సామాజిక కథల క్షేత్రం దాపటెద్దు - భైతి తార

దాపటెద్దు

పుస్తక సమీక్ష : సామాజిక కథల క్షేత్రం దాపటెద్దు నిత్య జీవితం లో మనకు ఎన్నో పుస్తకాలు పరిచయమవుతాయి.కొన్ని పుస్తకాలు చదివిన తర్వాత కొంత కాలమే గుర్తుంటాయి.మరి కొన్ని పుస్తకములు ,అందులో ప్రస్తావించిన విషయాలు మనలను వెంటాడుతూనే ఉంటాయి. అటువంటి అపురూప కథల పుస్తకమే "దాపటెద్దు ". పేరు చూడగానే ఇది వ్యవసాయములొ రైతుకు పొలం దున్నకం లో ఉపయోగపడే రెండు ఎద్దుల్లో ఒక ( నాగలికి ఎడమ వైపున ఉండే) ఎద్దు అని అర్థమవుతుంది.నిజానికి దాపటెద్దు కు ఓర్పు,సహనం, నైపుణ్యం ఎక్కువ.రైతుకు కుడి భుజము లా సహాయ పడుతుంది. ఇందులో మొత్తం 22 కథలు ఉన్నాయి. కథలు అన్ని వివిధ పత్రికలో ప్రచురితమైనవే.అందులో కొన్ని పోటిల్లో బహుమతి పొందిన కథలు ఉన్నాయి. సామాజిక సమస్యలే ప్రధాన విషయ వస్తువుల నేపథ్యం లో అద్భుతంగా వ్రాసారు రచయిత దుర్గమ్ భైతి. బాల కార్మికుల గురించి వ్రాసిన " పసివాడి చదువు" కథ కు రంజని వారి ప్రథమ బహుమతి లభించింది. ఈ కథ చదివినంత సేపు భావోద్వేగానికి లోనవుతాము.అంతలా అందులోని పాత్రలు మనలను వెంటాడుతాయి. మరో బహుమతి కథ "అభాగ్యుని ఊయల " భూమి కోల్పోయిన రైతు కుటుంబ సమస్యలను వివరిస్తుంది. రైతుకు ,ఎద్దుకు మధ్యన ఉన్న అనుబంధాన్ని సరికొత్త కోణం లో ఆవిష్కరించిన మరో బహుమతి కథ " దాపటెద్దు" యొక్క కథనం అసక్తి గా ఉంది.ఇలా మరిన్ని బహుమతి పొందిన కథలు ఈ పుస్తకములో ఉన్నాయి. గ్రామీణ వాతావరణం,కుటుంబ అనుబంధాలు,మహిళా సాధికారత,బాలికల పట్ల వివక్ష,పండుటాకుల ( వృద్దుల) దీన గాథలు, రైతు జీవనం,మట్టి వాసనలు లాంటి కథా అంశం తో రూపొందిన ఈ కథలు మళ్ళీ మళ్ళీ చదివేలా చేస్తాయి. రెండు కామెడీ కథలు కడుపుబ్బా నవ్విస్తాయి. అఖరి కోరిక కథలొ కావలసినంత సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. అందమైన ముఖ చిత్రముతో ఆకర్షణీయమైన ఈ పుస్తకములో ప్రతి కథ ఒక ఆణిముత్యమే.విహారి గారి ముందుమాట సూక్ష్మములో మోక్షం లా ఉంది.112 పేజీలు ఉన్న ఈ పుస్తకము వెల. 125 రూపాయలు. ప్రతులకు : దుర్గమ్ భైతి రామునిపట్ల. గ్రామము, చిన్న కొడూర్.మండలం, సిద్దిపేట జిల్లా . పిన్ -502267 సెల్ -9959007914