వివేకానందుని తాత్విక చింతన - పిళ్లా కుమారస్వామి

వివేకానందుని తాత్విక చింతన

ప్రాథమికంగా వివేకానందుడు అద్వైత వాది. భావవాది దేనిని బ్రహ్మంగా పిలుస్తాడో, భౌతికవాది దానినే పదార్థంగా పిలుస్తాడన్నాడు. ఈ ప్రపంచం భ్రాంతి అని శంకరుని అద్వైత భావనకు విరుద్ధంగా, వివేకానందుడు ఈ ప్రపంచం వాస్తవమనే విషయాన్ని అంగీకరించాడు. వేదాంతం అంటే జీవితానికి దూరంగా పారిపోవడం కాదు. అది సజీవంగా రోజువారీ జీవితంలో భాగంగా ఉండి, నైతిక ప్రమాణాలను పెంచేదిగా ఉండాలన్నారు. ‌‌ ప్ర‌‌కృతి కొన్ని సూత్రాలను అనుసరిస్తుందని, వాటిని మనం తప్పక పాటించాలన్నాడు. కానీ, ప్రకృతికి ఉన్నట్లే సమాజానికి కూడా కొన్ని చలనసూత్రాలు ఉన్నాయనే విషయాన్ని వివేకానంద గుర్తించలేక పోయాడు. గురువు పరమహంస బెంగాల్ రాష్ట్రం వరకు పరిమితమైతే శిష్యుడు చికాగో వరకు హిందూ మతాన్ని విస్తరించాడు. హిందుమత ప్రపంచీకరణ ప్రక్రియకు వివేకానంద ఆనాడే పునాది వేసినాడు. రామకృష్ణ పరమ హంస శిష్యుడిగా, కలకత్తాలో 1897 లో రామకృష్ణ మిషన్ ను, బేలూరు మఠాన్ని స్థాపించాడు. ‌‌ హిందూ మతం రాడికల్ పరివర్తనకు గురికానివ్వ కుండా సైన్సును, మతానికి ముడివేశాడు వివేకానంద. ఐనిస్టీన్ ప్రతిపాదించిన శక్తినిత్యత్వ సూత్రాన్ని ఆదిశక్తి గా; డార్విన్ పరిణామవాదాన్ని దశావతారాలుగా పోల్చాడు. జర్మన్ తత్వవేత్త హెగల్ గతితర్కాన్ని వేదాలలో ఉందన్నారు.ఆధునిక విమానాన్ని పుష్పక విమానంతో ముడి పెట్టాడు. నాటి పుక్కిటి పురాణ గాథల్ని, నేటి విజ్ఞాన శాస్త్రాలతో ముడి వేసినాడు. ఒక్కమాటలో చెప్పాలంటే తనకాలంలో క్షీణిస్తోన్న పాత హిందూ మత ధార్మిక వ్యవస్థను ధ్వంసం చేసుకుంటూ కొత్త గా వస్తున్న భావాలతో నాశనం కానివ్వకుండా కాపాడాడు వివేకానంద.వేదాంతం అంటే మానవత. మానవునిలో అంతర్లీనంగా ఉండే దైవత్వాన్ని మేళవించి శుష్కవేదాంతం స్థానంలో నిర్దిష్ట నైతిక విధానాలు, గందరగోళమైన యోగా సిద్దాంతం స్థానంలో శాస్త్రీయ దృక్పథంగల ఆచరణా త్మకమైన మనస్తత్వం పెంపొందించాలన్నాడు. వివేకానంద బోధనలతో ప్రభావితమైన వివిధ ఫ్యూడల్ సంస్థాన పాలకులు వేదవిద్యకు బదులు ఆధునిక విద్య వైపు వెళ్లారు. వివేకానందుడు ఆధునికతకు, పాత ఫ్యూడల్ సంప్రదాయాలకు వారధిగా నిలిచాడని చెప్పవచ్చు. వివేకానంద అసలు పేరు నరేంద్ర నాధ్ దత్.1863 జనవరి 13 జన్మించాడు. తండ్రి మరణం తర్వాత నరేంద్ర కుటుంబం అత్యంత పేదరికంలోకి పోయింది. అతని తల్లి , సోదరీమణులు రోజుకు భోజనం పొందడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. తరచుగా నరేంద్ర రోజుల తరబడి ఆహారం లేకుండా జీవించాల్సి వచ్చింది. అపారమైన మేధాసంపత్తి కలవాడనీ అతనికి పేరుంది. కానీ విద్యార్థి దశలో నరేంద్ర నాథ్ సగటు విద్యార్థే.అతను విశ్వవిద్యాలయ ప్రవేశ స్థాయి పరీక్షలో 47%, FA లో 46% (తరువాత ఈ పరీక్ష ఇంటర్మీడియట్ ఆర్ట్స్ అయ్యింది) , BA లో 56% మాత్రమే సాధించాడు.BA డిగ్రీ ఉన్నప్పటికీ, నరేంద్ర నాథ్ ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నించారు.దాంతో దేవునిపై అతని నమ్మకం చెదిరిపోయి అతను దాదాపు నాస్తికుడిగా మారారు. కాకపోతే స్వామి వివేకానందకు అద్భుతమైన ఏకాగ్రత శక్తి ఉంది. అతను విపరీతమైన రీడర్. లైబ్రరీ నుండి అనేక పుస్తకాలను అరువు తీసుకొని మరుసటి రోజు వాటిని తిరిగి ఇచ్చేవాడు.అనర్గళ ప్రసంగకర్త. తన గంభీరమైన ప్రసంగాల ద్వారా ప్రపంచాన్ని కదలించాడని అందరికీ తెలుసు. ఆయన కలకత్తాలో 1880 FA చదివాడు. తర్వాత BA పూర్తి చేశాడు. ఆ కాలంలో కలకత్తాలో జూట్, పోర్టు, మున్సిపల్, రిక్షా కార్మిక సమ్మెలు జరిగాయి. వాటి గూర్చి పట్టించుకోలేదు. ఆయన 1888లో సన్యాసిగా మారి 1893 వరకు ఐదేళ్లు దేశపర్యటన చేసాడు. 1893 సెప్టెంబర్లో విశ్వమత మహా సభకై వెళ్లి మూడున్నర ఏళ్లు అమెరికా దేశంలో పర్యటించాడు. అక్కడ అప్పటికే ఎనిమిది గంటల పని దినం కోసం 1886లో కార్మికవర్గం తమ రక్తాన్ని చికాగోలో చిందించింది.అదే చికాగోలో మరో ఏడేళ్లకు వివేకానందుడు ఉన్నాడు. ఆయన అమెరికాలో ఉండగానే మూడు సార్లు మేడేలు జరిగాయి. నలుగురు మేడే కార్మిక యోధుల్ని ఉరితీసిన విషాదంలో ఆ కార్మికవర్గం ఉంది. ఐనా వారి కోసం ఒక కన్నీటి చుక్కను కూడా కార్చలేక పోయాడు. అయితే అమెరికా సాధించిన సైన్సును, పారిశ్రామిక పురోగతిని మాత్రం శ్లాఘించాడు. భారతదేశం కూడా ఇలాంటి పురోగతి సాధించడానికి ఆధునిక భావాలు అలవర్చుకోవాలన్నాడు. ఆంగ్లేయుల్ని వ్యతిరేకించే వాళ్ళు భారతదేశ అభివృద్ధికి కూడా వ్యతిరేకులే నన్నాడు. కాంగ్రెస్ వాళ్ళు స్వాతంత్ర్యం కావాలని అరుస్తున్నారు. వారికి స్వాతంత్ర్యం ఇస్తే పాలించ గలరా? అని ప్రశ్నించాడు. గుండు సూదిని సైతం తయారు చేయడం చేతగాని భారతజాతికి ఇంగ్లీష్ వాళ్ళు స్వాతంత్య్రం ఇస్తే ఏం సాధిస్తారు? అని ప్రశ్నించాడు. వివేకానందుని లో ఇలాంటి అనేక వైరుధ్యాలు కనిపిస్తాయి. అపరిమిత లాభాల కోసం పెట్టుబడిదారుల తపన ఉందని విమర్శించారు.సోషలిజం రూపంలోనో, మరో రూపంలోనో ప్రజారాజ్యం ఏర్పాటవుతుందని జోస్యం చెప్పారు. ఇన్ని శతాబ్దాలుగా అణచివేతకు గురైన తర్వాత శూద్రులు పాలించే వంతు వస్తుందని మరో సందర్భంలో అన్నారు. కులం అన్నది ఒకనాటి అవసరం.అది సామాన్య ప్రజానీకాన్ని అణగద్రొక్కింది. ఈ సాంఘిక వ్యవస్థ కాలాన్ని బట్టి మారుతూ ఉండాలి. దీనికి మతానికి సంబంధం ఉండకూడదని ఆయన పేర్కొన్నారు. భారతదేశం తనలో తాము ముడుచుకుపోయి, యితర దేశాల్లో ఏమి జరుగుతుందో తెలుసుకోకుండా నూతిలో కప్పవలె ఉండిపోయింది. నిర్జీవమైన మృతదేహంతో మమ్మీల కు సమానమైన నాగరికతలోకి దిగజారిపోయిందన్నాడు. బలమైన దేశంగా తీర్చిదిద్దేందుకు బహుజను లంతా ఆధునిక విద్యను అభ్యసించాలని సూచించారు. మనుస్మృతికి భిన్నంగా వీరు దేశాన్ని పాలించాలని వివేకానంద ఆకాంక్షించారు.ఆధునిక పరిభాషలో యిది కార్మిక వర్గ పాలనని చెప్పవచ్చు. అతను మహిళల సమానత్వాన్ని గట్టిగా సమర్థించాడు . మహిళలను అణచివేసే అన్ని సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా నిలబడ్డాడు. తన గురువు బాటలో అన్ని మతాల ఐక్యత కోసం గట్టిగా ప్రచారం చేశాడు. అంతర్జాతీయ సహోదరత్వాన్ని ప్రోత్సహించాడు.విశ్వమత సమ్మేళనంలో అందరినీ తన సహోదరులు గా సంబోధించాడు. "ఇతర ధర్మాలను నిందించొద్దు. ప్రతి మతంలోను, ప్రతి సిద్ధాంతంలోను, ఎంతోకొంత మంచి వుంటుంది. సోదర ప్రేమ గురించి ప్రసంగాలు మాని, ఆ ప్రేమను కార్యరూపంలో ప్రదర్శించండి. ప్రపంచంలోని సర్వమతాలలోని ఏకత్వాన్ని దర్శించండి. అపుడే మానవాళికి సహాయం చేయగలరు"అని అన్నాడు. విశ్వసౌభ్రాతృత్వమే అన్ని మతాల సారాంశమన్నారు. మతం పేరుతో జరిగే మహిమలు, మహత్యాలను ఆయన ఖండించాడు. "ఇంద్రజాల విద్యలు, సమ్మోహన విద్యలు మొదలైన వాటిమీద హిందూ మతం ఆధారపడి లేదు. ఈ మంత్రాలు, తంత్రాలు మార్మిక విద్యలు మనలను నాశనంచేశాయి. ఇవి మనిషి ని బలహీనపరిచే మూఢనమ్మకాలు. వీటి గురించి జాగ్రత్త ఉండాలి. మీరందరూ నాస్తిక వాదులైపోయినా సరే నాకు యిష్టమే. మూఢ నమ్మకాలు గల మూఢులవడం కంటే అదే మంచిది. ఎందుకంటే నాస్తికవాది సజీవంగా ఉంటాడు.. మూఢ నమ్మకాలకు లోనైతే నీ మెదడు మెతక బడిపోతుంది. జీవం నశిస్తుంది." అని అన్నాడు. "మంత్ర తంత్రాలు వదలండి! ఉపనిషత్తుల అధ్యయనానికి మరలండి. ఉపనిషత్తుల్లో అత్యంత బాజ్వల్య మాన తాత్విక సంపద ఉంది" అని ఉపనిషత్తు లను గొప్పవి గా కీర్తించాడు. ‌‌ భా‌రతీయుల ఆత్మగౌరవమనే నినాదంతో వలస పాలకులను ఎదుర్కొనే విధంగా వివేకానంద అనేక మంది యువతను ఉత్తేజపరిచారు. ఫలితంగా వారు జాతీయ ఉద్యమంలోకి ప్రవేశించారు. ఆయన గో రక్షణ ఉద్యమాన్ని తీవ్రంగా విమర్శించాడు. ఆ ఉద్యమకారులు తోటి మానవులను విస్మరిస్తున్నారని, ఆకలి, దరిద్రం లాంటి సమస్యలలో చిక్కుకున్న మనుషుల్ని వదిలి గోవులకు ఎక్కువ విలువ ఇస్తున్నారని విమర్శించారు. ఆకలిగొన్న వానికి వేదాలు బోధిస్తే ఏం లాభం? ముందు అతని తీర్చమన్నాడు. 'ముందు భుక్తి,ఆ తర్వాత భక్తి' ఆయన సూక్తుల్లో ఒకటి. ఇంకా మానవ సేవే మాధవ సేవ అన్నాడు. పేదవాడి ఆకలి తీర్చడానికి అన్నం ముద్ద పెట్టకుండా రాతిబొమ్మని కొలవడం ఎందుకు? అని ప్రశ్నించారు. నూతన విద్యావిధానం వ్యక్తిత్వాన్ని నిర్మించే విధంగా, ఆలోచనలను పెంచే విధంగా, విజ్ఞానాన్ని విస్తరించే విధంగా, మన కాళ్లమీద మనం నిలబడే విధంగా ఉండాలని వివేకానంద అన్నారు. విద్య ప్రధాన లక్ష్యం మానవ సృష్టేనని ఆయన భావించారు. శారీరక, మానసిక, నైతిక అభివృద్ధితోపాటు వివక్ష లేని విద్యను, ఆధునిక టెక్నాలజీ, వాణిజ్యం, పరిశ్రమ, సైన్స్‌కి సంబంధించిన విద్యను అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉండాలని ఆయన కోరారు. ‌భారతదేశం ఎదుర్కొంటున్న సామాజిక, రాజకీయ, ఆర్థిక సమస్యల కంటే అతి పెద్ద సమస్య దేశంలో ఉన్న యువతరానికి సరియైన ఆలోచనా దృక్పథం లేకపోవడమేనని వివేకానంద భావించారు. ఆయన భారతీయ సమాజాన్ని మార్చటానికి కృషి చేశాడు. ఆధునికమైన శాస్త్ర ప్రాతిపదిక కలిగిన రాజకీయ, ప్రజాతంత్ర, లౌకిక, భారత సమాజ నిర్మాణానికి కృషి చేశాడు. రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాలలో సమానత్వం కోసం వివేకానంద పిలుపునిచ్చాడు. ప్రముఖ బెంగాలీ రచయిత శంకర్ రాసిన 'ది మాంక్ యాజ్ మ్యాన్' పుస్తకం ప్రకారం, వివేకానంద 31 వ్యాధులతో బాధపడ్డాడు. నిద్రలేమి, కాలేయం, మూత్రపిండాల వ్యాధి, మలేరియా, మైగ్రేన్, మధుమేహం, గుండె జబ్బులు లాంటి 31 ఆరోగ్య సమస్యలను వివేకానంద తన జీవితకాలంలో ఎదుర్కొన్నాడు. అతను అనేక సార్లు భరించలేని ఆస్తమాతో బాధపడ్డాడు. అందువల్లే ఆయన 39 సంవత్సరాలకే మరణించాడు. ఆయన ఆశయాలకు అనుగుణంగా భారత ప్రభుత్వం 1984 వ సంవత్సరం నుంచి జాతీయ యువజన దినోత్సవం గా ప్రకటించింది. కొందరు వివేకానంద అనుచరులమని చెప్పుకుంటున్న వారు, ఆయన చెప్పిన బోధనలను వక్రీకరించటానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు.