
"అకాల మృత్యు హరణం సర్వ వ్యాధి నివారణం ...."
శ్రీమతి గంట మ్రోగిస్తూ వల్లిస్తున్న శ్లోకాలు గంట శబ్దాన్ని దాటి రాలేక పోతున్నాయి. ముక్కోటి దేవతలకు మొక్కడం అయిపోయినట్టుంది. చివరకు వాగించే గంట శబ్దానికి మెలకువ వచ్చింది నాకు.
ఇంతలో ఫోన్ మోగింది. అమ్మ దగ్గరినుండి.
"ఆ... అమ్మా! "
"బాగున్నావా నాన్నా? పిల్లలందరు క్షేమమే కదా?"
"అందరం బాగున్నామమ్మా, కాని, నీ గొంతు తేడాగా ఉందేమిటి?"
"ఏం లేదురా, రెండు రోజుల నుండి మన ఊరి పరిసరాల్లో పులి సంచరిస్తుందట. ఎవరికీ నిద్ర
పట్టడం లేదు. క్రిందటి వారం కంచిలి దగ్గర ఒక ఊరిలో పశువుల సాల లో దూరి ఒక ఆవుని చంపేసిందట."
"అయ్యో! అలాగా ..... జాగ్రత్తమ్మా! రేపే బయలుదేరి వస్తానమ్మా"
అమ్మ ఆ పల్లెటూల్లో ఒక్కతే ఉంటుంది. ఎంత చెప్పినా వినదు. "ఆ పట్టణాలలో నాకు ఊపిరాడదురా" అంటుంది. ఉద్యోగ రీత్యా విశాఖపట్నం వెళ్ళిన నేను ఆ తరువాత పిల్లల చదువుల కోసం అక్కడ ఉంటేనే మంచిది అని తలచి అక్కడే స్థిరపడిపోయాను. మొదట్లో రిటైరయిన తరువాత తిరిగి మా ఊరికి వెళ్ళిపోదామనుకున్నాను గాని ఇప్పుడు అక్కడికెళ్ళి ఉండలేనేమోనని ఆ ఆలోచనను విరమించుకున్నాను.
-----///-----
శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట నుండి కవిటి మీదుగ ఇఛ్చాపురం వరకు వెళ్ళే మార్గమంతా సముద్ర తీర ప్రాంతం. ఈ ప్రాంతం రోడ్డుకు ఇరువైపులా కొబ్బరి తోటలతో గోదావరి తీరప్రాంతమైన "కోనసీమ" ను తలపిస్తుంది
సోంపేటలో బస్సు ఎక్కిన తరువాత రెండు కిలో మీటర్ల దూరములో కవిటి వెళ్ళే రోడ్దులో రిక్వెస్ట్ స్టాప్ 'మండపల్లి'. రోడ్డు పాయింట్ నుండి లోపలికి నడక మార్గం చిన్న గోర్జి లాగ ఉంటుంది. ఇరువైపుల ఎత్తైన కొబ్బరి చెట్లు. ఎడ్ల బళ్ళు వెళ్ళడానికి వీలుగా చేసిన దారి. మా నాన్న గారు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునిగా ఆ ఊరువచ్చి అక్కడే స్థిర పడి పోయారు. నా బాల్యమంతా అక్కడే గడిచింది. ప్రాథమిక విద్య పూర్తైన తరువాత సోంపేట హై స్కూల్ లో చేరాను. అప్పుడు బస్సు సౌకర్యము అంతగా లేక పోవడం వలన మేము పొలాల గట్ల వెంబడి నడుచుకుంటు సోంపేట వెళ్ళే వాళ్ళం.
నాన్న గారు పోయాక అమ్మ ఒక్కతె ఆ ఊరిలో ఉంటుంది. అమ్మ నా దగ్గరికి ఎప్పుడు వచ్చినా రెండు మూడు రోజులకన్నా ఎక్కువ ఉండదు.
మరుసటి రోజు విశాఖపట్నం నుండి డైరెక్టుగా కవిటి వెళ్ళే బస్సు పట్టుకుని మా ఊరు వెళ్ళాను.
-----///-----
"అమ్మా, చిన్న మేస్టరు గారొచ్చారట" అని గోపాల్ అన్న మాటకి మెలకువ వచ్చింది. పల్లెటూరులో అందరు తెల్లవారుతుండగనే నిద్ర లేస్తారు. నాకు పట్నం అలవాట్లు వంటబట్టాయి. అందునా ముందు రోజు బస్సు ప్రయాణమాయె. బడలికతో కాస్త ఎక్కువ నిద్ర పోయాను.
నాన్నను 'మేస్టరుగారు' అన్న ఊరివాళ్ళందరికి నేను 'చిన్న మేస్టరు', అమ్మ 'మేస్టుగారమ్మ'
గోపాల్ ఆ ఊరి పశువుల కాపరి. ఊళ్ళో ప్రతి ఇంటికి కనీసం ఒక ఆవు ఉంటుంది. అవన్నీ గోపాల్ సంరక్షణలోనే ఉంటాయి.
"ఏం గోపాల్ బాగున్నావా?"
"అయ్యా బాగున్నానయ్యా, తమరి ఆరోగ్యం ఎలాగుంది? అమ్మగారు, పిల్లలు అంతా బాగున్నారా?"
"ఆ... అందరం బాగున్నాం"
"సరే మీరు మొకం కడుక్కొని కాపీలు తాగండయ్యా, రేతిరికి వస్తాను మాటలాడుదాం" అని వెళ్ళిపోయాడు గోపాల్
కాఫీ తాగిన తరువాత "అలా వెళ్ళొస్తానమ్మా" అని అమ్మకు చెప్పి బయటికొచ్చాను.
-----///-----
"దండాలయ్యా బాగున్నారా?" పక్కింటి వీరేశం పలకరింపు.
"ఆ ... ఆ... బాగున్నానండి మీరెలాగున్నారు?"
మరి కొద్ది దూరం వెళ్ళేటప్పటికి ఒక 'టీ' షాపు కనిపించింది. కొత్తగా వెలిసినట్టుంది. ఇప్పుడు టీ తాగేవారు పెరిగినట్టున్నారు. నా చిన్న తనములో టీ తక్కువ మంది తాగేవారు. అలాంటి వారు ఇళ్ళలోనే తయారు చేసుకునేవారు.
"బాబు, బాగున్నారా" అన్న మాటతో అటు తిరిగి చూసాను. వడ్రంగి వీరయ్య పలుకరింపు.
"ఆ ... బాగున్నాను వీరయ్య, మీరంతా క్షేమమేనా?"
ఊరిలో రైతులకు కావలసిన పనిముట్ల కర్మాగారం నడిపే ఏకైక వ్యక్తి వీరయ్య.
ఇలా దారి పొడుగునా ఆప్యాయతల వెల్లువ.
అంబా అంటూ ఆవులు, కొక్కొరొకో అంటు కోళ్ళు, ఊర పిచ్చుకల కిచ కిచ శబ్దాలు ఇవన్నీ నాకు పాత అనుభవాలే అయినా, చాలా రోజుల తరువాత మళ్ళీ అందులోని మాధుర్యాన్ని కొత్తగా ఆస్వాదిస్తున్న ఆనందం మనసును ఆహ్లాద పరచింది.
ఊరి చివరిలో ఉన్న పాఠశాలలో ఉదయానే ఒక యువకుడు కొంత మంది పిల్లలకు కోలాటం నేర్పిస్తున్న దృశ్యం చూసాను. "బృందావన మాలి రారా మాఇంటికి ఒక సారి..... " అన్న పాటకు పిల్లలతో లయబద్ధముగా అడుగులు వేయిస్తున్న ఆ దృశ్యం ఎంతో హాయి గొల్పింది. పిల్లలకు ఎండా కాలం సెలవులనుకుంటా, కొంత మంది పిల్లలు స్కూల్ గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతున్నారు. మా చిన్నప్పుడు అక్కడ "గిల్లి దండ" ఆడే వాళ్ళం.
తరువాత కోనేటి గట్టున నిలబడి చిన్నప్పటి లాగ చిల్లపెంకులు విసిరాను నీటిలోకి. అవి విసిరిన వెంటనే నీటిలో మునిగి పోకుండా, అంచెలంచెలుగా నీటిని తాకుకుంటు దూరముగా వెళ్ళాయి. చిన్న పిల్లాడిలా ఆనందించాను.
ఒడ్డునే ఉన్న శ్యామసుందర స్వామిని ఆలయం బయటనుండే నమస్కరించుకున్నాను, స్నానాదులు చెయ్యక పోవడం వలన.
కొబ్బరి తోటల మధ్య నడుచుకుంటు వెళ్తుండగా చిన్నప్పుడు నాతో టెంత్ వరకు చదివిన అప్పారావు కనిపించాడు.
"ఏం అప్పారావు బాగున్నావా?" అని అడిగాను
"ఆ... బాగున్నాను, నీవెలాగున్నావు?"
క్షేమ సమాచారాల పిదప, తను వేసిన "పొట్టి కొబ్బరి" వంగడాల గురించి వివరించాడు అప్పారావు.
తనకు ఒకే ఒక్క కూతురు. పెళ్ళి చేసి పంపించేసాడు. ఈ వయసులో తన కొబ్బరి తోటే తనకు ఆసరా అని చెప్పాడు.
"కొడుకు కన్నా కొబ్బరి మేలన్న" సామెతను మా ఊళ్ళో చాల మంది నమ్ముతారు.
దారిలో కొబ్బరి, జీడి,మామిడి చెట్ల మీద గంతులేస్తున్న ఉడుతలని చూస్తె నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. కోతి కొమ్మచ్చి ఆటలాడుతూ మేము కూడ అలా చెట్లెక్కి దూకేవాళ్ళం. ఇంకో వైపు నుండి పికిలి పిట్ట, నామాల పిట్టల అరుపులు ఎంతో ఆనందాన్నిచ్చాయి.
ఆహా!... మహాత్ముడు ఊరికే అనలేదు "మన దేశానికి పల్లెలే పట్టుగొమ్మలని" అనుకున్నాను. ఇన్నాళ్ళు నేనేమిటి మిస్ అయ్యానో అర్థమయింది.
-----///-----
గోర్జి మార్గం గుండా బస్సు పాయింట్ వరకు వెళ్ళాను.
ఎదురుగా రోడ్డుకు ఆవలి వైపున పెద్ద కొండ. మా ఊరి బస్సు స్టాప్ ఎదురుగా ఉన్న ఆ కొండని "గోవర్ధన కొండ" అనే వాళ్ళం. ఎందుకంటె మా గోపాల్ ఊరిలోని ఆవులన్నింటిని మేత కోసం ఆ కొండ పైకి తీసుకెళ్ళేవాడు.
కాని చుట్టు ప్రక్కల గ్రామాల వారు 'సూది కొండ' అనే వారు. కొండ త్రిభుజాకారం లో ఉండి, దాని శిఖరం ఎత్తుగా సూదిగా ఉంటుంది.
నాకు మాత్రం "అనకొండ" లా అనిపిస్తుంది. దానికి కారణం నలభయ్యేళ్ళ క్రితం జరిగిన సంఘటన. పల్లెటూరి జీవితం ఎంత ఆహ్లాదమో అంత బాధాకరం కూడ.
అప్పుడు నేను డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉన్నాను. గోపాల్ కొడుకు కృష్ణయ్యకప్పుడు పదేళ్ళు. ఊళ్ళో వారందరు కిష్టిగాడు అని పిలుస్తారు గాని నేను కృష్ణయ్యా అని పిలిచే వాడిని. చిన్నప్పటినుండి మా ఇంట్లో కలయ తిరుగుతూ, నాన్న గారికి చిన్న చిన్న పనుల్లో సాయం చేసేవాడు. నాన్న గారు ఆ ఊరి పిల్లలకు పాఠాలు చెబుతున్నంతసేపు ఆయన చెంతనే కూర్చుని శ్రద్ధగా వినేవాడు. అది గమనించిన నాన్న గారు గోపాల్ ను ఒప్పించి కృష్ణయ్యను స్కూల్ లో చేర్పించారు.
అయిదవ తరగతి పూర్తి చేసిన తరువాత సోంపేటలో హై స్కూల్ చదువులకు పంపించకుండా పశువుల కాపరిగా పంపించాడు కృష్ణయ్యని తండ్రి గోపాల్.
"అయ్యా, పెద్ద సదువులు నేను సదివించలేను. నాకు పనిలో సాయ పడతాడయ్యా" అని సాకు చెప్పాడు గోపాల్.
-----///-----
ఒక రోజు తెల్లవారి "అయ్యా నిన్నరేతిరి ఎలుగుబంటి మన తోటల కాడికొచ్చిందండి. ఒక ఆవు పెయ్యని సంపేసిందండి. పెద్ద ఆవుని సెట్టుకి కన్నెతో కట్టీసారు కాబట్టి అరిసింది గాని అది ఏమి సెయ్యలేక పోయింది" అని గోపాల్ నాన్న గారితో చెప్పడం తో అందరం కలసి చూడడానికి వెళ్ళాం.
"కొబ్బరి తోట మధ్యలో వేసే వేరుశనగ పంటను మరియు జీడి తోటలో జొరబడి జీడి పిక్కలను తినడానికి అలా ఎలుగుబంట్లు కొండ మీది నుండి దిగి ఊరి వైపొస్తాయని" తేల్చారు అక్కడ గుమిగూడిన వారందరు.
ఆ కొండని చూడ్డమే గాని పైకి ఎవరు వెళ్ళే వారు కాదు. చుట్టు ప్రక్కల ఊర్లనుండి పశుల కాపర్లు కూడ కొంతమేర పశువుల్ని తీసుకెళ్ళి, పచ్చిక బయళ్ళు, చిన్న చిన్న మొక్కలు ఉన్నచోట పశువుల్ని మేతకు ఆపేవారు.
అక్కడికి రెండు రోజుల తరువాత రాత్రి సమయములో సోంపేట నుండి కవిటి వైపు వెళ్తున్న ఒక కారు డ్రైవరుకు రోడ్డు క్రాస్ చేస్తున్న ఎలుగుబంటి పిల్లలతో కనబడిందట. దానితో కొండ మీద గుహలో ఎలుగు బంట్లు నివాసమున్నాయి అని రూఢి అయింది.
"ఊళ్ళో ఉన్న కొందరు యువకులు రాత్రి పూట కాగడాలు వెలిగించి బస్సు పాయింటుకు దగ్గర్లో ప్రదర్శనగా నిలబడండి కొన్ని రోజులు" అని ఒక పెద్దాయన సలహా ఇచ్చాడు. కాగడాలను చూసి ఎలుగుబంట్లు భయంతో రావని.
ఆయన చెప్పినట్లు చేసాం. కొన్నాళ్ళ వరకు ఎలుగుబంట్లు మా ఊరివైపు రాలేదు. కొండకు అటువైపు దిగుతున్నాయేమోనని అనుకున్నాం.
-----///-----
అటు పిమ్మట కొద్ది రోజులకే ఒక సాయంత్రం పశువుల్ని తిరిగి ఇళ్ళకు తోలుకొస్తున్న సమయములో ఒక పెయ్య కనబడలేదని దాన్ని వెతుక్కుంటు కొంత దూరం వెళ్ళాడు కృష్ణయ్య. అక్కడ పొద చాటున దాగి ఉన్న ఎలుగు, దూడపై దాడి చెయ్యగా, దాన్ని తన చేతి లోని కర్ర తో అదరగొట్టడానికి ప్రయత్నించాడు. అది తిరగబడి కృష్ణయ్య మొహం పై పంజా విసిరింది. ఆ దెబ్బకు కృష్ణయ్య కుడి కన్ను, చెంప, చెవి దెబ్బతిన్నాయి. అది గమనించిన గోపాల్ తన దగ్గరున్న దుడ్డుకర్రతో దాని మీద దాడి చెయ్యగా అది పారిపోయింది. గోపాల్ వేసిన కేకలకు ఆ సమయములో తోటల్లో ఉన్న కొంత మంది వెళ్ళారు. వారి సాయం తో కృష్ణయ్యను సోంపేట ఆసుపత్రికి తీసుకెళ్ళారు. నెల రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్న కృష్ణయ్య కొద్దిగా తేరుకున్నాడు.
కాని ఇంటికి చేరుకున్న కృష్ణయ్యని ఆ గాయాలు ఎక్కువ రోజులు బ్రతకనివ్వలేదు. ఊరంతా విషాదములో మునిగి పోయింది.
ఇప్పుడు మళ్ళీ పులి సంచరిస్తుందని అంటున్నారు. అంటె ఇప్పుడు ఈ "అనకొండ" పులికి కూడ స్థావరమయిందేమోనని అందరితో పాటు నేను అనుకుంటున్నాను.
-----///-----