స 'హితమేనా' - అరవ విస్సు

sahithamena

✒️ *స "హితమేనా ? "* ✒️ తెలుగునాట సాహిత్యం కొత్తపుంతలు తొక్కుతోంది. పలు కొత్త సాహితీసంస్థలు పుట్టుకొచ్చి తెలుగు సాహితీ సంపదను సుసంపన్నం చేస్తున్నాయి.సంతోషకరం. ప్రతీవ్యక్తి ఎంతోకొంత సాహిత్యాభిలాషను పెంచుకోవడం జరుగుతుంది. ఇది మంచి శుభపరిణామం. ఈ ఉత్సుకతను సమాజాభివృద్ది వైపు అడుగులు వేయించడం, మానవీయ కోణం వైపు చూసి, ఆచరించేలా కవులు,రచయితల ఆలోచనలు, ఆచరణ వుంటే మరో ప్రపంచం చూడవచ్చు . కానీ ఇటీవల కాలంలో పలు సాహితీ సంస్థలు నిర్వహించే కార్యక్రమాలు పలు విమర్శలకు దారితీస్తున్నాయి. వందలాదిమందిని ఒకే వేదికపై తీసుకురావడ కవిత చదవడం , వెంటనే శాలువా, జ్ఞాపికతో సన్మానం, ఒక ఫోటో....ఇలా ప్రహసనంలా సాగుతోంది. గమ్యం మంచిదైనప్పుడు గమనం కూడా అదేస్థాయిలో వుండాలికదా ! సన్మానాలపై మోజు,బిరుదుల పై ఆసక్తి ఇవన్నీ రాయాలనే ఆసక్తి- శక్తిని పెంపొందింపచేయడంలో క్రియాశీలకంగావుండాలి. సాహిత్యం అనుభవంలోంచి, పరిశీలనాదృక్పథం లోంచి, ఒక విషయాన్ని సృజనాత్మకతకోణంలో చూడడం, ఇతర ప్రముఖుల రచనలు చదవడం ఇవన్నీ సాహిత్యంలో గీటురాయిగా మారడానికి పునాదిరాళ్ళు. ఇవేమి లేకుండా కొందరు "కత్తిరింపుకవులు " రకరకాల సామాజిక మాధ్యమాలలోను, పుస్తకాలలోను చదివినవి, అక్కడక్కడ కొన్ని పదాలను అతికించి , తమ స్వీయకవిత అని సభల్లో చదవడం, ప్రేక్షకులచేత చప్పట్లు కొట్టించుకోవడం ఇటీవల కాలం ప్రాచుర్యం పొందిన "సాహితీ చోరకళ " ఈ మధ్య కాలంలో జరిగిన సాహితీ సదస్సులో మా గురువు గారు శ్రీ "కొప్పర్తి " గారు రచించిన కవితలను చదివిన ఒక పెద్దాయనను అందరూ "వహ్వా ! అంటుంటే చిరునవ్వుతో వాటిని స్వీకరిస్తూ "ఇదినాసహజశైలి " అనే మేకపోతుగాంభీర్యం ప్రదర్శన. నేను ఆగలేక అన్నా "మా గురువుగారి కవిత కదా !" అన్నా . "ఆవిషయం నీకే తెలుసు నీలాంటివాళ్ళు ఒకరో ఇద్దరూ వుంటారు-ఐనా చెబుతున్నా మీ గురువుగారిదే! ఆయన సాహిత్యలౌక్యానికి ఏమనాలో నాకైతే తెలియలేదు. ఆస్తులేకాదు ఆలోచనలను తస్కరించేస్తున్నారు . సాహిత్యం రాయడమే కాదు వ్యక్తిగతజీవనంలో ప్రతిబింబించాలి. అప్పుడు అందరూ మనను ఆదర్శంగా తీసుకుంటారు.సాహిత్యం డ్రైనీజీలా పొంగకూడదు. రాయడం మంచి అలవాటే. చదవడం ఇంకామంచి అలవాటు. స్వంతంగా రచించే స్థాయికి వెళ్ళడం అనేది కృషితోనే సాధ్యం . గతంలో మహామహులు ఎన్నో పుస్తకాలను,ప్రబంధాలను,పురాణాలనూ రచించారంటే వారి కష్టంలో ఆవగింజంత కృషి మనం చేసినా మంచి కవి,రచయిత గా చాలామంది మనస్సులో ముద్రవేయవచ్చు. గతితప్పిన వారిని సద్గతి కి తీసుకురావడం- మంచి సమాజ నిర్మాణం లో అక్షరాలు ఎప్పుడూ ముందుండాలి . అక్షరాలు అచ్చోసివదిలిన ఆబోతులు కాదు.అక్షరాలు కామధేవునులు,కల్పవృక్షాలు. తెలుగు సాహిత్యాన్ని పరిపుష్ఠం చేయాలనీ , పొగడ్త పన్నీరు లాంటిదీ! వాసన చూడాలికాని, త్రాగకూడదు.మితిమీరిన గుర్తింపు కాంక్ష విషతుల్యం. నీ పయనం నువ్వు సరిగా సాగిస్తే ,నీవు కోరుకోకపోయినా నీ అర్హతకు కావాల్సిన అవార్డులు, రివార్డులు అన్నీ అవేవస్తాయి. మనకు అర్హతలేని అవార్డులు తీసుకుంటే ,మన ఇంట్లో వాటిని చూసినప్పుడు అవి వెక్కిరిస్తాయి. ఎవరి దుస్తుల్లో వాళ్ళు నగ్నంగా వున్నట్టే ,మనం ఏమిటో మనకు బాగా తెలుస్తుందీ! బాగా చదవాలనీ, బాగారాయాలనీ, కత్తిరింపుకవితలకు స్వస్తి పలకాలనీ కోరుతున్నాను. రచన: అరవ విస్సు ద్రాక్షారామ, శుభకృత్ ఉగాది.