చిలుక లాగానో నెమలి లాగానో కాకి అందమైన పక్షి కాకపోయినప్పటికీ కాకికి హిందూ ధర్మంలో చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది ముఖ్యంగా పితృ కార్యక్రమంలో పితృదేవతలకు సమర్పించే పిండాలు కాకి ముడితేనే పితృదేవతలు తృప్తి చెందుతారని మన విశ్వాసము. పితృదేవతలు పిండాన్ని స్వీకరించటానికి కాకి రూపంలో వస్తారని హిందువుల విశ్వాసము. అంటే కాకి మనకు మన గతించిన పూర్వీకులకు వారధి లాంటిది. అందుచేత కాకిని పవిత్రమైన పక్షి అని అంటారు అంతే కాకుండా కాకికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.కాకి ఉదయాన్నే లేచి కావు కావు అని అరుస్తూ మనం అనుభవించే ఆస్తులు సంపదలు కీర్తి ప్రతిష్టలు ఏవి మనవి కావు అని గుర్తు చేస్తూ ఉంటుంది. కాకి శని వాహనం.కాకికి ఆహారం పెట్టడం అనేది శని ని తృప్తి పరచడం అని పెద్దలు చెబుతారు.ఆ విధంగా శని అనుగ్రహాన్ని పొందవచ్చు.కష్టకాలంలో శని తీవ్రత తగ్గడానికి దోహదం చేస్తుంది. కాకిని చంపితే పితృదోషం మరియు శని దోషం వస్తుంది తిరునల్లార్ లోని శని దేవాలయములో శని బంగారు కాకి వాహనం మీద కూర్చుని పూజలందుకుంటాడు.
పితృ కార్యాలలో కాకికి అంత ప్రాధాన్యత కు కారణం ,గరుడ పురాణములో కాకులు యమధర్మరాజు వాహకులుగా చెప్పబడినాయి.కాకులకు ఇచ్చిన ఆహారం పూర్వీకుల ఆత్మలకు చేరుతుంది అని యమ ధర్మరాజు కాకులకు వరం ఇస్తాడు చాల పురాణాలలో కాకులకు దేవతలా స్థానము కల్పించ బడ్డాయి. కాకిని కాలజ్ఞాని అంటారు కాకి వేకువజామునే అంటే బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని స్నానమాచరిస్తుంది.అందరిని నిద్ర లేపుతుంది. ఎక్కడైనా ఆహారం కనిపిస్తే ఇతర కాకులకు సందేశం పంపి అన్ని కాకులు గుమిగూడి ఆహారాన్ని తింటాయి. అంటే అన్ని కాకులు స్నేహ పూర్వకంగా ఉంటాయి ఏదైనా ఒక కాకి చనిపోతే అన్ని కాకులు దాని చుట్టూ చేరతాయి.సంతాపాన్ని తెలియజేస్తూ కాసేపు రోదనలు చేస్తాయి ఆ తర్వాత స్నానమాచరించి గూటికి చేరతాయి. శత్రువులను గుర్తిస్తే ఇతర కాకులకు సందేశం పంపి అన్ని సంఘటితంగా పోరాటం చేపడతాయి.మనుషుల్లో శత్రువులను సులభంగా గుర్తు పడతాయి. సూర్యాస్తమయానికి గూటికి చేరే మంచి లక్షణము సమయపాలన కాకులదే ,సూర్యాస్తమయం తర్వాత ఆహారం ముట్టని సద్గుణము కాకులది.
కాకులు లేని ప్రదేశం ఈ భూమిపైన లేదనే చెప్పవచ్చు పచ్చని ప్రకృతిని విస్తరింప చేయడం లో కాకులు ప్రధాన పాత్ర పోషిస్తాయి ఎలా అంటే చిన్న చిన్న పళ్ళను తిని మరో చోట గింజలు విసర్జిస్తాయి. ఆ విధంగా కొత్త మొక్కలు మొలుస్తాయి వనాలు పెరుగుతాయి.అడ కాకి మగ కాకి కలవడం కూడా గోప్యంగా పరుల కంట బడకుండా కలుస్తాయి. అంత గుప్త జ్ఞానం కలిగి ఉండటం కాకి ప్రత్యేకత.కాకులు అరుస్తూ ఉంటే ఎవరో మనకు కావలసిన బంధువులు ఇంటికి వస్తారని పెద్దలు చెబుతుంటారు. అలాగే ప్రకృతి వైపరీత్యాలను అంటే భూకంపాలు తుఫానులు వంటి వాటిని ముందుగా గుర్తించి సూచనగా అరుస్తూ ఎగురుతూ లోకానికి తెలియజేస్తాయి కానీ వాటి సూచనను మనము గమనించము . మానవ జీవన పరిమాణం లో కొన్ని తరాలు గుర్తు పెట్టుకునేది కాకియే అందుకే ఎక్కువ కాలం బ్రతికే వారిని కాకిలా కలకాలం బ్రతికాడు అంటారు,చిన్నప్పుడు కాకి దాహం వేస్తే కూజాలో అడుగున ఉన్న నీటిని పైకి తేవడానికి రాళ్లు వచ్చింది అని చెబుతారు అంటే ఆనాడే కాకి సాంకేతిక అంది పుచ్చుకున్నది అని అర్ధం అవుతుంది. ఏ మాత్రం దానధర్మాలు చేయని వారిని ఎంగిలి చేత్తో కాకిని తోలని వారీగా ఉదహరిస్తారు ఆ అపవాదు రాకుండా ఉండాలనే చాలా మంది భోజనం చేసే ముందు కాకికి చిన్న అన్నం ముద్ద పెట్టి వారు తింటారు ఆ ముద్ద పితృదేవతలకు, అలాగే దానం చేసినట్లు ఉంటుంది.
వాల్మీకి రామాయణం లో కాకి కీ సంబంధించిన కధ ఉన్నది ఒకనాడు సీతా రాములు అరణ్యవాసం లో ఉండగా శ్రీరాముడు మధ్యహ్నాం సీతాదేవి తొడపై తల ఆనించి నిద్రిస్తూ ఉండగా ఇంద్రుని కొడుకైనా జయంతుడు కాకి రూపంలో వచ్చి సీతాదేవిని మోహించి ఆమెపై దాడి చేస్తాడు ఇది గమనించిన శ్రీ రాముడు ఒక గడ్డిపరకను బ్రహ్మాస్త్రం గా ప్రయోగించ బోతాడు తన తప్పును తెలుసుకొని జయంతుడు శ్రీరాముని శరణు వేడుతాడు దయార్ద్ర హృదయుడైన రాముడు జయంతుని క్షమిస్తాడు కానీ నీవు చేసిన తప్పుకు నిన్ను కొంతవరకు శిక్షిస్తాను అని నీవు రెండు కళ్ళను ఒకే సరి ఉపయోగించలేవు అని శపిస్తాడు అలాగే నీకు ఒక వరం కూడా ఇస్తాను అని నీకు అర్పించే పిండాలు పితృ దేవతలకు చెందుతాయి అని వరం ఇస్తాడు అందుచేతనే మనము పితృదేవతలకు అర్పించే పిండాలను కాకికి సమర్పిస్తాము కాకి ఆ పిండాన్ని ముట్టుకుంటే పితృదేవతలు వచ్చి ఆహారాన్ని స్వీకరించారని మనము భావిస్తాము. అందుచేతనే పితృకర్మల్లో కాకికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది. ప్రస్తుతం సెల్ టవర్ల వల్ల కలిగే రేడియేషన్ పుణ్యమా అని పిచ్చుకలతో పాటు కాకులు కూడా కనిపించడం మానేసినాయి అందువల్ల బాగా ఆకాశ హర్మ్యాలు ఉండే పట్టణాల్లో కాకులను పితృ కార్యాలకు అద్దెకిస్తున్నారు