ఓపికను తికమక పెట్టే - ఓటీపీ !
ఓటీపీ అంటే One-Time Password. కానీ నా దృష్టిలో దాని అసలు అర్థం ఓపికను తికమక పెట్టేది! ఆరు అంకెల చిన్న నంబరే కదా అని తేలిగ్గా తీసుకోకండి. అది ఫోన్‌కు రావడానికి మనం పడే తంటాలు చూస్తే, ఆరు అంకెలు సంపాదించడానికి ఆరు నెలలు కష్టపడినట్టుంటుంది! అది వచ్చేలోపు ఫోన్‌ను పదిసార్లు చూస్తాం, నెట్‌వర్క్‌ను ఐదుసార్లు తిడతాం, ‘Resend OTP’ని కనీసం మూడుసార్లు బతిమాలుకుంటాం. చివరికి ఓటీపీ వచ్చేసరికి మన ఓపికకు మాత్రం అప్పటికే గడువు ముగిసిపోతుంది!
మనిషి జీవితంలో ఎదురుచూపులకు కొదవలేదు. బస్టాండులో బస్సు కోసం ఎదురుచూడాలి. రైల్వే స్టేషన్‌లో రైలు కోసం నిరీక్షించాలి. ప్రేమలో ఉన్నవాళ్లు ప్రియురాలి ఫోన్ కోసం ఎదురుచూడాలి. పెళ్లిచూపులకు వెళ్లినవాళ్లు అమ్మాయి సమాధానం కోసం కళ్లు కాయలు కాచేలా చూడాలి. ఆసుపత్రికి వెళ్లినవాళ్లు డాక్టర్ బిల్లు చేతికొచ్చే వరకు గుండెలు బిగబట్టుకోవాలి. బిల్లు చూసిన తర్వాత ‘నీ పని అయిపోయింద్రా అబ్బాయ్!’ అని మనసులో అనుకోవాలి. ఇప్పుడు ఈ ఎదురుచూపుల జాబితాలో మరో కొత్త అంశం చేరింది. అదే OTP!
ఒకప్పుడు పోస్టుమ్యాన్ కోసం ఎదురుచూసేవాళ్లం. ఆయన చేతిలో ఉత్తరం కనిపిస్తే మనసులో ఆనందం కలిగేది. ఆ తర్వాత టెలిఫోన్ మోగితే పరుగెత్తేవాళ్లం. సెల్‌ఫోన్ వచ్చాక ఫోన్ కాల్ కోసం, మెసేజ్ కోసం ఎదురుచూశాం. ఇప్పుడు ఏ పని చేయాలన్నా ఓటీపీ కోసం ఎదురుచూడాల్సిందే. మనిషి జీవితంలో ఎదురుచూపులు తగ్గకపోగా, వాటికి కొత్త కొత్త రూపాలు వస్తున్నాయి. అయితే ఓటీపీ కోసం ఎదురుచూడటంలో ఒక ప్రత్యేకత ఉంది. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. వచ్చినా మనకు కనిపించదు. కనిపించినా గడువు ముగిసిపోయి ఉంటుంది!
ఆన్‌లైన్‌లో ఏదైనా పని మొదలుపెడతాం. పేరు నమోదు చేస్తాం. ఫోన్ నంబరు ఇస్తాం. వెంటనే తెరపై ఒక సందేశం కనిపిస్తుంది.
‘మీ మొబైల్‌కు ఓటీపీ పంపించాం. దయచేసి నమోదు చేయండి.’
అంతే! చేయాల్సిన పని ఆగిపోతుంది. చూపులన్నీ ఫోన్‌పైనే నిలుస్తాయి. ఆరు అంకెల ఓటీపీ కోసం మన ఓపికకు సెలవు ప్రకటించాల్సి వస్తుంది!
ఫోన్ చేతిలో పట్టుకుని చూస్తూ ఉంటాం. ఒకసారి నెట్‌వర్క్ ఉందో లేదో చూస్తాం. మరోసారి మెసేజ్ బాక్స్ తెరుస్తాం. మళ్లీ వెనక్కి వెళ్లి చూస్తాం. ఓటీపీ మాత్రం రాదు. కానీ అదే సమయంలో పది ప్రకటనల సందేశాలు మాత్రం వరుసగా వచ్చి పడతాయి. వాటికి మనం అడగకుండానే స్వాగతం. మనకు కావాల్సిన ఓటీపీకి మాత్రం మనం ఎంతగా ఆహ్వానించినా రాకపోవడం విచిత్రం!
బస్టాండులో బస్సు కోసం ఎదురుచూస్తున్నప్పుడు దూరంగా కనిపించే ప్రతి వాహనాన్నీ బస్సు అనుకుంటాం. దగ్గరకు వచ్చాక అది లారీ అని తెలుస్తుంది. ఓటీపీ కోసం ఎదురుచూస్తున్నప్పుడు కూడా ఫోన్ కిసుక్కున నవ్విన ప్రతిసారీ మన గుండె ఒక్కసారి అదనంగా కొట్టుకుంటుంది. వెంటనే మెసేజ్ తెరిచి చూస్తే బ్యాంకు ప్రకటనో, బీమా ప్రచారమో కనిపిస్తుంది. మనకు కావాల్సిన ఓటీపీ మాత్రం ఎక్కడో తీర్థయాత్రకు వెళ్లినట్టు ఉంటుంది!
రైల్వే స్టేషన్‌లో రైలు బయలుదేరడానికి సిద్ధంగా ఉంటుంది. ప్రయాణికులు బోగీల్లో కూర్చుని ఉంటారు. గార్డు జెండా పట్టుకుని సిద్ధంగా ఉంటాడు. కానీ సిగ్నల్ కోసం స్టేషన్ మాస్టర్ ఎదురుచూస్తుంటాడు. సిగ్నల్ వచ్చే వరకు రైలు కదలదు. ఓటీపీ కోసం ఎదురుచూసే మన పరిస్థితి కూడా అంతే. పని అంతా సిద్ధంగా ఉంటుంది. మనం కూడా సిద్ధంగా ఉంటాం. కానీ ఆరు అంకెల ఓటీపీ అనే సిగ్నల్ పడనిదే మన పని ముందుకు కదలదు. రైలుకు సిగ్నల్ ఆలస్యమైతే ప్రయాణికులు విసుక్కుంటారు. మనకు ఓటీపీ ఆలస్యమైతే మనమే ఫోన్‌ను విసుక్కుంటాం!
ఇంకో పోలిక చెప్పాలంటే, అప్పు ఇచ్చినవాడు అప్పు తీసుకున్నవాడి ఇంటి గుమ్మం దగ్గర నిలబడి ఉంటాడు. లోపల ఉన్నవాడు తలుపు తెరుస్తాడో లేదో తెలియదు. అప్పు ఇచ్చినవాడికి మాత్రం ఆ డబ్బు ఎప్పుడు వస్తుందా అన్న ఆత్రం. ఓటీపీ కోసం ఎదురుచూసేవాడి పరిస్థితి కూడా అలాంటిదే. ఫోన్ గుమ్మం దగ్గరే మనం నిలబడి ఉన్నట్టుంటుంది. మెసేజ్ తలుపు ఎప్పుడు తెరుచుకుంటుందా అని చూస్తుంటాం. లోపల ఓటీపీ ఉందని తెలుసు. కానీ అది బయటకు రావాలి కదా! అప్పులవాడు గుమ్మం దగ్గర నిలబడితే ఇంట్లోవాళ్లు తలుపు తీయకుండా ఉండొచ్చు. ఓటీపీ మాత్రం మనల్ని చూసి తలుపు తీయనట్టు ప్రవర్తిస్తుంది!
ప్రేమలో ఉన్నవాళ్లకు ఈ ఎదురుచూపు బాగా అర్థమవుతుంది. ప్రియురాలి నుంచి ఒక చిన్న సందేశం వస్తే చాలు, రోజంతా పండగే. కానీ ఆమె నుంచి మెసేజ్ రాకపోతే ప్రతి ఐదు నిమిషాలకోసారి ఫోన్ చూస్తారు. ఓటీపీ కోసం ఎదురుచూసేవాళ్ల పరిస్థితి కూడా అంతే. తేడా ఒక్కటే. ప్రియురాలు మెసేజ్ పంపకపోతే మనసు బాధపడుతుంది. ఓటీపీ రాకపోతే పని ఆగిపోతుంది!
పెళ్లిచూపుల్లో అమ్మాయి తల్లిదండ్రులు ‘మా అమ్మాయి ఆలోచించి చెబుతుంది’ అంటారు. అబ్బాయి కుటుంబం సమాధానం కోసం రోజులు లెక్కపెడుతుంది. చివరకు ఫోన్ వస్తుంది. ఆ క్షణం వరకు గుండెల్లో ఎన్నో ప్రశ్నలు. ఓటీపీ కూడా అలాగే. వస్తుందా? రాదా? వస్తే సరైనదేనా? గడువులోగా వస్తుందా? అన్నీ అనుమానాలే. పెళ్లిచూపుల్లో అమ్మాయి ‘నచ్చలేదు’ అని చెబితే బాధపడతాం. ఓటీపీ మాత్రం మనల్ని నచ్చినంతగా పరీక్షించి, చివరికి ‘Invalid OTP’ అని చెప్పి అవమానిస్తుంది!
ఇక ‘One Time’ అనే మాటలోనే ఒక ప్రత్యేకమైన గమ్మత్తు ఉంది. పుట్టుమచ్చ ఒకసారి ఏర్పడితే జీవితాంతం మనతోనే ఉంటుంది. దాన్ని తొలగించుకోవాలంటే ప్రత్యేక ప్రయత్నం చేయాలి. కానీ ఈ One-Time Password మాత్రం ఒక్కసారి ఉపయోగించగానే మాయమైపోతుంది. పుట్టుమచ్చను అద్దంలో చూసుకోవచ్చు. ఓటీపీని మాత్రం ఫోన్‌లో వెతుక్కోవాలి. అది కనిపించేలోపే గడువు ముగిసిపోతుంది. పుట్టుమచ్చ శరీరంపై గుర్తుగా మిగిలిపోతే, ఓటీపీ మనసులో తికమకగా మిగిలిపోతుంది. పేరులో One Time అయినా, దాని కోసం మనం చేసే ప్రయత్నాలు మాత్రం ఎన్నోసార్లు!
ఓటీపీ ఆలస్యమైతే మనకు మన ఫోన్ మీదే అనుమానం మొదలవుతుంది. ‘నా ఫోన్ బతికే ఉందా? నెట్‌వర్క్ పనిచేస్తోందా? లేక మెసేజ్‌లు పంపే వ్యవస్థే సెలవులో ఉందా?’ అని సందేహం కలుగుతుంది. ఫోన్‌ను ఒకసారి తట్టి చూస్తాం. స్క్రీన్ వెలిగిస్తాం. మెసేజ్‌లు తెరిచి చూస్తాం. అయినా ఓటీపీ జాడ ఉండదు. చివరికి ఓటీపీ కోసం ఎదురుచూస్తున్నామా, లేక మన ఫోన్ ఇంకా బతికే ఉందని నిర్ధారించుకోవడానికి నిరీక్షిస్తున్నామా అన్న అనుమానం వస్తుంది! ఫోన్ బతికే ఉందని చెప్పడానికి కూడా ఓటీపీ అవసరమేమో అనిపిస్తుంది!
ఒకసారి ఓటీపీ కోసం ఎదురుచూస్తూ ఉండగా తెరపై ‘Resend OTP’ అనే అవకాశం కనిపిస్తుంది. దాన్ని నొక్కుతాం. మరోసారి నొక్కుతాం. ఇంకోసారి నొక్కుతాం. మనం ఓటీపీని అడుగుతున్నామా, లేక వేడుకుంటున్నామా అన్న సందేహం వస్తుంది. చివరకు అది వస్తుంది. కానీ అప్పటికే మొదటిది వచ్చి ఉండవచ్చు. రెండోది రావచ్చు. ఏది తాజాదో, ఏది చెల్లుతుందో తెలియక మనమే తికమకపడతాం. మొదటి ఓటీపీ నమోదు చేస్తే తప్పు. రెండోది నమోదు చేస్తే గడువు ముగిసిందని సందేశం. మూడోది వచ్చేసరికి మన సహనానికి గడువు ముగిసిపోతుంది!
ఆన్‌లైన్‌లో బ్యాంకు పని చేయాలన్నా, విద్యుత్ బిల్లు కట్టాలన్నా, ప్రభుత్వ సేవ పొందాలన్నా ఓటీపీ తప్పనిసరి. మన గుర్తింపును నిరూపించుకోవడానికి ఆధార్ నంబరు ఇవ్వాలి. ఫోన్ నంబరు ఇవ్వాలి. ఓటీపీ నమోదు చేయాలి. కొన్నిసార్లు ఒక చిన్న పని పూర్తి చేయడానికి మనమే మనల్ని మూడుసార్లు పరిచయం చేసుకోవాల్సి వస్తుంది. మనకు మనమే పరిచయం లేని వ్యక్తులమన్నట్టుగా వ్యవస్థలు ప్రవర్తిస్తాయి!
ఇంట్లో పెద్దవాళ్ల పరిస్థితి మరీ విచిత్రం. వాళ్లకు ఆన్‌లైన్ పని చేయాల్సి వస్తే పిల్లల్ని పిలుస్తారు.
‘ఒరేయ్! ఈ ఫోన్‌లో ఏదో నంబరు అడుగుతోంది. ఏమిట్రా అది?’
‘అది ఓటీపీ నాన్నా! ఫోన్‌కు వస్తుంది. చెప్పండి.’
‘ఫోన్‌కే వస్తుందా? మరి ఎక్కడుంది?’
‘మెసేజ్‌లలో చూడండి.’
‘ఇక్కడ ఎన్నో మెసేజ్‌లు ఉన్నాయి. ఏది నాది?’
‘ఆరు అంకెల నంబరు ఉంటుంది. అదే చెప్పండి.’
‘అది నీకు చెబితే సరిపోతుందా?’
‘అవును నాన్నా!’
‘మరి ఎవరికీ చెప్పొద్దంటారు కదరా!’
ఈ ప్రశ్నలోనే ఓటీపీ చుట్టూ ఉన్న గందరగోళం అంతా దాగి ఉంది. నిజానికి బ్యాంకు లేదా ప్రభుత్వ సంస్థల పేరుతో ఫోన్ చేసి ఓటీపీ అడిగేవారికి చెప్పకూడదు. ఓటీపీని ఎవరితోనూ పంచుకోకూడదు. మోసగాళ్లు మన తొందరపాటునే తమ పెట్టుబడిగా మార్చుకుంటారు. అందుకే ఓటీపీ విషయంలో జాగ్రత్త అవసరం. అయితే జాగ్రత్తగా ఉండటం ఒక ఎత్తయితే, దాన్ని నమోదు చేసేలోపు ఓపిక కోల్పోకుండా ఉండటం మరో ఎత్తు!
డాక్టర్ దగ్గరకు వెళ్లినప్పుడు కూడా ఇలాంటి ఎదురుచూపే ఉంటుంది. పరీక్షలు పూర్తయ్యాక బిల్లు చేతికి ఇచ్చే వరకు మనసులో ఒకటే ఆలోచన. ‘నీ పని అయిపోయింద్రా అబ్బాయ్!’ అని మన జేబు మనల్ని హెచ్చరిస్తుంది. ఓటీపీ కోసం ఎదురుచూస్తున్నప్పుడు కూడా అదే పరిస్థితి. పని పూర్తవుతుందో లేదో తెలియదు. కానీ మన సమయం మాత్రం ఖర్చవుతూనే ఉంటుంది.
ఓటీపీకి ఒక విచిత్రమైన స్వభావం ఉంది. మనం అత్యవసరంగా ఉన్నప్పుడే అది ఆలస్యం చేస్తుంది. సమయం ఉన్నప్పుడు మాత్రం వెంటనే వచ్చేస్తుంది. రైలు బయలుదేరే ముందు టికెట్ బుక్ చేయాలంటే ఓటీపీ రాదు. పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి నిమిషంలో ప్రయత్నిస్తే ఓటీపీ రాదు. గడువు ముగిసిన తర్వాత మాత్రం వరుసగా మూడు నాలుగు ఓటీపీలు వచ్చేస్తాయి. అప్పుడు మనకు అవసరం ఉండదు. ఓటీపీకి మాత్రం మనల్ని పలకరించాలనే ఆత్రం ఉంటుంది!
రైతు వర్షం కోసం ఎదురుచూస్తాడు. నిరుద్యోగి ఉద్యోగం కోసం ఎదురుచూస్తాడు. విద్యార్థి పరీక్ష ఫలితం కోసం ఎదురుచూస్తాడు. అప్పు ఇచ్చినవాడు అప్పు తిరిగి వస్తుందా అని ఎదురుచూస్తాడు. వీళ్లందరి ఎదురుచూపుల్లోనూ ఒక ఆశ ఉంటుంది. కానీ ఓటీపీ కోసం ఎదురుచూసేవాడి ఆశ మాత్రం ఆరు అంకెల్లో బందీ అయిపోతుంది. ఆరు అంకెలు వచ్చేవరకు అతని పని ముందుకు కదలదు. అవి వచ్చిన తర్వాత కూడా తప్పుగా నమోదు చేశాడేమోనని మరో భయం!
సాంకేతికత మన జీవితాన్ని సులభతరం చేయడానికి వచ్చింది. ఇంట్లో కూర్చుని పనులు చేసుకోవచ్చు. బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం తగ్గింది. బిల్లులు చెల్లించడం సులభమైంది. ప్రభుత్వ సేవలు వేగంగా అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ మంచి పరిణామాలే. కానీ సాంకేతికత సౌకర్యం కల్పించాలి గానీ,సహనానికి పరీక్షా కాకూడదు. ప్రతి చిన్న పనికీ ఇన్ని ధృవీకరణలు, ఓటీపీలు అడుగుతుంటే, పని పూర్తవుతుందో లేదో తెలియదు గానీ, బీపీ మాత్రం పెరుగుతుంది, తలనొప్పి మొదలవుతుంది, చిరాకు చుక్కలంటుతుంది!
మనిషి యంత్రాలను తయారు చేశాడు. వాటిని తన అవసరాలకు అనుగుణంగా పనిచేయించుకోవాలనుకున్నాడు. కానీ ఇప్పుడు యంత్రాల సూచనల ప్రకారం మనిషి నడుచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఫోన్ చేతిలో ఉన్నా, మనసంతా ఆరు అంకెల కోసం వెతుకుతోంది. మన పని మనం చేసుకోవడానికి వచ్చిన సాంకేతికత, మన ఓపికను పరీక్షించే పరీక్షా కేంద్రంగా మారిపోయింది.
అందుకే నాకు ఓ.టీ.పీ అంటే. ఓపికను తికమక పెట్టేది! అంతేకాదు, కొన్నిసార్లు అది ఓపిక పోయేంత తిప్పలు!
కూడా!
ఓటీపీ కోసం ఎదురుచూస్తూ ఫోన్ వైపు చూస్తున్న ప్రతిసారీ ఒక ప్రశ్న వేయాలనిపిస్తుంది.
మనిషి యంత్రాన్ని తయారు చేశాడా? లేక యంత్రం మనిషి ఓపికను పరీక్షించడానికి తయారైందా?
ఏది ఏమైనా, ఓటీపీ కోసం మనం చేసే ప్రయత్నాలు మాత్రం ఎన్నోసార్లు! అది వచ్చే వరకు ఫోన్‌ను వందసార్లు చూస్తాం, ‘Resend OTP’ని పదిసార్లు నొక్కుతాం. చివరికి ఓటీపీ వచ్చి పని పూర్తయిపోతుంది. కానీ అప్పటివరకు మనం పడిన తిప్పలు మాత్రం అంత త్వరగా మర్చిపోలేం. పుట్టుమచ్చ శరీరంపై గుర్తుగా మిగిలినట్టు, ఓటీపీ వచ్చిందో లేదో తెలియదు గానీ, అది వచ్చేలోపు మనకు మాత్రం చుక్కలు కనిపిస్తాయి!

