“ఎట్లా జరిగింది? పెద్దాయన అకస్మాత్తుగా వెళ్ళిపోయాడు?” “రాత్రి భోజనం చేసి వక్కపొడి కోసం తలుపు వెనకాల డ్రాలో వెతకడానికి వంగాడంట. అంతే ఆ వంగడం లోనే నేరుగా టేబుల్ క్రిందకి వాలి పోయాడు.” అన్నాడు కొదండయ్య. “అయినా ఎంత మంచి చావు కదా – శివరామయ్య మంచంలో పడకుండా – ఓకరిని యిబ్బంది పెట్టకుండా మెల్లగా దాటుకున్నాడు.” అన్నాడు రాఘవయ్య .పెద్దాయన శివరామయ్య పెద్దకర్మ సందర్భంగా, బంధువులు, స్నేహితులు శ్రేయోభిలాషులు అందరూ యింటి దగ్గరకి చేరుకున్నారు. శివరామయ్య జతగాళ్ళు, ఆ వయస్సు వాళ్ళు కొంతమంది యింటి ఎదురుగా కూర్చున్నారు. “అయినా అందరూ పోవాల్సిన వాళ్ళే కదా – ముందూ వెనకా “ మాట కలుపుతూ అన్నాడు మోహనరావు. “ఈ పోవడం – చావడం అనేది ఎవ్వరికీ తప్పదు. మధ్యలో హింస పెట్టె రోగాలు ఉండాయి చూడు - వాటితోనే సమస్య అంతా” కోదండం మళ్లి అందుకున్నాడు.
“వారం రోజుల నుంచి కాళ్ళు సూదులు గుచ్చినట్లు భాదిస్తున్నాయి . డాక్టరుని అడిగితే diabetic Neuropathy అన్నాడు. పరిష్కారం చెప్పండయ్యా అంటే, ఏమీ లేదు – Manage చెయ్యవలసిందే అన్నాడు. 60 ఏండ్ల తర్వాత ఏధీ రాకపోతే ఆశ్చర్యం. 70 కి పూర్తి ఆరోగ్యంగా ఉంటె గ్రేట్ – యింక ఆ తర్వాత అది నిలబెట్టుకోవడమే – 80 తర్వాత ప్రతి సంవత్సరం బోనస్ క్రిందే లెక్క. ఎవరికి అనిపించిన విధంగా వారు వ్యాఖ్యానం చేస్తున్నారు. పెద్ద కర్మ కార్యక్రమం సజావుగా జరిగిపోతూ ఉంది. యువతీ యువకులు బంధువులను పలకరించుకుంటూ ఉన్నారు. మధ్య వయస్కులు కొందరు ఎవరెవరు వచ్చారు, ఎవరు రాలేదు, ఎలా వచ్చిందీ, తిరిగి ఎలా బయల్దేరుతున్నది మాట్లాడుకుంటున్నారు. యింకొంతమంది పెద్దాయన ఆస్తులు, ఎవరెవరికి ఏది రావొచ్చో అని చర్చించుకుంటున్నారు. రాఘవయ్య అతని మిత్రులు శివరామయ్య చావు గురించి యింకా వివరణ ఇచ్చుకుంటున్నారు.
“దానికి ముందురోజే నేను శివరామయ్యని కలిసాను. యింకా ఎం బతకతాం తొందరగా పోతే బాగుండు.” అన్నాడు. “ఎందుకు ఆ మాట అంటున్నావు? అని అడిగా “ఏముందిరా, ఇష్టమైనది తినడానికి లేదు. రోజూ 8 రకాల మందులు, పలకరించడానికి – మాట్లాడడానికి ఏమీ లేదు. నీ శకం ముగిసింది అని గౌరవప్రదంగా డ్రాయింగు రూములో ఒక వారగా బెడ్ – కుర్చీ – వార పత్రికలు – పుస్తకాలు. యింకో మనిషికి భారం అయ్యేలోపల దాటుకోవాలని ఉంది” అన్నాడు. “ఎందుకో మనస్సులో ఎదో భాధ పెట్టుకున్నాడని అనిపించింది.” సందర్భానికీ తగినట్లు కామెంటరి చేసే అలవాటున్న మోహనరావు యిలా అందుకున్నాడు “మా నాయన అనేవాడు ప్రపంచంలో అన్నింటి కంటే వింతైన విషయం శవం స్మశాన వాటికకు కదిలిపోతూ ఉంటే కళ్ళెదుట కనిపించినా, మాకు సంబంధం లేదులే అంటూ ఎవరి పనిలో వారు మునిగిపోవడం.” “శివరామయ్య వయస్సు ఎంతంటావు?” “ఎంతరా. 76 ఏండ్లు మరీ పెద్ద వయస్సు కూడా కాదు. మా అన్నవయస్సే. మా అన్న ఉండాడు, ఆయన పని ఆయన చేసుకుంటాడు. బండి కూడా తోలుతాడు . అయినా ఎవరి ఆయుషు ఎంతని ఎవరు చెప్పగలరు.” “రేయ్ ఈ సంధర్భానికి నువ్వు చెప్పేది అతకదు. వేదాంతం ఆపు, అయితే శివరామయ్య భాద ఏమై ఉంటుంది?” అన్నాడు కోదండం “అదేమంత కష్టం కాదు కనుక్కోవడం - శివరామయ్య అంటేనే dynamic ఎట్టా తిరిగేవాడు. సంఘ నాయకుడిగా విజయవాడ- హైదరాబాద్ – డిల్లీ – ఎంత active గా ఉండేవాడు. ఏ పని పడినా – కారు – బస్సు – రైలు ఏది దొరికితే అది పట్టుకుని ప్రయాణం సాగించేవాడు. అటువంటిది రిటైర్మెంట్ తర్వాత అన్నీ ఆగిపోయాయి. ఆ తర్వాత ఆరు నెలలకి బయటపడిన Parkinson మనిషిని కట్టిపడేసింది .”
“తిట్టే నోరు, తిరిగే కాలు ఊరికే ఉండవు కదా. అదే గనుక కారణమైతే ఒకరిని నిందించడానికి ఏమి లేదు. ఎందుకో తనలో తాను సతమతమయ్యి ఉంటాడు. ఒత్తిడి ఎటువంటి వాళ్ళనైనా వంచి పారేస్తుంది. రాఘవయ్య అన్నాడు. “అయినా అసలు యిదంతా ఆశించడం – ఊహించడం నుంచి వస్తుంది. ఎటువంటి ఆశలు, ఊహలు, ఆలోచనలు లేకుండా, నేనింక చూడడానికి, చేయడానికి ఏమి మిగల్లేదు అనే స్థితికి రావాలి. అప్పుడు ఎటువంటి వత్తిడి ఉండదు. మనస్సు నిర్మలంగా, ప్రశాంతంగా మారుతుంది. “ రాఘవయ్య ఆధ్యాత్మిక సాధనలో తన అనుభవాలు అలా చెప్పుకుంటూ పోతున్నాడు.
“అదే జరిగితే అద్బుతం జరిగినట్లు. మనిషి జీవితం పరిపూర్ణత్వం సాధించినట్లు. నా మటుకు నేను ఈ క్షణం నా ప్రాణం పోయినా సంతోషంగా విడిచి పెట్టడానికి సిద్దపడి ఉన్నాను.” “ఎవరయ్య నువ్వు – నిన్ను అడిగి నీకు చెప్పి వస్తుందంటయ్యా? చావు దాని మానాన అది చెప్పకుండా వస్తుంది. అది వచ్చేధీ పోయేది ఎవరికీ తెలియదు” అన్నాడు మోహనరావు. “కాటికి కాళ్ళు చాపుకుని కూర్చోవడం అనేది శుద్ధ అబద్ధం. నిజంగా మనిషికి జీవితం పట్ల అనుభూతి, ఆసక్తి పూర్తిగా చనిపోతే శరీరమే తనకు తాను Shut down చేసుకుంటుంది. అందువలన సాధ్యమైనంత వరకు ఆశతో జీవించాలి.” కోదండం అంటున్నాడు.
చర్చ మరణం గురించి divert అవ్వడం ఎవ్వరూ గమనించడం లేదు. “అరే శివరామయ్య దేనికి వ్యతిరేకమో – మనం దాని గురించే మాట్లాడుకుంటున్నాము. మరణం గురించిన ఆలోచన, చర్చ క్రియాశీల జీవితానికి పూర్తి విరుద్దం అన్నది ఆయన అభిప్రాయం” అన్నాడు కోదండం. “జీవితాన్ని ఆస్వాదించాలి. అనుక్షణం వర్తమానంలోనే జీవించాలని కదా” “అయితే ఏమంటావు? చావు గురించి అసలు మాట్లాడవద్దంటావా? వాళ్ళ లాగ వేరే విషయాల గురించి మాట్లాడడానికి మనమేమన్న యువకులమా? ఆ వయసులో నేను అంతకంటే ఉత్సాహంగా ఉన్నాను. యిప్పుడు shutdown, slow down అయిపోతున్న body function ఒక్కొక్కటి రోజూ నాకు నా వయస్సుని గుర్తు చేస్తూ ఉంది.” అన్నాడు మోహనరావు.
“రేపటి గురించి, రేపు జీవిస్తాను అన్న ఆశలేని వ్యక్తి ఈ రోజే మరణిoచినట్లు. మనకు వయస్సు మీద పడిందంటే మనం పనిచేయడం ఆపేయమని కాదు. 100 సవత్సరాల వయస్సులో వ్యవసాయం చేస్తూ, తన ధాన్యం తానే పండించుకునే వ్యక్తులు కూడా ఉన్నారు. అంతా యిక్కడ ఉంది” అన్నాడు రాఘవయ్య మెదడు వైపు వేలు చూపిస్తూ. ఇంటిలోపల గంపనెత్తే క్రతువు మొదలయ్యింది. గంపచుట్టూ పూలమాల అందంగా కట్టే అందులో రకరకాల పిండివంటలు పెట్టారు. జoగం దేవర శంఖం ఊదుతూ ఉంటే , అయినవారు, దాయాదులు నిప్పులో సాంబ్రాణి చల్లుతున్నారు. వాతావరణం గంభీరంగా మారింది. చితి అంటించిన చిన్న కొడుకు గంప నెత్తుకునే సమయానికి కొంతమంది కన్నీళ్ళు పెట్టుకున్నారు. జరగాల్సిన కార్యక్రమం యింకా ఉంది కాబట్టి గంపనెత్తుకుని మగవాళ్ళు అందరూ రేవు వైపు నడిచారు. వాళ్ళు వెళ్ళిపోయిన 5 నిముషాల కంతా యింట్లో వాతావరణం తేలికపడింది.
“చూసావా – గంట క్రింద దాకా అందరూ విషాదంలో ఉన్నట్లుగా కనపడింది – కర్మకాండ పూర్తి అయిపోయే లోపల అందరూ ఎవరి లోకంలోకి వారు తిరిగి చేరుకున్నారు. అంతేగా జీవితం – ఎవరూ ఎవరి కోసం ఆగరు. ఏధీ దేని కోసం ఆగదు .” అన్నాడు రాఘవయ్య. “నువ్వు ఏ కాలంలో ఉన్నావు. కన్న బిడ్డలే ఉండడం లేదు. పది రోజుల కర్మకాండను కుదించి మూడు రోజులలో పూర్తి చేస్తున్నారు. ఎవరి పనులు వాళ్లకి ముఖ్యం – వెళ్ళిపోయిన వాళ్ళ కోసం ప్రపంచం ఆగిపోతుంది అనుకోవడం అవివేకం. మహామహులు చనిపోయినా, మరిచిపోయింది ప్రపంచం. “కర్మకాండ పూర్తి చేసేసి పిండాలు దూరంగా నీటిలో కలపమని అనడంతో ఆ పనికి బయల్దేరారు. దానితో సంభందం లేదన్నట్లు భోజనాలు ఎప్పుడో ప్రారంభించడంతో అందరూ అటు మూగారు. కొంతమంది భోజనం పూర్తి చేసిన వాళ్ళు Ice cream, పండ్ల దగ్గిరకు చేరుకున్నారు.
“అయ్యా మీరందరూ భోజనానికి రండి – మీ కోసం బంతి భోజనం ఏర్పాటు చేశాను.” వాళ్ళను భోజనానికి రమ్మని క్రిష్టప్ప వచ్చి పిలిచాడు. క్రిష్టప్ప వయసు యించుమించు రామయ్య వయస్సంత్ ఉంటుంది. ఆ ఇంటిలో వంట మనిషిగా 30 ఏండ్ల నుంచి పని చేస్తున్నాడు.
“అదేంది క్రిష్టప్ప బంతి భోజనం మాకేనా – మిగతా వారి సంగతేంది ?” అన్నాడు మోహనరావు. “అందరికీ Buffet అంటయ్య. పెద్దవాళ్ళ వరకూ బంతి భోజనం ఏర్పాటు చేసారు” అన్నాడు. క్రిష్టప్ప వయస్సు మీద పడినా క్రిష్టప్ప ఉత్సాహంగా ఉన్నాడు. అందరితోబాటు వడ్డనకు పూనుకున్నాడు. బంతి భోజనంలో కూర్చున్న పెద్దవాళ్ళకి విస్తళ్ళు పరిచి, నీళ్ళు పెట్టాడు.
రాఘవయ్య, మోహనరావు, కోదండం యింకొంత మంది పెద్దవాళ్ళు కలిసి బంతి భోజనానికి కూర్చున్నారు. కొన్ని మిగిలిపోయిన సీట్లుంటే వాటిలో పిల్లలు కూర్చున్నారు. వడ్డనలో అన్ని అందరికీ వస్తున్నా వేరే వేరే కారణాలతో పెద్దవాళ్ళు కొన్ని పదార్థాలను వద్దంటున్నారు. కోదండం స్వీటు వద్దంటే, మోహనరావు పలావు అన్నం వద్దన్నాడు. పిల్లలు మాత్రం ఉత్సాహంగా అన్ని రకాల items అడిగి మరి పెట్టించుకుంటున్నారు. భోజనాల తర్వాత శివరామయ్య స్నేహితులు యింట్లోపల శివరామయ్య రూములోనికి వెళ్లారు. ఆయన శ్రీమతి అంతకు ముందే చనిపోవడంతో, ఆ గదిలోనే అతని జీవితం గడిచిపోయేది.
“యిక్కడే రోజూ సాయంత్రం Chess లేదా రమ్మి ఆడేవాళ్ళం” అంటూ రాఘవయ్య ఆ రూము అంతా తేరిపార చూస్తున్నాడు. బల్ల మీద చక్కగా ఒక ప్రక్క శివరామయ్య అద్దాలు, దాని ప్రక్కనే ఆయన మందుల పెట్టె, కొయ్య Chess set, Plastic Playing cards పేర్చి ఉన్నాయి.
రూము అంతా వెళ్ళిపోయిన వ్యక్తి తాలూకా జ్ఞాపకాలతో నిండి ఉన్నట్లు అనిపిస్తోంది. “శివరామయ్య ఈడనే యిట్టా కూర్చుని పేకలు వేస్తున్నట్లు ఉందిరా” అన్నాడు కోదండం. టేబుల్ మీది Paper Calendar లో పేజీలు చించక పోవడంతో పదిరోజుల క్రితం శివరామయ్య చనిపోయిన రోజు తేదీ యింకా అలాగే ఉంది. “చూశావా ఆ రోజుతో ఆయన జీవితం ముగిసినట్టు. ఇది ఎలా తెలియ జేస్తోందో చూడండి” అంటూ రాఘవయ్య ఆ Calendar వైపు చూపించాడు. ఏర్పాట్లు అన్ని బయట చేయడంతో యింట్లో ఈ స్నేహితులు తప్ప ఎవ్వరూ లేరు. ఎవరైనా ఒకరిద్దరు వచ్చినా, ఎదో వస్తువు తీసుకుని మళ్ళి వెళ్లి పోతున్నారు.
శివరామయ్య కొడుకుని వెంట పెట్టుకుని స్వామి యిల్లంతా పసుపు నీళ్ళు చల్లాడు. రేపటి నుంచి యింక మనం ఇక్కడికి రాలేం రా. ఒక్కసారి కూర్చుని పేక ఆడుదాం అని కోదండం పేక ముక్కలు తీసుకుని ముగ్గురికి పంచాడు. డ్రాలోంచి శివరామయ్య నమిలే Sweet వక్కపొడి యిద్దరికీ ఇచ్చి తను నోటిలో వేసుకుని పేక ముక్కలను చేతిలోకి తీసుకున్నాడు కోదండం. “మనిషి పోయాక ఆ గదిలో ఎదో వెలితి అన్పిస్తుంది కదా. ఏదో యిక్కడే ఉన్నట్టు, దీర్ఘంగా పేపరు చదువుతున్నట్లు, వంగి టీ తాగుతున్నట్లు, ఏమో యిక్కడ ఉంటె నాకు ఏదో కలతగా ఉంది” అన్నాడు మోహనరావు. మోహనరావుకి life, మూడు జోకర్లు పడడంతో ఆట తొందరగానే అయిపొయింది. నా ఆట అయిపోయిందిరా ´అంటూ మోహనరావు షో చూపించాడు. “నాకు యింక యిక్కడ ఉండబుద్ధి కావడం లేదు. పదండి పోదాం.” అన్నాడు రాఘవయ్య, తీసిన వస్తువులను యధా స్థానంలో ఉంచి తలుపు మూసేసి ముగ్గురు స్నేహితులు బయట పడ్డారు.
భోజనాలు దాదాపు ముగియడంతో ఒక యిరవై మంది తప్ప అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళొస్తా అని చెప్పకూడదు అనే ఆలోచనతో ముగ్గురూ కాళ్ళు ఈడ్చు కుంటూ బైట పడ్డారు. వీధి మలుపు తిరిగే లోపల కృష్ణప్ప పరిగెత్తుకుంటూ వాళ్ళ వెనకాల వచ్చాడు. “యిది మీకు యిమ్మని పంపారయ్య ఆయన జ్ఞాపకార్ధం” అంటూ ముగ్గురి చేతుల్లో భగవద్గీత పెట్టి వెళ్ళిపోయాడు.
మిత్రుల మనస్సులోని వ్యాకులతతో సంభంధం లేదన్నట్లు బయట పిల్లలు హడావుడిగా అటూ యిటూ పరిగేత్తుతున్నారు. టెంట్ హౌస్ అబ్బాయి వచ్చి వేసిన డేర విప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. యింటి ముందరి మామిడి చెట్టు ఆకులు కదల్చక నిశ్చలంగా ఉంది. యింటి కుక్క వాకిట్లో కట్టేయ బట్టి వెళ్ళిపోయిన పెద్దాయనని తలుచుకునే ఏమో దైన్యంగా చూస్తూ ఉంది.
*****

