సామాజిక పరిణామాల ప్రతిబింబాలు లొట్టపీసు పూలు.. - ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి

సామాజిక పరిణామాల ప్రతిబింబాలు లొట్టపీసు పూలు..

 

“ససంత్ర మొచ్చి ఇన్నేల్లయింది. అయినా ఈ గూడానికి ఈ మడుషులకి తెల్వి రాకపాయె. ఇంకా ససంత్రం ఎక్కడిది? తెల్లోడు పోయిండన్న మాటే గని, తెల్వైన మనోడే మనల్ని బానిసల చేసి ఆడిస్తుండు. హు... కష్టమొకడిది సుఖమొకడిది. ఛా..కాలం మారినా మడుషులు మారక పాయ గదరా? “ ససంత్రం తెచ్చిన నెహ్రునే గీళ్ళను మార్సలేకపాయె. గిప్పుడు గాయన బిడ్దోచ్చిందంట. ఆడబిడ్డ. గామె జేస్తదా! ( ఇసపురుగు కథలో ఇస్తారి పెద్దయ్య)

“లొట్టపీసు పూలు” కథల రచయిత శీలం భద్రయ్య 41 ఏళ్ల తెలంగాణ రచయిత. ఈ కథాసంపుటిలో 15 కథలున్నాయి. ఈ కథలన్నీ అక్టోబరు 2020 నుండి మే 2021 వరకు ఎనిమిది నెలల లోపల్నే వివిధ పత్రికలలో అచ్చయ్యాయి. జూలై 2021 లో పుస్తకంగా తీసుకువచ్చారు. ఈ కథా సంపుటి ఇప్పుడే ఒక కథారైతు పండించిన తాజాపంట. సరికొత్త పంట. ఈ సంపుటిలోని కథలకు ఆ కథలలోని వస్తువులను బట్టి చారిత్రక ప్రాధాన్యం ఉంది. వర్తమాన ప్రాధాన్యత కూడా ఉంది. ఈ కథలు రజాకార్ల కాలం నుండి, తెలంగాణ రైతాంగ పోరాట కాలం నుండి ఇప్పటి కరోనా సెకండ్ వేవు కాలం దాకా జరుగుతాయి. ఈ కథలు రచయితకు వర్తమానం పట్ల ఎంత ఆసక్తి ఉందో, చరిత్ర పట్ల కూడా అంతే ఆసక్తి ఉందని తెలియజేస్తాయి. చరిత్రను వర్తమానంతో అనుసంధానం చేసి, చరిత్ర కొనసాగింపును మనకు తెలియజేయాలన్న స్పృహ కథా రచయితకుంది. చరిత్రతోనే కాదు పురాణ వాస్తవికతను కూడా, వర్తమానంతో అనుసంధానం చేసే ప్రయత్నం చేశారు భద్రయ్య.

ఈ కథలన్నీ ఒకేసారి చదివితే, పాఠకులకు ఒక వివేకాన్ని కలిగిస్తాయి. ఒక చింతనను రేకెత్తిస్తాయి. ఈ కథలు పాఠకులను అద్వాన్నపుటెడారులలో వదిలేసి వెళ్లిపోవు. ఒక యువరచయిత మనం నివసించే సమాజాన్ని ఎలా అర్థం చేసుకున్నాడో చెప్పి, మనల్ని కూడా ఆలోచించమంటాడు. ఈ కథలు నల్లగొండ జిల్లా గూడెం ప్రజల జీవిత వాస్తవికతను కథనం చేస్తున్నాయి. స్వాతంత్ర్యోద్యమ కాలంనాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నల్గొండ ప్రాంతంలోనే ఉధృతంగా కొనసాగింది. ఆ ఉద్యమం 1951 అక్టోబరులో నిలిచిపోయినా , ఆ ఉద్యమకాలంలో పసివాళ్ళుగానో, యువకులుగానో ఉన్నవాళ్ళు ఆ ఉద్యమాన్ని తరువాత ఆ తరాల వారికి మౌఖికంగా చెబుతూ వస్తున్నారు. అందుకే తెలంగాణ రైతాంగ ఉద్యమ స్పృహ నేటికి తెలంగాణాలో ప్రజలలో సజీవంగా ఉంది.

భద్రయ్య రాసిన పదిహేను కథల్లో ఐదు కథలు రజాకార్ల ఆగడాలను చిత్రించాయి లేదా ప్రస్తావించాయి. అంటే ఆ ఉద్యమ ప్రభావం ఇంకా ప్రజలలో బలంగా ఉందన్న వాస్తవం తెలుస్తుంది. ఉత్తరాంధ్ర సాహిత్యంలో కూడా 1967-70 ల నాటి నక్సల్బరి ఉద్యమ స్ఫూర్తి ఆ తరువాత కాలంలోనూ ప్రతిబింబిస్తుంది.

భద్రయ్య “ఇసపురుగు”, “కేంపు చెర్వు”, “బంచెర్రాయి”, “కోదండం”, “మాయబారీ”- కథలలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో రజాకార్ల ఆగడాలను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చిత్రించారు. ఈ చారిత్రక సందర్భం భద్రయ్య కథలకు గొప్ప ప్రాముఖ్యతను తీసుకువచ్చాయి. “ఇసపురుగు” కథలో ఇస్తారి పెద్దయ్య తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు. రజాకార్లను ఎదిరించి పోరాడాడు. ఆయన పెద్దకొడుకు పోరులోనే మరణించాడు. ఆయన భార్య, కూతురు రకరకాల కారణాలతో చనిపోవడంతో ఏకాకి అయ్యాడు. ఊర్లో బతకలేక ఊరిబయట రాంబాయి పటేల్ బాయికాడ జీతగాడిగా కుదురుకున్నాడు. రజాకార్లతో అజ్ఞాత పోరాటం జేసే కాలంలో పెద్దయ్య నేర్చుకున్న ప్రకృతి వైద్యంతో నర్సమ్మ ఆపదను తొలగిస్తాడు. ఈ కథలో పెద్దయ్యకు స్వాతంత్ర్యానంతర భారతదేశ స్థితిగతుల పట్ల విమర్శనా దృష్టి ఉండడంలో అసహజత్వమేమి లేదు. ఒకవైపు రాష్ట్ర పాలకులు, వాళ్ళ ప్రైవేటు సైన్యంతోనూ, మరొకవైపు స్థానిక పటేల్, పట్వారిలతోనూ పోరాడిన పెద్దయ్య ఒక పటేల్ దగ్గర పనిజేసుకొని బతకవలిసి రావడం విషాదం. స్వాతంత్ర్యం వచ్చి శ్రీమతి ఇందిరాగాంధీ పాలన వచ్చినా, గూడెం ప్రజలకు రోడ్డు, వైద్యం వంటి సౌకర్యాలు కల్పించకపోవడం పట్ల ఆయన గట్టి విమర్శే పెట్టారు. ఈ కథలో నర్సమ్మ భర్త ఒక కొడుకు పుట్టినాక మస్కట్ వెళతాడు. అక్కడ దొంగతనం కేసులో అరెస్టవుతాడు. ఆయనను విడిపించాలంటే డబ్బు కావాలి. డబ్బు ప్రజల దగ్గర లేదు. నారాయణ పటేల్ దగ్గర ఉంది. అతడు పరమ దుర్మార్గుడు. మొగుడి ముందే పెళ్ళాన్ని చెరబట్టే దుర్మార్గుడు. పెద్దయ్య కూతురును నాశనం చేసి ఆమె ఆత్మహత్యకు కారణమైనవాడు. నర్సమ్మ స్థితి పట్ల సానుభూతి గల గంగమ్మకు కూడా అతని మీద కోపం ఉంది. అతని భార్యనే అనుమానంతో చంపేశాడు. అలాంటి వాని దగ్గరకు నర్సమ్మ అప్పు అడగటానికి వెళుతుంది. సాయంకాలం బావి దగ్గరకు వస్తే అప్పు ఇస్తానని నర్సమ్మను లోబరుచుకునే ప్రయత్నం జేస్తాడు నారాయణ పటేల్. పెద్దయ్య సాయంతో “ఇసముష్టి” మూలికా విషాన్ని నారాయణ పటేల్ కు ఇచ్చి ఆపద నుండి గట్టెక్కుతుంది నర్సమ్మ. గంగమ్మతో బాటుగా గ్రామ ప్రజలంతా నారాయణ పటేల్ ఇసపురుగు కాటుకు చనిపోయాడనుకుంటారు. నారాయణ పటేల్ చావు గురించి గంగమ్మ కసిగా అనుకోడానికి కారణం చెబితే మరొక కథ అవుతుంది. స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా గ్రామాల్లో పటేల్ ల ఆగడాలు ఆగని పరిస్థితిపై తిరుగుబాటు ఈ కథ.

“కేంపు చెర్వు” కథలో రచయిత తెలంగాణ సాయుధ పోరాట కాలానికి, నక్సల్బరీ ఉద్యమ కాలానికి ముడిపెట్టారు. ఈ కథలో నర్సమ్మ కొడుకులిద్దరిలో ఒకడు రజాకార్ల చేతిలో చనిపోయాడు. రెండోవాడు శివుడు. అతను అడవిలోకి వెళ్ళిపోయాడన్నారు. ఆరోజుల్లో రజాకార్లు ఊర్లో కొస్తే మారణ, అత్యాచారకాండలే. “రజాకార్ల వల్ల ఆ ఊర్లొ గాయపడని ఇల్లు లేదు. దెబ్బతినని మనిషి లేడు” అన్న వాక్యం పాఠకుల గుండెలను పిండుతుంది. ఆ పోరాటం పోయింది. స్వాతంత్ర్యం వచ్చింది. స్వపరిపాలన వచ్చింది. దాని వైఫల్యం నుండి నక్సల్భరి ఉద్యమం పుట్టుకొచ్చింది.అయినా ప్రజలలో రైతాంగ పోరాటస్పృహ నశించిపోలేదు. కథలో ఈ పరిణామక్రమాన్ని గమనించవచ్చు. ఈ నేపథ్యంలో చాకలి రామక్క ఆయాసపడుతూ వచ్చి నర్సమ్మతో “ఊరవతల కేంపు ఏసిండ్రని చెబుతుంది” క్యాంపు అంటే ఆమె దృష్టిలో రజాకార్ల క్యాంపే. “ఆ ముదనష్టపొళ్లు మల్లోచ్చిండ్రా” అంది నర్సమ్మ. ఆ క్యాంపు రాజాకార్లదా? కమ్యునిస్టులదా? అని ప్రజలు చర్చించుకుంటారు. చివరికి అది మూసీ జలాశయం నిర్మాణానికి సంభందించిన క్యాంపు అని తెలుస్తుంది. స్వతంత్రం వచ్చిన తరువాత కూడా దొరల ప్రభావం కొనసాగుతున్నదనడానికి ఈ క్యాంపే నిదర్శనం. అక్కడ ప్రాజెక్టు వస్తుందని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఊరొదిలి వెళ్లిపోవాలని ప్రభుత్వం ప్రకటించింది. దొర హుకుం జారీ జేస్తే ప్రజలు కన్నతల్లి వంటి ఊరునొదిలిపెట్టడానికి భారంగా కదులుతారు. వలసబాట పడుతారు. అప్పుడు శివుడు అనే ఉద్యమ నాయకుడు వచ్చి దొర కుట్రను బయటపెట్టి, నష్టపరిహారం కోసం పోరాటం చేయమని వారిని చైతన్యపరుస్తాడు. దాంతో ప్రజలు దొర మీద తిరుగుబాటు చేస్తారు. దొర గడీ వదిలి పట్నం వెళ్ళిపోతాడు. ఈ కథలో దొరతనం, పెత్తనం గ్రామాలను వదిలి పట్నాలకు చేరే పరిణామాన్ని వివరిస్తుంది.

“బంచెర్రాయి” పూర్తిగా రజాకార్ల కాలంనాటి కథ. పెండ్లి జరిగినాక కొత్త పెండ్లి కూతురు లక్ష్మమ్మ ఆమె భర్త నర్సిరెడ్డి బంధువులతో కలిసి అత్తగారింటికి పోతుంటే, వాళ్ళ బండ్ల మీద రజాకార్లు దౌర్జన్యం చేస్తారు. బహుశా ఈ కథ 1947-48 మధ్య కాలంలో జరిగి ఉండవచ్చు. రజాకార్లు తమ రాజ్యం పోతుందని తెల్సి గ్రామాల మీద దౌర్జన్యాలకు దిగే క్రమంలో పెండ్లి బండ్ల మీద పడి విధ్వంసం సృష్టించారు. అదే సమయంలో యూనియన్ సైన్యాలు వచ్చి అక్కడ గాయపడ్డ ప్రజలను కలుసుకున్నారు. రజాకార్లను తరిమికొట్టారు. ఇలాంటి ఇతివృత్తాలను రచయిత తన పూర్వికులు, గ్రామ వృద్దుల నుండి తెలుసుకుని రాసి ఉండవచ్చు. ఏడున్నర దశాబ్దాల చరిత్రను రచయిత ఈ కథ ద్వారా మనకు గుర్తు చేశారు.

“కోదండం” కథ కూడా తెలంగాణ సాయుధ పోరాట కాలం నాటిదే. చింత గూడెంలో కూలీలు పొలం పనులు చేస్తూ ఉంటారు. సాయమ్మ కూలి పెంచమంటుంది. అక్కమ్మ పాటలో ఆమెకు సమాధానం చెబుతుంది. పనులు ముగించుకొని సాయంకాలం అందరూ ఇళ్ళకు బయలుదేరుతుంటే 15 మంది రజాకార్లు వారిపై విరుచుక పడ్డారు. అక్కమ్మ పైట లాగారు. అక్కమ్మ పాడిన పాట వామపక్ష పాట కావడం వల్ల, వాళ్ళు ఆమెను హింసించి చంపేశారు. మళ్ళీ గూడెం మీద పడి కమ్యూనిస్టులను గురించి విచారించారు. సాయమ్మను నాశనం చేశారు. ఆ సమయంలో బహుశా అజ్ఞాత వామపక్ష వాదులు జరిపిన కాల్పుల్లో రజాకార్లు మరణించారు. ఆ గ్రామంలో అంజయ్య అనే విద్యార్ధి నాయకత్వంలో చిన్న పిల్లలు చింత చెట్లు ఎక్కి, వడిసెల రాళ్ళు విసిరారు. అదే సమయంలో యునియన్ సైన్యం వచ్చింది.

దీనికి కొనసాగింపు వంటి కథ “మాయబారి”. సాయమ్మ భర్త తెలంగాణ రైతాంగ సాయుధపోరాటంలో మరణించాడు. సాయమ్మ కొడుకులలో ముత్తయ్య చిన్నవాడు. తండ్రి మార్గంలో నడుస్తాడు. ముత్తయ్యను రజాకార్లు పట్టుకుపోయి సంఘ నాయకుల ఆచూకి చెప్పమని భయంకరంగా హింసిస్తారు. అదే సమయంలో సంఘ నాయకులు అక్కడకు వచ్చి రజాకార్లను తరిమికొడతారు. దాంతో ముత్తయ్య సంఘంలో కలిసిపోయాడు. రజాకార్లు మళ్ళీ అర్ధరాత్రి వచ్చి సాయమ్మను, ముత్తయ్య భార్యా పిల్లలను ఊచకోత కోస్తారు. అది తెలిసి ముత్తయ్య ఊర్లొ సంఘ సమావేశం పెడుతుండగా సాయుధ రజాకార్లు వచ్చిపడ్డారు. ముత్తయ్య తప్పించుకున్నాడు. అయినా రజాకార్లు వదిలిపెట్టలేదు. అతన్ని వెంటాడారు. దీంతో ముత్తయ్య పెద్దన్న వీరన్న నాయకుడవుతాడు. తరువాత గ్రామప్రజల సాయంతో దేశీయ విధానాలు, ప్రాంతీయ వ్యూహాలతో రజాకార్లను మట్టుబెట్టారు.

ఈ అయిదు కథలలో తెలంగాణ ఏవిధంగా దొరలు, భూస్వాముల పాలనలో సతమతమైనదో చెప్పి, ప్రజాచైతన్యాన్ని చిత్రించారు రచయిత. పాలకవర్గ నిరంకుశత్వం, దౌర్జన్యాలను ప్రజలు, ప్రజాసంఘాలు సంఘటితంగా ఎదుర్కోవడమే మార్గమని ఈ కథలు చెబుతూ వచ్చాయి.

ఈ కథా సంపుటిలో “కొత్త దొర” అన్నది చాలా విశిష్టమైన కథ. దొరతనం మారకుండా దొరలు మారితే ప్రయోజనం శూన్యమని, వ్యవస్థను మార్చకుండా వ్యక్తులు మారితే లాభం లేదని ఈ కథ చెబుతుంది. ఎవరు పాలిస్తున్నారన్నది కాదు. ఎలాంటి పాలన సాగుతున్నది అనేదే ప్రధానమని ఈ కథ చెబుతుంది. ఈ కథ భుజాలు మార్చుకొని చేసే రాజకీయాల దోపిడీ స్వభావాన్ని కన్నులకు కడుతుంది.

స్వతంత్రం రాకముందు నిజాం పాలనలో దొర దగ్గర బంటుగా పనిజేసిన పెంటయ్య, తానే దొరయితే ఎలా ఉంటాడో భద్రయ్య ఈ కథలో చిత్రించారు. స్వాతంత్ర్యం రాకముందు దొర దగ్గర పాలేరుగా ఉండేవాడు పెంటయ్య. దొర చెప్పిన పనులన్నీ చేశాడు. ఆ దొర పరమ దుర్మార్గుడు. స్త్రీ లోలుడు. ఒకరోజు పెంటయ్య దొర దగ్గరికి వచ్చి దొర భూములు ప్రజలు స్వాదీనం చేసుకుంటున్నారని యూనియన్ సైన్యాలొస్తాయని తెలిసి ఊరి జనానికి ముల్లు పెరిగిందని, వాళ్లకు కమ్యూనిస్టులు తోడయ్యారని , చెప్పు కింద తేళ్ళులాగ ఉన్న జనం దొరను దొర భూములను లెక్కజేయడం లేదని వ్యాఖ్యనించాడు.

అప్పుడు దొర సూర్యాపేటకు పోయి అక్కడి నుంచి కిరాయి గుండాలని తీసుకురమ్మని చీటీ రాసి అతనిని పంపాడు. పెంటయ్య భార్య మీద దొర మనసుపడిందనే విషయం పెంటయ్య తెలుసుకుంటాడు. ఆమెను అతని బారిన పడకుండా జాగ్రత్తగా కాపాడుకున్నాడు. అందువల్ల సూర్యాపేట పోవడానికి పెంటయ్య తటపటాయించాడు. అయినా వెళ్లక తప్పలేదు. తెల్లారేసరికి సూర్యాపేట నుండి రెండు వందల మంది కిరాయి గుండాలు వచ్చి దొర భూముల్లో దిగారు. విధ్వంసం సృష్టించారు. ఆ భూముల్లోకి ఊరిజనం వస్తే హింసించారు. వెంకయ్యని చంపారు. యాదయ్య గొర్లను ఎత్తుకుపోయారు. ఆరోజు “ ఏ ఇంట్లో విన్నా మూలుగులే”. ఇది తెలిసి కమ్యూనిస్టులు వచ్చారు. ఆటపాటలతో జనాల్ని చైతన్య పరిచారు. ఆ సమయంలోనే పెంటయ్య వచ్చి. తన భార్యను దొర చెరిచేసి, గొంతు పిసికి బావిలో వేశాడని ఏడుస్తూ చెబుతాడు. దాంతో జనం ఆవేశం కట్టలు తెంచుకుంది. పెంటయ్య కూడా ప్రజల తిరుగుబాటులో కలిశాడు. ప్రజాగ్రహాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. 17 గ్రామాల ప్రజలు దొరపై తిరుగుబాటు చేయడంతో కిరాయి గుండాలు తోక ముడిచారు. జనం దొర గడీని కోపంతో కూల్చివేశారు. అప్పటికే దొరను, భార్యను తుదముట్టించిన పెంటయ్య తన భార్య చావును జనాల వద్ద సానుభూతికి సాకుగా చూపి తరువాత కాలంలో వారి అండతో అధికారంలోకి వస్తాడు.

ఆ తర్వాత ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చింది. దొర పోయిండు, దొరతనం పోయిందని భావించిన పేదప్రజలు పెంటయ్యను నాయకుడిగా చేసుకున్నారు. పెంటయ్య రెండోసారి పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యగా వచ్చింది దొర కూతురే. పెంటయ్య దొర గడీని అనుకూలంగా నవీకరించుకుంటాడు. “కొత్త గడీల కూసున్న పెంటయ్య నాయకుడికి గడీల దొరతనం,కరుకుదనం చేరింది.” కొన్నాళ్ళు కోటలో , కొన్నాళ్ళు పట్నంలో ఉంటున్నాడు. ప్రజల సమస్యలు సమస్యలుగానే మిగిలిపోయాయి. ప్రజలకు భూమి దక్కలేదు. వృత్తులు పోయాయి. వ్యాపార వృత్తులు పెరిగాయి. వృత్తులు కోల్పోయిన వారు భూమిని కోరుకున్నారు. ప్రజల అసంతృప్తిని గమనించిన పెంటయ్య కోట గడీకొచ్చాడు. తెలివిగా కులవృత్తులను కట్టుబాట్లను పునరుద్ధరించే ప్రయత్నం చేశాడు. లేకపోతే జనం భూమి కావాలంటారని, తన మీద దళితులు తిరగబడతారని గ్రహించాడు.చివరికి జనం పెంటయ్య మీద తిరగబడతారు. ఈ కథ ఒక చారిత్రక పరిణామ కథ. చాలా నర్మగర్భంగా ఇది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలాన్ని ఆతర్వాత కాలాన్ని చిత్రించినట్లు కన్పించినా, జాగ్రత్తగా ఆలోచిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందటి పాలనను, తెలంగాణ రాష్ట్ర అవతరణ తరువాత పాలనను చిత్రించినట్టు అర్ధమవుతుంది. ఈ కథలో స్వతంత్రం అంటే రాష్ట్ర అవతరణ అని అర్థం చేసుకుంటే, దొర పాలన ఆంధ్ర నాయకుల పాలన అని, పెంటయ్య పాలన రాష్ట్ర ఏర్పాటు తర్వాత పాలన అని అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, తెలంగాణలో స్వపరిపాలన వచ్చినా, సామాజిక న్యాయ తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పడలేదని, అందువల్ల ఇంకా ఉద్యమాలు రావాల్సిన అవసరం ఉందని ఈ “కొత్త దొర” కథ చెబుతున్నది అనిపిస్తుంది. ఇప్పటికే తెలంగాణలో ఏర్పడి ఉన్న తెలివికి ఈ కథ అక్షర రూపమని చెప్పవచ్చు.

ఈ సంపుటిలో గురుశిష్య సంబంధాలను చిత్రించే రెండు కథలున్నాయి. ఒకటి “కర్తవ్యం”. రెండు “టముకు”. మొదటిది ఉద్యోగుల కథ. రెండవది కళాకారుల కథ. “కర్తవ్యం”లో పాఠశాలలో మర్రి ఊడలు పట్టుకొని ఉయ్యాలూగే రాముడు జారి రాయి మీద పడి తల పగలడంతో ఆస్పత్రిలో చేర్చారు. డాక్టర్ కట్టుకట్టి పెద్ద ఆస్పత్రికి తీసుకుపొమ్మంటాడు. పెద్దాసుపత్రిలో వైద్యానికి లక్ష రూపాయలవుతుందని డాక్టరు చెబుతాడు. ఆపరేషన్ తర్వాత ఏమైందో తెలియదు. రాము చదువుకొని ఉద్యోగం సంపాదించి తన గురువు రాఘవయ్య సారు ఆశీర్వాదం తీసుకుందామని అతని వద్దకు వచ్చాడు. వచ్చేసరికి రాఘవయ్య సారు పాడె మీడున్నారు. అంత్యక్రియలయ్యాక రామునికి రాఘవయ్య డైరీ ఇస్తాడు రాఘవయ్య నౌకరు వెంకయ్య. ఆ డైరీ లో రాఘవయ్య రాముని గురించి గొప్పగా రాసి ఉంటాడు. అందులో “నా జీవితంలో గెలిచిన జ్ఞాపకం రాముడు” అని రాసి ఉంటుంది. ముగ్గురు అనాధ పిల్లలను చేరదీసి ఆదరించినట్లు, వాళ్ళ పోషణకు పెన్షన్ ఖర్చుపెట్టి తన ఆరోగ్యాన్ని లెక్కచేయనట్టుగా రాసి ఉంటుంది. అప్పుడు గతంలో రామునికి రాఘవయ్య సారు చేసిన మేలు గుర్తుకు వస్తుంది. తను ఆసుపత్రిలో ఉన్నాడు. నానమ్మ శవమైపోయింది. రాఘవయ్య రోడ్డు ప్రమాదంలో భార్య పిల్లల్ని పోగొట్టుకుని, గాయాలతో ఆసుపత్రికి వస్తాడు. విషయం తెలుసుకుని తన దగ్గరున్న డబ్బు ఇచ్చి వైద్యం చేయిస్తాడు. ఇది జ్ఞాపకం వచ్చి రాఘవయ్య సారు ఆదరించిన ఆ ముగ్గురు పిల్లలను తాను ఆదరిస్తారు. వాస్తవానికి ప్రచారానికి మధ్య ఉండే దూరాన్ని గురు-శిష్య సంబంధం ద్వారా భద్రయ్య రాసిన కథ “టముకు”. గ్రామ విషయాలను ప్రజలను తెలియపరిచేటప్పుడు ఉపయోగించే వాయిద్య సాధనం టముకు. ప్రచారానికి ప్రతీక. ఈ కథలో బుచ్చయ్య పంతులు, సర్వడు చిడ్తల కళలో గురుశిష్యులు. సర్వడు మంగలి పని చేసుకొని జీవనం గడిపే, చిడ్తల కళాకారుడు. మంచి అందగాడు. ఆయనను ఒక రోజు తన చెల్లెలు ఇందిరను బలాత్కరించాడని అపోహపడి చెట్టుకు కట్టేసి కొడతాడు వీరారెడ్డి. బుచ్చయ్య పంతులు వెళ్లి ప్రాధేయపడి వినిపించుకుని వస్తాడు. దాంతో ఊళ్ళో మంచి పేరున్నసర్వడికి చెడ్డ పేరు వస్తుంది. ఆ అవమానం భరించలేక సర్వడు తన భార్యను తీసుకొని వేరే ఊరుకు వెళ్ళిపోతాడు. ఇందిర ఇంట్లో చెప్పకుండా ఎవరితోనో లేచిపోతుంది. ఇందిర అన్న వీరారెడ్డి సర్వడిపై అనుమానంతో కేశపురం సర్వని ఇంటికి వెళ్లి చూస్తాడు. సర్వడి భార్య మాత్రమే ఉంటుంది. అవమానం భరించలేక వీరారెడ్డి ఉరేసుకుంటాడు. దాంతో కేశపురంలో కూడా సర్వయ్య మీద దుష్ప్రచారం జరుగుతుంది. నిజానికి ఇందిర ఇంకో కళాకారుడైన మల్లయ్యతో వెళ్ళిపోతుంది. కానీ ఈలోపు ఆ గ్రామంలో కూడా సర్వడిపై దుష్ప్రచారం పాకిపోతుంది. లాభం లేదని సర్వడు ఆ ఊరును వదిలి మరోచోటుకు జీవనాన్ని మారుస్తాడు. మంచి చిడ్తల కళాకారున్ని కోల్పోవడంతో గ్రామంలో బుచ్చయ్య పంతులు ప్రదర్శించాలనుకున్న ప్రదర్శన ఆగిపోతుంది. చాలా కాలం తరువాత బుచ్చయ్య పంతులు తన మనుమరాలును చూడడానికి రాంపురం పోతున్నప్పుడు దారిలో యాదృచ్చికంగా అక్కడ చిడుతల రామాయణం ప్రదర్శన చూస్తాడు. అది తనవల్ల కాని పద్మవ్యూహాన్ని సర్వడు ప్రదర్శిస్తుంటాడు. దుష్ప్రచారం మానవ సంబంధాలను ఎంతగా అస్థిరపరుస్తుందో ఈ కథ చెబుతుంది. స్నేహం గొప్పదనం, ఆ నాటి కళలు, వైభవం, అమాయకత్వం అవన్నీ కథలో ఉంటాయి.

ఈ సంపుటిలో రెండు పరువు హత్య కథలు ఉన్నాయి. ఒకటి ఖూని. రెండవది శూర్పనఖ. గత పదేళ్లుగా తెలుగునాట పరువుహత్యలు, దుర్మార్గాలు పెరిగిపోయాయి. వీటికి ప్రధాన కారణం యువతీ యువకులలో స్వాతంత్ర్య ప్రకటన. కులాంతర ప్రేమ వివాహాలు. వీటిని సహించలేని ఆధిపత్య కులాల వాళ్ళు, నిరంకుశ వాదులు హత్యలకు పూనుకుంటున్నారు. శూర్పణఖ కథ రామాయణ శూర్పణఖ కథ నేపథ్యంగా రాశారు భద్రయ్య. రంగారావు అనసూయమ్మల కుమారుడు రామారావు. వాళ్ళ దగ్గర పనిచేసే గంగమ్మ, శంకరయ్యలకు కుమార్తె మీనాక్షి. బాల్యం నుండి రామారావు, మీనాక్షి కలిసి చదువుకున్నారు. వాళ్ల కులాలు, ఆర్థిక స్థితిగతులు వేరైనా, వాళ్ల హృదయాలు మాత్రం ఒక్కటయ్యాయి. కానీ రంగారావు తల్లిదండ్రులు అతడికి రమతో బలవంతంగా పెళ్లి చేశారు. విధిలేని పరిస్థితుల్లో ఆమె అమ్మానాన్నలు మీనాక్షికి ఒక దురలవాట్లున్న వ్యక్తితో పెళ్లి చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో అనసూయమ్మది నిరంకుశ పాత్ర ఉంది. రంగారావు రమతో సంసారం చేయలేదు. మీనాక్షి భర్త మరణించాడు. ఆమె ఒంటరిదయింది. రంగారావు మీనాక్షిలు రహస్యంగా కలుస్తున్నారు. ఇది బయట పొక్కింది. ఇది తట్టుకోలేని అనసూయమ్మ మీనాక్షిని కారణంగా భావించి, ఆమె ఉంటున్న ఇంట్లోనే అగ్నికి ఆహుతి చేస్తుంది. శూర్పనఖగా మిగిలిపోతుంది.

“ఖూనీ”లో ధరణికి ఇష్టం లేని పెళ్లి చెయ్యబోతె రైల్వేస్టేషన్ లో ఆమెను పెళ్లి చేసుకోబోతున్నారనుకుని అనుమానంతో ధరణి తండ్రి చంపేస్తాడు. ఈ కథా నిర్మాణం కొంత సంక్లిష్టంగా ఉన్నా సారాంశం ఇది. ఈ కథ పరువు హత్యలపైన ఈ తరం యొక్క నిరసనే.

మూఢనమ్మకాల వల్ల బతుకులు ఎలా నాశనమవుతాయో చెప్పిన కథ “లత్త”. లింగమ్మకు నుదిటిమీద ఎగనాకుడు ఉందని, మల్లయ్య తల్లి ఆ సంబంధాన్ని ఒప్పుకోదు. అందరి ఒత్తిడితో ఒప్పుకుంటుంది. వెయ్యి రూపాయల కట్నం, రెండువేల రూపాయలకు పెరిగిపోతుంది. అనేక రకాల ఆశ చూపించాక చివరికి ఒప్పుకుంటుంది. తీరా పెళ్లి దగ్గరకు వచ్చేసరికి లింగమ్మ తండ్రి మరణిస్తాడు. దాంతో మల్లయ్య తల్లి నమ్మకం బలపడడంతో వెనక్కి తగ్గుతారు. పెండ్లి రద్దయిపోతుంది. చివరికి లింగమ్మకు ఇద్దరు భార్యలు మరణించిన వ్యక్తితో పెళ్లి జరుగుతుంది. లింగమ్మను చేసుకోవాల్సిన మల్లయ్య చివరికి బిక్షగాడు అవుతాడు. మానసిక స్వస్తత చేకూరే వరకు లింగమ్మ దంపతులు అతనికి ఆశ్రయం కల్పించి ఆదరిస్తారు.

“తోడు” కథ ఇప్పటి వైద్యరంగంలోని అమానుషత్వాన్ని వాస్తవికంగా చిత్రించింది. పల్లెలో బతకలేక పట్నం వెళ్ళిన విజయమ్మ రామలింగంలు ఉపాధి కోల్పోవడం వలన, కూతుర్ల ధన దాహం వలన నిరాశ్రయులైన ఆ దంపతులు వృద్దాప్యంలో వైద్యం చేయించుకోలేక జంటగా కన్ను మూసిన వాస్తవాన్ని ఈ కథ చెబుతుంది. అలాగే పల్లె నుండి పట్నం వచ్చి కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి మళ్ళీ పల్లెకు చేరే క్రమంలో ప్రమాదానికి గురైన రాములమ్మ, రాములు విషాద గాథ “అగ్గువ బతుకులు”. “వెలుగు చుక్క” సైనిక నేపథ్యంలోఉన్న కథ. ఆనందరావు, కిరణ్ ల సాహస గాథ. ఆనందరావు కుమారుడిని , ఆయుధాలను ఎత్తుకెళ్ళిన తీవ్రవాదులనుండి సాహాసం చేసి కిరణ్ కొన్ని గంటలలోనే తిరిగి తీసుకొస్తాడు. “లొట్టపీసు పూలు” చెరువులో పూస్తాయి. శివుడు ఆ లొట్టపీసు పూల చెట్లను నరికి వాటితో తడికల అల్లి జీవనం సాగిస్తాడు. అనుకోకుండా అతనిపై ఎల్లయ్య పంతులు అనే పెద్దమనిషిని చంపాడనే హత్యనేరం పడుతుంది. అంతకు ముందు తాతతో చెరువు దగ్గర యమున “లొట్టపీసు పూలు” ఇష్టపడి వెంట తెచ్చుకుంటుంది. ఆ పూలు బతుకమ్మను పేర్చడంలో ఉపయోగపడవని, వాటిని ముట్టరాదని సలువమ్మ తన బిడ్డ యమునకు చెబుతుంది. చివరికి ఆ హత్యోదంతాన్ని, నేరస్తుడిని పట్టివ్వడంలో ఆ “లొట్టపీసు పూలే” ఉపయోగపడతాయి. గ్రామాల్లో లొట్టపీసు చెట్లు చెరువుల్లో పెరిగినపుడు, అవి పెరగకుండా వాటిని అడుగుకు తొక్కి వేస్తారు. కొంత కాలం తరువాత లొట్టపీసు చెట్లు తిరిగి లేస్తాయి. ఈ క్రమంలో వాటినే నమ్ముకున్న కొన్ని వృత్తుల వాళ్ళు కొంతకాలం ఉపాధి కోల్పోతారు. ఈ కథల్లో అణిచివేత, చిన్నచూపుకు గురైన జీవితాల తిరుగుబాటు ప్రధానంగా ఉండడంతో ఈ పుస్తకానికి శీర్షికగా “లొట్టపీసు పూలు” అని నిర్ణయించారు రచయిత.

ఈ కథలన్నీ కలిసి సారాంశంలో స్వాతంత్య్రానంతర ఆర్థిక సాంఘిక రాజకీయ వాస్తవాలపై రచయిత చేసిన వ్యాఖ్యలు. స్వాతంత్ర వచ్చినా, సాధించవలసినంత అభివృద్ధిని, మార్పును సాధించలేకపోవడం వల్ల, దోపిడీని నిర్మూలించలేకపోవడం వల్ల, బలవంతుల దౌర్జన్యాలు అలాగే కొనసాగుతున్నాయని ఈ కథలు చెబుతాయి. ప్రజలలో సాంఘీక చైతన్యం కల్గించడంలో పాలకులకు శ్రద్ద లేకపోవడం వలన కుల వివక్ష కొనసాగుతూ, పరువు హత్యలు జరుగుతున్నాయి. మూఢనమ్మకాల నిర్మూలనలో పాలకులు విఫలం కావడం వల్ల వివాహ సంబంధాలు దెబ్బతింటున్నాయని ఒక కథ చెబుతుంది. పేదరిక నిర్మూలన జరిగకపోవడం వల్ల అనేక అనర్ధాలు జరుగుతున్నాయి. చేరదీసిన వాళ్ళను చంపేయడం, పల్లెలను వదిలి పట్నాలకు పోయి కష్టాల పాలవ్వడం వంటి అనర్ధాలు జరుగుతున్నాయని కొన్ని కథలు చెబుతాయి. “సమాజంలో ఎన్ని లోపాలున్నా, మానవత్వం పూర్తిగా చావదు” అని చాటి చెప్పే ధోరణి చాలా కథలలో కనిపిస్తుంది.

భద్రయ్యకు వస్తువు మీద మంచి శ్రద్ధ ఉంది. వస్తువుని కథగా మలచడంలో పరిణతిని సాధించవలసి ఉంది. సామాజిక సంబంధాలను, పరిణామాలను భద్రయ్య జాగ్రత్తగా చిత్రిస్తాడు. కొన్ని సార్లు కాకతాళీయతను నమ్ముకుంటాడు. కొన్నిచోట్ల అనూహ్య మలుపులు తిప్పాలనుకుంటారు. సీరియస్ రచయితగా ఉన్న భద్రయ్య కమర్షియల్ కోణాన్ని ఆయన పరిహరించుకోవాల్సి ఉంది. చక్కని తెలంగాణ భాష ఆయన సొంతం. ఈ కథలలోని పాత్రలు చాలా వరకు బడుగుల జీవితాలు. తల్లి లేని పిల్లలు, తండ్రి లేని పిల్లలు, ఇద్దరూ లేని పిల్లలు, నానమ్మ తాతయ్య పోషణలో పెరిగిన వాళ్ళు, భర్తల నిరాదరణకు గురైన స్త్రీలు, భర్త చనిపోతే మరొకరితో వెళ్లిపోయిన స్త్రీలు. ఈ కథల్లో వీళ్లంతా సామాన్యులు. భద్రయ్య తన పరిమితమైన జీవితానుభవంలో గొప్ప వైవిధ్యభరిత కథలే రాశాడు.