మొదటి వేదం లోని సృష్టి సూక్తం - K. V. S. Ganesh

మొదటి వేదం లోని సృష్టి సూక్తం

మొదటి వేదం లోని సృష్టి సూక్తం
— అనువాదకుడు: కారపాకుల వెంకట సాయి గణేష్, కేంబ్రిడ్జి యూనివర్సిటీ


హిందుత్వంలో ప్రశ్నించే బుద్ధికి ఋగ్వేదం (మొదటి వేదం) లోని సృష్టి సూక్తమే ఋజువు. మూడు వేల సంవత్సరాల ముందు రూపొందించిన ఈ సూక్తం పేరు "నాసదీయ సూక్తం." తెలుగులో "నాసదీయ" అంటే "లేనిది కాదు" అని అర్థం. మన మనస్సు లోని ఆలోచన బయటకు చెప్పనంతవరకు ఆ ఆలోచననేది బయట లేకపోయినా లోపల ఉంటుంది. అలాంటి ఆలోచన (బయట) "ఉంది" అని చెప్పలేము, (లోపల) "లేదు" అని కూడా చెప్పలేము. ఈ సూక్తం చాలా ప్రశ్నలు అడుగుతుంది. మన మనస్సులలాగే బహుశా ఒక రూపం లేని "విశ్వ మనస్సు" విశ్వ సృష్టి ముందు ఉండేదేమో... బహుశా ఆ "విశ్వ మనస్సు" యొక్క "ఆలోచన" పుట్టించిన వేడివల్ల ఈ విశ్వం విడుదలైందేమో... అనేదే ఈ సూక్తం. ఈ కాలపు శాస్త్రవేత్తలకు తెలిసిన "బిగ్ బేంగ్" లాంటి కొన్ని విషయాలు ఈ సూక్తంలో ఊహ రూపంలో ఉన్నాయి. ఈ సూక్తం జీవుల పుట్టుక గురించి కూడా పద్యం రూపంలో చెప్తుంది. ఈ సూక్తాన్ని సాధారణ తెలుగులోకి అనువాదం చేయాలని నా చిన్న ప్రయత్నం ఇది:

"లేనిది కాదు"
(ఋగ్వేదం లోని సృష్టి సూక్తం)


అప్పట్లో ఏదో ఉండేదని చెప్పలేము, ఏదీ లేదని చెప్పలేము.
అప్పట్లో ఆకాశం లేదు, దాన్ని మించిన స్వర్గం కూడా లేదు.
ఏది ముందుకు వెనుకకు కదిలింది? ఎక్కడ? ఎవరి రక్షణలో?
అప్పట్లో ఏదైనా దట్టమైన లోతైన (విశ్వ) జలం ఉండేదా?

అప్పట్లో మరణమనేది లేదు, అమరత్వమనేది కూడా లేదు.
అప్పట్లో రాత్రికి మరియు పగటికి గుర్తులు లేవు.
ఒకటుండేది, ఆ ఒక్కటి గాలి లేకుండా సొంతంగా ఊపిరి పోసుకునేది.
ఆ ఒక్కటి కాకుండా వేరొకటి అప్పుడు లేనేలేదు.

మొదట చీకట్లో చీకటి దాగి ఉండేది.
అదంతా ఏ గుర్తులు లేని (విశ్వ) నీటిగా ఉండేది.
శూన్యత తో కప్పబడిన ఆ ఒక్కటి
ఆఖరికి శక్తివంతమైన వేడి వల్ల ఉద్భవించింది.

మొదట్లో (వేడి వంతమైన) కోరిక పెరిగింది.
అదే (విశ్వ) మనస్సు యొక్క మొదటి విత్తనం.
ఉన్నదానికి లేనిదానికి మధ్య ఉన్న బంధాన్ని కనుక్కున్నారు
మనస్సుతో హృదయాలను శోధించిన కవులు.

ఆ (బంధం యొక్క) త్రాడు పక్కవాటుగా విస్తరణయ్యింది.
కిందా పైన ఏమన్నా ఉండేవా?
విత్తువారు (పైన) ఉండేవారు. శక్తులు (కింద) ఉండేవారు.
కింద (స్త్రీతత్వ) స్వశక్తి ఉండేది.పైన (పురుషత్వ) ఇచ్చేతనం.

నిజంగా ఎవరికి తెలుసు? ఎవరు చెప్పగలరు
ఇది ఎక్కడ ఏర్పడిందో, ఈ సృష్టి ఎక్కడిదో?
ఈ పక్కటి దేవుళ్ళు విశ్వ విడుదల తర్వాత వచ్చారు.
కాబట్టి ఇదంతా ఎక్కడనుండి ఉద్భవించిందో ఎవరికి తెలుసు?

ఈ సృష్టి ఎక్కడి నుంచి ఉద్భవించిందో?
అది స్వయంగా ఏర్పడలేదేమో లేదా స్వయంగా ఏర్పడిందేమో...
అత్యున్నతమైన స్వర్గం నుండి పర్యవేక్షించే అతనికి
మాత్రమే తెలుసు లేదా బహుశా తెలియదేమో...