మనసులో నిలిచిన మధుర దీపావళి -
1600 గడపగల మా పల్లెటూరు కోరపు కొత్తవలసలో జరుపుకున్న పండగలు ప్రత్యేకతను సంతరించుకునేవి. పండగలో ప్రకృతి ఆరాధన ,పరిరక్షణ ఒక భాగం.ఆ పల్లె తల్లి ఒడిలో జరుపుకున్న దీపావళి చిన్ననాటి జ్ఞాపకం. మధురస్మృతిగా మనసులో నిలిచి పోయింది.
మాది ఈ రోజుల్లో పెద్ద విల్లాల తో, బంగళాల తో సమానమైన పెద్ద డాబా,పెంకుటిల్లు. ఇటు .అటు సున్నపు మేడల మధ్యలో పెంకుటిల్లు. వెనక పెద్ద పెరటి తోట.ఇంటి ముందు పూల తోట. మనోహరంగా ఉండేది మా పుట్టినిల్లు. ఇంటి ముందు పెద్ద రాతి అరుగులు. ఒక వెయ్యి మంది కూర్చోవడానికి వీలుగా వాకిలి ఉంటాయి.
దీపావళి ముందు గానే జ్ఞాపకం వచ్చేది గౌరమ్మ పండగ ఆశ్వీజ పున్నానికే మా ఊరి సంప్రదాయం ప్రకారం మంచి పంట, పొలం నుండి, ఏపుగా పెరిగినpolam నుండి వరి దుబ్బులు మట్టి పెళ్ళతో పెళ్ళగించి, తీసి పెద్ద పళ్లెంలో పెట్టి, పసుపు కుంకుమలతో పూజించి, ఒక పెద్ద ముత్తయిదువ నెత్తి మీద ఆ గౌరమ్మగా పెట్టి, భాజా భజంత్రీల తో ఊరేగించి, గౌరమ్మను తెచ్చామని గద్దె మీద పెట్టేవారు.
రామ మందిరంలో పెట్టడంతో, గౌరమ్మ సంబరాల తో పాటు, ఆశ్వీజపున్నమి నాడే మట్టి తీసుకొచ్చి, పార్వతీ పరమేశ్వరులు నంది మీద కూర్చున్నట్లు, పార్వతీ దేవి ఒడిలో గణపతి,శివుని నెత్తిపై గంగమ్మ, చంద్రరేఖ, పక్కన కుమారస్వామి తో మట్టి విగ్రహాలుతయారుచేసి, నంది మీద అమర్చే వారు.
ఆశ్వయుజ బహుళ అమావాస్య శరదృతువులో వస్తుంది కాబట్టి మరొక పున్నమిలా వెలుగులు విరజిమ్ముతో దీపావళిగా దివ్యాంగా వెలుగొందుతుంది దీపావళి నాడు నాటు బండి పై నంది పై ఉన్న పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలు పెట్ట, మనుషులు లాగుతూ,ఊరంతా ఊరేగించి,ప్రత్యేకంగా పెదనాన్న గారి ఇంటికి, మా ఇంటికి నంద న్న గా వచ్చి నైవేద్యాలు స్వీకరించి వెళ్లడం ఆనవాయితీగా ఉండేది.
నందీశ్వరుడు మళ్లీ రామమందిరంలో కూర్చున్నాక, దివ్వెలు కాల్చి, ఊరిలో దీపాలు వెలిగించడం మొదలయ్యేది కార్తీక పున్నానికి గౌరమ్మ నిమజ్జనం జరిగేది.
ఈ నెల రోజులు గౌరమ్మ సంబరాలు ఎంతో సందడిగా జరిగేవి. ఊర్లో జానపదుల పాటలు, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవి. జానపద కళలకు ఆటపట్టుగా ఉండేది.ముఖ్యంగా దీపావళి అంటే మా ఇంట్లో పెద్ద నాన్న గారి ఇంట్లో 15 రోజులు ముందు నుండి మందు గుండు సామాన్లు అన్నీ తెచ్చి చిచ్చుబుడ్లు, టపాసులు, మతాబులు,అన్ని తయారు చేసేవారు. పిల్లలం మతాబులు కోసం దళసరి కాగితాలతో, మతాబుల గొట్టాలు తయారు చేసే వాళ్ళం.
అమ్మ ఒక 300 పైచిలుకు మట్టి ప్రమిదలు, సుమారు 150 పైచిలుకు చిచ్చుబుడ్లు,50 పెద్ద ప్రమిదలు, మట్టి మూకుళ్ళు కుమ్మరి చేత ముందు తెప్పించేది.
నరక చతుర్దశి నాడే తలంటి స్నానాలు చేసి, కొత్త బట్టలు ధరించి,పూజలన్నీ అయ్యాక, గారెలు, పాయసం,రకరకాల పిండి వంటలతో, భోజనం చేసే వాళ్ళము. దీపావళి నాడు మధ్యాహ్నం మొదలుపెట్టి, అరుగుల నిండా, మెడల మీద, వాకిట్లో పెద్ద పెద్ద ముగ్గులమధ్య, మూల మూలల్లో , ఎక్కడాచీకటి అన్నది లేకుండా, ప్రమిదలతో దీపాలు పెట్టేవాళ్ళం. ముందే నువ్వులు గాని వేరుశనగ గాని, గానుగ ఆడించి నూనె సిద్ధం చేసేవారు .
ముఖ్యంగా దేవుడు నూనెల కు నువ్వులే వాడేవారు . భారీ ఎత్తున తాటాకు పటాకులు, మతాబులు, చిచ్చు బుడ్లు ,చేయడమే కాకుండా, కొని. తెచ్చిన విష్ణు చక్రాలు, భూచక్రాలు, రాకెట్లు, తారాజువ్వలు,వీటన్నిటిని విజయనగరం దగ్గర ద్వారపూడి నుండి తెప్పించేవారు.
పెద్ద పెద్ద సంచులతో నాన్న తెప్పిస్తూ ఉంటే ,ఊర్లో పిల్లలందరూ, అమ్మో! పెద్ద పంతులుగారు ఇంట్లో దీపావళి టపాసులు సామాన్లు ఉంటాయి! అని గుండెలుబాదుకునే వారు. పనివాళ్ళకు, రైతులకు, వచ్చిఅడిగిన చిన్న పిల్లలకు,కొన్ని పంచి పెట్టమని చెప్పేది అమ్మ. మన ఇంట్లో చీకటి పోతే సరికాదు. వాళ్ళ ఇంట్లో కూడా చీకట్లు పోవాలి. ఆ పిల్లలూ పండగ చేసుకోవాలి అనేది. పిండివంటలు కూడా అలాగే పంచేవారు అమ్మ అమ్మమ్మ. ఆశ్వీయుజమాసం నుండే పత్తితో దీపం ఒత్తులు తయారు చేసి,కొత్త పంచ చింపి చేసిన ఒత్తులు, ప్రమిదలో వేసి,ఆముదం కర్రలకు పొడవాటి ఒత్తులు కట్టి, "దుబ్బు దుబ్బు దీపావళి, ఎల్లుండి వచ్చే నాగుల చవితి" అని ఆ ఆముదం కొమ్మలు దివ్వలు గా కొట్టి, దీపాలు వెలిగించి, పటాకులుపేల్చి, ఏడుగురు పిల్లలం, ఇంటికి వచ్చిన చుట్టాల పిల్లలతో కలిపి సంబరంగా పండుగ చేసుకునేవాళ్ళం.
ఆరోజు మాత్రం అందరికీ నూలు బట్టలు ధరించమనేవారు నాన్న. ఎప్పుడూ దేశ సంచారం చేస్తూ ఉండే నాన్న, వినాయకచవితికి, దీపావళి అమావాస్యకి, తప్పనిసరిగా ఇంట్లో ఉండేవారు.పెద్ద,పెద్ద బకెట్లతో నీళ్లు వీధిలో, పెరట్లో పెట్టించే వారు.
అమ్మ బర్నాలు, వెన్న, అన్ని సిద్ధంగా పెట్టుకునేది. పొరపాటున ఎక్కడైనా చిన్న చురకబడిoదంటే, కాలిన వెంటనే ప్రథమ వైద్యం చేసేవారు.
ఆ రోజుల్లో అంతకు ముందు చూపు ఉండేది పెద్దవాళ్ళకి. అన్నిటికన్నా ముఖ్యమైన జ్ఞాపకం దీపావళి నాడు ముందు రోజు నుండి ఊర్లో అందరూ ఇల్లు తడుపుకునేవారు.
ఎందుకంటే !ఊరు కాలిపోతూ ఉండేది.మా ఇంటితో కలిపి ఊరు మొత్తం ఒక మూడు తప్ప, పెంకుటిల్లు డాబాలు ఉండేవి కావు. లెక్కపెట్టినట్టు ముచ్చటగా మూడు డాబాలు ఉండేవి అమ్మా, నాన్న కచ్చితంగా చెప్పేవారు.
ఈ చిన్న చిన్న టపాసులను మాత్రమే ఇంటి దగ్గర కాల్చాలి అని. ఇంట్లో కాల్చిన తర్వాత అన్నయ్య లు వాళ్ల స్నేహితులు దూరంగా పొలాల్లోకి వెళ్లిపోయి, అక్కడ బాంబులు, పేల్చడాలు, తారాజువ్వలు రాకెట్లు వదిలడం చేసేవారు.
ఆ సమయం లోనే జనపనార చెరువుల్లో ఎక్కువ నానబెట్టేవారు. క్రిమి కీటకాదులూ చేరిపోతూ ఉండేవి. ఈ దీపావళి టపాసులు కాల్చి నందు వల్ల చాలా దోమలు పురుగులు నశించేవి. పొలాల్లో బాంబులు అవి పేల్చడం వల్ల, క్రూర జంతువులు పారిపోయేవి. ఎలుగుబంట్లు వచ్చేవి కావు. అసలు ఈ ఎలుగుబంట్లు రాకుండా దివిటీలు వెలిగించేవారు. నిప్పు చూస్తే వాటికి భయం అని. నాన్న బోలెడన్ని టపాసులు తెస్తే !*అమ్మమ్మ మట్టి పండుగ సంక్రాంతి ,మసి పండగ దీపావళి అనేది*. అమ్మ వెలుగుల పండగ దీపావళి అనేది*. మసి పండగ ఎందుకంటావ్?అని అమ్మమ్మతో అంటే, ఇదిగో ఇంత డబ్బు పెట్టి కొన్నవన్నీ! మసి చేసేస్తున్నారు కదా!అని అనేది.
మరి సంక్రాంతి అంటే మట్టి పండుగ ఎందు కంటావ్? అంటే, అలకడం, ముగ్గులు పెట్టడం, సున్నాలు వేయడం, ఇల్లు బాగు చెయ్యడం, మట్టితోనే పనని , .ధనుర్మాసం అంతా శుభ్రం చేయడం తోటే అయిపోతుంది అని నవ్వేది. ఏదైనా పెద్దలు పండగల పరమార్ధాన్ని అద్భుతంగా వివరించేవారు.
దీపావళి ముందు రోజే చాటింపు వేయించేవారు. ఊర్లో ఎవరు ఎలాంటి తారాజువ్వలులాంటివి కాల్చకూడదు, రాకెట్లు లాంటివి ఊర్లో వదలకూడదని చెప్పేవారు. ఊరంటుకుంది అంటే మొత్తం తగలపడిపోయేది.
అదే సమయంలో దొంగలు, కోళ్లు గొర్రెలు, పశువులు దొంగలించేవారు. కొందరు. సామాన్లు బయట పడేస్తే పట్టుకుపోయేవారు .
ఊరు అంటుకున్న దృశ్యం మాత్రం నాకు చాలా భయంకరమైన జ్ఞాపకం.
ఒకసారి ముసలి తల్లి ఇంట్లో ఉండిపోయిందని తేవడానికి వెళ్ళినప్పుడు, వాళ్ళ అమ్మని పట్టుకుని అగ్నికి ఆహుతి అయిపోయాడు పాతికేళ్ళ కొడుకు కూడా.ఆ సంఘటన నాకు ఇప్పటికీ మరుపు రాదు.
ఫైర్ ఇంజన్ 20,30 కిలోమీటర్ల నుండి రాడానికి, చాలా సమయం పట్టేది. ఈ లోపుగా ఊరంతా పరశురామ ప్రీతి అయిపోయేది. అందువలన దీపావళి క్రిమి కీటకాదులు చస్తాయి అన్ని బాగానే ఉంటాయి కానీ! అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండాలి. అని చాలా జాగ్రత్త పడేవారు.
ఒకసారి మా పెదనాన్న గారి అబ్బాయి పని చేస్తున్నదో,లేదో, అని చూడడం కోసం, తారాజవ్వ వెలిగిస్తే,అది పక్కన ఉన్న వాళ్ల పాకమీద పడి అంటుకుంటే వెంటనే అందరూ వచ్చి ఆపేసారు. అన్న తెలివి తప్పి పడిపోయాడు భయానికి.. అంటే ఊర్లో అగ్గి పుట్టిందంటే! ఊరందరూ అందుకు కారణమైన వారిని చాలా తిట్లు తిట్టేవారు. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా జరిగేవి. అది భయం …
దీపావళి అంటే.. ఇంకొక జ్ఞాపకం.
చాలా మంది రైతుల ఇళ్లల్లో,మందు గుండు సామాన్లు కొనేవారు కాదు ఆరోజు మాత్రం రాత్రి 9 వరకు మా ఇంట్లో పటాసులు కాల్చేవాళ్ళము. ఇంకా మిగిలి నవి నాగుల చవితికి, కార్తీక పున్నానికి, దాచుకునేవాళ్ళం. అయితే మా స్నేహితులందరూ, మా పెద్దరుగు పక్కన దాక్కునేవారు.
నాన్న కంట పడకుండా. నాన్నంటే మాకు భయం వాళ్లకి భయం. అసలు మేము ముందుగానే వాటాలను వేసుకునే వాళ్ళము.
ఎవరి వాటా మందు గుండు సామాన్ల నుండి వాళ్ళo మెల్లగా వాళ్ళకి కొంచెం కొంచెం అందజేసి వాళ్ళం. స్నేహితుల కళ్ళల్లో వెలుగులు చూస్తే ఎంత సంతోషంగా ఉండేదో.
కృష్ణ భక్తురాలైన అమ్మ,నరక చతుర్దశి నాడు సత్యా కృష్ణులకు దీపావళి నాడు రుక్మిణి సత్యభామలతో సహితమైన కృష్ణమూర్తికి అద్భుతంగా పూజలు, భజనలు చేసేది.. దీపావళి నాడు లక్ష్మీ పూజను ఎంతో బాగా చేసేవాళ్ళం. ఇల్లంతా సాంబ్రాణి ధూపాల తో పరిమళించేది.
ప్రతి ఇంట్లో ఆరోజు పెసలతోటో బొబ్బర్లతోటో కందుల తోటో బూర్లు తప్పనిసరిగా ఉండేవారు తీపి పదార్థాలు చేసేవారు ఎంత పేదవాళ్లయినా కనీసం అప్పాలైన చేసి అర్పించేవారు పెద్ద పెద్ద ముగ్గులు పెట్టి మధ్యలో ప్రమిదలు పెట్టి, చుట్టూ దీపాలు పెట్టి ఎంతో వేడుకగా చేసుకునేవాళ్ళం. అంతేకాదు, మేము కాల్చేసి,లోపలికి వచ్చిన తర్వాత, కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి, బట్టలు మార్చుకొని, బొబ్బట్లు అవీ తిని, ఎవరు ఎలా కాల్చేమో, ఎన్ని కాల్చేమో, గొప్పలు చెప్పుకుంటూ నిద్రపోయే వాళ్ళం.
ప్రతిరోజు ఏడు గంటలకల్లా ఊరంతా నిద్రపోయేది మా ఇంట్లో మహా అయితే ఎనిమిది గంటల వరకు మేల్కొని ఉండేవాళ్ళు మర్నాడు ఊరు తెల్లారక ముందే చుట్టుపక్కల పిల్లలు వచ్చి వెలగకుండా ఆరిపోయిన టపాసులను, మేము పక్కన పెట్టి మరిచిపోయిన వాటిని, తుడిచి, పోగులు పెట్టేసి, అందులోంచి మంచివి పట్టుకెళ్ళి పోయేవారు. చిన్ననాటి దీపావళి కళ్ళ ముందు కదులుతూ ఇంకా కన్నుల పండగ చేస్తోంది.
పండగ అంటే పంచుకోవడం, సంతోషాన్ని పెంచుకోవడం అని అనే అమ్మ మాటలు ఎప్పటికీ గుర్తొస్తూ ఉంటాయి.

