భారతదేశానికి సర్వోన్నత శాసనం భారత రాజ్యాంగం - కొమ్మలూరు హరి మధుసూదన రావు

భారతదేశానికి సర్వోన్నత శాసనం భారత రాజ్యాంగం

భారతదేశానికి సర్వోన్నత శాసనం భారత రాజ్యాంగం

జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా

ఒక దేశం యొక్క మౌలికమైన శాసనాన్ని రాజ్యాంగం అంటారు. ఇది ఇంగ్లాండ్ రాజ్యాంగం లాగా అలిఖితం కావవచ్చు, అమెరికా రాజ్యాంగం లాగా లిఖితం కావచ్చు. రాజ్యాంగంలో ప్రభుత్వం యొక్క అధికారాలు, ప్రజల యొక్క హక్కులు, బాధ్యతలు ఉంటాయి. భారతదేశానికి రాజ్యాంగం కావాలని స్వాతంత్ర్యానికి పూర్వమే గాంధీజీ గ్రహించారు. ‘స్వరాజ్యం బ్రిటీష్ వాళ్ళు ఇచ్చే దానం కాదు. అది భారతీయుల ఆత్మ. భారత రాజ్యాంగం కోట్ల మంది భారతీయుల ఆశయాల సమూహం, వారి ఆశయాల మేరకు రాజ్యాంగ నిర్మాణ ఆవశ్యకత ఎంతో ఉంది’ అని తెలిపారు. 1938 సంవత్సరం లో నెహ్రూ ‘రాజ్యాంగం ప్రజల కోరికల మేరకు నిర్మింపబడాలే కానీ బ్రిటీషు వారి ప్రమేయం పై కాదు’ అని తెలిపారు. 1945, సెప్టెంబర్ 19 వ తేదీ న బ్రిటీషు వైస్రాయ్ వేవెల్ ఒక ప్రకటన చేస్తూ రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 212, ముస్లిం లీగు 73, మిత్రపక్షాలు 11 స్థానాలను గెల్చుకొన్నాయి.

రాజ్యాంగ సభ నిర్మాణం

డా. సచ్చిదానంద సిన్హా తాత్కాలిక అధ్యక్షునిగా 1946 ఆగష్టు 9 న రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం జరిగింది. డా.బాబు రాజేంద్రప్రసాద్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. పాకిస్తాన్ ప్రత్యేక దేశం గా కావాలని ముస్లిం లీగు దీనిని బహిష్కరించింది. 1947 ఆగష్టు 14 వ తారీఖున రాజ్యాంగ సభ సమావేశ మయ్యింది. న్యాయ కోవిదుడైన బి.నరసింగ రావు రాజ్యాంగ సభ కు సలహా సభ్యుడి గా నియమించారు. ఇతను మొదట 243 ప్రకరణలు, 11 షెడ్యూళ్ళు తో మొదటి మాదిరి రాజ్యాంగం తయారు చేశారు. కొన్ని కమిటీలకు అధ్యక్షులను నియమిచడం జరిగింది. ఉదాహరణకు ముసాయిదా కమిటీకి డా. బి.ఆర్ అంబేద్కర్, సలహా సంఘానికి పటేల్, కేంద్ర రాజ్యాంగ కమిటీకి నెహ్రూ, నియమావళి కి రాజేంద్ర ప్రసాద్, అల్ప సంఖ్యాకుల రక్షణ కమిటీకి హెచ్.సి. ముఖర్జీ వంటి వారిని వివిధ కమిటీలకు అధ్యకులుగా నియమించారు.

వీటన్నింటిలో ప్రధానమైనది ముసాయిదా కమిటీ. ఇందులో అల్లాడి క్రిష్ణ స్వామి అయ్యర్, యన్.గోపాలస్వామి, కె.యం.మున్షీ, యం.సాదుల్లా, బి.ఎల్.మిట్టర్, డి.పి.ఖైతాన్ సభ్యులుగా ఉన్నారు. ఇందులో డా.బి.ఆర్.అంబేద్కర్ ప్రధాన పాత్ర పోషించి తన సర్వశక్తులను ధారపోశారు. అందుకే ‘రాజ్యాంగ పిత’ గా ఖ్యాతి గాంచారు.

అమెరికా మొదటి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ తో పోల్చబడ్డ డా. బాబు రాజేంద్ర ప్రసాద్ ఉద్రేక పూరిత చర్చలలో సైతం నిగ్రహంగా వ్యవహరించి సభను చాకచక్యంతో నడిపారు. రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంశయాలను నెహ్రూ గారు ఎప్పటికప్పుడు తీర్చేవారు. వీరే కాక పటేల్, బి.యన్.రావు, టి.టి. కృష్ణమాచారి వంటి నిజమైన దేశ భక్తుల చేత నిర్మింప బడినది ఈ రాజ్యాంగం. పరాయి పాలనలో పడ్డ కష్టాలను కళ్ళారా చూసిన ఈ దేశభక్తులు ఇకపై భారతమాతకు ఈ దుర్గతి పట్టకూడదని నిశ్చయించారు.

 

ప్రపంచంలో అతి పెద్ద రాజ్యాంగం

ప్రారంభంలో 395 ప్రకరణలు, 8 షెడ్యూళ్ళు, 22 భాగాలు గా ఉండేది. ప్రస్తుతం 465 ప్రకరణలు, 12 షెడ్యూళ్ళు, 25 భాగాలు ఉన్నాయి. అందుకే సర్ ఐవర్ జెన్నింగ్స్ మన రాజ్యాంగాన్ని అత్యంత సుదీర్ఘ మైనదిగా ప్రకటించారు. హెచ్.వి. కామత్ ఐరావతం తో పోల్చారు.అయితే రాజ్యాంగంలో వివిధ సంస్థల కార్యక్రమాలను వివరణాత్మకంగా, విస్తృతంగా వ్రాయండం వలన మన రాజ్యాంగం నిడివి పెరిగింది. భారత దేశంలో మతాలు, కులాలు, భాషలు, సంస్కృతులు అనేకం ఉండటం వలన కొన్నింటికి పరిమితులు, మినహాయింపులు ఇవ్వటం వలన సుదీర్ఘమైంది.

భారత రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం లాగా సరళంగా లేదని, ఇది ‘న్యాయవాదుల స్వర్గ’మని కొందరు విమర్శించారు. కానీ రాజ్యాంగ కర్తలు రాబోవు సమస్యలను ముందుగానే ఊహించి తయారు చేయడం వల్లనే రాజ్యాంగం విస్తృతమయ్యింది . సందిగ్ధత లేకుండా ఇప్పటికీ నిలిచింది.

భవిష్యత్తు లో ఎదురవ్వబోయే సమస్యలకు కూడా పరిష్కారం

70 దశాబ్దాలైనా భారత రాజ్యాంగం చెక్కు చెదర లేదు. దీనికి ప్రధాన కారణం రాజ్యాంగ నిర్మాతల యొక్క ముందుచూపు. మార్పులకు అనుగుణంగా కొన్నింటిని పార్లమెంటుసాధారణ మెజారిటీ తో, కొన్నింటిని ప్రత్యేక మెజారిటీ తో మరికొన్నింటిని ప్రత్యేక మెజారిటీ తో పాటుగా కనీసం సగం వంతు రాష్ట్ర శాసన సభల ఆమోదం తో రాజ్యాంగాన్ని సవరించవచ్చు. ఉదాహరణకు రాష్ట్రాల పునర్నిర్మాణం, విధాన పరిషత్ రద్దు, పౌరసత్వం వంటి విషయాలను సాధారణ మెజారిటీ తో మార్చవచ్చు. ప్రాధమిక హాక్కులు, విధులు, నిర్దేశిత నియమాలు వంటి వాటిని పార్లమెంటు లో హాజరైన వారిలో మూడింట రెండు వంతు సభ్యుల మద్దతుతో మార్చవచ్చు. రాష్ట్రపతి ఎన్నిక విధానం, రాజ్యాంగ సవరణ విధానం, న్యాయ వ్యవస్థల అధికార పరిధి వంటి వాటిని మాత్రం పార్లమెంటు ప్రత్యేక మెజారిటీ తో పాటుగా కనీసం సగం వంతు రాష్ట్ర శాసన సభల ఆమోదం తో మాత్రమే మార్చగలము.

భారత రాజ్యాంగం కలగూర గంప ?

భారత రాజ్యాంగాన్ని విమర్శకులు ‘అరువు తెచ్చుకున్న సంచి’ వంటిదని విమర్శించారు. ప్రొఫెసర్ శ్రీనివాసన్ గారు రాజ్యాంగం లో మూడింట రెండువంతులు 1935 చట్టం నుంచే సంగ్రహించారని తెలిపారు. మిగతా ఒక వంతును కూడా ఇతర దేశాల రాజ్యాంగాల నుండి సంగ్రహించారు. న్యాయ సమీక్షాధికారం, ప్రాధమిక హక్కులు, రాజ్యాంగ ప్రవేశిక, సమాఖ్య విధానం అమెరికా రాజ్యాంగం నుంచి, పార్లమెంటరీ విధానం ఇంగ్లాండ్ రాజ్యాంగం నుంచి, అత్యవసర పరిస్థితి అధికారాలు, ప్రాధమిక హక్కులకు మినహాయింపులు జర్మని యొక్క వీమర్ రాజ్యాంగం నుంచి, ఆదేశ సూత్రాలు ఐరిష్ రాజ్యాంగం నుంచి, సుప్రీంకోర్టు అధికారాలు జపాన్ రాజ్యాంగం నుంచి, స్వేఛ్చ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఫ్రెంచి రాజ్యాంగం నుంచి, ఉమ్మడి జాబితా ఆస్టేలియా రాజ్యాంగం నుంచి స్వీకరించారు.

రాజ్యాంగ నిర్మాతలు కొత్త రాజ్యాంగాన్ని సృష్టించడం తమ ఉద్దేశ్యం కాదని, భారతీయులకు అప్పటికే అలవాటైన విధానాలను మెరుగు పరచడమే తమ కర్తవ్యమని భావించి 1935 చట్టం లోని అంశాలకు కొన్ని మార్పులను చేసి తీసుకున్నామన్నారు. డా. బి.ఆర్. అంబేద్కర్ ‘అనేక దేశాల రాజ్యాంగాలను క్షుణ్ణంగా పరిశీలించి భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా ఉన్న అంశాలనే స్వీకరించాము. అనుకరణ అనునది ప్రకృతి సిద్దమైనది అది మంచిదే’ అని తెలిపారు.

రాజ్యాంగ కర్తల ఆశయాలకు ప్రతీక రాజ్యాంగ ప్రవేశిక

సంక్షిప్త పరచబడిన రాజ్యాంగం యొక్క ఆశయాలు, లక్ష్యాలు, తత్వాన్నే ‘ప్రవేశిక’ లేక ‘పీఠిక’ అంటారు. ఇది ఒక రకంగా ఉపోద్ఘాతం వంటిది. ‘భారత దేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి ....’ అని ప్రవేశిక మొదలవవుతుంది. కేశవానంద భారతి లో తీర్పు నిస్తూ ప్రవేశిక భారత రాజ్యాంగం యొక్క మౌలికాంశమని పేర్కొంది. అంటే ప్రవేశిక రాజ్యాంగం యొక్క ఆత్మ వంటిది.

 

 

 

మన రాజ్యాంగం ధృడ, అధృడ రాజ్యాంగ సమ్మేళనం

రాజ్యాంగ నిపుణుడు మూల్ ఫోర్డ్ ప్రకారం ‘మార్పులకు వీలులేని రాజ్యాంగం నియంతృత్వం కన్నా ఘోరమైనది’. గార్నర్ తెలిపినట్లు ‘రాజ్యాంగాన్ని కాలానికి అనుగుణంగా మార్పు చేయుటకు వీలుపడని కఠినంగా కాని, రాజ్యాంగ ప్రాధాన్యతనే కించపరిచే విధంగా మార్చే విధంగా గాని ఉండకూడదు’. బ్రిటీషు రాజ్యాంగం లాగా సులభంగా మార్చలేము. అలాగని అమెరికా రాజ్యాంగం లాగా మార్చడానికి వీలు పడని రాజ్యాంగం కాదు. ఆత్మ రక్షణార్థం అమెరికాలో ఆయుధాలను ఉంచుకోవచ్చు అని రాజ్యాంగం తెలిపింది. కాని ప్రస్తుతం దానివల్ల కొందరు దుర్వినియోగం చేసి అనేక మంది అమాయకుల ప్రాణాలను బలికొంటున్నారు. దీనిని మార్చడానికి అమెరికా ప్రభుత్వం కు తలనొప్పిగా తయారయ్యింది.

రాజ్యాంగ కర్తల ఆశయాలను నిజం చేద్దాం

రాజ్యాంగాన్ని నవంబర్ 26 1949 లో ఆమోదించారు. 1950 జనవరి 26 నుండి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అందుకే ప్రతి సంవత్సరం జనవరి 26 న గణతంత్ర దినోత్సవం గా జరుపుకుంటున్నాము. మన ప్రక్క నున్న దేశాలలో ప్రజాస్వామ్యం కుప్పకూలిన సందర్బాలను ఎన్నో చూసాం. కాని ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతోందంటే ఇంతపటిష్టంగా నిర్మించిన రాజ్యాంగ కర్తలకు మనం సదా ఋణ పడి ఉన్నాము. రాజ్యాంగాన్ని గౌరవిద్దాం. వారి ఆశయాలను నిజం చేద్దాం.

జై హింద్

భారత రాజ్యాంగం గురించి కొన్ని ఆసక్తికర అంశాలు

ప్రేమ బిహారీ నారైన్ రైజాద ఇటాలిక్ క్యాలీగ్రఫీ లో భారత రాజ్యాంగాన్ని మొదట హిందీ మరియు ఇంగ్లీష్ బాషలలో లిఖించారు. ప్రతి పేజీని అందంగా చిత్రీకరించారు. శాంతినికేతన్ విద్యార్థులు ఇందుకు సహకరించారు. ఈ రాజ్యాంగాన్ని హీలియం గ్యాస్ నింపిన పెట్టెలో ఉంచి భారత పార్లమెంట్ గ్రంధాలయం లో భద్రపరచారు. భారత రాజ్యాంగాన్ని వ్రాయడానికి 2 సంవత్సరాల 11నెలల 18 రోజులు పట్టింది. రాజ్యాంగం లోని ప్రతి క్లాజు మీద రాజ్యాంగ సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. భారత రాజ్యాంగానికి అధికార చిహ్నం ఐరావతం మూడవ రీడింగు తరువాత 1949 నవంబర్ 26 తేదీన న మొదటి రాజ్యాంగ ప్రతి తయారయ్యింది. 1949, నవంబర్ 26 వ తేదీన రాజ్యాంగాన్ని ఆమోదించారు. 1950, జనవరి 24 వ తేదీన 284మంది రాజ్యాంగ సభ్యులు సంతకం చేశారు. 1950, జనవరి 26 వ తేదీ నుండి అమలులోకి వచ్చింది. జనవరి 26 వ తేదీనే అమలు లోనికి తేవడానికి ప్రధానమైన కారణం 1929 జనవరి 26 వ తేదీన ‘పూర్ణ స్వరాజ్’ దినోత్సవం గా జరుపుకోవాలని కాంగ్రెస్ గతంలో తీర్మానించింది. ఇప్పటి వరకూ 105 రాజ్యాంగ సవరణలు చేశారు. ఈ 105 రాజ్యాంగ సవరణ ప్రకారం 2021, ఆగష్టు 10 వ తేదీ నుంచీ రాష్ట్రాలకు OBC జాబితా పై హక్కును కల్పించారు.