సున్నితం చంద్రికలు - రాము కోలా.దెందుకూరు.

సున్నితం చంద్రికలు

✍️ పుస్తక సమిక్ష ✍️ //అనేక అంశాల మేళవింపు సున్నితం చంద్రికలు// తెలుగు సాహిత్య వనంలో విరిసిన అక్షర కాంతుల వెలుగులు- *సున్నితం చంద్రికలు* చంద్రికలు అంటేనే సుగంధ భరితమైన లేదా పౌర్ణమి నాడు వచ్చే వెన్నెల అనే అర్థం వస్తుంది అనుకుంటాను. పుస్తక ముఖచిత్రం అదే భావాన్ని తనలో నింపుకున్నట్లు కనిపిస్తుంది. చల్లని వెన్నెల వేళ విరిసిన సుమపరిమళం,నింగి వైపు సాగుతున్నట్లు...వెన్నెల చిరుజల్లులు సుమాన్ని అభిషేకిస్తున్నట్లు..... కవయిత్రి మనోభావాలకు దర్పణం ముఖచిత్రం అనిపిస్తుంది. సాహిత్య ప్రియులకు, ముఖపుస్తక కవులకు/కవయిత్రులకు సోదరి దీకొండ చంద్రకళ పేరు కొత్తగా పరిచయం చేయవల్సిన అవసరం లేదు. కారణం వివిధరకాల సాహిత్య సంస్థలు నిర్వహించే పోటీల విభాగంలో ప్రతినిత్యం విజేతగా నిలుస్తూ పురస్కారాలు అందుకుంటూ ఎందరో వర్ధమాన కవులకు, కవయిత్రులకు ప్రేరణగా కనిపిస్తుంటారు కనుక. //"సున్నితం చంద్రికలు"తెలుగు సాహిత్య రంగంలో నూతన ప్రక్రియలో వెలువడిన తొలి కవితా సంకలనం // వేమన శతకం లోని పద్యాలను ఎంతగా ఆస్వాదిస్తామో,ఈ సున్నితం చంద్రికలను అలాగే ఆస్వాదించగలం. నూతన ప్రక్రియలో వెలువడిన సంకలనంలో, విభిన్నమైన నలభై అంశాలను తీసుకుని సున్నితాలను రచించడం వారిలోని సాహిత్యాభిలాషను తెలియచేస్తుంది. తల్లి ప్రేమగా ఉగ్గు పాలతోనే తన బిడ్డకు తెలుగు భాషలోని స్పష్టత, నేర్పు, భావం, కూర్పు నేర్పుతుంది.అందువలననే ఎందరో కవులు,కవయిత్రులు, తెలుగు సాహిత్య రంగంలో తమ ఉనికిని చాటుకుంటున్నారు. ఎందరో మహనీయులు, కవులు, కవయిత్రులు మన తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను చాటిచెప్పారు.అటువంటి మరో ప్రయత్నం చేసారు దీకొండ చంద్రకళ గారు. "తెలుగు సాహిత్య రంగంలో తమ ప్రతిభను చాటుకుంటున్న దీకొండ చంద్రకళ గారి సున్నితాలను ఒక్క సారి పలకరించేద్దాం పదండి... ఎక్కడ మనసుకు నిర్బయత్వమో ఎక్కడ జ్ఞానం వెల్లివిరుస్తుందో అదే రవీంద్రవిరచిత స్వేచ్ఛాస్వర్గం చూడచక్కని తెలుగు సున్నితంబు... అంటూ ఎందరో కవులకు , ప్రేరణగా నిలిచిన గీతాంజలి కావ్య సృష్టికర్త , రవీంద్రనాథ్ ఠాగూర్ ను తమ సున్నితం ప్రక్రియలో అలా కీర్తించారు..... కన్యాశుల్కంపై శివమెత్తిన గురజాడ దేశమంటే మట్టికాదని చాటెను లోకమందు రెండే కులములనెను చూడచక్కని తెలుగు సున్నితంబు.. అంటూ సంఘసంస్కర్త గురజాడ స్త్రీ జనోద్ధరణకు జరిపిన కృషిని తెలియచేసారు...... నేనుసైతం అంటూ విప్లవించిన సమసమాజ సంస్థాపన ప్రవక్త అభ్యుదయ కవితాయుగ ప్రయోక్త చూడచక్కని తెలుగు సున్నితంబు... అంటూ విప్లవ సాహిత్యంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన మహా కవి శ్రీశ్రీ లోని విప్లవ కవిని వివరించారు. దివాళా అంచునున్న ఆర్థికవ్యవస్థను ప్రగతి పట్టాలెక్కించిన ఘనుడు నేటిభారతం ఠీవి పీవి చూడచక్కని తెలుగు సున్నితంబు.... అంటూ ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు,అపర చాణుక్యుడు అని పిలువబడే పివీ.నరసింహారావుగారిని కీర్తించారు. అదే విధంగా మౌనంగా పడివున్న మొండిరాళ్ళు కరిగి సప్తస్వరాలను మీటే శిల్పి రామప్ప హస్తనైపుణ్యంతో చూడచక్కని తెలుగు సున్నితంబు.. అంటూ కాకతీయ వంశస్తుల కాలంలో కళారంగం ఎంతగా అభివృద్ధి చెందిందో అందరికీ తెలుసు. అందుకు నిదర్శనంగా నిలిచిన రామప్ప వైభవాన్ని సున్నితంబుగా మలచారు. అపూర్వ మూర్తిమత్వ నిధి మన దేశానికి దొరికిన పెన్నిధి ప్రజాప్రసిడెంటై నిలిచిన దయానిధి చూడచక్కని తెలుగు సున్నితంబు.. అంటూ భారత దేశంను అంతరిక్ష పరిశోధనల్లో ప్రథమంగా నిలిపేందుకు కృషి చేసి భారత రాష్ట్ర పతిగా సేవలు అందించిన డాక్టర్ ఏ.పి.జే అబ్దల్ కలాం గారిని కవిత్వీకరించారు. వ్యక్తిగత శాంతే విశ్వశాంతి సానుకూల ప్రకంపనల శాంతి మంత్రం పాటించాలి ప్రపంచమంతా ఒక్కటై చూడచక్కని తెలుగు సున్నితంబు.. అని శాంతిని కాంక్షిస్తూ.. దేశ స్వాతంత్ర్యం కోసం నిర్విరామంగా తపించి, ఉప్పు సత్యాగ్రహం,విదేశీ వస్త్ర బహిష్కరణ నినాదంతో బ్రిటిష్ వారిని గడగడలాడించిన గాంధీ మహాత్ముని గురించి శాంతి ప్రవచనంలా సున్నితంబును అందించారు. జైజవాన్- జైకిసాన్ అనే నినాదంతో సంస్థానాల విలీనంలో ప్రముఖ పాత్ర వహించిన సర్ధార్ వల్లభాయ్ పటేల్ ను కీర్తిస్తూ... జనులను తన సాహిత్యంతో చైతన్య వంతులను చేస్తూ, నిజాం పాలనపై ప్రజలు తిరుగుబాటు చేసేలా సంసిద్ధం చేసిన డా.దాశరథి కృష్ణమాచార్య గారి సాహిత్యంను సున్నితంగా కవితలా మార్చుకుంటూ... వీర వనిత ,ఎందరో మహిళలు స్వాతంత్ర్యం సంగ్రామంలో భాగస్వామ్యులు కాగలిగేందుకు ప్రేరణగా నిలిచిన ఝాన్సీ లక్ష్మీబాయి ధైర్యసాహసాలను విజయగాథగా వినిపిస్తూ..... తన పాటల్తో పగలే వెన్నెలలో విహరించిన అనుభూతిని కలిగించేలా గీతాలను రచిస్తూ, నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అని సూటిగా ప్రశ్నించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి తన అక్షర సుమాలతో నీరాజనాలు అర్పిస్తూ.... ఇలా అనేక రంగాల్లో నిష్ణాతులైన వారిని తన సున్నితాల్లో అద్భుతంగా ఆవిష్కరించిన ఘనత సోదరి దీకొండ చంద్రకళ గారిదే అని చెప్పక తప్పదు.ఇది అందరికీ సాధ్యం కాదు. తెలుగు భాష పట్ల తమకు ఉన్న మక్కువను కూడా ఇలా సున్నితం అనే ప్రక్రియలో పొందు పరిచారో చూడండి అమ్మ పాలలా కమ్మనైన భాష పొరుగు రాజులు మెచ్చిన మెరుగు భాష ఆశుకవిత్వాల అవధానుల మేటి భాష చూడచక్కని తెలుగు సున్నితంబు.. అంటూ తెలుగు భాష మాధుర్యాన్ని రుచి చూపించి... మూఢనమ్మకాలను ఖండిస్తూ... పౌష్టికాహారం ఆవశ్యకతను తెలియచేస్తూ.. రక్తదానంతో నలుగురి జీవితాలను కాపాడుమని హితవు పలుకుతూ... తెలంగాణ పండుగ బతుకమ్మ.. పూలతో దేవతలను కాక పూలనే దేవతలుగా కొలిచి పోషక నైవేద్యాలను నివేదింతురు.. అంటూ పండుగ పరమార్థం వివరిస్తూ.... ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది అనే విషయంను,మొక్కలను నాటుదాం అంటూ సున్నితంబుగా మలచి, అంగవైకల్యం నీగెలుపుకు అవరోధం కాకూడదు... గెలుపుతో దానిని జయించు .... అంటూ మంచిస్ఫూర్తిని అందించే సున్నితాలను అందించిన సోదరి దీకొండ చంద్రకళ గారి కలం నుండి జాలువారిన సున్నితం చంద్రికలు చదివి సోదరిని మనసారా దీవించండి...... //కవికి తరగని సంపద సాహిత్య సేవ మాత్రమే// //శుభం// రాము కోలా. దెందుకూరు ‌ ఖమ్మం.9849001201