మంచిని బ్రతకనివ్వరు - మద్దూరి నరసింహమూర్తి

Manchini bratakanivvaru

ఆసుపత్రికి వెళ్ళిన అమ్మ నిర్జీవంగా ఇంటికి వచ్చిన దృశ్యం ఎనిమిదేళ్ళ వయసులోని మదన్ పసి హృదయం మీద గాఢమైన ముద్ర వేసి - పెద్దైతే తాను వైద్యుడినై అలాటి అర్ధాంతర మరణాలు ఆపగలిగే చదువును చదవాలన్న కోరికకు బలీయమైన పునాది వేసింది.

అప్పటినుంచీ, చదువే ధ్యాసగా ఎదిగి పిన్న వయసులోనే పట్టభద్రుడైన వైద్యుడిగా గుర్తింపు పొందేడు.

తల్లి అకాల మరణం గుర్తుకు వచ్చినప్పుడల్లా, డబ్బు ఉన్నంత మాత్రాన మనిషికి ఆయుష్హు పెరగదు; మంచి వైద్యం మాత్రమే రోగి బ్రతుకుకు ఆలంబనం అని గుర్తించేడు. డబ్బు పుష్కలంగా ఉన్నా తల్లి మరణించినందున, అదే డబ్బు అసలు ఉండని పేదలకు అందని వైద్య సదుపాయం మీద వచ్చే వ్యాసాలు కథలు కవితలు చదివి, తన వైద్య చదువు అటువంటి వారికి అండగా ఉండాలన్న కోరికకు, అతి కష్టం మీద, తండ్రిగారి ప్రోద్బలం లభింపచేసుకున్నాడు.

రాకపోకల సౌలభ్యం తక్కువగానే కాక ప్రమాదకరంగా ఉండే మన్యం ప్రదేశంలో, పాతిక తండాల మధ్య, వైద్య శిబిరం ఏర్పాటు చేసుకొని అందులోనే ఉండసాగేడు. తన దగ్గర ఒక మోటార్ సైకల్ ఉంచుకొని రోగులను త్వరగా చూసి వస్తూండే సౌలభ్యం సమకూర్చుకున్నాడు. ఆ తండాకు కానీ చుట్టుపక్కల తండాలకు కానీ విద్యుత్ సదుపాయం లేకపోవడంచేత, డీజల్ సదుపాయంతో విద్యుత్ ఉత్పాదన చేసే యంత్రం (జనరేటోర్) తన శిబిరంలో పెట్టుకొని, రాత్రి వేళల్లో కూడా అవసరమైన వైద్య సదుపాయం ప్రజలకు అందించసాగేడు. ఆ చర్య అతన్ని జనానికి దగ్గరయేందుకు అధికంగా దోహదపడింది.

ఆ తండాల మధ్య భూత ప్రేత వైద్యులుగా చలామణి అయే కొందరు వ్యక్తులు జనానికి వచ్చే రోగాలికి వైద్యం పేరుతో మోసగిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. మదన్ రాక వారందరికీ కంటగింపుగా తయారైంది.

జనాన్ని దోచుకొనేందుకు వచ్చిన పట్నం వైద్యుడని, అతన్ని నమ్మితే భూతాలు ప్రేతాలు ప్రకోపగించి జనానికి అనర్ధం చేకూరుస్తాయి అని ప్రచారం చేయసాగేరు. కానీ, మదన్ ఏ రోగి దగ్గరా డబ్బు తీసుకోకపోగా, వారికి అవసరమైన మందులు కూడా తన ఖర్చుతో ఇవ్వడంతో – అతి కొద్ది కాలంలోనే ఆ దుష్ప్రచారాలకు విలువ తగ్గిపోయింది.

ఎక్కడెక్కడ సంతలు అవుతాయో, ఆ ప్రదేశాల్లో ఆ సమయాల్లో మదన్ అక్కడే ఉంటూ, అక్కడకు వచ్చే జనానికి – రోగాలు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు సులభతరమైన భాషలో చెప్పసాగేవాడు.

అంతేకాక, వారికి పౌష్టికమైన ఆరోగ్యప్రదమైన ఆహారం తీసుకోవలసిన ఆవశ్యకత గురించి కూడా కథలు కథలుగా చెప్పి జాగృతం చేయసాగేవాడు.

వారి దగ్గర దొరికే పంట తదితర వస్తు సామగ్రిలోని ఆరోగ్య లక్షణాలను కూడా వివరించి, అవి విరివిగా తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని వారికి సులభంగా బోధపరచసాగేవాడు.

వీటన్నిటికి సంబంధించి, ప్రొజెక్టర్ సహాయంతో చిన్న చిన్న సినీమాలు చూపించసాగేవాడు.

ఈ రకమైన చర్యల వలన వైద్యుడిగానే కాక మంచి మనిషిగా కూడా పేరు మదన్ తెచ్చుకున్నాడు.

గతంలో ఏ చిన్న అనారోగ్యానికైనా అక్కడ ఉన్న జనం దారిలో వచ్చే వంకలు వాగులు దాటుకొని ప్రభుత్వ ఆరోగ్యకేంద్రానికి వెళ్ళేవారు. అక్కడ సర్కారువారు నియమించిన వైద్యుడు ఎప్పుడూ ఉండేవాడు కాడు. సర్వసాధారణంగా అక్కడ వైద్యుని సహాయకుడు మాత్రమే ఉండేవాడు. ఆ కేంద్రంలో వైద్యుడు ఉన్నా లేక సహాయకుడు ఉన్నా - ఎటువంటి ఖర్చు భరించే అవసరం లేని విధంగా సర్కారువారి ద్వారా జనానికి దొరకవలసిన మందులు ఇచ్చేవారు కారు. జనం దగ్గర భారీగా డబ్బులు వసూలు చేసి అవే మందులు ఇచ్చేవారు. మదన్ అక్కడ స్థిరపడిన తరువాత, ఆ కేంద్రం వద్దకు వచ్చే జనం తగ్గి, అక్కడ ఉండే వైద్యుడికి సహాయకుడికి దొరికే అక్రమ ఆదాయం భారీగా తగ్గిపోయింది.

మదన్ స్థిరపడిన తండా చుట్టు పక్కల పాము కాటుకు గురైన జనం అధికంగానే ఉండేవారు.

మదన్ రాకకు ముందు అక్కడ ఉండే భూత ప్రేత (దొంగ) వైద్యులు, పాము కాటు వేసిన చోట అదే పాము వచ్చి తన విషం తీసుకుందికి మంత్రం వేస్తామంటూ, అలా రాలేదంటే దానికేదో కారణం సృష్టించి, పాము కాటుతో రోగి చనిపోయే వరకూ ఏవో నటనలు చేస్తూండేవారు.

వారు చేసేదంతా నటనయే అని తెలిసిన ఆ (దొంగ) వైద్యులు, వారి వైద్యం ఆరంబించడానికి ముందుగానే రోగి బంధువుల దగ్గర దండీగా దుడ్లు సామానులు వసూలు చేసుకుంటూ పబ్బం గడుపుకోసాగేరు.

తన దగ్గరకు వచ్చే రోగుల్లో పాము కాటుకు గురైన జనం అధికంగానే ఉండడం చూసిన మదన్, తన దగ్గర పాము విషానికి విరుగుడు మందు చిన్న మంచు పెట్టేల్లో ఉంచుకోసాగేడు. అతను ఏ తండాకు వెళ్ళినా ఆ పెట్టెను కూడా తనతో తీసుకొని వెళ్లసాగేడు. ఆ విధంగా మదన్ చాలా రోగులను పాము కాటువలన వారిలో ఎక్కే విషప్రభావం నుంచి కాపాడసాగేడు.

ఈ పరిస్థితులన్నీ కలిసి - ఆ కేంద్రంలో ఉండే సర్కారువారి వైద్యుడు, సహాయకుడుతో సహా, తండాలలో ఉండే భూత ప్రేత వైద్యులు అంతా కలిసి మదన్ పై కక్ష కట్టిన శత్రువులుగా తయారై, అతన్ని అక్కడ నుంచి తరిమివేయాలి – వీలైతే తుదముట్టించాలి – అన్న నిర్ణయానికి వచ్చి, అందుకు తగిన అదనుకోసం ఎదురు చూడసాగేరు.

ఒక రోజు చీకటి పడే ముందర ఒకతను వచ్చి అక్కడకు కొంత దూరంలో గర్భంతో ఉన్న తన ఆడమనిషికి పురిటి నొప్పులు వస్తున్నాయని ఆమెను తీసుకొనిరావడం కష్టంగా ఉందని చెప్తూ – మదన్ ని వచ్చి ఆమెతో పాటూ ఆమె గర్భస్త శిశువును కూడా కాపాడమని వేడుకున్నాడు. ఆ వ్యక్తితో వెళ్ళిన మదన్, ఆమె ఆరోగ్యకరమైన శిశువును జన్మ ఇచ్చేటట్టు సకాలంలో వైద్యం చేసి వారి అభినందన అందుకున్నాడు.

కర్ణుడి చావుకు కారణాలు కోకొల్లలు అన్నట్టు –

తిరుగు ప్రయాణంలో చీకటిలో ఒంటరిగా వస్తున్న మదన్ దారిలో అడ్డంగా ఉన్న దుంగకు మోటార్ సైకల్ గుద్దుకోవడంతో కింద పడ్డాడు. కింద పడిన మోటార్ సైకల్ కి ఎక్కడ దెబ్బ తగిలిందో కానీ, ఉన్న లైట్ ఆరి ఆరి వెలుగుతూ తగినంత వెలుతురు లభ్యమవకుండా చేసింది. తనతోపాటూ పడిన మోటార్ సైకల్ లేవదీస్తున్న సమయాన, తగినంత వెలుతురు లేనందున, తన కుడి కాలు మీద ఏదో కరచిందని తెలుసుకున్నా, ఆ కరచింది పామో కాదో, పామే అయితే అది విషగ్రస్త పామో కాదో తెలుసుకోలేకపోయాడు. కింద పడినప్పుడు ఎడమ కాలు మడమ దగ్గర ఏదో సూదిగా గుచ్చుకున్నట్టు మంట పెట్టసాగగా, కుడి చేయి కూడా కొంచెం బెణికిన్నట్టు తెలుస్తోంది అతనికి. అప్పటికే తాను వెళ్ళిన చోటు నుంచి దూరంగా వచ్చేసిన కారణంతో, మరో మనిషిని సాయంగా పిలిచే అవకాశం లేదు. తన దగ్గరకి వచ్చిన మనిషి తొందర పెట్టగా బయలుదేరిన తొందరలో, పాము విషానికి విరుగుడు మందు ఉండే పెట్టె తెచ్చుకోలేదు.

వికృతంగా నవ్వుకుంటూ తన పక్కనుంచి వెళ్తున్న నాలుగు మానవ క్రీనీడలు, అందులో ఒకరి చేతిలో ఉన్న పడగ విప్పిన పాము - మిణుకు మిణుకు మంటున్న మోటార్ సైకల్ వెలుతురులో లీలగా చూస్తున్న మదన్ కళ్ళు రెప్పలార్చకుండా నిలబడిపోగా, మంచిని బ్రతకనివ్వని మానవ రూపంలో ఉన్న ఆ నలుగురు రాక్షులు చేసిన అకృత్యానికి - అతని ఆఖరి ఊపిరి అప్పుడు పూర్తిగా ఆగిపోయింది.

**శ్రీరామ**

మరిన్ని కథలు

Intini addekiste
ఇంటిని అద్దెకిస్తే...!
- బొందల నాగేశ్వరరావు
Aakhari vuttaram
ఆఖరి ఉత్తరం !
- బొల్లిముంత వెంకట రమణా రావు
Kalakshepapu porapaatu
కాలక్షేపపు పొరపాటు
- జ్యోత్స్న జల్లూరి
Dharmo rakshathi rakshitaha
ధర్మో రక్షతి రక్షితః
- సి.హెచ్.ప్రతాప్
Govindudu andari vaadele
గోవిందుడు అందరి వాడేలే
- డా:సి.హెచ్.ప్రతాప్
Neevu nerpina vidyaye
నీవు నేర్పిన విద్యయే
- మద్దూరి నరసింహమూర్తి
Sutta kosam
సుట్టకోసం
- మోహరావు మంత్రిప్రగడ
Oka maata oka jeevitham
ఒక మాట... ఒక జీవితం
- డా:సి.హెచ్.ప్రతాప్