సామాజిక బాధ్యత తోఅందిన్చిన డా కె.ఎల్.వి.ప్రసాద్ ..కథలు - శ్రీమతి ఝాన్సీ కొప్పిశెట్టి

Dr KLV Prasad Stories

సామజిక బాధ్యతతో అందించిన డా.కె.ఎల్.వి.ప్రసాద్.కథలు...!!

“రవి గాంచని చోట కవి గాంచున్..” అన్నది అనాదిగా మనం వింటున్న సూక్తి. డాక్టర్ కె ఎల్వీ ప్రసాద్ గారి ఈ కథా సంపుటిలో వైవిధ్య భరితమైన విషయాల పైన వారు రాసిన విభిన్నమైన కథలు చదివాక నాకెందుకో ప్రాస కోసం ‘కవి’ అన్నారే తప్ప నిజానికి రచయిత కూడా ఏ జీవిలోకి అయినా, ఏ మనసు మూలలకైనా చొచ్చుకుని పోయి, పరకాయ ప్రవేశం చేసి పాత్రలను సజీవంగా సృష్టించగలడని అర్ధమయ్యింది.  డాక్టర్ కె ఎల్వీ ప్రసాద్ గారు తన తొలి కథా సంపుటి ‘కె ఎల్వీ కథలు’ తన జీవిత భాగస్వామి,  అర్ధాంగి శ్రీమతి అరుణ గారికి అంకితమిస్తే, మలి కథా సంపుటి ‘హగ్ మీ క్విక్’ ను తన సోదరుడు కానేటి మధుసూదన్ గారికి అంకితమిచ్చారు. డాక్టరు గారు “దంతాలు...ఆరోగ్యం” అనే దంత ఆరోగ్య నిఘంటువు లాంటి పుస్తకాన్ని రచించి, వారి జీవితాన్ని తీర్చి దిద్దిన సోదరుడు కె కె మీనన్ దంపతులకు  అంకితమిచ్చారు. అక్క స్వర్గీయ కానేటి మహానీయమ్మ గారి స్మృతిలో “విషాద మహనీయం” రచించారు. వారి చిన్నక్క భారతి గారికి కథా సంపుటి “అస్త్రం” అంకితమిచ్చారు. వారి ఏకైక మనుమరాలు ఆన్షి తొలి పుట్టినరోజున వెల కట్టలేని “పనస తొనలు” ఆవిష్కరించి చిన్నారికి అంకితo చేసి తాతగారి ప్రేమను ప్రకటించుకున్నారు. ఈ మధ్యనే “చిలక పలుకులు” అనే బాల గేయాలను ఆవిష్కరించి వారి సుపుత్రుడు శ్రీ కానేటి రాహుల్ కి అంకితమిచ్చారు. నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తుతూ ఈ కథా సంపుటిని వారి అత్తగారు అమృత మూర్తయిన పూర్వసువాసిని పద్మగారికి అంకితం చేస్తున్నారు. వారి సాహిత్య ప్రస్థానoలో ప్రతీ రచనను ఆత్మీయులకు అంకితమిచ్చిన విధానం వారిలో వున్న కుటుంబాపేక్షకు  సాక్షీభూతం.

చాలా కుటుంబాల్లో తోడ బుట్టిన వారి మధ్య అరుదుగా కనిపించే  ఆత్మీయతానురాగాలు డాక్టరు గారిలో సమృద్దిగా వున్నాయి. వారు  కుటుంబ బంధాలకు, మానవతా విలువలకు పెద్ద పీట వేస్తారని అర్థమవుతోంది. అంతే కాకుండా వారి రచనలు వ్యక్తి చైతన్యానికి, సమాజాభ్యుదయానికి అవసరమైన, ఆరోగ్యకరమైన సందేశాలు  కూడా అందించటం విశేషం. ఈ కథా సంపుటిలో మొత్తం పదకొండు కథలు వున్నాయి. కథలన్నీ వారి జీవితాధ్యయనంలో నుండి మధించి తోడిన సంఘటనలే. లోతుగా గమనిస్తే ఈ కథలన్నింటిలో వారిలోని సున్నిత హృదయం, సంస్కార పరిణితి, మానవతా విలువలెరిగిన ఉన్నతమైన వారి వ్యక్తిత్వము, సమకాలీన సమస్యల పైన వారికున్న అవగాహన, సామాజిక బాధ్యతగా వారు ఇచ్చే కనిపించీ కనిపించని చిన్న సందేశము ద్యోతకమవుతాయి.

మొదటి కథ “నాన్నా, పెళ్ళి చేయవూ” లో రాఘవ రావు ఎంతో ప్రేమ శీలి, సౌమ్యుడు అయినప్పటికీ నరనరాల్లో జీర్ణించుకు పోయిన పురా భావాల నుండి బయటపడలేక కుటుంబాన్ని క్షోభ పెట్టే పురుషుడు అతనిలో మనకు దర్శనమిస్తాడు. ప్రపంచం ఎంత పురోగతి సాధించినా, స్త్రీలు ఎన్ని విద్యలు నేర్చినా, ఎన్ని ఉన్నత పదవులను అధిరోహించినా, ఉద్యోగం కేవలం పురుష లక్షణం మాత్రమేనని, స్త్రీలు నాలుగు గోడల మధ్యే వుండాలని, పది మందిలోకి వెళ్ళి ఉద్యోగాలు చేసి ఊళ్ళు ఏలక్కర లేదనే ఛాందస భావాలు గల పురుషుడిని అతనిలో చూస్తాము. మారిన కాలంలో  వేడి నీళ్ళకు చన్నీళ్ళు తోడయితే ఎంత సౌకర్యమో గ్రహించలేక, చదువుకున్న భార్యను, ఆడపిల్లలను పరదా మాటున వుంచి కాచుకునే మగ అహంకారం గల మగాడిని చూస్తాము. అతని మస్తిష్కంలో పాతుకు పోయిన తుచ్చమైన (భార్యా పిల్లలను ఎవరూ చూడకూడదనే స్వార్ధపు ఆలోచన) ఆలోచనల కారణంగా ఈడొచ్చిన ఆడపిల్ల కన్యగా ముదిరిపోవటం, భార్య సాహసించి చెప్పలేని విషయాన్ని కూతురు తెగించి ఉత్తరం రూపేణా వ్యక్త పరచటం, డాక్టరుగారు నొప్పించక తానొవ్వక.. పద్దతిలో  చాలా సరళంగా మృదువుగా సాత్వికoగా పాత్రోచితంగా దృశ్యీకరించారు. ఈ కథలో మచ్చుకైనా పరుష వాక్కులు లేని వినయ విధేయతలు, కుటుంబ విలువలు, నేటి కాలానుగుణంగా మారాల్సిన మగాడి ఆలోచనలు, ఎదిగిన ఆడపిల్లకు కావలసిన అణకువతో కూడిన తెగువ కనిపిస్తాయి. ఈ కథ ప్రతి మనిషి జీవన శైలిలో అనుసరించాల్సిన పాఠాలు చెబుతుంది. కథా సంపుటికి ఈ కథా శీర్షికనే శీర్షికగా పెట్టటంలోనే ఈ కథ విలువ అర్థమవుతుంది.

“అవ్వ మనసు” కథ, వృద్దాప్యం మీద పడినా, పేదరికం పరీక్షిస్తున్నా, కోవిడ్ చావు గంటలు మ్రోగిస్తున్నా ఒక ముదుసలి అవ్వ తల వంచని ఆత్మాభిమానాన్ని వ్యక్త పరిచే చిన్న కథానిక. ఎన్ని చదువుసంధ్యలున్నా, ఆస్తిపాస్తులున్నా ఆత్మాభిమానం లేని వ్యక్తికి విలువ వుండదు అనే నీతిని పరోక్షంగా ఈ కథ చాటుతుంది.

“అందుకే అలా..” చదువుతుంటే నాకు డాక్టరుగారి కుటుంబం కళ్ళ ముందు మెదిలింది. బహూశా కథనం ఆత్మాశ్రయ రీతిలో ఉత్తమ పురుషలో సాగటం కూడా అందుకు దోహదమయ్యింది.  రచయితకు ఉత్తరాల పైనున్న మమకారం, కాల గమనంలో ఉత్తరాలు మరుగున పడిపోవటంతో కలిగిన దుఃఖం, అదే సమయంలో కో ఇన్సిడెంటల్ గా కుమారుని నుండి ఉత్తరం రావటం, మన సమాజంలో పాతుకు పోయిన కులమత వివక్షల పైన, పేద ధనిక వైరమ్యాల పైన పుత్రుడు వ్యక్త పరిచిన ఉదాత్తమైన ఆలోచనలు... మొత్తంగా పాత్రల చిత్రణ, సంఘటనల సన్నివేశాల రూపకల్పన, చాలా హృద్యంగా సాగింది ఇందులో కథనం.

“అపరిచితుడు” స్పష్టంగా డాక్టరుగారి అనుభవమేనని తెలుస్తోంది. ఇది ముక్కూ మొహం తెలియని అపరిచితుల మాయలో పడిపోకుండా పాఠకులు ఒక పాఠంగా స్వీకరించాల్సిన సామాజిక కథ.

డాక్టరు గారు “తొందర”, “తికమక” అనే కథలతో వారు హాస్య కథలు కూడా చమత్కారంగా రాయగలరని నిరూపించుకున్నారు. “మరుపు” చాలా సహజ సిద్ధంగా పెన్షనర్ల మనఃస్థితిని దృశ్యమానం చేసిన కథ.  దంపతులు రాఘవయ్య విశాలమ్మల మధ్య ఆ కొద్ది కథా సమయంలో సాగిన ప్రేమపూరిత సంభాషణలు చాలా ఆర్ద్రుతతో కూడి పాఠకుడిని పాత్రలతో సమైఖ్యo చేసి విచలితుడిని చేస్తాయి. ఈ కథ ప్రతీ నెలా వచ్చే పెన్షను ఏ కారణం చేతనయినా ఒక నెల ఆగిపోతే సాధారణ మధ్య తరగతి కుటుంబాల్లో వచ్చే సునామీల పరిష్కారాలు, పరిణామాలు ఎంత భయవిహ్వలను చేస్తాయో కూలంకుషంగా నిజాయితీగా విశదీకరిస్తుంది.

“నిజాయితీ” చదివి నేను కొద్ది సేపు స్తబ్దుగా వుండిపోయాను. శీలానికి విలువ ఇవ్వని ఈ నవ తరంలో మనో చాపల్యంతో ఇలాంటి సంఘటనలు జరగవచ్చునేమో కాని ఎందుచేతనో ఈ కథ నాకు జీర్ణం కాక క్షోభ పెట్టింది. నిజాయితీకి దూరమయిన, అవిశ్వాసానికి ప్రతీక అయిన ఈ కథకు డాక్టరుగారు ‘నిజాయితీ’ అని పేరు పెట్టటం చిత్రంగా అనిపించింది. ఒకవేళ వ్యతిరేకార్ధంలో వ్యంగ్యంగా “నిజాయితీ” అని పెట్టి వుంటే వారికి పాదాభివందనం. అలా కాకుండా మణి అశ్వనిల మానసిక దౌర్బల్యం, ఆ పైన వారిరువురి మధ్య దృశ్యీకరించిన సన్నివేశం తరువాత కూడా వారిద్దరు నిజాయితీపరులు అనుకుంటే మాత్రం నేను వారితో ఏకీభవించలేను. ఈ కథలో కేవలం అశ్వని ఆఖరి క్షణంలో కాదనటం వలన ఆగిపోయిన అక్రమ స్నేహానికి, మణి తన భార్య ముందు గిల్టీగా ఫీలవ్వటంలో అర్ధం లేదు. స్వల్ప ప్రయోజనాల కోసం భర్తను మోసం చేయలేను...బ్లా... బ్లా..అంటూ అశ్వని మెసేజ్ చాలా అర్ధరహితంగా, ఆమె చవకబారుతనం మరింత స్పష్టం చేసేట్టుగా వుంది. ప్రయోజనం భారీగా వుంటే శీలాన్ని పణంగా పెట్టవచ్చుననే అర్ధం వచ్చే విధంగా వినిపిస్తుంది. అనుకోని దుర్నిముషాన ఉద్రేకంలో జరిగిన పొరపాటుగా కాకుండా, ఇద్దరూ వెల్ ప్లాన్డ్ గా కలవాలను కోవటం, వారి మానసిక స్థితి, పాత్రల మధ్య సంభాషణ అనౌచిత్యంగా వున్నాయి. పాత్రల చిత్రణలో లోపం వుంది. పాత్రల పట్ల ప్రేమ,  దయ కలగక పోగా వాటిపై గౌరవం సడలిపోతుంది. ఈ కథలోని శృంగార వర్ణన కూడా డాక్టరు గారి కలానికి నప్పలేదు. పైగా ఈ కథను odd out లా మిగిలిన కథల మధ్య నుండి వేరు చేసింది. ఈ కథ నేటి సమాజంలోని విపరీత ధోరణిని, నేటి తరంలో ప్రబలుతున్న అవాంఛనీయ పోకడలను హెచ్చరిస్తూ సందేశాన్ని అందచేసింది.

“ప్రతిధ్వని” ఈ కథా సంపుటిలో నాకు బాగా నచ్చిన కథ. పాత్రల చిత్రణ, కథాగమనం, సందేశం అన్నీ అద్భుతంగా పొసిగాయి. సోషల్ మీడియాలో ఎందరో స్త్రీలు ఈ కాలంలో కథలు, కవితలు రాసి పోస్ట్ చేస్తూ స్నేహితుల జాబితా పెంచుకుంటున్నారు. వారికి వచ్చే లైకులు, కమెంట్లు చూసి ఏదో సాధించేసామనే భ్రమలో అపరిచితులతో గురువుగారని, అన్నయ్యని, బాబాయని వరుసలు కలుపుకుంటున్నారు. అది అవకాశంగా హద్దులు మీరుతున్న ఆగంతకులను  అదుపు చేయలేక, పెడదోవ పడుతున్న పడతులకు ఈ కథ గొప్ప కనువిప్పు. గనిరాజు సుందరిల పాత్ర చిత్రణ, సంభాషణలు అద్భుతం. గనిరాజు వ్యక్తిత్వం పైన గౌరవాభిమానాలు, నలుగురు పిల్లల తల్లయిన సుందరి పసితనం, అమాయకత్వం మీద జాలి, ప్రేమ కలుగుతాయి. This story is the need of the hour.  కథ ముగింపులో, జరిగిన సంఘటనను ఒక కలగా చెప్పటం, కలయినప్పటికీ జ్ఞానోదయం కలిగిన సుందరి మొబైల్లో అనవసర ఖాతాలన్నీ డిలీట్ చేయటం బావుంది.

“దిలాసా”  కథను డాక్టరుగారు అందంగా గాఢంగా తీర్చి దిద్దారు. ఎన్ని చట్టాలు వచ్చినా, వైవాహిక బంధాలు ఎంత పురోగతి సాధించినా ఇప్పటికీ కొన్ని ఇళ్ళల్లో శ్రవణ్ లాంటి పితృస్వామ్య భావాల పురుషాహంకార భర్తలను చూస్తూంటాము. వైవాహిక బంధాలు సాధారణంగా రెండు రకాలుగా కనబడుతూంటాయి. వివాహబంధం వయసు పెరిగే కొద్దీ ప్రేమ చిక్కబడుతూ అనుబంధం గట్టిబడేవి కొన్నయితే, తొలి రోజుల్లో కొత్త మోజుతో ప్రేమగా వుంటూ, రాను రాను ప్రేమ బిగుతు సడలి బంధం సన్నగిల్లేవి మరికొన్ని. కొన్ని సందర్భాల్లో స్వార్ధంతోనో, అవసరాలకో, వయసుడిగిపోయే కొద్దీ రెండో రకం భర్తలు మొదటి రకంగా మారతారు.  దిలాసాలో శ్రవణ్ రెండో కోవకు చెందిన భర్త. భార్య ప్రేమను, అణకువను, ఓర్పును, సహనాన్ని, సేవలను అర్ధం చేసుకోకపోగా మాటలతో హింసించి బాధ పెడతాడు. స్త్రీ ఎంత సహనశీలి అయినా భూదేవి అంత ఓర్పు గలదయినా ఆమె సహనానికీ ఒక హద్దు వుంటుంది. ఈ కథ చివరలో శుభ శ్రవణ్ కి తెరుకోలేని షాక్ ఇచ్చి మంచి గుణపాఠం చెప్పింది. పరోక్షంగా ఈ కథ కట్టుకున్న భార్య అయినప్పటికీ పురుషాహంకారాన్ని ఎదిరించాలని, జీవితమంతా పడి వుండాల్సిన అవసరం లేదనే సందేశాన్ని అందచేస్తోంది.

డాక్టరుగారు ‘గల్పిక’ అంటూ చిక్కగా చక్కగా రచించిన కథ “అద్దం చెప్పని అందం”లో  పురుషులు ఆడపిల్ల నవ్వును ఎలా అపార్దo చేసుకుంటారో, అది ఎటు దారి తీస్తుందో  రమ్యంగా చెప్పిన వైనం బావుంది. ముఖ్యంగా మన దేశంలో స్త్రీ పురుషుని చూసి పలకరింపుగా నవ్వినా, నవ్వుతూ పలకరించినా సదరు పురుషుడు అపార్థం చేసుకోవటం ఖాయం. బహూశా ఇలాంటి అపార్థాలకు తావీయకూడదనేనేమో మన పెద్దలు ఇప్పటికీ ఆడపిల్లలకు తల వంచుకునే నడవాలని, బాహాటంగా నవ్వకూడదని బోధిస్తూంటారు. తనను చూసినప్పుడల్లా చిరునవ్వు చిందించే సౌందర్యను కృష్ణ మగబుద్దితో అపార్థం చేసుకుని ఏవేవో ఊహించుకుంటాడు. చివరకు సౌందర్య “అన్నయ్యా..” అన్న పిలుపుతో ఖంగు తింటాడు. ఈ కథ ఎప్పుడో పాతికేళ్ళ క్రితం నేను రాసిన ఓ కథను గుర్తు చేసింది. నేను ఇలాంటి ఒక కథలో ఏవేవో ఊహలతో వచ్చిన అబ్బాయికి చివరలో అమ్మాయితో రాఖీ కట్టించి షాకు ఇప్పించాను.

ఈ కథాసంపుటిలోని మొత్తం పదకొండు కథలు మానవ పార్స్వాలన్నీ స్పృశిస్తూ, మనిషి జీవిత కోణాలన్నింటినీ చూపిస్తూ కథానుసారంగా సందేశాన్ని ఇస్తున్నాయి. డాక్టరు గారు మరిన్ని మంచి కథలు రాసి మరో సంపుటితో త్వరలో మన ముందుకు రావాలని, ఆ పుస్తకాన్ని వారి కుమార్తె  చిరంజీవి నీహారకి అంకితమివ్వాలని మనసారా కోరుకుంటున్నాను.

శ్రీమతి .ఝాన్సీ కొప్పిశెట్టి
కవయిత్రి, నవలారచయిత్రి,
ఆష్ట్రేలియా.