నాకూ ఒక కల ఉంది - కొమ్మలూరు హరి మధుసూదన రావు

Naakoo oka kala vundi

ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం – మే 21 సందర్భంగా

 

“భారతదేశం చాలా ప్రాచీన దేశం, కానీ యువ దేశం. నాకూ ఒక కల ఉంది. భారతదేశాన్ని బలమైన, స్వతంత్రమైన, స్వావలంబన కలిగిన దేశంగా మానవ జాతి సేవలో మొదటి స్థానంలో ఉంచాలన్నదే నా కల.’ - రాజీవ్ గాంధీ

ఇటువంటి గొప్ప కల కన్న మహనీయుడిని భారతదేశం ఉగ్రవాద దాడిలో కోల్పోవలసి వచ్చింది. అది మే 21 1991 ఎన్నికల సభలో పాల్గొనడానికి శ్రీపెరంబూర్ కు రాజీవ్ గాంధీ వచ్చారు. కాంగ్రేస్ నాయకురాలు లతాకన్నణ్ , ఆమె కుమార్తె కోకిల రెడ్ కార్పెట్ దగ్గర వేచి ఉన్నారు. వీరి మధ్యలో థను అనే ఆమె ఒక చందన మాలను పట్టుకొని ఉంది. దీనిని అంతటినీ కెమరాలో బందిస్తున్నాడు కెమరామెన్ హరిబాబు. ఒంటి కన్ను శివరాసన్ పత్రికావిలేఖరి రూపంలో ఉన్నాడు. రెడ్ కార్పెట్ పై వస్తున్న రాజీవ్ గాంధీ ని ఆహ్వానించడానికి కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. కోకిల హింది లో కవిత వినిపించింది. రాజీవ్ గాంధీ శభాష్ అని మెచ్చు కున్నారు. ముందుకు రాబోతున్న థనుని అక్కడి సబ్ ఇన్ స్పెక్టర్ అనసూయ అడ్డుకున్నారు. అది గమనించిన రాజీవ్ గాంధీ తన దగ్గరికి పంపించవలసినదిగా పిలిచాడు. చందన మాలను రాజీవ్ మెడలో వేసి కాళ్ళకు నమస్కారం చేయడానికి వంగుతూ సరిగ్గా రాత్రి 10.20 గంటలకు నడుముకు ఉన్న బెల్ట్ బాంబ్ ను ఆన్ చేసింది. అంతే పెద్ద శబ్దం, మంటలు, పొగ వ్యాపించాయి. ఎక్కడ చూసినా మృతదేహాలు. అందరి చూపు రాజీవ్ గాంధీ పైనే ఉంది. ఎక్కడ ఎక్కడ అని వెతికారు. రాజీవ్ గాంధీ వేసుకొనే బూటు, తల వెనక భాగాన్ని బట్టి కాంగ్రేస్ నాయకురాలు జయంతి నటరాజన్ కనుగొన్నారు. దేశం గొప్ప నాయకుడిని కోల్పోయింది. ఇంత ఘోరమైన ఆత్మాహుతి దాడి అసలు ఎందుకు జరిగింది ? అసలు రాజీవ్ గాంధీని ఎందుకు చంపాలనుకున్నారు అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.

రాజీవ్ గాంధీ జీవిత చరిత్ర :

ఇందిరా గాంధీ, ఫిరోజ్ లకు 1944 ఆగస్ట్ 20న రాజీవ్ గాంధీ జన్మించారు. డెహ్రాడూన్ లోని వెల్ హమ్ స్కూల్లో చదివారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లో మెకానికల్ ఇంజనీరింగ్ చేసేటప్పుడు ఇటాలియన్ మహిళ సోనియా మైనో తో పరిచయం ప్రేమగా మారింది. 1968 లో వివాహం చేసుకున్నారు. వీరికి, కుమారుడు రాహుల్, కూతురు ప్రియాంక జన్మించారు. రాజీవ్ గాంధీ మొదట ఇండియన్ ఎయిర్ లైన్స్ లో ప్రొఫిషనల్ పైలెట్ గా పనిచేశారు. సోదరుడు సంజయ్ గాంధీ 1980 లో విమాన ప్రమాదంలో మరణించడంతో తల్లి కోరిక మేరకు అమేథీ నుంచీ ఉపఎన్నికలలో పోటీ చేసి గెలుపొందారు. 1984 అక్టోబర్ 31న ఇందిరా గాంధీ సిక్కు బాడీ గార్డులైన సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ లచే హత్య కావింపబడ్డారు. రాజీవ్ గాంధీ ఆరవ ప్రధానమంత్రిగా పదవిని స్వీకరించారు. అప్పటికి ఆయన వయస్సు 40 సంవత్సరాలే. భారతదేశ ప్రధానులలో అత్యంత పిన్న వయస్కుడు రాజీవే. ప్రజాస్వామ్యంలో యువత పాత్ర కీలకమని భావించి ఓటు హక్కు కు కావలసిన కనీస వయస్సును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించారు. గ్రామాల్లో కూడా టెలీఫోన్ సౌకర్యం కల్పించారు. సాఫ్ట్ వేర్ రంగాన్ని అభివృద్ధి చేశారు.

 

 

 

 

ఉగ్రవాదం అంటే ఏమిటి ?

ఆత్మన్యూనతకు లోనై, ఇతరులను భయపెట్టి తమ పంతాలను నెగ్గించుకోవడాన్నే ఉగ్రవాదం అంటారు. ఇది ఒక మానసిక రుగ్మత. ఒక సామాజిక పైశాచికత్వం. ఉగ్రవాద దుశ్చర్యల వల్ల అమాయకులైన ప్రజలు బలవుతున్నారు. ఇటువంటి ఒకానొక ఉగ్రవాద సంస్థే LTTE (లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం).

LTTE గురించి క్లుప్తంగా :

శ్రీలంకను సిలోన్ అని పిలిచేవారు. ఈ దేశానికి బ్రిటీష్ వారి నుండి ఫిబ్రవరి 4, 1948 లో స్వాతంత్ర్యం లభించింది. ఇక్కడ 74.9 శాతం సింహళీయులు, 11.2 శాతం శ్రీలంక తమిళులు, 4.2 శాతం భారతదేశం నుండీ టీ తోటలలో పనిచేయుటకు వచ్చి స్థిర పడిన తమిళులు, మిగతావారు 10 శాతం మంది ఉన్నారు. 1972 మే 22న రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంకగా ఏర్పడే వరకూ అక్కడ అందరికీ సమాన హక్కులు ఉండేవి. కానీ ఆ తరువాత చేసిన చట్టాలలో ఒకటి స్థానికులకే యూనివర్సిటీ లలో 40 శాతం సీట్లు కేటాయించాలనే చట్టం. దీనివల్ల సింహళీయులకే ఎక్కువ ఉన్నత విద్యావకాశాలు లభించాయి. ఇంకో చట్టం ప్రకారం జనాభా ప్రాతిపదికన 10 శాతం మాత్రమే తమిళులకు ఉద్యోగ అవకాశాలు లభిస్థాయి. దేనితో అక్కడి తమిళులకు కోపోద్రేకాన్ని తెచ్చిపెట్టింది. తమిళ ప్రజలను తక్కువ చేసి చూస్తూ ద్వితీయ శ్రేణి వ్యక్తులుగా పరిగణించేవారు. దీనితో అక్కడి తమిళుల కోసం EPRS, TELO, EROS, PLOTE వంటి అనేక గ్రూపులు పోరాడాయి. వీటిలో ప్రధానమైనది LTTE. దీనిని 1976 లో వేలుపిళ్ళై ప్రభాకరన్ స్థాపించాడు. తమిళుల కోసం ప్రత్యక దేశం ఏర్పాటు కావాలని డిమాండ్ చేశాడు. దీనికోసం శ్రీలంకలోని తమిళులనందరినీ ఏకం చేశాడు. దీనికి కావాల్సిన డబ్బు, ఆయుధాలు సేకరించాడు. సైనికుల్ని తయారు చేశాడు. ప్రత్యేకంగా వార్తాపత్రిక, రేడియో, టివి ఛానల్ ఏర్పాటు చేసుకున్నాడు.

LTTE కి భారతదేశం తో సంబంధ మేమిటి ?

శ్రీలంక సైన్యం శ్రీలంక లోని తమిళ వేర్పాటు వాదులను ఏరివేసే కార్యక్రమం చేపట్టింది. ఎంతో మందిని కాల్చి చంపారు. ఇందులో ఎందరో అమాయక తమిళులు ప్రాణాలు కోల్పోయారు. కొంతమందిని దేశంనుంచీ తరిమి వేసారు. కొన్ని వేల మంది తమిళులు భారతదేశానికి వలస వచ్చారు. శ్రీలంకలోని తమిళుల పడుతున్న కష్టాలను చూసి తమిళనాడులోని రాజకీయ నాయకులు అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారిపై ఒత్తిడి తెచ్చారు. ఇందిరాగాంధీ అప్పటికే బంగ్లాదేశ్ ఏర్పాటుకు సహాయం చేశారు. అలానే శ్రీలంక తమిళులకు సహాయం చేసి ప్రత్యేక దేశం ఇప్పించమని వారు కోరారు. LTTE వారికి భారతసైన్యంచే రహస్యంగా ఆయుధాలను ఇచ్చి శిక్షణ నిప్పించారు.

1987 జూన్ 5న జాఫ్నా ప్రాంతంలో జరిగిన అంతర్యుద్ధంలో ఎంతోమంది తమిళ శ్రీలంక వాసులు చనిపోయారు. సామాన్య ప్రజలు కూడా శ్రీలంక సైన్యం చేతిలో అనేక చిత్ర హింసలకు గురయ్యారు. శ్రీలంకలోని తమిళ తీవ్రవాద సంస్థలపై దాడిని ముమ్మరం చేసింది. LTTE తో సహా అన్నితీవ్రవాద సంస్థలూ బాగా దెబ్బ తిన్నాయి. తమిళులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను దిగ్భంధించింది. ఆహారము కూడా అందకుండా చేసింది. దీనితో ఆకలి చావులు సంభవించాయి. ఎక్కడ చూసినా శవాలే. LTTE లొంగి పోయే పరిస్థితికి వచ్చింది. వారికి సహాయం చేయవలసినదిగా తమిళనాడు లోని నాయకులు చిదంబరం, M.G. రామచంద్రన్ తదితరులు అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీని ఒత్తిడి చేశారు. భారత సైన్యం సహాయంతో ‘ఆపరేషన్ పూమలై’ నిర్వహించింది. దీని ప్రకారం శ్రీలంకలోని తమిళులకు సహాయంగా 23 వేల టన్నుల ఆహార ధాన్యాలను, కొన్ని ఆయుధాలను పారాచూట్ల సహాయంతో శ్రీలంకలోని తమిళులు ఎక్కువగా ఉన్న జాఫ్నా ప్రాంతాలలో అందించింది. దీనిని శ్రీలంక ప్రభుత్వం ఖండించింది.

శాంతి ఒప్పందం :

శ్రీలంక ప్రభుత్వం భారతదేశానికి ఒక ప్రతిపాదన పంపింది. దాని ప్రకారం శ్రీలంకలోని తమిళులకోసం ప్రత్యేక దేశం ఇవ్వడం తప్ప మిగిలిన అన్ని డిమాండ్లనూ సత్వరం నెరవేరుస్తాము. అయితే మీరు చేయవలసిన సహాయం ఒకటే. వారి దగ్గర ఉన్న ఆయుధాలనన్నిటినీ అప్పగించేందుకు ఒప్పించాలి. దీనితో రాజీవ్ గాంధీ ప్రభాకరన్ తో 1987, జూలై 28న ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రతిపాదనకు ఒప్పుకోవలసినదిగా కోరారు. దీనికి ప్రభాకరన్ తాను ఒప్పుకుంటున్నట్లు సంతకం చేశాడు. కానీ శ్రీలంక అధ్యక్షునితో జరిగే కొలంబో సమావేశానికి తాను రానని చెప్పాడు. 1987, జూలై 29న శ్రీలంక ప్రెసిడెంట్ J.R. జయవర్దన తో రాజీవ్ గాంధీ మధ్య శాంతి ఒప్పందం జరిగింది. కానీ ఈ ఒప్పందం శ్రీలంక ప్రభుత్వానికీ అక్కడి తీవ్రవాద సంస్థలకూ జరగాలి. భారతదేశం మధ్యవర్తిత్వం వహించాల్సి ఉంది. మరుసటి రోజు కొలంబోలో సైనిక వందనం స్వీకరిస్తున్న సమయంలో హఠాత్తుగా విజిత రొహానా అనే శ్రీలంక తమిళ సైనికుడు తన రైఫిల్ తో దాడి చేయబోవగా తృటిలో రాజీవ్ గాంధీ తప్పించుకున్నాడు. ఆ సైనికిడిని అరెస్ట్ చేసి జైలు శిక్ష విధించారు.

IPKF :

శ్రీలంకలోని తమిళ తీవ్రవాదుల నుంచీ ఆయుధాలను స్వాధీనం చేసుకోవడానికి భారత సైన్యాన్ని పంపవసినదిగా కోరారు. దీనికి సమ్మతిస్తూ ‘ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ (IPKF) ని మేజర్ జనరల్ హరికిరత్ సింగ్ ఆధ్వర్యంలో పంపారు. LTTE తో సహా EPRLF, TELO, EROS, PLOTE వంటి అనేక తీవ్ర వాద సంస్థలు ఆయుధాలను సమర్పించడానికి అంగీకరించాయి. ప్రభాకరన్ ను పట్టుకోవడానికి శ్రీలంక సైన్యాలు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఆగస్టు 2 వ తేదీన జాఫ్నాలో భారత సైన్యం వద్దకి రక్షణ కోసం ప్రభాకరన్ వచ్చాడు. “IPKF ద్వారా రక్షణ కల్పిస్తాము. కాబట్టి ఆయుధాలను అప్పగించండి” అని ప్రభాకరన్ ని హరికిరత్ సింగ్ కోరారు. ప్రభాకరన్ దీనికి అంగీకరిస్తూ హరికిరత్ సింగ్ కు లిఖిత పూర్వక హామీ పత్రాన్ని ఆగస్టు 3 న ఇవ్వడం జరిగింది. అయితే ఆయుధాలు లేని తమను IPKF వెళ్ళిపోయిన తరువాత, శ్రీలంక సైన్యం చంపివేస్తుందని ప్రభాకరన్ భయపడ్డాడు. ఆగస్టు 21 నుంచి ఆయుధాలను అప్పగించడం ఆపివేశాడు. తమిళ ప్రాంతాలన్నిటినీ కలిపి ఈశాన్య ప్రావిన్స్ గా ఏర్పాటు చేసి దానికి ERLF వ్యక్తి వరదరాజ పెరుమాళ్ ను చీఫ్ మినిస్టర్ గా చేయాలని IPKF ప్రకటించింది. కానీ దీనికి ప్రభాకరన్ ఒప్పుకోలేదు. LTTE తరపున ముగ్గురు పేర్లను పంపింది. దీనిని IPKF తిరస్కరించింది. దీనితో తక్షణం అక్కడినుంచి IPKF భారతదేశానికి వెళ్లిపోవలసిందిగా రాజీవ్ గాంధీని ప్రభాకరన్ కోరాడు. దీనిని రాజీవ్ గాంధీ ఒప్పుకోలేదు. అమెరికా హై కమీషనర్ J.N.దీక్షిత్ తో శ్రీలంక ప్రభుత్వ సమావేశాన్ని సెప్టెంబర్ 15 న ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ప్రభాకరన్ ను కూడా పిలిచారు. సెప్టెంబర్ 14 వ తేదీ రాత్రి హరికిరత్ సింగ్ కు ఫోన్ చేసి “ప్రభాకరన్ ను అరెస్ట్ చేయండి లేదా షూట్ చేసి చంపండి” అని కమీషనర్ చెప్పాడు. రెండు నిమిషాలు వ్యవధి అడిగి హరికిరత్ సింగ్ ఈ విషయాన్ని భారత ముఖ్య సైనికాధికారి లెఫ్టినెంట్ జనరల్ దీపేందర్ సింగ్ కు తెలిపాడు. దీపేందర్ సింగ్ “మనం శత్రువును కూడా వెనక నుంచి చంపము” అని చెప్పాడు. ఈ విషయాన్నే దీక్షిత్ కు హరికిరత్ సింగ్ తెలిపాడు. తెలిపన్ అనే LTTE రాజకీయ నేత IPKF వెనక్కి వెళ్లి పోవాలని ఆమరణ నిరాహారదీక్ష చేపట్టి చనిపోయాడు. దీనితో తమిళులలో IPKF పట్ల వ్యతిరేకత మొదలయ్యింది. శ్రీలంక సైనికులు పట్టుకోబోగా 12 మంది సైనైడ్ తిని LTTE సభ్యులు చనిపోయారు. దీనికి IPKF కారణంగా భావించి LTTE భారత సైన్యం పై దాడి చేయడం ప్రారంభించింది. శ్రీలంక సైన్యానికి LTTE కి మధ్య జరిగే అంతర్యుద్ధం కాస్తా IPKF కీ LTTE కి యుద్ధంగా మారింది. IPKF సైనికులను చంపి బహిరంగంగా వ్రేలాడ దీశారు. శ్రీలంకలో జరిగిన ఎన్నికలలో రణసింఘే ప్రేమదాస అధ్యక్షుడి గా ఎన్నిక అయ్యారు. ప్రేమదాస LTTE తో ఒప్పందం చేసుకున్నారు. శ్రీలంక లోని తమిళ ప్రాంతాలు IPKF ఆధీనంలోకి వెళ్లిపోతాయనే భయంతో భారత సైన్యాన్ని ఉపసంహరించుకోవలసినదిగా కోరాడు. కానీ ఈ పరిస్థితులలో అది వీలుకాదని రాజీవ్ తెలిపారు.

మారిన రాజకీయ పరిస్థితులు :

భోఫోర్స్ కుంభకోణం వంటి అవినీతి ఆరోపణలవల్ల 1989 నవంబర్ లో జరిగిన 9వ లోక్ సభ ఎన్నికలలో కాంగ్రేస్ ఓడిపోయింది. V.P. సింగ్ నాయకత్వంలో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. IPKF ని శ్రీలంకనుంచి ఉపసంహరింప చేశారు. రామజన్మభూమి రథయాత్ర చేపట్టిన L.K.అద్వానీని అక్టోబర్ 23, 1990 లో అరెస్ట్ చేయడంతో నేషనల్ ఫ్రంట్ కు తమ మద్దతును BJP ఉపసంహరించింది. V.P. సింగ్ రాజీనామా చేశారు. కాంగ్రేస్ బయటి నుంచి ఇచ్చిన మద్దతుతో చంద్రశేఖర్ ప్రధాని అయ్యారు. కానీ కాంగ్రేస్ మార్చి 6, 1991 లో మద్దతు ఉపసంహరించడంతో రాష్ట్రపతి R.వెంకట్రామన్ లోక్ సభను రద్దు చేసి మధ్యంతర ఎన్నికలను ప్రకటించారు. రాజీవ్ గాంధీకి రాజకీయాలపై పూర్తిగా అవగాహన వచ్చింది. రాబోయే 10వ లోక్ సభ ఎన్నికలలో కాంగ్రేస్ ప్రభుత్వం వస్తుందని ఒపీనియన్ పోల్స్ లో స్పష్టంగా తేలింది. ఎన్నికల ప్రచార సభలో రాజీవ్ గాంధీ తాము అధికారంలోకి వస్తే శ్రీలంకకు మళ్ళీ IPKF ను పంపుతామని తెలిపారు. దీనితో ప్రభాకరన్ కు భయం పుట్టుకుంది. LTTE ఇంటలిజెన్స్ చీఫ్ షణ్ముగం శివశంకర్ అలియాస్ పొట్టుఅమ్మన్ తో సమావేశమయ్యాడు. రాజీవ్ గాంధీని చంపాలని నిర్ణయించారు. రాజీవ్ ప్రధాని అయితే చంపడం కష్టమని, ఎన్నికల ప్రచార సభలలో అయితే సెక్యురిటీ తక్కువ, జనాభా ఎక్కువగా ఉంటుందని తెలిపాడు. ఈ కార్యక్రమాన్ని శివరాసన్ కు అప్పగించారు.

మే, 21 1991 న ఏం జరిగింది ?

ఎన్నికల చివరి ప్రచార సభలలో పాల్గొనడానికి రాజీవ్ గాంధీ సిద్ధంగా ఉన్నారు. భువనేశ్వర్, విశాఖపట్నం, శ్రీపెరంబదూర్ లో ప్రచార సభలలో పాల్గొన వలసి ఉంది. మే 20 వ తేదీన సాయంత్రం 5 గంటలకు తన నివాసం జనపథ్ 10 నుంచి ఇందిరాగాంధీ విమానాశ్రయానికి చేరుకున్నారు. పైలెట్ సెహానాను కోపైలెట్ గా ఉండమని చెప్పి సొంతంగా విమానాన్ని నడిపారు. రాత్రి 8.20కి భువనేశ్వర్ చేరుకొన్నారు. ప్రచార సభ అనంతరం భారీ వర్షంకురిసింది. మరుసటి రోజు విమానంలో సాంకేతిక సమస్య రావడంతో హెలీకాఫ్టర్ లో విశాఖపట్నం కి మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరారు. విశాఖపట్నం సభ అనంతరం చెన్నైకి వెళ్ళడానికి విమానాశ్రయం వచ్చారు. కానీ విమానంలో ఎలక్ట్రిక్ ఫెయిల్యూర్ సమస్య వచ్చిందని విమాన ఇంజనీర్ ఆనంద వర్మ తెలిపారు. ఆ రోజు రాత్రి విశాఖపట్నంలోనే ఉండాలని రాజీవ్ అనుకొని గెస్ట్ హౌస్ చేరుకున్నారు. కానీ కొంత సమయానికి విమానం తయారయ్యిందని తెలిసింది. మృత్యువు మళ్ళీ ఆయనను ఆహ్వానిస్తోంది కాబోలు వెంటనే ఒక కారులో విమానాశ్రయానికి బయలు దేరారు. మరో కారులో వస్తున్న రక్షణాధికారి O.P.సాగర్ వచ్చేలోపే బయలుదేరి వెళ్ళిపోయారు.

శ్రీపెరంబదూర్ లో జరిగిన దుర్ఘటన :

శ్రీపెరంబదూర్ లో కాంగ్రేస్ నాయకుడు మరకతం చంద్రశేఖర్ గ్రాండ్ వెస్ట్రన్ ట్రంక్ రోడ్డు ఆలయ ప్రాంగణంలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. సభ ప్రారంభించే ముందు అక్కడికి ప్రజలను అలరించడానికి శంకర్ గణేష్ సంగీత విభావరిని నిర్వహించారు. పత్రికా విలేఖరి రూపంలో శివరాసన్, కెమరామెన్ హరిబాబు, మానవ బాంబు థెన్మోజ రాజరత్నం అలియాస్ థను, శుభ, నళిని అక్కడికి ముందే చేరుకున్నారు. నళిని, శుభ మహిళా గ్యాలరీలో కూర్చొని చూస్తున్నారు. చందన మాలను పట్టుకొని లత, కోకిల మధ్యన థను ఉన్నారు. రాజీవ్ అంబాసిడర్ కారులో అక్కడికి చేరుకున్నారు. హరిబాబు వీరిని ఫోటో తీస్తున్నాడు. ముందుగా 20 మంది మాత్రమే ఆహ్వాన ప్రాంతంలో పూల దండలతో ఉండాలని నిర్ణయించారు. కానీ ఒక్క సారిగా ఎక్కువ మంది తోసుకుంటూ అక్కడికి వచ్చేసారు. మెటల్ డిటెక్టర్ తో పరిశీలించాల్సి ఉంది. కానీ ఆరోజు మెటల్ డిటెక్టర్ తేలేదు. శివరాసన్ ని దూరంగా వెనక్కి వెళ్లి పొమ్మని థను సైగ చేసింది. శివరాసన్ దూరంగా వెళ్లి చూస్తున్నాడు. అక్కడ ఉన్న వారిని సబ్ ఇన్స్పెక్టర్ అనసూయ కంట్రోల్ చేస్తున్నారు. రాజీవ్ దగ్గరకు చేరుకోగానే కోకిల హిందీ కవితను చదివింది. రాజీవ్ బాగా పాడావు అని మెచ్చుకుంటూ ఆశీస్సులు అందిస్తూ కోకిల తలపై చేయిపెట్టారు. వెనక ఉన్న థను రాజీవ్ కు దండ వేయడానికని ముందుకు రాబోయింది. కానీ సబ్ ఇన్స్పెక్టర్ అనసూయ అడ్డుకుంది. దీనిని గమనించిన రాజీవ్ తన మృత్యువు ను తనే ఆహ్వానిస్తున్నట్లు ఆమెను అడ్డుకోవద్దు తనవద్దకు పంపండని సబ్ ఇన్స్పెక్టర్ అనసూయకు సైగ చేశారు. థను దండను రాజీవ్ గాంధీ మేడలో వేసి కాళ్ళకు నమస్కరించడానికని ముందుకు వంగి తన బెల్ట్ కు ఉన్న RDX బాంబు బటన్ ను ఒత్తింది. అంతే పెద్ద శబ్దంతో ఆత్మాహుతి దాడి జరిగింది. 20 అడుగుల ఎత్తు వరకూ మంటలు లేచాయి. అంతటా దట్టమైన పొగ వ్యాపించింది. ఎక్కడ చూసినా మృత దేహాలు చెల్లా చెదరుగా పడి ఉన్నాయి. అందరూ రాజీవ్ గాంధీ ఎక్కడని వెతికారు. బూటు ను బట్టి రాజీవ్ గాంధీని కనుగొన్నారు. దేశం గొప్ప నాయకుడిని, మంచి వ్యక్తిని కోల్పోయింది. రాజీవ్ గాంధీ తో సహా మొత్తం 14 మంది మరణించారు. 43 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి.

కార్తికేయన్ నాయకత్వంలో సిట్ దర్యాప్తు :

కేంద్ర ప్రభుత్వం CBI వారిచే ఈ దుర్ఘటన పై D.R. కార్తికేయన్ నాయకత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. సంఘటనా స్థలి వద్ద దొరికిన హరిబాబు కెమరా ఫోటోలను బట్టి విచారణను చేపట్టారు. హరిబాబు పనిచేస్తున్న సుభా స్టూడియో ఓనర్ సుభా సుందరాన్ని విచారించారు. హరిబాబుకు LTTE కి సంబంధాలున్నట్లు తేలింది. హరిబాబుకు స్నేహితుడైన భాగ్యనాధాన్ ప్రెస్ నడుపుతున్నాడు. ఈ ప్రెస్ ను LTTEకి చెందిన బేబి సుబ్రహ్మణ్యం ఇచ్చాడు. శంకర్ అలియాస్ కోనేస్వరన్ అనే LTTE వ్యక్తిని తంజావూరు లో అరెస్ట్ చేయబోగా పారిపోయాడు. కానీ అక్కడ లభించిన టెలీఫోన్ బిల్లులను బట్టి నళిని, పయస్ ల ఫోన్ నెంబర్లు దొరికాయి. నళినీ మురుగదాస్ లను సైదాపేటలో అరెస్ట్ చేశారు. థను ను మానవ బాంబ్ గా మార్చిన శివరాసన్ దీనికి ప్రధాన సూత్ర ధారి అని తేల్చారు. శివరాసన్ LTTE కి చెందిన వాడని తెలియడంతో రాజీవ్ హత్య పక్కా ప్లాన్ తో చేశారని కేంద్ర హోం శాఖ కార్యదర్శి R.D. ప్రధాన్ దీనిపై వ్రాసిన పుస్తకం ద్వారా తెలుస్తుంది. ఈ కుట్ర లో భాగం ఉన్న LTTE వాళ్ళను పట్టు కోవడానికి వెళ్ళగా మెడలో ఎప్పుడూ ఉంచుకొనే సైనైడ్ మింగి వారు చనిపోయారు. శివరాసన్ బెంగుళూరు లో ఉన్నట్లు తెలిసికొన్నారు. కార్తికేయన్ బృందం పాల వాడి సహాయంతో ఇల్లును గుర్తించారు. ఎలాగయినా ప్రాణాలతో పట్టుకోవాలనుకున్నారు. కార్తికేయన్ పై అధికారులకు విషయం తెలియజేశాడు. దాడి చేయడానికి అనుమతిని కోరాడు. కానీ వారు అనుమతి ఇవ్వడం ఆలస్యం చేశారు. కిటికీ ద్వారా పోలీసులు తమను చుట్టిముట్టి నట్లు శివరాసన్ గమనించాడు. శుభ తో సహా ఐదు మంది సైనైడ్ మింగి చనిపోగా శివరాసన్ పిస్టల్ తో కాల్చుకొని చనిపోయాడు. రాజీవ్ గాంధీ జన్మదినం ఆగస్టు 20 నే శివరాసన్ చనిపోవడం కాకతాళీయం. రాజీవ్ గాంధీని చివరి సారి ఇంటర్వూ చేసిన ప్రముఖ జర్నలిస్ట్ నీనాగోపాల్ రాజీవ్ గాంధీ హత్య అనే పేరుతో పుస్తకాన్ని వ్రాశారు. దీనిలో LTTE ప్రభాకరన్ వ్యూహాలను అంచనా వేయడంలో రీసర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (RAW) పూర్తిగా విఫలమైందని తెలిపారు.

 

రాజీవ్ హత్య కారకులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ?

రాజీవ్ హత్యకు మొత్తం 26 మందిని దోషులుగా తేల్చింది. శ్రీలంకకు చెందిన శ్రీహరన్ అలియాస్ మురుగన్, శాంతన్, రాబర్ట్ పయస్, జయకుమార్ లతో పాటు భారతీయులైన నళిని, రవిచంద్రన్, పెరివాలన్ అలియాస్ అరివు లను అరెస్ట్ చేశారు. శాంతన్, పెరివాలన్, మురుగదాస్, నళిని లకు ఉరి శిక్షను ఖరారు చేసింది. అరెస్ట్ చేసే సమయానికి నళిని గర్భవతి. జైలులోనే ఒక ఆడ బిడ్డను ప్రసవించింది. ఆమెకు ఉరి శిక్ష విధిస్తే పుట్టిన బిడ్డ అనాధ అవుతుందని సోనియాగాంధీ ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చాలని కోరారు. గవర్నర్ క్షమాబిక్ష ప్రసాదించి మరణ శిక్షను నళిని, మురుగదాస్, శాంతన్, పెరివాలన్ లకు యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు.

ప్రియాంక గాంధీ నళిని ని కలవడం :

2012 లో నళిని రచించిన ఆత్మకథను ప్రభాకరన్ ను ఆరాధ్యుడిగా భావించే వైగో ఆవిష్కరించారు. ఈ పుస్తకానికి ‘రాజీవ్ కోలాయ్ మరిక్క పట్టా ఉన్మయ్ గళ్’ అంటే ‘రాజీవ్ హత్య - మరుగున పడిన రహస్యాలు’ అని పేరు పెట్టింది. దీనికి క్యాప్షన్ గా ‘ప్రియాంకం నళిని సంద్దిప్పు’ అంటే ‘ప్రియాంక నళినిల భేటీ’ అని ఉంచింది. రాజీవ్ గాంధీ కుమార్తె ప్రియాంక మార్చి 19, 2008 లో నళిని ని కలిసిన విషయాలను ఇందులో వ్రాసింది. “నా తండ్రి చాలా మంచి వాడు కదా! అటువంటి మంచి వ్యక్తిని ఎందుకు చంపవలసి వచ్చింది ?” అని ప్రియాంక అడిగింది. “మీ తండ్రి హత్యకు నాకు ఎటువంటి సంబంధం లేదు. పరిస్థితుల ప్రభావంతో నేను జైలుకు రావలసి వచ్చింది. అసలు మీ తండ్రిపై జరిగిన హత్యకు సంబంధించిన కుట్ర సంగతి గురించిన సంగతి కూడా నాకు గాని, నా భర్తకు కానీ అసలు తెలియదు. అంతే కాదు జైలు శిక్ష అనుభవిస్తున్న మిగతా ఇద్దరూ కూడా అమాయకులే” అని నళిని చెప్పింది. వెంటనే ప్రియాంక ఎర్రబడిన కళ్ళతో ఉద్వేగంగా “మీరంతా నిర్దోషులు, అమాయకులైతే మరి మా నాన్నను చంపిందెవరు ? దర్యాప్తు అధికారులు మిమ్మల్నే ఎందుకు అరెస్ట్ చేశారు ? కోర్టు మీకెందుకు శిక్ష విధించింది ?” అని ప్రశ్నల వర్షం కురిపించిండంతో “తనకు ఏం మాట్లాడాలో తోచలేదు” అని నళిని పేర్కొంది.

పాపం పండింది :

రాజీవ్ గాంధీ హత్య తరహాలోనే 1993 మే 1 న శ్రీలంక అధ్యక్షుడు ప్రేమదాస కూడా మానవ బాంబు చేత హత్యకు గురయ్యాడు. అయితే మహేంద్ర రాజపక్సే LTTEని పూర్తిగా అణచి వేశాడు. చివరికి 18 మే 2009న ప్రభాకరన్ ను శ్రీలంక సైన్యం కాల్చి చంపారు. రాజీవ్ గాంధీ ఆత్మ శాంతించినట్లయ్యిందని పత్రికలు వ్రాశాయి.

భారతదేశాన్ని శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి చేసి సమున్నత స్థానంలో నిలపాలని కలలు కన్న రాజీవ్ గాంధీని ప్రజలు తమ గుండెలలో దాచుకున్నారు. మోము పై చెరగని చిరునవ్వు చిందిస్తూ ఉన్న రాజీవ్ గాంధీ అందరి మనసులలో నిలిచే ఉంటాడు.

బుద్ధుడు పుట్టిన దేశం, గాంధీ నడయాడిన దేశం మన భారతదేశం. ఉగ్రవాద రహితంగా, శాంతి కాముక దేశంగా అగ్రభాగాన నిలవాలన్నదే నా సుందర స్వప్నము.

మరిన్ని వ్యాసాలు

కళల ఆవిర్భావం .
కళల ఆవిర్భావం .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
లంబాడి సంస్కృతి .
లంబాడి సంస్కృతి .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
గిరిజన నృత్యాలు .
గిరిజన నృత్యాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
కళారూపం ఒగ్గు కథ.
కళారూపం ఒగ్గు కథ.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
యోగాలు .
యోగాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
కళారూపం తోలుబొమ్మలాట .
కళారూపం తోలుబొమ్మలాట .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
కురుక్షేత్ర సంగ్రామం.
కురుక్షేత్ర సంగ్రామం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.