నిర్ణయం తెలుగు కథ - కొడాలి సీతారామా రావు

Nirnayam Telugu Story

“విఘ్నేశ్వర శర్మకి జీవశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. ఆ బహుమతి ఆయన రాబర్ట్ స్టీఫెన్ అనే ఇంగ్లాండు శాస్త్రవేత్తతో కలిపి పంచుకున్నారు.”

అవంతిక ఆదివారం ఉదయం కాఫీ తాగుతూ టీవీ చూస్తోంది. ఏ చానెల్ చూసినా అదే వార్త. పైగా అతని గురించే అనేక విషయాలు తెలుపుతున్నాయి. వారిద్దరి ఫోటోలు చూపుతున్నారు.విఘ్నేస్వ్వర శర్మ అప్పట్లాగే వున్నాడు. అతని పేరు వినగానే అవంతికకి గతం గుర్తుకొస్తోంది.

*********

తను డిగ్రీ పరీక్షలు రాసి ఇంట్లో వుంది. తనకి అంతకు ఆరు నెలల ముందు నుంచీ సంబంధాలు చూస్తున్నారు. తను ఎమ్మెస్సీ చదవాలనుకుంటోంది. లెక్చరర్ ఉద్యోగం చేయాలని కోరిక. తండ్రి సమర్ధించినా తల్లి ఒప్పుకోలేదు. పై చదువులు అంటే అంతకన్నా ఎక్కువ చదివినవాడిని తేవాలి. పైగా వయసు ఎక్కువై పోతుంది. ఇక ఉద్యోగాలు అంటే సంపాదన మోజులో పెళ్లే వద్దంటే ఆవిడ సందేహం. బదిలీ అయ్యే ఉద్యోగం అయితే అల్లుడున్న చోటికో, అతను అమ్మాయి వున్న చోటికో బదిలీ అయితే ఫరవాలేదు. లేకపోతే అమ్మాయి పనిచేసే చోటే సంబంధం చూడమంటే అలా దొరకాలి కదా. అల్లుడు, అత్తవారింట్లో ఒప్పుకుంటే చదువుకుంటావో, ఉద్యోగం చేసుకుంటావో నీ యిష్టం అని ఖరాఖండీగా చెప్పేసింది . తండ్రికి చదివించాలనీ, ఉద్యోగం చేయాలని వుంది.కానీ ఆవిడ ఒప్పుకోక పోవటంతో చదువు ముందుకు సాగలేదు .

మూడు సంబంధాలు వచ్చాయి. వాళ్ళకి తను నచ్చకపోవటమో, తనకి వాళ్ళు నచ్చకపోవటమో, పెట్టుపోతలు నచ్చకో తప్పిపోయాయి. సరిగ్గా తన డిగ్రీ రిజల్టు వచ్చిన రోజే ఓ సంబంధం వచ్చింది . అదే విఘ్నేశ్వర శర్మది.

అతను జెర్మనీలో సైంటిస్టుగా చేస్తున్నాడు. తల్లి తండ్రి టీచర్లు. ఇంకా ఉద్యోగం చేస్తున్నారు. అతను ఒక్కడే కొడుకు. అయితే అతను అక్కడే వుంటాడు. ఐనా అన్ని విధాలా అమ్మా నాన్నకి , తమ్ముడికి నచ్చింది. అన్నిటికీ మించి వాళ్ళు ముందే మధ్యవర్తి ద్వారా కబురు చేశారు కట్నం అనే మాట లేదు. పెట్టు పోతలు కూడా సాధారణంగా పెళ్ళిలో పెట్టేవే. వారికి పల్లెటూరిలో అయిదేకరాల మామిడి తోట వుంది. వాళ్ళు అక్కడే వుంటారు. ఉద్యోగాలు ఆ చుట్టుపక్కల ఊళ్ళే కనక వెళ్ళి వస్తుంటారు. ఆయన హోమియో వైద్యం చేస్తారు ఆదివారం ఉచితంగా . పెళ్ళికొడుకు కూడా బాగున్నాడు ఫోటోలో.

సరిగ్గా నాలుగు రోజుల తరువాత చూడడానికి వచ్చారు. అతను ఆరడుగులు వుంటాడు.తను అతని భుజాల దాకా వస్తుందేమో. అందంగా వున్నాడు.తెల్ల పాంటు, లేత నీలం రంగు హాఫ్ హండ్స్ షర్టు టక్ చేసుకున్నాడు. నవ్వు ముఖం. అతను అవంతికతో మాట్లాడాలని చెప్పటంతో ఇద్దరినీ గదిలోకి వెళ్లమన్నారు . అతను చెప్పాడు తను సాగర్ యూనివర్సిటీలో ఎంటెక్ బయో టెక్నాలజీ చేసి జెర్మనీలో పీహెచ్డీకి వెళ్ళాడనీ, అదవగానే అక్కడే సైంటిస్టుగా అవకాశం వచ్చిందనీ చెప్పాడు. ప్రస్తుతం తను ఒక ముఖ్యమైన పరిశోధన చేస్తున్నట్టు చెప్పాడు. తను అక్కడే వుంటానన్నాడు. అవంతికకి ఇష్టమయ్యి ఈ పెళ్లి జరిగితే తను మాస్టర్స్ చేయొచ్చనీ, పి హెచ్ డీ కూడా చేసి తగిన ఉద్యోగం కూడా చేయొచ్చన్నాడు. చివరిగా తనకి అవంతిక ఇష్టమే అని చెప్పాడు. “మీరేమన్నా అడుగుతారా నన్ను“ అని అడిగాడు అతను. తను ఏమీ లేదని తల ఊపడంతో ఇద్దరూ బయటికి వచ్చారు .

తనకి బాగున్నట్టే అనిపించినా, జెర్మనీలో వుండటం అంటే భయం వేసింది. అమ్మా నాన్నలకి చెప్పింది తనకి ఆ సంబంధం ఇష్టంలేదని . కారణం కూడా చెప్పింది . తమ్ముడు కూడా చెప్పి చూశాడు “ఈ రోజుల్లో దూరం అంటూ లేదు గంటల్లో ప్రయాణాలు సాధ్యమౌతున్నాయి.” అమ్మా నాన్న కూడా చెప్పారు అన్నీ విధాలా మంచి సంబంధం అని. పైగా అతను ప్రతి ఏడూ వస్తూనే వుంటాడట. అయినా తన భయం కారణంగా ఒప్పుకోలేదు.

*********

టీవీలో చెప్తున్నారు విఘ్నేశ్వర శర్మ మన తెలుగువాడవటం గొప్ప విషయం. ఈ విషయం తెలిసిన నప్పటి నించీ అతని గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది అని చెప్తున్నారు. అతను చదువుకున్న స్కూల్, కాలేజీ ఉపాధ్యాయులు, స్నేహితులూ అతని గురించి గొప్పగా చెప్తున్నారు. ఒక టీవీలో చెప్పారు జెర్మనీలోని తమ ప్రతినిధి ద్వారా ఆయన ఇంటర్వ్యూ కోసం ప్రయత్నిస్తున్నామని.

అతను ఒక విదేశీ న్యూస్ చానల్ తో మాట్లాడుతూ “ఒక మనిషి అంగంలోని ఒక కణం ద్వారా ఆ అంగాన్ని సృష్టించే తన ప్రయోగం విజయవంతమైనందుకు సంతోషంగా వుంది. రెండేళ్ల క్రితం రాబర్టు ఒక కాన్ఫరెన్సులో కలిసినప్పుడు తను కూడా ఇదే పరిశోధన చేస్తున్నట్టు చెప్పారు. అప్పటి నించీ ఇద్దరం మా పరిశోధన వివరాలు పంచుకుంటున్నాము. ఈ రోజు ఆయనతో ఈ పురస్కారం అందుకోవటం చాలా సంతోషంగా వుంది.

ఈ గౌరవం ముందుగా నా తల్లిదండ్రులకి, నాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులందరికీ చెందుతుంది.

*********

తరువాత తనకి నారాయణతో పెళ్లి అయింది. అతను బేంకులో క్లర్కు. హైదరాబాదులో కాపురం పెట్టారు . అతనితో చెప్పింది చదువుకోవాలనీ, ఉద్యోగం చేయాలనీ వుందని. అతను అంగీకరించలేదు. కానీ అన్నీ విధాలా తనని బాగానే చూసుకున్నాడు. గమ్మత్తుగా మూడేళ్ళ తరువాత అతను మారిపోయాడు. మొదటిలో బేంకులో పని ఎక్కువ వుందని తెల్లవారు ఝామున వచ్చేవాడు. కానీ అతని నుంచీ బ్రాందీ వాసన వచ్చేది . ఏదో కొద్దిగా కంపెనీ కోసం తీసుకున్నా అనేవాడు. తరువాత అర్ధమయ్యింది. అతను మదిరకి అలవాటు పడ్డాడని. ఎన్నో సార్లు చెప్పింది మంచిది కాదని. పట్టించుకోలేదు. తరువాత తరువాత పేక అలవాటయ్యింది. ఎంతగా అంటే జీతం రోజు ఒకోసారి మూడొంతుల జీతం ఓడిపోయేవాడు. ఒకోసారి ఎంతగా తాగేవాడంటే అతని సహోద్యోగులు ఇంటికి తీసుకొచ్చేవారు. వాళ్ళూ తాగే వుండేవారు. తరువాత రోజుల్లో ఓ రిక్షా అతను తీసుకొచ్చేవాడు .

ఎన్నిసార్లు ఎంత చెప్పినా వినేవాడు కాదు. అప్పు చేసి మరీ తాగటం, ఆడటం మొదలెట్టాడు. జీతం ఇంటికి తేలేకపోవటంతో ఇంటి అద్దె, పాల బాకీ, పచారీ కొట్లో బాకీ పేరుకు పోయి వాళ్ళు ఇవ్వటం మానేశారు. ఇంటి ఓనరు మరుసటి నెల అద్దె ఇచ్చినా ఇవ్వకపోయినా ఖాళీ చేయిస్తానని చెప్పారు. తినటానికి కూడా ఇబ్బంది అయింది.

పైగా తన చేతకానితనాన్ని ఆమెపై చూపేవాడు. విపరీతంగా కొట్టేవాడు. ఆమెకీ సహనం పోతోంది. ఇరుగు పొరుగులలో కూడా అవమానం. బయటికి రాలేకపోతోంది. ఆ సమయంలో అవంతిక తల్లి తండ్రీ వచ్చారు. వారి దగ్గిర దాయటానికి కూడా లేని పరిస్తితి . రెండు రోజులు వున్నారు. ఆ రెండు రోజుల్లో వున్న అప్పులు తీర్చారు. ఇంటికి కావలసిన వస్తువులు సమకూర్చారు. అతను అసలు వీరితో పలకరింపుగా కూడా మాట్లాడలేదు. ఐనా మామగారు అతనికి వివరంగా అప్పులు తీర్చినట్టు చెప్పి, అవంతికని తమ వెంట తీసుకువెళుతున్నట్టు చెప్పారు. అతను ఏమీ పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. అవంతిక ముందు ఒప్పుకోలేదు వాళ్ళతో వెళ్ళటానికి. కానీ అతను తన తండ్రిని కనీసం పలకరించకపోవటంతో ఆమెకి కోపం వచ్చింది. తమని ఆర్ధికంగా ఆదుకున్నారన్న కనీస కృతజ్నత కూడా లేకపోవటం ఆమెని బాధించింది .

*********

“నా తల్లిదండ్రుల సహకారంతో మా వూళ్ళో బడి ,గుడి ,రోడ్లు ,సామాజిక భవనం ఏర్పాటు చేసుకున్నాము. ప్రతి ఇంటి ముందు ఇంకుడు గుంతలు, కనీసం ఒక చెట్టు నాటేలా నిర్ణయం తీసుకుని అమలు చేస్తున్నారు. మా వూరిలో సారా కొట్టు లేదు. తాగి వూర్లోకి వస్తే పంచాయితీకి పదివేలు జరిమానా కట్టాలి. అందువల్ల ఎవరూ మద్యం జోలికి పోరు. దానివల్ల డబ్బు ఆదా అవుతోంది. ఒక ఆసుపత్రి నిర్మాణానికి ఆలోచన చేస్తున్నాము. అనేకమంది దాతలు ముందుకు వస్తున్నారు. కొందరు వైద్యులు కూడా స్వచ్ఛందంగా అక్కడ పనిచేయటానికి ఉత్సాహం చూపించారు .ఇప్పటికే కొందరు వివిధ విభాగాల వైద్యులు నెలకి రెండుసార్లు వచ్చి ఉచితంగా పరీక్షించే ఏర్పాటు చేశాము. మందులు,అవసరమైన శస్త్రచికిత్సలు చేసేందుకు కూడా ఎందరో ప్రముఖులు సహాయం చేస్తున్నారు .మా వూరు ఒక ఆదర్శ గ్రామంగా వుండాలని ఆశిస్తున్నా.”

*********

అవంతిక పుట్టింటికి వచ్చి ఆరు నెలలు అయింది. తనకి వెళ్లాలని వున్నా అతను కనీసం వుత్తరం రాయకపోవటం, గత రెండు ఏళ్లుగా తను అనుభవించిన బాధలు,అవమానాలు ఆమె మర్చిపోలేక పోవటంతో ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. అలా ఎం ఏ (ఇంగ్లీషు ) చదివింది . పుట్టింటికి వచ్చాక ఆమె అత్తగారు, మామ గారు వచ్చారు. ఆమెకి తమ కొడుకు వల్ల కలిగిన ఇబ్బందులకి బాధపడ్డారు. వాళ్ళు చెప్పినా అతను వినలేదు. వారిని కూడా పట్టించుకోలేదు.

బందరు హిందూ కాలేజీలో లెక్చరరుగా చేరింది. అతనికి విడాకుల నోటీసు ఇచ్చింది. అతనూ ఎటువంటి అభ్యంతరాలు చెప్పలేదు. కౌన్సెలింగుకి వచ్చిన అతన్ని చూస్తే జాలి వేసింది.దుస్తులు సరిగా లేవు.మనిషి కూడా బాగా చిక్కి పోయాడు. విడాకులు తొందరగానే మంజూరయ్యాయి.

ఉదయం నుంచీ ఏ టీవీ చానెల్ పెట్టినా విఘ్నేశ్వర శర్మ గురించి,అతని పరిశోధనల గురించే. అతని చిన్నప్పటి ఫోటోలు,చదువుకున్న వూరు, స్కూలు , కాలేజీ ఫొటోలు చూపిస్తున్నారు. అవంతిక మధ్య మధ్య తన పని చూసుకుంటూ టీవీ చూస్తూనే వుంది. ఆమెకి అతనిని పెళ్లి చేసుకుని వుంటే తానూ చక్కగా ఉన్నత చదువులు చదువుకుని, అతను చెప్పినట్టు పీ హెచ్ డీ చేసి వుండేదేమో అనిపించింది. అదే జరిగుంటే ఈ సమయంలో తను ఎంత సంతోషం అనుభవించేదో. అప్పటి తన నిర్ణయం తప్పనిపించింది.

*********



“నేను మొదటిసారి పెళ్లి చూపులులో చూసిన అమ్మాయిని ఎలా వున్నా పెళ్లి చేసుకోవాలనుకున్నా. నచ్చలేదని ఒకరి ని అవమానించకూడదు అని నా అభిప్రాయం. ఆమె అన్ని విధాలా నాకు నచ్చింది. పెళ్లి చేసుకోవలనుకున్నా. ఆమె ఇష్టపడలేదు. అప్పటి నించీ మరొకరిని పెళ్లి చేసుకోవాలని అనిపించలేదు.” విఘ్నేశ్వర శర్మ చెప్తున్నా డు విలేకరితో .

“ఆమె అంగీకరిస్తే ఇప్పుడైనా సంతోషంగా ఆహ్వానిస్తా నా జీవితంలోకి. ఆమె తన కుటుంబంతో సంతోషంగా ఉండి ఉంటుందనే భావిస్తా .”

“నో ..నో .. ఆమె పేరు చెప్పి ఆమె జీవితంలో కల్లోలం రేపాలనుకోవటం లేదు. ఆమె సుఖంగా వుండాలి .” ఓ విలేఖరి ప్రశ్నకి సమాధానంగా చెప్పాడు శర్మ.

*********

అవంతిక అతని అభిప్రాయం విన్నాక ఒక నిర్ణయానికి వచ్చింది. గూగుల్లో చూసి అతని ఈ మెయిల్ కి అతన్ని అభినందిస్తూ, తన గురించిన వివరాలు రాసింది.చివరిగా తను అతనితో జీవితం పంచుకోవాలనుకుంటున్నట్టు తెలిపింది. అతని నిర్ణయం కోసం ఎదురు చూస్తోంది. సరిగ్గా ఒక గంట తరువాత అతని నుంచీ మెయిల్ వచ్చింది ఆమె నిర్ణయాన్ని స్వాగతిస్తూ .