ఇంటి పని: సహాయమా? బాధ్యతనా?
అబ్బాయిలు చేస్తే ‘సహాయం’, అదే అమ్మాయిలు చేస్తే ‘బాధ్యత’ — ఇంటి పనిలో దాగిన లింగ అసమానత
నా పాఠశాల రోజుల్లో ఉపాధ్యాయులు మా తల్లితండ్రులు వృత్తుల గురించి అడిగినప్పుడు, గర్వంగా నా తండ్రి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో సీనియర్ టెక్నీషియన్ గా పని చేస్తున్నారు అని చెప్పేవాడిని. నిజానికి ఆ హోదాకి సామజిక గుర్తింపు మరియు గౌరవం ఉండేది. నా తల్లి గురించి వచ్చినప్పుడు మాత్రం ఏ సంకోచం లేకుండా " ఆమె ఏమి చెయ్యదు, గృహిణి " అని చెప్పేవాడిని. ఆ సమయానికి ఆ మాటల్లో ఎలాంటి అవమాన భావం లేదు అనిపించినా, ఇప్పుడు ఆలోచిస్తే ఆ మాటలు అసమానతను ప్రతిబింబిస్తుంది. తండ్రి వృత్తిజీతంతో, హోదాతో కొలవబడుతుంటే, తల్లి రోజూ చేసే అలసట లేని పనికి మాత్రం "పని" అనే గుర్తింపు ఇవ్వబడదు. వంట చేయడం, పిల్లలను పెంచడం మరియు కుటుంబాన్ని చూసుకోవడం, ఇవన్నీ "సహజ బాధ్యతలు" గా మాత్రమే చూడబడతాయి, శ్రమగా కాదు. పిల్లవాడిగా నేను చెప్పిన "ఆమె ఏమి చెయ్యదు" అనే వాక్యం, వాస్తవానికి ఆమె చేసే అపారమైన శ్రమను కనపడనివ్వని ఒక సామజిక అలవాటుని ప్రతిబింబిస్తుంది. మన విద్య, మన సమాజం, మన భాష మహిళల శ్రమకు విలువ ఇవ్వకుండా ఎలా పెంచుతాయో ఈ చిన్న జ్ఞాపకం స్పష్టంగా చూపిస్తుంది. మన ఆలోచనల్లో చాలా సహజంగా కలిసిపోయింది.
ఈ ఆలోచన ఒక్క నా అనుభవానికే పరిమితం కాదు. మన సమాజంలో చాలమంది పిల్లలు ఇదే భావనతో పెరుగుతారు. తండ్రి చేసే పనిని "ఉద్యోగం", "ఆదాయం", "వృత్తి" అనే పదాలతో నిర్వచిస్తాం. తల్లి చేసే పనిని మాత్రం ప్రేమగా, బాధ్యతగా మాత్రమే చూస్తాం. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకూ విరామం లేకుండా చేసే పని మనకు కనిపించదు, ఎందుకంటే ఆ పనికి జీతం ఉండదు కాబట్టి. ఇంటిపనులు చెయ్యడం అమ్మాయిలకు సహజం అనే భావన మనకు చిన్ననాటి నుండి నాటుకుపోయింది. అందుకే ఇంట్లో అమ్మాయిలని వంటగదికి దగ్గర చేస్తాం, అబ్బాయిలను బయట ప్రపంచానికి సిద్ధం చేస్తాం. అబ్బాయిలకు సంపాదన నేర్పిస్తాం, అమ్మాయిలకు సహనం నేర్పిస్తాం. ఒక శిశువు జన్మించినప్పుడు వారి జీవశాస్త్రీయ లింగం బట్టి సమాజం వాళ్ళకి కొన్ని నిర్దిష్ట పాత్రలు కేటాయిస్తుంది. వారు పెరుగుతున్న కొద్ది ఈ పాత్రలు మరింత బలంగా స్థిరపడతాయి. అబ్బాయిలకి ధైర్యం, బలము, నాయకత్వం, భావోద్వేగాలను దాచుకోవడం వంటి లక్షణాలను "పురుషత్వం" గా నేర్పిస్తారు. అబ్బాయిలు ఏడవకూడదు, భయపడకూడదు, ఇంటి బయట పనులు చేయాలి, కుటుంబాన్ని పోషించాలి అనే చెప్తారు. అదే విధంగా అమ్మాయిలకు సౌమ్యత, సహనం, వినయం, సంరక్షణ, త్యాగం వంటి లక్షణాలను "స్త్రీతత్వం " గా నిర్ధారిస్తారు. ఆమె నిశ్శబ్దంగా ఉండాలి, అందంగా కనిపించాలి, ఇంటిపని చూసుకోవాలి, ఇతరుల్ని చూసుకోవాలి అనే అంచనాలు విధిస్తారు. ఇలా అబ్బాయిలు–అమ్మాయిలు అన్న భేదంతో లక్షణాలను నేర్పడం కేవలం వ్యక్తిత్వ నిర్మాణం కోసం కాదు; ఇది లింగ ఆధారిత శ్రమ విభజనకు పునాది వేస్తుంది
లింగ విభజన చాలావరకు సహజం అని అనుకుంటాం, కానీ ఇది సమాజం ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థ. ఇంటి పనుల్లో లింగ ఆధారంగా జరిగే విభజన మూడు విధాలుగా కొనసాగుతుంది—సహజమేనని నమ్మించడం, అలవాటుగా మారడం, మళ్లీ మళ్లీ అదే విధంగా కొనసాగించడం. మొదటగా, ఇంటి పనులు ఆడవాళ్లకు సహజమైనవే, మగవాళ్లకు సరిపోవు అని చెప్పడం జరుగుతుంది. మహిళలకు సహజంగా చూసుకునే గుణం ఉందని భావించి, వంట, పిల్లల సంరక్షణ, ఇంటిపని ఇవన్నీ వాళ్ల బాధ్యతలుగా చూపిస్తారు. ఎప్పుడు అయితే ఈ విభజన సృష్టించబడిందో అప్పటి నుండి ఇది వివిధ విధాలుగా నష్టం చేకూర్చుతుంది. కాలక్రమేణా ఈ విభజన ఒక వ్యవస్థ గా మారింది. ఈ విధంగా కుటుంబాల్లో ఈ లింగ ఆధారిత పాత్రలు స్థిరపడిన తర్వాత, అవి తరతరాలకు అలాగే కొనసాగుతాయి. ఇంట్లో ఎవరు ఏ పని చేస్తున్నారు అన్నది పిల్లలు గమనిస్తారు. తల్లి ఇంటిపనులు చేయడం, తండ్రి బయట పని చేయడం చూస్తూ, అదే సరైన విధానం అని పిల్లలు నమ్ముతారు. ఈ విభజన వాళ్ల మనసుల్లో నిలిచిపోయి, పెద్దయ్యాక వాళ్ల జీవితాల్లో కూడా అలాగే అమలవుతుంది. ఇలా ఇల్లు సంప్రదాయ లింగ పాత్రలు అమలయ్యే స్థలంగా మారుతుంది. రోజూ చూసే పనుల వల్ల అవే సహజమైనవి, సాధారణమైనవిగా అనిపిస్తాయి. అంతేకాదు, పాఠశాలల్లో బోధించే విషయాలు, సంస్కృతి, సినిమాలు, టీవీ కార్యక్రమాలు కూడా ఇదే భావనను బలపరుస్తాయి. ఆడవాళ్లు ఇంట్లో ఉండాలి, మగవాళ్లు బయట పని చేయాలి అనే ప్రైవేట్–పబ్లిక్ విభజనను ఇవన్నీ కొనసాగిస్తూ, లింగ పాత్రలను మరింత పటిష్టం చేస్తాయి.
ఇప్పటికీ చాలా ఇళ్లలో మగవాళ్లు ఇంటిపని చేసినా, దాన్ని “సహాయం” అని మాత్రమే అంటారు. ఇది వినడానికి చిన్న మాటలాగా అనిపించినా, ఇందులో బలమైన రాజకీయ భావన ఉంది. “సహాయం” అనేది ఆ పని అసలు ఎవరిదో సూచిస్తుంది. అంటే ఇంటిపని మహిళల బాధ్యత, మగవాళ్లు చేస్తే అదొక ఉపకారం అన్న భావన దాగి ఉంది. ఈ భాషా ప్రయోగం వల్ల ఇంటిపని ఒక సామూహిక అవసరంగా కాకుండా, ఒక వ్యక్తిపై మోపబడిన కర్తవ్యంగా స్థిరపడుతుంది. మగవాడు వంట చేస్తే, పిల్లలను చూసుకుంటే, లేదా ఇల్లు శుభ్రం చేస్తే అతడిని ప్రత్యేకంగా ప్రశంసిస్తారు. ఆ ప్రశంస అతడిని “బాధ్యతాయుతమైన వ్యక్తి”గా చూపించినట్టే కనిపించినా, అసలు లోతులో అది ఇంటిపనిని అతడి సహజ బాధ్యతగా అంగీకరించని మనస్తత్వాన్ని వెల్లడిస్తుంది. అదే పనిని ఒక మహిళ ప్రతిరోజూ చేసినా, అది సాధారణమని, ఆమె చేయాల్సిందేనని భావిస్తారు. ఆ శ్రమ కనిపించదు, ఆ శ్రమకు పేరు ఉండదు.అందుకే మగవాడు వంట చేసినా, పిల్లల్ని చూసుకున్నా అతడిని ప్రశంసిస్తారు; కానీ అదే పని మహిళ ప్రతిరోజూ చేసినా ఎవ్వరూ గుర్తించరు. ఈ పరిస్థితి సమాజంలో ఉన్న అసమానతను, భారాన్ని స్పష్టంగా బయటపెడుతుంది. ఈ విభజన ద్వారా సమాజం బాధ్యతను కాదు, అధికారాన్ని పంచుకుంటుంది. ఫలితంగా అసమానత కొనసాగుతుంది, భారము ఒక్క వర్గంపైనే కేంద్రీకృతమవుతుంది.
ఈ ‘సహాయం’ అనే మాట ఎంత రాజకీయమో నాకు నా ఇంటి అనుభవం ద్వారా అర్థమైంది. బయట కనిపించేదంతా చూస్తే, మగవాళ్లు ఇంటిపని చేస్తే అది ఆధునికతగా, మార్పుగా అనిపిస్తుంది. కానీ ఆ పనిని “సహాయం” అని పిలిచిన క్షణం నుంచే, ఆ పని అసలు ఎవరిదో అనే భావన స్పష్టంగా బయటపడుతుంది. అంటే ఇంటిపని మహిళల బాధ్యత, మగవాళ్లు చేస్తే అది అదనంగా చేసిన పని అన్న ఆలోచన అక్కడే దాగి ఉంటుంది. నేను పెరిగిన ఇంట్లో గృహపనులు లింగం ఆధారంగా కాకుండా అందరి బాధ్యతగా ఉండేవి. అయినా, బయట సమాజం మాత్రం దీనిని వేరేలా చూసేది. ఇంట్లో ఎప్పుడు అయినా పని చేస్తున్నపుడు "తల్లికి సహాయం చేస్తున్నారు" లేదా " అమ్మాయిల పనులు చేస్తున్నారు" అని అనడం సాధారణంగా వినిపించేది. ఒకటి ప్రశంస అయినా మరొకటి కించపరిచే మాట అయినా, ఈ రెండు, ఇంటిపని మహిళల భాద్యతే అని నమ్మకాన్ని బలపరుస్తాయి. కానీ ఆ మాటలను మా అమ్మ ఎప్పుడూ అంగీకరించలేదు. ఇంటిపని ఎవరికో సహాయం చేయడమని కాకుండా, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యతగా ఆమె స్పష్టంగా చూశారు. ఇంటిపని జీవించడానికి అవసరమైన మూలాధారం అన్న భావన ఆమెకు ఉంది. మొదట్లో ఈ దృష్టికోణం సహజంగా అనిపించకపోయినా, క్రమేణా ఇంటిపని ని వ్యక్తిగత ఉపకారంగా కాకుండా, పంచుకోవాల్సిన బాధ్యతగా చూడాల్సిన అవసరం స్పష్టమైంది. ఇంటిపని లో పురుషుల భాగస్వామ్యం “సహాయం”గా కాకుండా సహజమైన బాధ్యతగా స్థిరపడింది. ఈ ఆచరణ పుస్తకాల నుంచి వచ్చిన సిద్ధాంతం కాదు; దైనందిన జీవితంలో తీసుకున్న స్పష్టమైన నిర్ణయం. లింగ పాత్రలకు లోబడి కాకుండా, సమాన భాగస్వామ్యాన్ని ఆచరించిన ఈ ఇంట్లో, ఆధిపత్యం కాకుండా సహజీవనమే కేంద్రంగా నిలిచింది.
ప్రపంచవ్యాప్తంగా ఇంటిపని ఇప్పటికీ ప్రధానంగా మహిళల భుజాల మీదే మోపబడిన శ్రమగా కొనసాగుతోంది. ఇది జీతం లేని పని, అధికారిక గుర్తింపు లేని పని; కానీ కుటుంబం రోజూ సజావుగా నడవడానికి ఇదే ఆధారం. ఈ శ్రమ లేకపోతే ఇల్లు నిలబడదు, పిల్లలు పెరగరు, పని చేసే శక్తి తయారవ్వదు. అయినా ఈ శ్రమను సహజంగా జరిగేదిగా తీసుకోవడం వల్ల, దానికి విలువ కట్టే అవసరమే లేదన్న భావన బలపడుతుంది. వంట, శుభ్రత, పిల్లలు–వృద్ధుల సంరక్షణ వంటి పనులు సహజంగా మహిళలకే చెందాయని భావించడం వల్ల, వారి రోజువారీ సమయం మౌనంగా ఖర్చైపోతుంది. ఈ పనుల కోసం వారు చేసే శ్రమ కనిపించదు, లెక్కలోకి రాదు. ఫలితంగా మహిళలు విద్య, ఉద్యోగం, విశ్రాంతి లేదా స్వయంకల్పిత అభివృద్ధికి కేటాయించాల్సిన సమయాన్ని కోల్పోతారు. ఇంట్లోని ఈ అసమాన విభజనే మహిళలను ఆర్థికంగా ఆధారపడే స్థితికి నెట్టేస్తుంది. ఇంట్లో మొదలైన ఈ అసమానత బయట ప్రపంచంలో మరింత బలంగా ప్రతిఫలిస్తుంది. మహిళలు ఉద్యోగాల్లో వెనుకబడతారు, తక్కువ వేతనాలకు పరిమితమవుతారు, నిర్ణయాల ప్రక్రియల నుంచి తప్పించబడతారు. వారి శ్రమకు విలువ లేకపోవడం వల్ల, వారి సామాజిక స్థానం కూడా తక్కువగా ముద్ర పడుతుంది. ఇలా గృహస్థాయిలో సాధారణంగా అనిపించే అసమానతే, పెద్ద స్థాయిలో ఆర్థిక, సామాజిక, రాజకీయ అసమానతలకు పునాది వేస్తుంది.
"వ్యక్తిగత జీవితం రాజకీయమే" అంటారు ఫెమినిస్టులు. ఇంట్లో ఎవరు ఏ పని చేస్తారు, ఎవరి శ్రమ కనిపిస్తుంది, ఎవరి శ్రమను సహజంగా తీసుకుంటారు అన్న ప్రశ్నలే సమాజంలో అధికార సంబంధాలను నిర్మిస్తాయి. ఇంటి పనిని మహిళల బాధ్యతగా ముద్ర వేయడం వల్ల వారి శ్రమ అదృశ్యమవుతుంది, విలువ దక్కదు, అవకాశాలు క్రమంగా కుదించబడతాయి. లింగ సమానత్వం గురించి విధానాలు రూపొందించినప్పుడు, చర్చ ఎక్కువగా ఉద్యోగాలు, విద్య, రాజకీయ ప్రాతినిధ్యం వంటి బహిరంగ రంగాలకే పరిమితం అవుతుంది. కానీ ఈ అసమానతలు అసలు ఎక్కడ మొదలవుతాయి అంటే అది కుటుంబం మరియు ఇల్లు. ఈ విషయానికి అధికంగా ప్రాధాన్యత ఇవ్వరు. ఇంట్లో పనులు ఎలా పంచుకుంటారు, ఎవరి శ్రమ సహజంగా తీసుకుంటారు, ఎవరి శ్రమకు విలువ ఇస్తారు అన్న ప్రశ్నలు విధానాల దృష్టికి రావు. ఫలితంగా, బయట సమానత్వం గురించి మాట్లాడుతున్నప్పటికీ, ఇంట్లో మాత్రం లింగ విభజనలు యథాతథంగా కొనసాగుతూనే ఉంటాయి.
ఇంటి పనిని “సహాయం”గా చూడడం ఒక వ్యక్తిగత అలవాటు కాదు, పితృస్వామ్య సామాజిక ధోరణి. ఈ ధోరణి మారకుండా సమానత్వం కేవలం మాటలకే పరిమితం అవుతుంది. పురుషత్వం అంటే ఇంటి పనుల నుంచి తప్పించుకోవడమన్న భావనను ప్రశ్నించినప్పుడే మార్పు మొదలవుతుంది. మహిళల శ్రమను సహజంగా తీసుకునే మనస్తత్వం కదలకుండా సమాజం ముందుకు సాగదు. సమానత్వం అనేది ఇంటి బయట కనిపించే హోదాలు, పదవులు లేదా చట్టాల వరకు మాత్రమే పరిమితం అయ్యే అంశం కాదు. అది ప్రతి రోజూ జరిగే సాధారణ జీవితంలో, ముఖ్యంగా ఇంటి లోపల ఎలా ఆచరించబడుతున్నదో అక్కడే నిజంగా పరీక్షించబడుతుంది. ఇంటిపనిని ఇప్పటకీ ఎవరో ఒకరి సహజ కర్తవ్యంగా, మరొకరి “సహాయం”గా చూడటం లింగ అసమానతను మళ్లీ మళ్లీ పునరుత్పత్తి చేస్తుంది. కలిసి జీవించే వారందరూ సమానంగా భుజం మోపాల్సిన బాధ్యతగా గృహపనిని గుర్తించినప్పుడే, కుటుంబంలో అధికార సంబంధాలు మారడం మొదలవుతుంది. ఆ మార్పు ఇంటి గడపలలో మొదలైనప్పుడు మాత్రమే, సమాజంలో పాతుకుపోయిన పితృస్వామ్య నిర్మాణం నిజంగా ప్రశ్నించబడుతుంది. సమాజ మార్పు పెద్ద వేదికల మీద కాదు; రోజువారీ జీవనంలో, ఇంటి లోపలే మొదలవుతుంది.
‘సహాయం’ అని పిలిచిన క్షణంలోనే అసమానత మొదలవుతుంది; ‘బాధ్యత’ అని అంగీకరించిన రోజే సమానత్వం ప్రారంభమవుతుంది.

