హాస్యధోరణి - బన్ను

haasya dhorani

ప్రతీ మనిషిలోనూ హాస్యధోరణి వుంటుంది. కానీ, కొంతమంది వ్యక్తపరుస్తారు మరికొందరు వ్యక్తపరచరు. నేను అనుకుంటాను... నేను అందరితో చాలా 'జోవీల్' గా వుంటానని... కానీ ఆఫీసులో నేను సీరియస్ గా వుంటానట. నన్ను చూస్తే, కొందరికి భయమట... ఆ విషయం నా స్నేహితుడు చెబితే నాకు తెలిసింది! దానిక్కారణం... నేను 'వర్క్' విషయం లో 'కాంప్రమైజ్' అవ్వను, నా సహ ఉద్యోగులను అవ్వనివ్వను. 'మనం అనుకున్నది సాధించాల్సిందే' అని మోటివేట్ చేస్తుంటాను. "ఆడుతూ... పాడుతూ పనిచేస్తుంటే... అలుపూ సొలుపూ వుండదూ..." అనేపాట నాకు ఇన్స్ప్ రేషన్. నువ్వు 'అలిసిపోయాను' అంటే నువ్వు 'వర్క్' ని ఎంజాయ్ చెయ్యటం లేదన్నమాట. నీలో 'హ్యూమర్' సన్నగిల్లుతున్నట్టు లెక్క!

ఆ మధ్య నా'కన్ను' ఎర్రబడితే... ఓ డాక్టర్ దగ్గరకి వెళ్ళాను. ఆయనేదో 'డ్రాప్స్' రాస్తుంటే... "డాక్టర్... మీరింతకుముందు రాసిన డ్రాప్స్ చీటీ నా దగ్గర వుందని చూపించి... ఇవి వాడనా?" అనడిగాను. దానికి ఆయన "దోమ కుట్టిందని సుత్తితో కొడతామా?" అనడిగారు. నేను కొంచం ఆలోచించి... "కొట్టినా పాపం లేద్సార్... వాటివల్ల చాలా జబ్బులొస్తాయి కదా" అన్నాను. ఆయన 'హాహాహా...' అని నవ్వి "మీ దగ్గర మంచి హ్యూమర్ వుంది... జోక్స్ బాగా వేస్తారు" అన్నారు. "అవున్సార్... జీవితంలో జోక్స్ వుండాలి... కానీ జీవితం జోక్ కాకూడదు" అన్నాను. నావంక అదోలా చూసి... "ఓకే అండీ ఈ డ్రాప్స్ వాడండి" అని... 'నెక్స్ట్' అని పిలిచారు. ఆయన చాలా బిజీ డాక్టర్. ఓ సంవత్సరం తర్వాత మళ్ళీ ఆయన్ని కలవాల్సొచ్చింది. "ఆ... రండి శ్రీనివాస్ గారూ..." అని పిలిచారు. అంటే అంత బిజీ డాక్టర్ కూడా నన్ను సంవత్సరం తర్వాత గుర్తు పెట్టుకున్నారంటే ఆశ్చర్యమేసింది. అది కేవలం 'హ్యూమర్' తోనే సాధ్యమవుతుంది.
మనం అలా అవతల వాళ్ళకి దగ్గరవుతాము.