పంచతంత్ర కథలు కేవలం పిల్లలకు నీతులు నేర్పడానికే కాదు, జీవితంలో ఎంతో అనుభవం సంపాదించిన పెద్దలకు కూడా ఎన్నో విషయాలు నేర్పుతాయి. దాదాపు 3000 సంవత్సరాల క్రితం రాసిన ఈ కథలు ఇప్పటికీ ఎంతో ఆచరణాత్మకంగా ఉన్నాయి. ఈరోజు మనం ఒక చిన్న కథ ద్వారాఎవరినీ తక్కువగా అంచనా వేయకూడదని, బలహీనులు కూడా ధైర్యంతో, ఐకమత్యంతో ఎలా శక్తిమంతులను ఎదుర్కోగలరో తెలుసుకుందాం.
సముద్ర తీరంలో ఒక టిట్టిభ పక్షుల జంట ఉండేది. ఆడ పక్షి గుడ్లు పెట్టడానికి సిద్ధపడుతోంది. అప్పుడు అది మగ పక్షితో, "ప్రియుడా, గుడ్లు పెట్టడానికి ఈ సముద్ర తీరం సురక్షితం కాదు. వేరే సురక్షితమైన చోటు చూడు" అని చెప్పింది. కానీ మగ పక్షి తన అహంకారంతో, "ఈ సముద్రానికి నా పిల్లలకు హాని కలిగించేంత ధైర్యం లేదు. నువ్వు భయపడకుండా ఇక్కడే గుడ్లు పెట్టు" అని చెప్పింది.
సముద్రం ఈ మాటలు విని, ఆ చిన్న పక్షి అహంకారాన్ని చూసి కోపంతో, వాటికి గుణపాఠం నేర్పాలని నిర్ణయించుకుంది. పక్షులు ఆహారం కోసం వెళ్ళిన సమయంలో, సముద్రం పెద్ద అలలతో వచ్చి, టిట్టిభ పక్షుల గుడ్లను తీసుకుపోయింది. గుడ్లు పోవడం చూసి, మగ పక్షి సముద్రంపై కోపంతో, తన ముక్కుతో సముద్రం నీటిని మొత్తం తాగేస్తానని శపథం చేసింది. పక్షుల రాజు గరుత్మంతుడు ఈ విషయం విని, వాటి ధైర్యాన్ని చూసి ఆకట్టుకున్నాడు. అతను సముద్రానికి వెళ్లి, గుడ్లను తిరిగి ఇవ్వమని హెచ్చరించాడు.గరుత్మంతుని కోపాన్ని చూసి సముద్రం భయపడి, గుడ్లను తిరిగి ఇచ్చేసింది.
నీతిశాస్త్రం
ఈ కథలోని నీతి ఏమిటంటే - చిన్నవారిని, బలహీనులను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. ధైర్యం, పట్టుదల, ఐకమత్యంతో ఎంతటి శక్తివంతమైన శత్రువునైనా ఎదుర్కోవచ్చు.
కార్పొరేట్ ప్రపంచంలో ఈ నీతి ఎంత ముఖ్యం?
- జూనియర్ ఉద్యోగులు: ఆఫీసులో జూనియర్ ఉద్యోగులను వారి హోదాను బట్టి తక్కువ అంచనా వేయకూడదు. వారికి మంచి ఆలోచనలు, సృజనాత్మకత ఉండవచ్చు.
- టీమ్ వర్క్: ఒక సమస్యను పరిష్కరించడానికి లేదా ఒక లక్ష్యాన్ని సాధించడానికి టీమ్ వర్క్ చాలా ముఖ్యం. బలహీనులు కూడా ఐకమత్యంతో శక్తివంతమైన వారిని ఎదుర్కోగలరు.
- కొత్త ఆలోచనలకు విలువివ్వడం: ఒక కొత్త ప్రాజెక్టు లేదా ఆలోచన చిన్నదిగా అనిపించినా, దాన్ని తక్కువ అంచనా వేయకూడదు. అదే పెద్ద విజయానికి కారణం అవ్వచ్చు.
వ్యక్తిగత జీవితంలో ఒక ఉదాహరణ:
సమాజంలో చిన్నవాళ్ళని, డబ్బు లేని వాళ్ళని తక్కువగా చూడకూడదు. వారికి కూడా సహాయం చేసే శక్తి ఉంటుంది. కష్ట సమయాల్లో మన పక్కన నిలబడేది వారే కావచ్చు. అలాగే, మన జీవితంలో చిన్న లక్ష్యాలను కూడా తక్కువ అంచనా వేయకుండా, వాటిని సాధించడానికి పట్టుదలతో కృషి చేయాలి.
ఆ రోజు ఆ సముద్రం, "ఓహ్! ఆ చిన్న పక్షులేంటి, నన్నేమైనా చేస్తాయా!" అని అనుకుంది. కానీ ఆ పక్షుల ధైర్యం, గరుత్మంతుని సహాయంతో చివరికి ఆ సముద్రానికే భయం పుట్టింది. ఈరోజుల్లో ఆఫీసులో కూడా చాలామంది 'సముద్రం' లాగా ఉంటారు. తమ పదవి, అధికారం చూసుకుని ఇతరులను తక్కువగా చూస్తారు. కానీ గుర్తుంచుకోండి, ఆ చిన్న 'టిట్టిభ పక్షులు' కూడా కావాలంటే 'గరుత్మంతుని' సహాయంతో మీ 'సముద్రపు హద్దులు' దాటించగలరు. కాబట్టి, ఆఫీసులో అయినా, జీవితంలో అయినా... ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. లేకపోతే టిట్టిభ పక్షుల లాంటి వారు వచ్చి మీ గుడ్లను... సారీ, మీ అహంకారాన్ని చెల్లాచెదురు చేసే అవకాశాలున్నాయ్ కదా?

