ఉద్యమ నేపద్యం శ్రీ కె కె మీనన్ కథలు - పి. జ్యోతి

ఉద్యమ నేపద్యం శ్రీ కె కె మీనన్ కథలు

ఉద్యమ నేపద్యం శ్రీ కెకెమీనన్ కథలు....!! (సమీక్ష) -------------------------------- "ఇది స్ట్రీకింగ్ కాదు" అనే ఈ కథా సంపుటిలో మొత్తం 16 కథలున్నాయి. రచయిత కే.కే. మీనన్ గారి ఈ కథలన్నీ కూడా 1970 లలో వివిధ పత్రికలలో ప్రచురితమైన కథలు. సమాజంలోని బడుగు జీవుల జీవితాలను తన కథావస్తువుగా ఎంచుకుని వారి బాధను, ఆవేదనను, ఆక్రోశాన్ని తన కలం ద్వారా మన ముందుకు తెచ్చి. ఎన్నో ప్రశ్నలను సంధిస్తారు రచయిత. మనిషి మనిషిపై చేసే పెత్తనం, ఆర్ధిక అసమానతల కారణంగా సమాజంలో జనం కడగండ్లు, వీటి గురించి పోరాడాలనుకునే వ్యక్తుల పట్ల సమాజ వైఖరి, వీటన్నిటిని తన కథా వస్తువులుగా ఎంచుకుని సమాజంలోని అణిచివేతకు గురవుతున్న ప్రజల పక్షం వహించి రచయిత సమాజాన్ని ఆలోచించమని అడగడం కనపడుతుంది. వీరి కథలు చదువుతున్నప్పుడు చప్పున రావిశాస్త్రి గారి శైలి గుర్తుకు వస్తుంది. మీనన్ గారి శైలి రావి శాస్త్రి గారిలా మరీ అంత పదునుగా ఉండదు కాని వారి కధనం చాలా చోట్ల కనిపిస్తుంది. "మౌనరాగం" కథ ఒక ఉద్యమకారుడి జీవితం. అతని పోరాటాన్ని అర్ధం చేసుకుని తన కర్తవ్యం నిర్ణయించుకునే ఒక స్నేహితురాలి కథ కూడా. ఉద్యమం చనిపోదని, చనిపోయేది మనుష్యులే కాని ఆలోచన కాదనే సందేశంతో రాసిన ఈ కథలో విషాదం, త్యాగం కదిలిస్తాయి. "పల్లకీ" కథ లో తమ హక్కుకోసం పోరాడే వర్గాన్ని ఇతర అధికార వర్గాలు ఏకమై మోసం చేసి అణిచివేసేతీరుని చూపుతూ గ్రామ రాజకీయాలను పరిచయం చేస్తారు. "ఎర్ర త్రీకోణం" కథ బలవంతంగా 70 లలో చేసిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ఇతివృత్తంగా సాగుతుంది. ప్రజల కోసం మొదలెట్టిన సంస్కరణోద్యమాలు ప్రజలను దోచే సాధనాలుగా మారడాం కనిపిస్తుంది. "గుడి తన్నిన బడి అను పాము కథ" ఊర్లో బడి కట్టీంచాలనే ఒక సంస్కర్తకు, ప్రజల మూడవిశ్వాసాలతో రాజకీయం నడిపే అగ్రకులస్థుల నడుమ జరిగే యుధ్ధం గురించి చర్చిస్తుంది, చివరకు రాజకీయం గెలిచి సంస్కరణ ఆగిపోతుంది. "గెషమ్స్ లా" అనే కథలో గ్రామ రాజకీయాలలో పావులుగా మారే జనం, స్వాతంత్ర్యోద్యమంలో త్యాగాలు చేసిన వారు నామరూపాలు లేకుండా పోవడం, దుష్ట రాజకీయాలకు బలి అవడం కనిపిస్తుంది. "ఇది స్ట్రికీంగ్ కాదు" అనే కథలో ఒక స్త్రీ వస్త్రాపహరణానికి గురి అవుతుంది. కాని పురుషుల చేతిలో కాదు. అహంకారంతో అసూయతో నిండిన స్త్రీ సమాజం చేతిలోనే. "ముంపు" కథ లో తమ స్వార్ధం కోసం అధికార గణం చేసే రాజకీయంలో పావులుగా మిగిలిపోయే విశ్వాసపాత్రులను చూస్తాం. "చీకటి చాటున మనిషి", "చట్టం చాటు మనిషి" కథల లో తన మార్గాన్ని మార్చుకోవాలన్నా కూడా మరో గత్యంతరం లేక తెలిసి తెలిసీ అధికారుల రాజకీయ దాహానికి సమిధలు గా మారే పేద ప్రజను చూస్తాం. ఇవి రెండు సీక్వెల్ కథలు గా రాసారు రచయిత. "సీతాలు గుడిసే మారింది" కథ మధ్య దిగువ తరగతులలో నైతికత పై అనేక ప్రశ్నలు సంధిస్తుంది. "తెల్ల కిరీటం" "వారధి"కథలు భారత దేశ రాజకీయ చరిత్రను చూపిస్తే, "ఖానూన్" న్యాయం పేరుతో జరుగుతున్న అన్యాయాన్ని చూపిస్తుంది. "నెత్తురుకారని కత్తిపోటు" లో ఆవిరవుతున్న ఎన్నో ఉద్యమాల వెనుక రాజకీయం కనిపిస్తుంది. "ఊరు మేలుకుంది" రైతు కూలి ఉద్యమ నేపద్యంలో రాసిన కథ. "సమిధ" కథకూడా ఉద్యమకారుని జీవితంలో ని విషాదాన్ని చెప్పే కథ. మీనన్ గారి కథలన్నిట్లో ఉద్యమ నేపద్యం కన్పిస్తుంది. భారతదేశంలోని బడా రాజకీయ నాయకుల ఎత్తుగడలకు బలి అయిపోతున్న పేదలు కనిపిస్తారు. తమ జీవితాలను మెరుగుపరుచుకోవడానికి పోరాటం బాట పట్టిన బడుగులు కనిపిస్తారు. సమాజంలోని వర్గ, కుల, ఆర్ధిక భేధాల నడుమ బలి అయిపోతున్న అమాయకులు కనిపిస్తారు. ఉద్యమాల అవసరం ప్రస్తుత సమాజంలో ఎంత ఉందో అన్న విషయాన్ని చాలా స్పష్టంగా ఎటువంటి ఉపోద్హాతం లేకుండా ప్రతి కథలో రచయిత చర్చకు తీసుకువస్తారు. కథలలో పాత్రల కు పోరాడడం ఒక అవసరం. దాన్ని అర్ధం చెసుకునే స్థాయికి పాఠకులకు తీసురావడానికి రచయిత ఈ కథావస్తువులను ఎన్నుకున్నారనిపించింది. రచయితి ప్రజా జీవితంతో మమేకమై, వారి బాధలను అనుభవించి రాసారనీ అనిపిస్తుంది. అప్పట్లోని గ్రామ రాజకీయ వాతావరణాన్ని చిత్రించడంలోని వీరి ప్రతిభ చూస్తే గ్రామ జీవితాల పట్ల గొప్ప అవగాహన ఉన్న సామాజికవేత్త కనిపిస్తారు వీరి కథలలో. ***