అగస్త్యుడు . - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

అగస్త్యుడు .

అగస్త్యుడు .

భారతదేశంలో ఎందరో దేవర్షి,బ్రహ్మరిషి,మహర్షి,రాజర్షిలు జన్నించారు.

లోకకల్యాణం కొరకు వీరంతా పలు యాగాలు జరిపారు.ఆమహనుయుల గురించి వారు తెలియజేసిన ఆచార వ్యవహరాల గురించి మన సంతతికి గుర్తుచేద్దాం !!!

దేవర్షి: దేవలోకంలో ప్రతిష్ఠి కలవారు దేవర్షులు.

బ్రహ్మర్షి: ఉత్తమ శ్రేణికి చెందిన మహర్షులను బ్రహ్మర్షులు అంటారు.

మహర్షి: సామాన్య ఋషి స్థాయిని దాటిని గొప్ప ఋషులను మహర్షి అంటారు.

రాజర్షి: రాజుగా ఉంటూనే ఋషిత్వం పొందినవాడు రాజర్షి.

మిత్ర,వరుణులు,ఊర్వశికి జన్మించిన వాడు అగస్త్యుడు. ఇతని సోదరుడు వసిష్ఠుడు.

ఇతన్ని కులససుతుడు,కుంభసంభవుడు, (కుండలో జన్మించినదున)ఘటోద్భవుడనీ,ఔర్వశీయుడని,మిత్రవరుణి, కుంభయోని అనే పేర్లతో పిలవ బడ్డాడు.

అగస్త్య మహర్షి హిందూ చరిత్రలో ఒక గొప్ప ఋషి. దక్షిణ భారతదేశంలో నేటికీ ఈ ఋషి జీవించే ఉన్నట్టుగా చెప్తారు. అగస్త్యుడు నర్మదా నది ఒడ్డున ఉన్న గరుడేశ్వర అనే ప్రదేశం వద్ద తపస్సు ఆచరించినట్లుగా చెబుతారు. భారతీయ సంప్రదాయం ప్రకారం అగస్త్యుడు చాలా భారతీయ భాషల్లో గొప్ప పండితుడు. ఋగ్వేదంలో 1.165వ శ్లోకం నుంచీ 1.191వ శ్లోకం వరకూ అగస్త్య మహర్షి, అతని భార్య లోపాముద్రలు రాసినవేనని పురాణ కథనం. ఋగ్వేదమే కాక, ఇతర వైదిక సాహిత్యం కూడా వారు రాశారు.

అగస్త్యుడు ఎన్నో ఇతిహాసాలు, పురాణాలలో కనిపిస్తాడు. ముఖ్యంగా రామాయణ, మహాభారతాలలో అతని ప్రస్తావన ఉంది. అగస్త్యుడు సప్తర్షులలో ఒకడు. తమిళ శైవ సాహిత్యంలో అగస్త్యుని శైవ సిద్ధునిగా వర్ణించారు. శాక్తేయం, వైష్ణవాలకు చెందిన పురాణాలలోనూ అగస్త్యుని ప్రస్తావన వస్తుంది. దక్షిణ ఆసియాలోని దేవాలయాలలో దొరికిన పురాతన శిల్పాలలో అగస్త్యుని విగ్రహం కూడా ఉండడం విశేషం. ఆగ్నేయ ఆసియాలో ఉన్న, ఇండోనేషియాలోని జావా దీవిలో ఉన్న శివాలయంలో ఈ విగ్రహం లభ్యమైంది. పురాతన జావనీస్ గ్రంథం అగస్త్యపర్వ అనేది అగస్త్యుని గురించి రాసిన పుస్తకమే. ఈ పుస్తకంలో అగస్త్యుని గొప్ప మహర్షిగా, గురువుగా వర్ణిస్తూ రాశారు. ఈ పుస్తకం 11వ శతాబ్దపు ముద్రణ ఇప్పటికీ లభ్యమవుతోంది.

శ్రీ లలితా సహస్రనామ స్తోత్రములోనూ, అష్టోత్తర శత నమాలలోనూ, శ్రీదేవీ ఖడ్గమాలా స్తోత్రం లోనూ వీరిద్దరి నామాలూ వున్నాయి. అంటే లోకమాత శ్రీ లలితా దేవి వీరిపట్ల ఎంతటి గొప్ప దయను చూపారో తెలుస్తుంది. వరాహ పురాణంలోని అగస్త్య గీత, ద్వైద నిర్యాణ తంత్రం, స్కంద పురాణంలోని అగస్త్య సంహితలను రచించాడు అగస్త్యుడు. అగస్త్యుణ్ణి మన, కలశజ, కుంభజ, కుంభయోని, మైత్రావరుణి అని కూడా అంటారు.

అగస్త్యుని పేరు యొక్క ఉత్పత్తి ఎలా వచ్చిందన్నది సరిగా నిర్ధారణ జరగలేదు. ఒక సిద్ధాంతం ప్రకారం అగతి గండిఫ్లోరా అనే పూల చెట్టు పేరు నుంచి అగస్త్య అన్న పదం వచ్చింది. ఈ చెట్టు భారతదేశానికి చెందినది. ఈ చెట్టును తమిళంలో అకట్టి అని పిలుస్తారు. అలా ఈ చెట్టు పేరు మీదుగా అగస్తి అన్న పేరు వచ్చిందని కొందరి అభిప్రాయం. ఈ సిద్ధాంతం ద్వారా ఈ మహర్షి దక్షిణ భారతానికి చెందినవాడు అని ఇక్కడి వారి వాదన. ఇంకొందరు అగస్త్య అన్న పేరు అజ్ లేదా అంజ్ అన్న పదం నుంచి పుట్టిందని చెబుతారు. అజ్ అంటే ప్రకాశించేది, చీకటిని వెలిగించేది అని అర్ధం. దక్షిణ ఆసియాకు చెందిన ఆకాశంలో సిరియస్ అనే నక్షత్రం పక్కన ఉండే కనపస్ అనే నక్షత్రాన్ని భారతీయులు అగస్త్య తారగా పిలుస్తారు. ఈ నక్షత్రం రెండవ అతిప్రకాశవంతమైనది.

ఇరానియన్ భాషలో గస్త అంటే పాపం అని అర్ధం. అగస్త అంటే పాపం చేయనివాడు అని అర్ధం. అగ అంటే కదలనిది, పర్వతం అని అర్ధం, గం అంటే కదిలించేది అని అర్ధం. ఈ రెండూ కలసి అగస్త్య అంటే పర్వతాలను కదిలించగలిగేవాడు అని అర్ధం వస్తుంది. రామాయణంలో ఒక కథలో అగస్త్యుడు ఆకాశాన్ని తాకుతూ ఎదుగుతున్న వింధ్య పర్వతాన్ని యథాస్థానానికి తెచ్చిన కథనం ఈ ఉత్పత్తికి సరిపోతుంది. దక్షిణ భారతీయులు అగస్తి, అగతియార్ అని కూడా ఈ పేరును రాస్తారు.

ఋగ్వేదంలో ఎన్నో శ్లోకాలను అతను రచించాడు అని పురాణోక్తి. కానీ వాటిలో అతను జీవితం గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. అగస్త్యుని మూలాలు పౌరాణికమైనవి. మిగిలిన ఋషులులాగా అగస్త్యుడు తల్లీ, తండ్రులకు పుట్టలేదు. వరుణుడు, మిత్రుడు యజ్ఞం చేస్తుండగా, ఊర్వశి ప్రత్యక్షమవుతుంది. ఆమెను చూసి మోహం పొందిన వారిద్దరి వీర్యాలు అక్కడే ఉన్న ఒక కుండలో పడ్డాయి. ఆ కుండ గర్భస్థానం. ఈ కుండలోనే ఆగస్త్యుడు, తన కవల అయిన వశిష్ఠునితో కలసి పెరుగుతాడు. అలా అగస్త్యునికి కుంభయోని అనే పేరు వచ్చింది. కుంభయోని అంటే కుండలో నుంచి పుట్టినవాడు అని అర్ధం.

మనుస్మృతి ప్రకారం అందరు హిందువుల లాగే అగస్త్యుడు కూడా వివాహం చేసుకుని సంతానం కనాల్సి వచ్చింది. అప్పుడు అతను బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. అతను యోగశక్తిని ఉపయోగించి గుణగణాల్లోనూ, వ్యక్తిత్వంలోనూ అన్నిరకాలుగా, ఒక విరాగికి భార్యగా ఉండేందుకు అవసరమైన లక్షణాలు కలిగిన ఒక ఆడశిశువును సృష్టించాడు. ఇదే సమయంలో ఘనకీర్తి కలిగిన విదర్భ రాజు సంతానం లేక భాధపడుతున్నాడు. అతను ఒక పుత్రిక కోసం జపతపాదులు చేస్తూ నిరీక్షిస్తున్నాడు. అగస్త్యుడు అతను సృష్టించిన శిశువును ఆ రాజు భార్య గర్భంలోకి ప్రవేశపెట్టాడు. పుట్టిన బిడ్డకు ఆ రాజదంపతులు లోపాముద్ర అని నామకరణం చేశారు. ఆమెకు యుక్త వయస్సు రాగానే అగస్త్యుడు ఆమెకు తనతో వివాహం జరిపించాల్సిందిగా రాజును కోరాడు. మొదటగా ఒక విరాగి నుంచి ఈ ప్రతిపాదన విన్నరాజు ఖిన్నుడయ్యాడు. కానీ మానసికంగా, వ్యక్తిత్వ పరంగా ప్రతిభాశీలియైన తన కూతురు పట్టుబట్టడంతో ఒప్పుకున్నాడు. దాంతో రాజు వారిద్దరి వివాహం జరిపించాడు.

మేరు పర్వతం అన్నింటికన్నా ఎత్తైన పర్వతం. దాని ఎత్తును చూసి భరించలేక ఈర్ష్యతో వింధ్యపర్వతం కూడా దానికంటే ఎత్తుగా ఎదిగి సూర్యుని గమనాన్ని కూడా అడ్డగించసాగింది. దీంతో రాత్రింబవళ్ళూ సక్రమంగా రాక వేద విధులకు ఆటంకం కలగసాగింది. అప్పుడు దేవతలందరూ కలిసి అగస్త్యమునిని ఏదో ఒకటి చేయమని ప్రార్థించారు. వారి ప్రార్థనను మన్నించిన అగస్త్యుడు తన భార్యతో కలిసి ఆ పర్వతం వద్దకు వచ్చాడు. తాము దక్షిణ దిశగా వెళుతున్నామనీ, అంత పెద్ద పర్వతాన్ని ఎక్కి దిగలేమనీ దాని ఎత్తుని తగ్గించుకోమన్నారు. మహర్షులంటే భక్తి ప్రపత్తులు గల వింధ్యుడు తక్షణమే తన ఎత్తుని

ఉపసంహరించుకుని వెంటనే వారు నడచి వెళ్ళడానికి వీలుగా దారి ఇచ్చాడు. తర్వాత అగస్త్యుడు తాము మరలా తిరిగి ఉత్తర దిశగా తిరిగి వస్తామని అప్పటిదాకా అలాగే ఉండమని చెప్పాడు. కానీ మళ్ళీ తిరిగి రానేలేదు. అప్పటి నుంచీ ఇప్పటిదాకా ఆ పర్వతం అలాగే ఉంది. కార్యక్రమాలు యదావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి.

వేరొక కథనం ప్రకారం, శివ పార్వతుల కళ్యాణానికి ఋషులందరు హిమాలయాలకు వచ్చారు. అప్పుడు వారి శక్తికి ఉత్తరాన భూమి క్రుంగి పోవుచుండడం చూసి శివుడు అందరి శక్తికి ఇంచుమించు సమానమైన అగస్త్య భగవానులను దక్షిణ దిక్కున ఉండమని ఆదేశమిచ్చారు. అప్పుడు అగస్త్యులవారు కళ్యాణం చూడలేక పోతున్నందుకు చింతించుచుండగా వారికి అక్కడనుండి కూడా ప్రత్యక్షంగా చూసే వరాన్ని ప్రసాదించారు. అప్పటి నుండి అగస్త్యుడు దక్షిణాన ఉన్నారు. వారు మొట్టమొదటి దక్షిణ భాష ఐన తమిళంను పరిచయం చేసారు. తమిళం అతి ప్రాచీన భాష అని అందరికి తెలిసిన విషయమే. అతను మొట్టమొదటి నుండి హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉన్నారన్న గుర్తుగా వారి పేరు మీద ఒక ఊరు కూడా ఉత్తరాఖండ్ కేదార్ నాథ్ వెళ్ళే దారిలో ఉంది. అక్కడ శివాలయం పక్కనే శనీశ్వరాలయం ఉన్నాయి.

తమిళ సంస్కృతిలో అగస్త్యుడు పెరగత్తియం అనే తొలి తమిళ వ్యాకరణ గ్రంథాన్నిరాశాడని ప్రసిద్ధి.

బెల్లంకొండ నాగేశ్వరరావు.

9884429899

 

మరిన్ని వ్యాసాలు

atithi
అతిధి
- M chitti venkata subba Rao
Manavulalo daivatwam
మానవులలో దైవత్వం
- సి.హెచ్.ప్రతాప్
హెలెన్ కెల్లర్
హెలెన్ కెల్లర్
- బి.రాజ్యలక్ష్మి
ఋచీక మహర్షి .
ఋచీక మహర్షి .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
ఋష్యశృంగ మహర్షీ .
ఋష్యశృంగ మహర్షీ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
ఆంగీరస మహర్షి.
ఆంగీరస మహర్షి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు