అన్నలు మెచ్చారు - కొడాలి సీతారామా రావు

Annalu mechharu

ఆర్టీసీ కధలు 6

శివరాం మెకానికల్ ఫోర్ మన్ గా ఆర్మూర్ డిపోకి బదిలీ అయ్యాడు. చాలా మంది చెప్పారు ప్రమోషన్ వదులుకో లేదా వేరే ప్రాంతానికి ప్రయత్నం చేసుకో . ఆ ప్రాంతం నక్సల్స్ ప్రాంతం అని . ఐతే శివరాం ఆర్మూర్ వెళ్ళటానికే నిశ్చయించుకున్నాడు తన మీద తనకి నమ్మకంతో. శివరాం రిపోర్టు చేసినప్పుడు డిపో మేనేజరు గారు అతని గురించిన వివరాలు తెలుసుకుని డిపో పరిస్తితి వివరించారు. అప్పటికే ఆయన శివరాం గురించి తనకి తెలిసిన సహోద్యోగుల ద్వారా తెలుసుకున్నారు. అతని సామర్ధ్యం మీద నమ్మకం ఏర్పడింది. ఆయన చెప్పారు అంతకుముందు పనిచేసిన ఎం ఎఫ్ సమర్ధుడు కాకపోవటం, ఉద్యోగులతో సరిగా పనిచేయించలేకపోవటం గురించి చెప్పాడు.

చివరిగా చెప్పాడు ఈ ప్రాంతంలో నక్సల్స్ ప్రభావం వుంది. మన ఉద్యోగులలో కొందరికి వారితో పరిచయం వుండటమో, బంధుత్వమో వుంది. అందువల్ల దూకుడుగా కాక సామరస్యంగా వ్యవహరించమని. శివరాం చెప్పాడు ‘ముందు, వాహనాల పరిస్థితి గమనించి తగిన ఆలోచన చేసి మీతో చర్చించి తగు విధంగా దారిలో తేగలననుకుంటున్నా.మీ సలహాలు వుంటాయి కనుక సాధించగలమనుకుంటున్నా.’ డిపో మేనేజరు గారు అసిస్టెంట్ ఫోర్మన్ ని గేరేజి నించి పిలిపించి శివరాంని పరిచయం చేసి తీసుకువెళ్లమని చెప్పారు. అలా గేరేజీకి వచ్చిన శివరాం డ్యూటీలో వున్న కార్మికులకి తనని పరిచయం చేసుకున్నాడు. ‘మనందరం కలిసి కొన్నాళ్లు ఇక్కడ పనిచేస్తాము కనుక ఒక కుటుంబ సభ్యులుగా పనిచేద్దాం’ అన్నాడు. ఆ మాటలు చాలా మందికి నచ్చినట్టు కనపడ్డారు. ఆ రోజు బస్సుల నిజ స్థితి,స్టోర్లో వున్న స్పేర్స్ పొజిషన్ తెలుసుకున్నాడు. కావల్సిన వాటి వివరాలు ఇండెంట్ రాసి మరునాడు జోనల్ స్టోర్ నుంచి ప్రత్యేకంగా తీసుకు రమ్మన్నాడు. డిపో క్లర్కుని పిలిచి పనిముట్లకి సంబంధించిన స్టేట్మెంట్ వారం రోజుల్లో తయారు చేసి, పనికిరాని వాటిని జోనల్ స్టోర్ కి స్క్రాప్ గా పంపే ఏర్పాటు చేయాలి అన్నాడు. ఈ విషయాలన్నీ తన అసిస్టెంట్ ఫోర్మన్ తో చర్చించేడు. మీరు చాలా ఫాస్ట్ అన్నాడతను. మరునాడు కార్మికులందరూ పనిలోకి వెళ్ళే ముందు శివరాం రెండు నిమిషాలు మీతో మాట్లాడాలి అన్నాడు. ‘ నిన్నంతా మన బస్సుల పరిస్థితి చూశాను. ఈ పరిస్థితికి మీలో నైపుణ్యం లేకపోవటం కారణం అని అనుకోను. ఎందుకంటే మిమ్మలని ఎంపిక చేసేటప్పుడు అది గమనించే ఎంపిక చేస్తారు కనుక. సరిగా గైడ్ చేయకపోవటం వల్ల అనుకుంటున్నాను. మనం శ్రధ్ద్ధగా మూడు నెలలు ప్రతి రోజూ ఒక బస్సుని పూర్తిగా చెక్ చేసి కావలసిన స్పేర్స్ వేస్తే అన్నీ సరిగ్గా నడుస్తాయి. ఎక్కడా ఆగే పరిస్థితి రాదు. ఆ తరువాత మనం ఆడుతూ పాడుతూ పనిచేసుకోవచ్చు. దీనికి మీ అందరి సహకారం కావాలి. ప్రతి బస్సు మన సొంతం అనుకుని పనిచేద్దాం రేపటి నుంచి.మనకీ మంచి పేరు వస్తుంది ప్రజలలో, మన ఉన్నతాధికారుల్లో.’ వారిలో ఒకరు అన్నారు ‘ మేము టైం ప్రకారం పనిచేస్తాం. అంతకన్నా ఎక్కువ చేయం.’ ‘చాలు సరిగా సమయాన్ని వుపయోగించుకుంటే. మీ సమయం తరువాత ఒక్క నిమిషం కూడా పనిచేయనవసరం లేదు.’ శివరాం చెప్పాడు. వాళ్ళు పనిలోకి దిగారు కానీ వాళ్ళలో వాళ్ళు చర్చించుకుంటున్నారని తెలుస్తోంది.సాయంత్రం గేరేజి యూనియన్ నాయకుడంటూ ఒకతను వచ్చాడు. ‘మీరు మా మీద పని భారం పెంచితే మేము ధర్నాలు,ఆందోళనలు చేయవలసి వస్తుంది. అంతదాకా ఎందుకు మేము అన్నలకి చేపితే మీరే దారికి వస్తారు.’ శివరాం నవ్వుతూ అన్నాడు ‘ ఈ చర్యలు తీసుకునే ముందు ఒకసారి ఆలోచించండి. నేను చెప్పింది మన డిపో కోసమే. నేను ఏక్కడి నుంచో వచ్చాను. ఎన్నాళ్లు వుంటానో తెలియదు. కానీ మీరు ఇక్కడే వుంటారు. కనుక బస్సులు సరిగా తిరగకపోతే ప్రయాణీకుల్లో, అధికారుల్లో మన కార్మికుల పట్ల సద్భావం వుండదు.

‘ మరునాడు శివరాం రాత్రి ఇంట్లో వున్నప్పుడు తొమ్మిది గంటలకి నలుగురు వ్యక్తులు అతన్ని తీసుకువెళ్లారు. అతని భార్య పిల్లలు ఏడుస్తూ గోల పెడుతున్నా. శివరాం వాళ్ళకి ధైర్యం చెప్పి ఆగంతకులతో వెళ్ళాడు. వాళ్ళు కొంతదూరం జీపు మీద,చాలా దూరం కళ్ళకి గంతలు కట్టి నడిపించారు. తెల్లవారు ఝాముకి ఒక చోటికి చేరాక కళ్ళకి గంతలు తీశారు. చెట్టు కొమ్మలు విరిచి మొహం కడుక్కోమని,చిక్కటి టీ ఇచ్చారు. వాళ్ళ కమాండరు అక్కడే వున్నాడు. అతను అన్నాడు ‘ రెండురోజులు అవ్వకుండానే మా వాళ్ళని హింసలు పెడుతున్నావుట. మానుకో. ఇంతకు ముందు వాళ్లలా పనిచేసుకుని వెళ్లిపో. లేకపోతే ఇబ్బంది పడతావు.’ శివరాం ‘ మీరు ఈ అడవుల్లో కష్టపడేది ప్రజలకి మంచి జరగాలని. నేను చేస్తున్నదీ అదే. ఈ డిపో బస్సులు ఎక్కడంటే అక్కడ ఆగిపోతున్నాయి. దాని వల్ల ఇబ్బంది పడేది ప్రజలు.దానికి కారణం సరైన నిర్వహణ లేకపోవటం. అది చేద్దాం అన్నా. మూడు నెలలు కష్టపడితే ఆ తరువాత సాధారణ పనే వుంటుంది. ప్రజలలో,అధికారుల్లో పేరు వస్తుంది. ఆదాయం పెరుగుతుంది డిపోకి. నేను చెప్పింది తప్పనిపిస్తే మీ ఇష్టం.’ కమాండర్ కాసేపు ఆలోచించాడు. తన సహచరులతో మాట్లాడాడు. తరువాత శివరాం దగ్గిరకి వచ్చి. ‘మీ పని మీరు చేయండి. మా వాళ్ళకి చెప్తాను.’ ఆ పగలు అక్కడే వుంచి భోజనం ఏర్పాటు చేశాడు. చెట్టుకింద పడుకోమన్నాడు. కచీటి పడుతుండగా బయలుదేరి ఇంటికి దగ్గిరలో వదిలి వెళ్లిపోయారు. తెల్లారి డ్యూటీకి వచ్చేటప్పటికి అందరికీ సమాచారం అందినట్టుంది. అందరూ తమ తమ పనులను శ్రద్ధగా చేయటం గమనించాడు. ఆ రోజునించీ పూర్తి పని సమయం వుపయోగిస్తున్నారు. శివరాం కూడా వాళ్ళు భోజనం కోసం బయటికి వచ్చినపుడే ఇంటికి భోజనానికి వెళుతున్నాడు. వారికి అతని పట్ల గౌరవం పెరిగింది. మూడు నెలల తరువాత నిజంగానే వాళ్ళ పని తగ్గింది. ఫిర్యాదులు తగ్గాయి. డ్రైవర్లు సంతోషంగా వున్నారు. అనేక పెరామీటర్లలో ఇతర డిపోలతో పోటీ పడేలా వుంది. అనేక అవార్డులు రావటంతో పాటు, ఆర్మూర్ డిపో బస్సు అన్నా,కార్మికుడన్నా అందరిలో గౌరవం పెరిగింది. రెండేళ్ల తరువాత శివరాంకి బదిలీ అయినప్పుడు వాళ్ళందరూ బాధ పడ్డారు. ఆయనని ముందు ఆపార్ధం చేసుకున్నా ఆయన వల్ల ఎంతో మేలు జరిగింది అన్నారు. ఘనంగా వీడ్కోలు పలికారు. ఆ సభకి శివరాం భార్య పిల్లల్ని కూడా పిలిచారు.అందరికీ బహుమతులు అందించారు. శివరాం గుండె సంతోషంతో బరువెక్కింది. ప్రతి ఒక్కర్ని హత్తుకుని తన కృతజ్నతలు తెలియచేసి వీడ్కోలు తీసుకున్నాడు. అతని ఇంటి సామాను వాళ్ళే కట్టలు కట్టి డీజీటీ లో ఎక్కించారు. అలా అన్నల మనసు గెలిచిన మొనగాడు అయ్యాడు.

మరిన్ని కథలు

Aapada bandhuvu
ఆపదభంధువు
- కొడాలి సీతారామారావు
Antaa manchike
అంతా మంచికే
- కొడాలి సీతారామా రావు
Podupu baata
పొదుపు బాట.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Nyayam jarigindi
న్యాయం జరిగింది
- సి.హెచ్.ప్రతాప్
Grahanam pattina chandrudu
గ్రహణం పట్టిన చంద్రుడు
- డా. సి.యస్.జి. కృష్ణమాచార్యులు
Ante..Nenu?
అంటే!... నేను!?.
- రాము కోలా. దెందుకూరు
Prajaswamyanike naa Otu
ప్రజాస్వామ్యానికే నా ఓటు
- రాపాక కామేశ్వర రావు
Srivarante maavare
శ్రీవారంటే మా వారే
- సి.హెచ్.ప్రతాప్