హరిత దీపావళి -
సెల్ ఫోన్ రింగ్ కావడంతో తీసుకొని చూసాడు ప్రసాద్ . ఢిల్లీ నుండి చెల్లెలు కరుణ దగ్గరనుండి వచ్చిన ఫోన్.
"హలొ అన్నయ్యా, దీపావళికి నేను పిల్లలు కలసి మన గ్రామానికి వెళ్లి. నాన్నతో వారం లేక పదిరోజులు వుండి తిరిగి వస్తాము . మా వారికీ అన్ని రోజులు సెలవుదొరకదంట,ఆయన ఢిల్లీలోనే వుంటారు "అంది కరుణ.
"మంచి పని చేస్తున్నావు కరుణా , ఈ దీపావళికి నేనూ వెళ్ళలేను. తమ్ముడు మూర్తి కూడా వెళ్లలేనని చెప్పాడు . క్రిస్టమస్ సెలవులకు వెళ్తానన్నాడు . నేను సంక్రాంతి సెలవులకు వెళ్తాను " అన్నాడు ప్రసాద్
"ఇపుడు నాన్న ఎలా వున్నారు "
"నిన్నటి రోజున పక్కింటి అంకుల్ కు ఫోన్ చేసి మాట్లాడాను .ఒకప్పుడు వసపిట్టలా వాగుతూ ఉండేవాడు .ఇప్పుడు మూగవాడిలా మాట్లాడకుండా వున్నాడంటూ బాధపడ్డారు "అన్నాడు ప్రసాద్ .
*** *** ***
రాఘవయ్య ఒక రైతు. ఆయనకు ముగ్గురు పిల్లలు. పెద్ద కొడుకు ప్రసాద్, రెండవ సంతానం కూతురు కరుణ, చిన్న కొడుకు మూర్తి. ఉన్న కొంత పొలంతో వ్యవసాయం చేసుకొంటూ కుటుంబం నడపసాగాడు .
ఇద్దరు కొడుకులకు ,కూతురికి పెండ్లిళ్లు చేసాడు . ఉద్యోగరీత్యా పెద్ద కొడుకు హైదరాబాదులో , చిన్నకొడుకు బెంగళూరులో, అల్లుడు ఢిల్లీలో పనిచేస్తున్నారు . పిల్లలకు వివాహాలు జరిపించగానే వారి వారి కుటుంబం అంటూ తల్లితండ్రులుంటున్న గ్రామం వదలి వెళ్ళవలసివచ్చింది.
మరికొంత కాలానికి భార్య చనిపోవడంతో జీవితం మీద విరక్తి కలిగిన వాడిలా నడుచుకొనసాగాడు. పొలం వైపు వెళ్లడం మానుకొన్నా పిల్లలు ఏమీ చెప్పలేదు. వయసు మళ్ళిన తండ్రిని వ్యవసాయపు పనులు చూడమంటూ చెప్పడం మంచిది కాదనుకొన్నారు. ఉన్న భూమిని కౌలుకిచ్చారు. గ్రామాన్ని వదిలి మా దగ్గరే వుండండి అంటూ ముగ్గురు పిల్లలు ఇంటికి రమ్మని పిలిచినా రాఘవయ్య రానంటూ మొండికేసాడు.
రాఘవయ్య ఉంటున్న గ్రామంలో చిన్న హోటళ్లు ఆరు ఉండటంతో మూడు వేళలా ఎక్కడో ఒక చోట తింటూ పొద్దు గడపసాగారు. ఒంటరితనం వలన అతను తాగుడుకు అలవాటు పడ్డాడు. తండ్రి తాగుడుకు అలవాటు పడటం తెలుసుకొని ముగ్గురు పిల్లలు బాధపడ్డారు , రాఘవయ్యకు చక్కెర వ్యాధి వచ్చింది. చక్కెర వ్యాధిని నిర్లక్ష పరిచితే చాలా విపరీత పరిమాణాలు దారి తీస్తుందన్న ఆలోచన కలగలేదు.
కాలు నొప్పితో బాధపడుతూ వైద్యం కోసం హైద్రాబాదులోనున్న పెద్ద కొడుకు దగ్గరకు వెళ్ళాడు రాఘవయ్య .
డాక్టర్లు పరీక్షించి చక్కెర వ్యాధిని నిర్లక్ష్య పరిచినందువలన కాలుకు ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉందంటూ కుడికాలులో కొంత భాగాన్ని ఆపరేషన్ చేసి తీసేసారు.
ఆ తరువాత హైదరాబాదు నుండి గ్రామానికి తిరిగి వచ్చాడు.
కాలు పోయాక ఇంట్లోనున్న మంచానికే రాఘవయ్య అతుక్కొనిపోయాడు.
ఇంటికి వచ్చిన మనవళ్లతో,మనవరాళ్లు మాట్లాడటం పూర్తిగా తగ్గించాడు. ఎందుకంటె ఒకప్పుడు రాఘవయ్య ఇంటికి వస్తే ఆ పిల్లలకు పండగ లాగుండేది . సాయంత్రం వేళ ప్రతి రోజూ ఎక్కడికో ఒక చోటుకు తీసుకొని వెళ్ళేవాడు.ఇంటిముందున్న మైదానంలో క్రికెట్ లాంటి ఆటలు ఆడేవాడు.
కాలు లేని నేను వారితో సరదాగా తిరుగులేని అన్న భావనతో ముఖభావంగా లోలోన వేదనపడసాగాడు.
రాఘవయ్య పిల్లలు మాట్లాడుకొని నెలకొకసారి గ్రామంలోనున్న తండ్రి దగ్గరకు ఎవరో ఒకరు వచ్చి కొన్ని రోజులు గడిపి వెళ్లేవారు .అయినా తండ్రితో మార్పు రాలేదు . మూగవాడిలాగా మౌనంగా ఉండేవాడు. తండ్రి ఎప్పుడు మారుతారా అని అనుకొనసాగారు
*** *** ***
దీపావళికి మూడురోజుల ముందు ఐదవతరగతి చదివే హరీష్ , మూడు సంవత్సరాల శృతి తో కలసి ఢిల్లీ నుండి కరుణ వచ్చింది.
ఇంటికి రాగానే రాఘవయ్యతో పరిచయమున్న వారిని కరుణ కలిసింది
" మీ నాన్న ఎందుకో లోలోన బాధపడుతున్నారు. ఇంటికి వచ్చినా తలవంచుకొని ముక్తసరిగా తక్కువ గొంతుతో మాట్లాడుతున్నాడు .అందుకే మేము రావడం బాగా తగ్గించుకొన్నాము." అన్నాడు రాంమూర్తి
"మీరంతా రోజూ కూర్చొనే చోటుకు రమ్మని పిలిచారా"
"కరుణా, కర్ర సాయంతో అలా నడచుకొంటూ రచ్చ బండ దగ్గరకురా రాఘవయ్యా, అందరూ ఉంటారు అంటూ పిలిచాము "రత్నాకర్
"మా నాన్న ఏం చెప్పారు "
" మనఊరిలో నేనొక్కడినే కుంటి వాడిని అని నన్ను ఎగతాళి చేయకున్నాఅందరూ నా వైపు బాధతో చూడటం సహించలేను. అందుకే ఇల్లు దాటి బయటకు రాలేదు అంటూ వచ్చిన మొదట్లో బొంగురు గొంతుతో అన్నాడు. ఆ తరువాత మాట్లాడటం కూడా బాగా తగ్గించాడు. ఎల్లకాలం ఇలా వుండలేడు ఒక్కసారి ఇంటి బయటకు వచ్చాడంటే వాడే మారిపోతాడు ఏదో ఒక రోజు ఇల్లు దాటి వస్తాడు." రామ్మూర్తి అన్నాడు.
ఆ మాటలు కరుణను ఆలోచింపచేసేలా చేసింది
కరుణ తండ్రికి మెల్ల మెల్లగా పనులు చెప్పసాగింది, కూతురు చెప్పిన పని కాదనకుండా కరుణ ఇచ్చిన కాయగూరలు కోయడం లాంటి పనులు చేసేవాడు, మిక్సీలో పచ్చళ్ళు నూరడం లాంటి పనులు అప్పగించింది. ఏ పని చెప్పిన యాంత్రికంగా చేస్తున్నాడు తప్ప అతని ముఖంలో వెలుగులు చూడలేకపోతోంది
"తాతా మేము ఢిల్లీ నుండి ఇక్కడకు ఎందుకు వచ్చామో తెలుసా "అన్నాడు హరీష్.
ఎందుకు అన్నట్టుగా తల ఆడించాడు
" తాతా, ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువగా ఉందంట మా కాలనీ వారు టపాకాయలు కాల్చకూడదని నిర్ణయించుకొన్నారు . టపాకాయలు కాల్చడం కోసం ఇక్కడకు వచ్చాము . మాకు టపాకాయలు కొనిస్తావా."
రాఘవయ్య తన దగ్గరున్న డబ్బులు తీసివ్వబోతుంటే" తాతా మేము పెద్ద అయ్యేంతవరకు ఎవరి దగ్గరా డబ్బులు తీసుకొనకూడదని అమ్మ చెప్పింది. తీసేస్తే మీరే తీసివ్వండి. లేకుంటే వద్దు. " అన్నాడు హరీష్. ముందుగా తల్లి ఎలా చెప్పాలో చెప్పి వుండటంవలన అలా చెప్పాడు హరీష్.
మనవడికి ఎలా సమాధానం చెప్పాలో అర్థంకాక మౌనంగా వున్నాడు.
“తాతా, గ్రీన్ క్రాకర్స్ కాల్చమని మా మాస్టారు చెప్పారు. గ్రీన్ క్రాకర్స్ అంటే ఏమిటి “ "
“హరిత టపాసులు .”
"తాతా, అందులో స్పెషాలిటీ ఏమిటి "
'అమ్మనడుగు' అన్నట్లుగా కూతురు వైపు చేయి చూపించాడు.
"తక్కువ కాలుష్యం ,హానికలిగించే రసాయనాలు తక్కువగా వున్న వాటిని హరిత టపాసులు అంటారు. హరిత టపాసులు దీపావళికి కాల్చడం మంచిది."అంది కరుణ
"నా జీవితానికి దీపావళే లేదు .ఇక హరిత దీపావళి ఒకటా" గొణుక్కుంటున్నట్టుగా అన్నాడు
రాఘవయ్య మాటలు హరీష్ కు అర్థం కాకపోయినా, ఆ మాటలు కరుణ మనసులో బాధ కలిగించింది.
"తాతా, నాకు హరిత క్రాకర్స్ కొనివ్వండి. " అన్నాడు హరీష్.
మీ అమ్మను అడుగు అన్నట్టుగా కరుణ వైపు చేతులు చూపించాడు
"నాన్నా ,వాడు ఎంతో ఆశతో అడిగితే మీరే వెళ్లి కొనుక్కొని రావచ్చుగా "
"నేనా కుంటి కాలుతో."
“కాలు లేని వారందరూ నడవకుండా ఉన్నారా.మీ దగ్గరున్న కర్ర సాయంతో నడవచ్చుగా "
శృతి లోనికి వచ్చి "నాకు తుపాకీ కావలి "అంది
"నాన్నా, పిల్లలు అడిగింది తీసివ్వ వచ్చుగా " అంది
"కరుణా. నా అవిటితనం చూసి అలా ఎవరూ బాధతో పడకూడదనే ఎక్కడకూ వెళ్ళలేదు ఇప్పుడు నీవు ఏమాత్రం దయ లేకుండా కర్రసాయంతో వెళ్ళమనడం కూడా నన్ను ఎగతాళి చేస్తున్నావా. ఇంటికి వచ్చిన హరీష్, శృతిలను ఎక్కడకూ తీసుకెళ్లలేక నాలో నేనే ఎంతగానో కుళ్లిపోయాను " చెమ్మగిల్లిన కళ్ళతో అన్నాడు.
"నాన్నా, కష్టం వచినప్పుడంతా ఎవరో బాధతో చూస్తారని ఇల్లుదాటకుండా వుంటారా .ప్రతిమనిషికీ ఏదో ఒక రూపంలో కష్టాలు వస్తుంది.వాళ్లంతా నీలాగా ఉంటున్నారా. వాటిని పట్టించుకోకుండా సంతోషంతో ముందుకు వెళ్ళాలి . ఆ పిల్లల ఆనందం కోసం అయినావాళ్లడిగిన టపాకాయలు కొనుక్కొని రండి.మీరు ముందు లేచి నిలబడండి."
రాఘవయ్య లేచి కర్ర సాయంతో నిలబడ్డాడు .
“నాన్నా, పాపను నడిపించుకు తీసుకొని వెళ్ళద్దు నీ బుజంపైన కూర్చొనపెట్టానంటే నీ తల పట్టుకొని కూర్చొని ఎంతగా సంతోషపడుతుందో నీవే చూడు "అంటూ తండ్రి భుజంపై కూర్చొని పెట్టగానే పాప సంతోషంతో " హై హై " అంటూ అరవసాగింది
"కరుణా, నాకాలు తీసివేసిన తరువాత మొదటిసారి చాలా చాలా సంతోషంగా వుంది. పిల్లలు అడిగింది కొనిస్తాను "అంటూ ఉత్సాహంతో కర్ర సాయంతో నడుస్తూ వెళ్తుంటే ప్రక్కనే హరీష్ వెళ్ళసాగాడు .
కరుణ ఇంటిగుమ్మం ముందు కూర్చొని వారి కోసం ఎదురుచూడసాగింది
రాఘవయ్య భుజం మీద కూర్చున్న శృతి మిక్కిలి ఆనందంతో తుపాకీతో “డాం డాం “ కాలుస్తోంది.
ఇంటిదగ్గరకు రాగానే టపాకాయల సంచి తీసుకొని హరీష్ ఇంటిలోనికి వెళ్ళాడు.
" కరుణా, అంగడి వాడినడిగి పర్యావరణం కాలుష్యం కాకుండా హరిత టపాసులు కొనుకొచ్చాను . మనం హరిత దీపావళి పండుగ జరుపుకొందాం. నేను ఇప్పుడు నా మనవరాలిని తీసుకొని అలా రచ్చ బండ వరకు వెళ్లి మిత్రులను చూసి వస్తాను " అన్నాడురాఘవయ్య .
' నా జీవితానికి దీపావళే లేదు' అంటూ బాధపడిన నాన్న ముఖంలోనూ హరిత దీపావళి వెలుగులు గుర్తించింది.
(అయిపొయింది)

