
రామయ్య పల్లెటూర్లో వ్యవసాయాన్ని నమ్ముకుని బ్రతకలేక పెళ్లయిన వెంటనే భార్యతో కలిసి నగరానికి వచ్చేసాడు. చిన్న టీ కొట్టు పెట్టుకొని భార్యా తను కష్టపడుతూ బతుకుతున్న అతనికి, ఒక లాటరీ టికెట్లు అమ్మే వ్యక్తి, తను తాగిన టీ డబ్బులకు బదులుగా లాటరీ టికెట్స్ అంటగట్టి వెళ్ళాడు.
అప్పటికే గర్భవతి ఐన అతని భార్య కమల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మహాలక్ష్మి పుట్టిందని భావించి పాపకు శ్రీనిధి అని పేరు పెట్టుకున్నారు. పేరుకు తగినట్లుగా తనతో పాటు నిధిని తెచ్చింది ఆ పాప. లాటరీ లో కోటి రూపాయల బహుమతి వచ్చింది రామయ్యకి. దాంతో పెద్ద హోటల్ ప్రారంభించి అంచలంచెలుగా, శాఖలుగా విస్తరించి నగరంలోనే ఎన్నదగినన ధనవంతులలో ఒకడిగా, రామారావుగా మారిపోయాడు రామయ్య.
తన కూతురి అదృష్టం వల్లే ఇదంతా జరిగిందనే తలంపుతో నిధిని ‘అద్దాల మేడలో రాకుమారిలా’ ఎంతో మురిపంగా పెంచారు ఆ దంపతులు. తల్లిదండ్రులు చేసిన అతి గారాబం వల్ల పెంకి పిల్లగా మారింది ఆమె. తను ఏదంటే అది. తన మాటకు ఎదురు ఉంటే సహించలేని విధంగా ఉండేది ఆమె ప్రవర్తన. అప్పుడప్పుడు తగవులు తెచ్చిపెడుతూ, ఒక్కోసారి విసుగు తెప్పిస్తున్నా, తల్లిదండ్రులు కనుక కూతుర్ని ఏమీ అనలేక తమలో తామే మదన పడుతూ ఉండేవారు.
ఇలా ఉండగా కాలేజీలో తనతో పాటు చదువుకుంటున్న మంత్రిగారి కూతురు దివిజతో ఏదో విషయంలో మాట పట్టింపు వచ్చి చిలికి చిలికి గాలి వానగా మారింది. అటువైపు ఉన్నది మంత్రి గారి అమ్మాయి. అందులోనూ జరిగిన గొడవలో ఆమె తప్పులేదు. అందువల్ల ఆమె కూడా ఏమాత్రం తగ్గలేదు. అలా వాళ్ళిద్దరి తగవు వేడి రామారావుకి, మంత్రి గారికి తగిలింది. చాలా భయపడిపోయాడు రామారావు. ‘పెద్దవాళ్లతో వ్యవహారం కత్తి మీద సాము’ అని తెలుసు అతనికి.
ఏం చేయాలో పాలుపోలేదు. రెండు నెలలు తిరిగేసరికి రామారావు వ్యాపారంలో ఏదో లొసుగులు ఉన్నాయంటూ అతని హోటల్స్ అన్నీ మూతపడ్డాయి. కుటుంబమంతా వీధిన పడింది. అవమానంతో అలా రోడ్డుపై ఉన్న సమయంలో రామారావు మేనల్లుడు వచ్చాడు. మేనమామ కుటుంబాన్ని ఆ పరిస్థితుల్లో చూసి వెంటనే ఊర్లో తమ ఇంటికి తీసుకు వెళ్ళాడు. ఇదివరకు బావ ఎన్నిసార్లు వచ్చినా ఏనాడూ అతడిని చూడలేదు శ్రీనిధి. డబ్బు ఉన్నప్పుడు చుట్టూ చేరి, అవసరం రాగానే అటువంటి వాళ్లంతా తమని గాలికి వదిలేసినా, నేనున్నానంటూ తమ ఇంటికి ఆహ్వానించిన బావని మొదటిసారి తేరిపార చూసింది ఆమె. తననే చూస్తున్న బావ కళ్లతో కళ్ళు కలపలేక తలదించుకుంది.
“మా ఇంట్లో మీకు అన్ని సౌకర్యాలు ఉండకపోవచ్చు, కొన్నాళ్ళు సర్దుకోక తప్పదు. ఈ లోగా న్యాయపోరాటం చేసి మీ వ్యాపారాలు మీ చేతికి వచ్చే ఏర్పాటు చేస్తాను మావయ్యా,” అని చెప్తున్న మేనల్లుడితో, గూడు చిన్నదైతేనేమి, గుండెల్లో అభిమానం ఉండాలి, ఈరోజు నువ్వు ఆదుకోకుంటే మా పరిస్థితి ఏమై ఉండేదో తలుచుకోవడానికి కూడా భయమేస్తుంది,” మనస్ఫూర్తిగా అన్నాడు రామారావు.
మొదట్లో ఆ ఇంట్లో, అటువంటి పరిసరాల్లో ఉండేందుకు నిజంగా చాలా ఇబ్బంది పడిన శ్రీనిధి, తన అత్త, మామయ్యలు, బావ చూపిస్తున్న ప్రేమ, అనురాగాలకు కరిగిపోయింది. తను డబ్బు వరదలా పొంగించినప్పుడు తన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్, ముఖ్యంగా నువ్వే నా లోకం, అంటూ తన చుట్టూ తిరిగిన బిజినెస్ మాగ్నెట్ రాఘవ గారి అబ్బాయి శైలేష్ ఇప్పుడు తన ఫోన్ కాల్స్ కి రిప్లై కూడా చేయకపోవడంతో, జీవితంలోని రియాలిటీ ఆమెకు నెమ్మది నెమ్మదిగా బోధపడింది. బావ అంటే ఇష్టమూ పెరిగింది.
అదే మాట అతనితో చెప్పేందుకు ధైర్యం చాలక తన తండ్రితో చెప్పింది. “బాగా ఆలోచించుకొని చెప్పు.బావ బాగా చదువుకున్నాడు, ఉద్యోగం చేసుకుంటున్నాడు, కాదనను. కానీ రేపు మనం కోర్టు కేసు గెలిస్తే, అప్పుడు మనం ధనవంతులం. కానీ బావ మన ఇంటికి ఇల్లరికం రాడు. నువ్వు ఈ ఇంట్లో జీవితకాలం ఉండగలవా? పేదరికం అంటే నీకు ఏమాత్రం ఇష్టం లేదు కదా?” కూతుర్ని అడిగాడు తండ్రి.
“నాన్నా, ప్రేమకు లేదు పేదరికం. నేను బావ వ్యక్తిత్వాన్ని ఇష్టపడుతున్నాను. దగ్గరగా చూసినప్పుడు, డబ్బుతో ఉన్నప్పుడు నేను ఉన్న జీవితమంతా కృత్రిమమే అని నాకు బోధపడింది. ఇప్పుడిప్పుడే అసలైన, సహజమైన జీవితం రుచి చూస్తున్నాను. నేను బావనే పెళ్లి చేసుకుంటాను,” మనస్ఫూర్తిగా చెప్పింది శ్రీనిధి. ఇప్పుడు తను పూర్తిగా మారిన మనిషి.
వాళ్ళ పెళ్లి జరిగిన కొన్ని రోజులకే మేనల్లుడు చేసిన న్యాయ పోరాటం ఫలితంగా రామారావుకి తన ఆస్తులన్నీ తిరిగి చేతికి అందాయి. “నువ్వు చెప్పింది నిజమే సాయీ, కొన్ని కొన్ని సందర్భాల్లో మన పిల్లలతో మనం కఠినంగా ఉండటమే మనం వాళ్లపై చూపించే నిజమైన ప్రేమ,” తామిద్దరే ఉన్నప్పుడు మేనల్లుడితో చెప్పాడు రామారావు.