వూదిబత్తీతో కాల్చి పరుగెత్త కుండా రాకెట్లను బాంబులను ఒక చేతితో పట్టుకొని మరొక చేతితో నిప్పు పెట్టి దైర్యంగా వదులుతున్న రాంబాబును చూసి ఆశ్చర్యపోయారు అత్తయ్య మామయ్యలు .   

"అల్లుడూ ,భార్యను  నీ చేతులలో  వుంచుకొన్నావు. ఆ తాళిని తీసేసి నీతూ  మేడలో కట్టవచ్చుగా" అడిగాడు

తాళి కట్టించుకున్నతరువాత అమాయకంగా వున్న  ఆడవారు భర్తలను తమ చేతులలో ఎందుకు పెట్టుకొంటారో రాంబాబుకు తెలిసిపోయింది.

'నాజీవిత రహస్యం ఎవరితోనూ చెప్పను.నేను బాంబులు, రాకెట్లు  భయపడకుండా  చేతులతో పట్టుకొని దైర్యంగా కాలుస్తున్నానంటే  అది నా భార్య కట్టిన తాళి మహిమ.’ అని మనసులో అనుకొంటూ ఎటువంటి సమాధానం చెప్పకుండా  మామగారివైపు చిరునవ్వుతో చూసాడు రాంబాబు .