మహానటి సావిత్రి . - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

మహానటి సావిత్రి .

మహానటి సావిత్రి.
గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలంలోని చిర్రావూరు గ్రామంలో డిసెంబరు 6, 1936న నిశ్శంకర గురవయ్య, సుభద్రమ్మ దంపతులకు జన్మించింది. వారికి సావిత్రి రెండవ సంతానం, 1934లో ఆడపిల్ల పుట్టగా మారుతి అని నామకరణం చేశారు. సావిత్రికి ఆరు నెలలు నిండగానే టైఫాయిడ్ కారణంగా తండ్రి మరణించాడు. గురవయ్య మరణంతో సుభద్రమ్మ విజయవాడలోని తన అక్క అయిన దుర్గాంబ ఇంటికి మకాం మార్చింది. దుర్గాంబ భర్త పేరు కొమ్మారెడ్డి వెంకట్రామయ్య, సావిత్రికి వరుసకు పెద్దనాన్న. మారుతి, సావిత్రి విజయవాడలోని కస్తూరిబాయి మెమోరియల్ పాఠశాలలో చేరారు. పాఠశాలకు వెళ్ళే దారిలో నృత్య విద్యాలయం ఉండేది. రోజూ ఇతరులు నాట్యం చేయటం చూసి ఆ నృత్యనిలయంలో చేరి శిష్ట్లా పూర్ణయ్య శాస్త్రి దగ్గర సంగీతం మరియూ శాస్త్రీయ నృత్యం నేర్చుకొని విజయవాడలో తన చిన్నతనంలోనే ప్రదర్శనలు ఇచ్చింది. కొంతకాలం ఎన్టీఆర్, జగ్గయ్య తదితరులు నడుపుతున్న నాటకాల కంపెనీలో పనిచేసి, అనంతరం స్వయంగా పెదనాన్న నడిపిన నాట్య మండలిలో కూడా నటించింది. బుచ్చిబాబు రాసిన ఆత్మవంచన అనే నాటకంలో కూడా నటించింది.
సావిత్రి13 సంవత్సరాల వయసులో ఉన్నసమయంలో కాకినాడలోని
ఆంధ్రనాటక పరిషత్ నిర్వహించిన నృత్యనాటక పోటీలలో ఆనాటి హిందీ నటుడు, దర్శకుడు, హిందీ సినీరంగంలో ప్రసిద్ధుడు అయిన పృధ్వీరాజకపూర్ చేతుల మీదుగా బహుమతి అందుకున్నది. అది ఆమెలో కళలపట్ల ఆరాధన పెరగడానికి కారణమైంది. ఆమె 1949లో చలనచిత్రాలలో నటించడానికి మద్రాసు నగరంలో ప్రవేశించింది.పెదనాన్న ప్రోద్బలంతో సినిమా రంగం వైపు దృష్టి సారించి ఎన్నో కష్టాలనోర్చి తిరుగులేని అభినేత్రిగా విరాజిల్లింది. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వం వహించిన సంసారం సినిమాలో చిన్న పాత్ర పొంది, ఆనక ఆ పాత్రకు తగ్గ వయసు లేదని అందులోనుండి తొలగింపబడింది. ఆ తరువాత కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన పాతాళ భైరవిలో ఒక చిన్న పాత్రలో నటించింది. పెళ్ళిచేసిచూడు ఆమె సినీ జీవితంలో ఒక మలుపు. కాని అందులో ఆమె రెండో కథానాయిక పాత్రకే పరిమితం కావలసి వచ్చింది. తన నటనా ప్రతిభను నిరూపించుకోవటానికి ఆమె, నృత్యరూపకుడు మరియూ దర్శకుడూ అయిన వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించిన దేవదాసు సినిమా వరకూ ఆగవలసి వచింది. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో మిస్సమ్మలో ప్రధానపాత్ర పోషించింది. ఆ చిత్రంతో ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగాస్థిరపడింది.ఆతరువాతవచ్చిన దొంగరాముడు, అర్థాంగి,

చరణదాసి ఆమె స్థానాన్ని పదిలపరచాయి.1957 లో వచ్చిన తెలుగు చిత్ర చరిత్ర లోనే అజరామరం అనదగిన మాయాబజార్ చిత్రంలో ఆమె ప్రదర్శించిన అసమాన నటనా వైదుష్యం ఆమె కీర్తి పతాకంలో ఒక మణిమకుటం. అది మొదలు యెన్నో వైవిధ్యమైన పాత్రలను తనకే సాధ్యమైన రీతిలో పోషించి వాటికి ప్రాణ ప్రతిష్ఠ చేసింది.
ఆమె తమిళ చిత్రాలలోనూ నటించి పేరుతెచ్చుకుంది. తమిళంలోనూ మహానటి (నడిగెయర్ తిలగం) బిరుదు పొందింది. 1968లో చిన్నారి పాపలు సినిమాకు దర్శకత్వం వహించింది. ఈ సినిమాకు ఒక ప్రత్యేకత ఉంది. బహుశా దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా దాదాపు పూర్తిగా మహిళలచే నిర్మింపబడిన చిత్రంగా ప్రత్యేకత సంతరించుకున్నది . అయితే అది అంత విజయం సాధించలేదు. ఆతరువాత చిరంజీవి,మాతృదేవత, వింత సంసారం మొదలగు సినిమాలకు దర్శకత్వం వహించింది. 1956లో అప్పటికే రెండు పెళ్ళిళ్ళయిన తమిళ నటుడు జెమినీ గణేశన్ను పెళ్ళిచేసుకుంది. వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు - విజయ చాముండేశ్వరి, సతీష్ కుమార్. అయితే ఆ పెళ్ళి విఫలమైంది. ఆస్తిపాస్తులు కోల్పోయి, తాగుడుకు, మత్తుమందులకు, నిద్రమాత్రలకు బానిసై 1981 డిసెంబర్ 26 న మరణించారు.
అభిమానులు, ప్రచారసాధనాలు సావిత్రి జన్మదినాన్ని డిసెంబర్ 6 గా జరుపుకుంటాయి. మల్లెపూలు, వర్షం సావిత్రికి ఇష్టమైనవి. ఆమెది ఎడమ చేతివాటం. క్రికెట్, చదరంగం ఆటలను బాగా ఇష్టపడేది. చెన్నైలో క్రికెట్ మ్యాచ్ ఉంటే ఆమె తప్పక చూసేది. వెస్టిండీస్ ప్రముఖ ఆటగాడు "గ్యారీ సోబర్స్"కు సావిత్రి అభిమాని. ఆ రోజుల్లోనే శివాజీగణేశన్ తోపాటు తారల క్రికెట్లో పాల్గొనేది. ఆమె వద్ద ఏనుగు దంతంతో చేసిన చదరంగం బల్లకూడా ఉండేది. సావిత్రి మంచి చమత్కారి, అంతే కాదు ఇతరులను అనుకరించటంలో కూడా దిట్ట. ఆమె తన భర్త జెమినీ గణేశన్ను, రేలంగిని, బి.సరోజాదేవిని, ఎస్వీ రంగారావుని, ఇంకా అనేకమందిని తరుచూ అనుకరించేది. దానధర్మాల విషయంలో అమెది ఎముకలేని చెయ్యి. ఒకసారి నిండుగా నగలతో అలంకరించుకుని ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిని కలిసేందుకు వెళ్ళి, అక్కడ మొత్తం నగలన్నిటినీ వలిచి ప్రధానమంత్రి సహాయ నిధికి దానమిచ్చేసింది.
మహానటి సావిత్రి జీవితంలో సంభవించిన వరుస అపజయాలు ఆమెను ఆర్థికంగానూ మానసికంగానూ బాధించాయి. ఆమె దర్శకత్వం వహించిన మొదటి చిత్రం చిన్నారి పాపలు. ఈ చిత్ర నిర్మాణంలో చాలా మంది పాలుపంచుకున్నారు. వీరి అభిప్రాయ బేధాలతో సినిమా సరిగా ముందుకు సాగకపోవడంతో ఆమె సొంత ఆస్తులు అమ్మి ఈ సినిమా నిర్మాణానికి వెచ్చించవలసి వచ్చింది. తెలుగులో అమోఘ విజయం సాధించిన మూగమనసులు చిత్రాన్ని తమిళంలో నిర్మించి అందులో శివాజీ గణేషన్ తో నటించింది. ఆ చిత్రం అపజయాన్ని ఎదుర్కొనడంతో ఆమె ఆర్థికపతనానికి దారితీసింది. ఆర్థికంగా సమస్యలను ఎదుర్కొంటూ టీ నగర్ నుండి అణ్ణానగర్‌కు నివాసం మారిన తరువాత ఆమె అంతిమ అంకం ముగిసిపోయింది.
సావిత్రి జీవిత విశేషాలతో 2018లో దర్శకుడు అశ్విన్ నాగ్ తెలుగు తమిళ భాషలలో "మహానటి" అనే సినిమా రూపొందించారు. ఆ చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తీ సురేష్ నటించింది, ఈ చిత్రమునకు ప్రపంచవ్యాప్తంగా అశేష జనాదరణ లభించింది. ఈ చిత్రంలో నటించిన కీర్తి సురేష్ కి జాతీయ ఉత్తమ నటి పురస్కారం లభించింది.