కార్తీకమాసం స్పెషల్ పోలి స్వర్గం - విష్ణుభొట్ల రామకృష్ణ

కార్తీకమాసం స్పెషల్ పోలి స్వర్గం

కార్తీక మాస స్పెషల్ 

పోలిస్వర్గం

కార్తీక మాసం వచ్చింది అంటే అందరూ శివాలయాలకు వేళ్లీ ,శివునికి అభిషేకాలు, మొదలగునవి చేస్తారు . భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుని ఆరాధీస్తారు.ఈ మాసం హరిహారాదులకు ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో పుణ్యం కోసం, మోక్షం, కోసం కార్తీక పురాణం చదవుతారు.కార్తీకం మాసం అంటే స్నానం, ధ్యానము, దానము. కార్తీక సోమవారం,కార్తీక పౌర్ణమి, రోజులలో ఉపవాసం ఉంటారు . కొంత మంది ఈ నెల నక్తం లేదా ఏకభుక్తo ఉంటారు . అలాగే ఈ కార్తీక మాస చివరిలో పోలిని స్వర్గానికి పంపుతారు . పోలిని ఎందుకు స్వర్గానికి పంపుతారు అంటే .

కార్తీక మాసం చివరి రోజు లేదా కార్తీక అమావాస్య మరుసటి రోజున (పోలి పాడ్యమి ) ఆచరించే నోము పోలిని స్వర్గానికి పంపటం . ఒక ఊరిలో ఒక చాకలి స్త్రీ ఉండేది. ఆమెకు నలుగురు కొడుకులు, నలుగురు కోడళ్లు ఉండేవారు. ఆమె ఆశ్వయుజ బహుళ అమావాస్య నుంచి కార్తీక మాసమంతా ప్రతిరోజూ తన నలుగురు కోడళ్లలో ముగ్గురితో కలిసి నదీ స్నానమాచరించి అక్కడే దీపం వెలిగించి వస్తుండేది. ఇంటి చాకిరీ మొత్తం చిన్న కోడలైన పోలిపై వేసేసి వెళ్లేది. కార్తీక మాసం అంతా అత్తగారు ముగ్గురు కోడళ్లతోనే నదీ స్నానానికి వెళ్లి దీపారాధన చేసేది కానీ.. ఒక్కరోజు కూడా చిన్న కోడలైన పోలిని తీసుకువెళ్లలేదు

కార్తీక మాసమంతా చిన్న కోడలు పోలి మాత్రం ఎలాగైనా ఈరోజు దీపం పెడతాను అని అనుకుని.. చల్ల చిలికిన కవ్వానికి అంటుకుని ఉన్న వెన్నను తీసుకని.. పెరటిలో ఉండే పత్తి చెట్టు కింద రాలిపడిన పత్తి కాడను తీసి వత్తిగా చేసి.. పెరటిలోనే ఉన్న బావి వద్ద స్నానం చేసి.. వెన్న, వత్తితో కలిపి దీపం వెలిగించి.. ఆ దీపం అత్తగారు చూడకుండా దాని మీద ఒక గంప లాంటి దానిని మూత వేసింది

ఇలా కార్తీక మాసం మొతం గడిచిపోగా చివరి రోజు దివ్యమైన దేవతా విమానం పోలి ఇంటి ముందుకొచ్చింది. దేవతలంతా పోలిని ఆ విమానంలోకి సాదరంగా ఆహ్వానిస్తూ లోపల కూర్చోపెట్టుకున్నారు. అయితే ఆ దివ్య విమానం తమ కోసమే,అనుకుని భ్రమిస్తూ.. మురిసి పోతున్న అత్తగారి ఆశలన్నీ అడియాశలయ్యాయి. పోలితో పాటు తాము కూడా ఎలాగైనా స్వర్గానికి వెళ్లాలనుకుని.ప్రయత్నం చేసినా.. ప్రయోజనం లేకుండా పోయింది. దుర్బుద్ధితో ఆటంకాలు కల్పించినా.. అచంచలమైన భక్తితో వాటన్నింటినీ అధిగమించిన పోలి భక్తిశ్రద్ధలకు పరమేశ్వరుడు ఎంతగానో పరవశించాడు . అందుకే పోలిని తీసుకురమ్మంటూ పుష్పక విమానం పంపించాడని భక్తుల విశ్వాసం

అప్పటి నుంచి మహిళంతా పోలిని తలుచుకుంటూ కార్తీక అమావాస్య మరుసటి రోజు తెల్లవారుజామున అరటి దొప్పల్లో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. కార్తీక మాసంలో ఒక్క రోజు కూడా దీపాన్ని వెలిగించకపోయినా కనీసం పోలి పాడ్యమి రోజు 30 వత్తులను వెలిగించి నీటిలో వదిలితే కార్తీక మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం కలుగుతుందని కార్తీక పురాణం చెబుతోంది

దీన్ని బట్టి మనకు ఏమి తెలుస్తుంది అంటే .... భగవంతుడు భక్తి ని మాత్రమే కోరుకొంటాడు. నువ్వు ఎంత బాగా పూజ చేశావు అని కాదు ఎంత భక్తి తో పూజ చేశావు అని చూస్తాడు. కావున కార్తీక మాసంలో భక్తి లేని పూజ ఎంతచేసిన వ్యర్ధం అని కార్తీక పురాణం చెపుతోంది . భక్తితో పూజ చేసి శివుని అనుగ్రహం పొందుదాం .

ఓం నమః శివాయ

 

 

విష్ణుభొట్ల రామకృష్ణ

విజయవాడ :: 9440618122

మరిన్ని వ్యాసాలు