వృక్షో రక్షతి రక్షిత : - సి.హెచ్.ప్రతాప్

Vruksho rakshathi rakshitaha

మన సంస్కృతీ ప్రకృతితో మమేకమైనది. మన పూజావిధానాలను పరిశీలించితే, లేక పురాణాలను పఠించితే ప్రకృతికీ మనకు మధ్య గల అవినాభావ సంబంధాన్ని తేటతెల్లం చేస్తోంది.

‘ఓషధిభ్యాః అన్నమ్, అన్నాత్ పురుషాః’ అని త్తెత్తీరీయోపనిషత్ లో ఒక చక్కని వాక్యం వుంది. అంటే, అన్నం నుంచి పురుషుడు అంటే జీవుడు పుట్టి, తనకు కావలసిన ఆహారాన్ని మొక్కలు, చెట్ల నుంచి గ్రహిస్తున్నాడని అర్థం.
మానవ మనుగడ, సర్వజీవుల సుఖజీవనానికి వృక్షసంపదను రక్షించాలని వేదాలు, పురాణాలు చెబుతున్నాయి.నీడ, పూలు, ఫలరసాలు మాత్రమేకాక ప్రాణవాయువునూ నిరంతరం విడుదల చేస్తూ చెట్లు జీవకోటికి గొప్ప మేలు చేస్తున్నాయి.


మానవాళి వదిలిన కార్బన్ డై ఆక్సైడ్ ను పీల్చుకొని, మనకు ఆక్సిజన్ ను వృక్షాలు అందిస్తాయి. అంతేకాక మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి అంటే చెట్లు మనకు నీడని ఇస్తాయి. అలాగే పండ్లు, పూలు, వేర్లు, ఆకులు ఇలా చెట్టు యొక్క అన్ని భాగాలు కూడా మనకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా ప్రకృతిలో లభించే ప్రతి మొక్క మనకు ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది.‘పంచపల్లవాల’ (మామిడి, మర్రి, మేడి, రావి, జువ్వి) కొమ్మలను ప్రతి శుభకార్యంలోనూ ఉపయోగించే సత్సంప్రదాయం మన దేసంలో వుంది.. వేల సంవత్సరాలు జీవిస్తూ, ఎంతోదూరం, నిరంతరం ఆక్సిజన్‌ను అందించే శక్తి ఈ మహావృక్షాలకు ఉంది.వృక్షో రక్షతి రక్షితః’ అన్న వేదసూక్తి వెనుక వున్న ఇంతటి గొప్పతనాన్ని అందరూ అర్థం చేసుకొని ఆ మేరకు మొక్కలు, చెట్ల పెంపకంతో ప్రకృతి రక్షణకు పూనుకోవాలి.
ప్రస్తుతం పర్యావరణం అతలాకుతలమౌతోంది. అడవులు అత్యధికంగా ఉన్న మన దేశంలోనే అడవులను నరికివేస్తున్నారు. అందులోనున్న కలపను తమ అవసరాలకు అనుగుణంగా వాడుకుంటున్నారు. దీంతో అడవులు తరగిపోతున్నాయి. అభివృద్ధి పేరిట ప్ర్రాణాధారమైన పచ్చటి వృక్షాలను కొట్టేస్తే , వర్షపు నీరు భూమికి చేరదు. తత్ఫలితంగా త్రాగు నీరు, జీవాధారమైన తిండి , పీల్చుటకు స్వచ్చమైన గాలి కరువై భూమిపై వున్న జీవులన్నీ అంతరించిపోతాయి . ఇటువంటి అఘాయిత్యాల వలన భూమి పై ఉష్ణోగ్రత పెరిగిపోయి మరి కొద్ది సంవత్సరములలో పృథ్వి ఉనికికే ప్రమాదం సంభవించనున్నది అని శాస్త్రజ్ఞులు పదే పదే హెచ్చరిస్తున్నారు. కాబట్టి వృక్ష సంపద పరిరక్షణే ధ్యేయంగా భూలోకం లోని మానవులందరూ తలా ఒక మొక్కని నాటి , రొజూ ఆ మొక్కకి నీరు పోసి దానిని ప్రాణ సమానంగా పరిరక్షించడమే ప్రధాన కర్తవ్యంగా భావించాలి. అప్పుడే భువి తిరిగి నందనవనంగా మారగలదు.

మరిన్ని వ్యాసాలు