రాజీ లేని ప్రమాణాల... రామోజీ రావు గారు! - వారణాసి రామకృష్ణ

రాజీ లేని ప్రమాణాల... రామోజీ రావు గారు!

సమాజం మీద ప్రేమ సాంఘిక సమస్యల పట్ల స్పృహ ఉన్న ప్రతి తెలుగు వాడు తెల్లవారి నిద్ర లేవగానే చేసే పని...ఈనాడు దినపత్రిక చదవడం! ఇక కవులు రచయితలు అయితే ఉదయం ఒక విడత చదవడం అయ్యాక మధ్యాహ్నం లేదా తర్వాత తీరిక చేసుకుని దిన పత్రికలోనీ ఎడిటోరియల్ పేజీని అందులో అచ్చయిన వ్యాసాల అక్షరాలను తడిమి తడిమి చదువుకునే వారు! రాత్రికి మళ్ళీ ఆసాంతం తిరగేసి మననం చేసుకుంటూ తృప్తిగా నిద్రకుపక్రమిస్తూ పొద్దున్నే రేపటి ఈనాడు దినపత్రిక చదవాలి అనీ ఊహించుకునేవారు! ఇలా తెలుగు జాతి గర్వంగా చదివే దిన పత్రికలో రచనలు చేసే మహాభాగ్యం తో బాటు రామోజీ రావు గారినీ రోజు చూసే అదృష్టం కొన్ని సంవత్సరాలు నాకు కలిగింది! ఆ అదృష్టానికి ముఖ్య కారకుడు నా ప్రియ మిత్రుడు... కార్టూనిస్ట్ శ్రీధర్!అక్కడ ఇలా పనిచేసే రోజుల్లోనే తెలిసిన విషయం...తెల్లవారు ఝామునే లేచి వారు వివిధ దేశాల పత్రికలు చదివి అందులో మన తెలుగు వారికి ఉపయోగపడే అనేక శాస్త్ర విజ్ఞాన భౌగోళిక విశేషాలను ఈనాడు దినపత్రిక ఎడిటోరియల్ పేజీ లో జ్ఞాననేత్రం భూభ్రమణాలు అనే శీర్షిక ద్వారా అనువదించి అందించే విధంగా ఆయా పెపర్ కట్టింగ్స్ మీద జ్ఞా...భూ...అని తన చేత్తో రాసి రౌండ్ గా స్కెచ్ పెన్ తో గీసేవారు! అలా వారు ఎంపిక చేసిన వేల వ్యాసాలను నేను ఈనాడులో జ్ఞాన నేత్రం భూభ్రమనం శీర్షికలో అనువదించే అదృష్టం కలిగింది! ఇప్పటికీ వారి జ్ఞాపకంగా వారి చేతి రాత ఉన్న రెండు పేపర్లని దాచుకున్నాను! రామోజీ రావు గారి ప్రమాణాలు ఉన్నతమైనవిగా ఉంటాయి. దిన పత్రికలో నిత్యం ప్రచురణ అయ్యే వార్థావిశేషాల్లో ఏవైనా పొరపాట్లు తప్పులు దొర్లితే అవి మళ్ళీ ఇంకోసారి అలా జరక్కుండా పకడ్బందీ ఏర్పాట్లు ఉండేవి కేవలం పత్రికలో పనిచేవారందరి కోసం ఒక బుల్లి బులిటెన్ బూదరాజు రాధాకృష్ణ గారి ఆధ్వర్యం లో వెలువడేది,! అందులో ఈనాడు దినపత్రిక లో దొర్లిన అనేక పొరబాట్లు వాటిని ఎలా సరి చేసి రాయాలో సూచనలు ఉండేవి! అసలా బులిటెన్ చదవడం కూడా ఒక గొప్ప అనుభూతి! అంత బాగా ఉండేవి అందులోని అంశాలు! ఇక ఈనాడు ఆదివారం అనుబంధం లో ఈవారం ప్రత్యేకం శీర్షిక కోసం ప్రచురణ అయ్యే అనేక శాస్త్ర సాంకేతిక విజ్ఞాన క్రీడా వినోద విషయాలు, రాసిన వ్యాసాల వెనుక ఎన్నో పుస్తకాలు మరెన్నో ప్రయాణాలు మరెన్నో సందర్శనాలు ఉన్నాయి! ఒక వ్యాసం ఈనాడు లో అచ్చు అవ్వాలి అంటే ఆ లెవెల్ హోం వర్క్ చేస్తే గాని ప్రచురణ కి తీసుకోరు! అదీ ఈనాడు స్టాండర్డ్! అదే ఆదివారం అనుబంధం లో ప్రచురణ అయిన ప్రతి కథకు సోమవారం ఉదయం నుండి మళ్ళీ శనివారం వరకు కొన్ని వందల మంది ఫోన్ కాల్ చేసి మరీ మాట్లాడే వారు,! ఏ పత్రికలో ప్రచురించినా రచయితలకు లభించని పాఠకాదరణ కేవలం ఆదివారం అనుబంధం లో ప్రచురణ అవగానే లభించేది! ఇక చతుర లో హాస్య కథలు అయినా విపుల లో ప్రచురణ పొందినఅనువాద కథలు, తెలుగు కథల ప్రచురణ కూడా ఏదో ఆషామాషీ వ్యవహారం కాదు! ఒక రచయితగా ఎంతో శ్రమకోర్చి సమాజాన్ని పరిశీలించి విషయాలు గ్రహించి వాటికో సాహిత్య ప్రయోజనం కలిగిoచి సృజిస్తేనే ప్రచురణ జరిగేది! రామోజి రావు గారు ఏమి చేసినా ఒక పద్ధతి ఒక స్టాండర్డ్ ఉండేది అని చెప్పడానికే ఈ ప్రయత్నం అంతా!! ఇలా ఎందరో తెలుగు వారికి సినీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నిత్య జీవితం లో పెనవేసుకుపోయిన రామోజీ రావు గారు ప్రాతః స్మరణీయులు! వారి జీవితమే అందరికీ మార్గదర్శి!! వారి మృతికి తీరని సంతాపం వ్యక్తం చేస్తూ.. రుచిలేనిపచ్చళ్ళతో పడడు రాజీ! శుచిలేనివార్తలతో నిoపడు పత్రికని గురూజీ! మారేకాలానికి మార్గదర్శి ప్రియ రామోజీ! నిశ్చయంగా...నిస్సందేహంగా చరిత్రపుటల్లో వారికంటూ ప్రత్యేకం .. ఓ పేజీ!! --వారణాసి రామకృష్ణ

మరిన్ని వ్యాసాలు

సిగ్గు ...
సిగ్గు ...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
మన సినిమాల్లో దెయ్యాల గీతాలు.
మన సినిమాల్లో దెయ్యాల గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Prabhutwa patashala
ప్రభుత్వ పాఠశాల
- అరవ విస్సు
నాటి తూనికలు - కొలతలు.
నాటి తూనికలు - కొలతలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Dandudu-dandakaranyam
దండుడు - దండకారణ్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు