సాహితీవనం - వనం వేంకట వరప్రసాదరావు

sahiteevanam

అల్లసాని పెద్దన విరచిత స్వారోచిష మనుసంభవము

(గత సంచిక తరువాయి)

ఇందీవరాక్షుడిని చూసిన స్వరోచి ఆశ్చర్యముతో అతడిని ఆతని భయంకర రూపానికి కారణం ఏమిటి అని అడుగగా  ఇందీవరాక్షుడు తన కథను చెప్పడం ప్రారంభించాడు.

కలఁ డుల్లోకయశఃపురంధ్రి జగతిన్ గంధర్వ వంశంబునన్

నలనాభాహ్వయుఁ డేఁ దదీయతనయుండన్ బ్రహ్మమిత్రుండు శి

ష్యులకుం గంటను వత్తిఁ బెట్టుకొని యాయుర్వేద మోరంత ప్రొ

ద్దులఁ జెప్పన్ వినుచుండి  మానసమునందుం దజ్జిఘృక్షారతిన్

జగత్ప్రసిద్ధుడైన నలనాభుడు అనే గంధర్వుడు ఉండేవాడు, నేను ఆయన కుమారుడిని. బ్రహ్మమిత్రుడు అనే మహానుభావుడు తన శిష్యులకు కంట్లో వత్తులేసుకుని ఆయుర్వేద విద్యను నిరంతరమూ ఉపదేశిస్తున్నాడని విని నాకు కూడా ఆ విద్యనూ అభ్యసించాలనే కోరిక కలిగింది. దాంతో..  

మౌనివరుఁ జేరి భక్తి నమస్కరించి

చెప్పవే నాకు నీ విద్య శిష్యకోటి

తోడఁ గూడంగ నేఁ గృతార్థుండ నగుదు

ననుచుఁ బ్రార్థింప ననుఁ జూచి యపహసించి

ఆ మునివరుడిని చేరి, భక్తిగా నమస్కరించి మీ శిష్యకోటితోపాటు నాకు కూడా ఈ విద్యనూ ఉపదేశించండి మహానుభావా! నేను క్రుతార్దుడను అవుతాను అని అడిగాను. ఆయన నన్ను అపహాస్యం చేస్తూ, చులకనగా ...

నట విట గాయక గణికా

కుటిలవచ శ్శీధురసము గ్రోలెడు చెవికిం

గటు వీశాస్త్రము వల ది

చ్చట నినుఁ జదివింపకున్న జరుగదె మాకున్?

నటులు, విటులు, గాయకులు, వేశ్యల కుటిలపు పలుకులరసాలను నిరంతరము గ్రోలే చెవులకు ఈ శాస్త్రము ఏం రుచిస్తుంది? వీలుకాదు, నీకు ఈ శాస్త్రాన్ని చదివించకుంటే మాకు జీవనం జరగదా  ఏమిటి? అన్నాడు.

అనఁగ నే నట్టివాఁడఁ గా ననఘచరిత!

యించుకించుక మీవంటి యెరుక గలుగు

పెద్దవారల శిక్షలఁ బెరిగిఁనాఁడ

నవధరింపుము శిష్యుఁగా ననిన నతఁడు

నేను మీరన్న వాళ్లవంటి వాడిని కాను స్వామీ! కొద్దో గొప్పో మీ అంతటి విద్వాంసుల శిక్షణలో పెరిగినవాడిని,  నా మాటలను నమ్మండి, నాకు ఆయుర్వేద విద్యను నేర్పండి అన్నాను నేను.

ధన రాజ్యరమా మదమునఁ

గనుగానని నిన్ను శిష్యుగా గైకొనుకం

టెను నేరమి గలదే? ననుఁ

గనలించుచుఁ బ్రేల కిఁకఁ బొకాలు మటన్నన్

ధనము, రాజ్యలక్ష్మి ఉన్నాయనే మదముతో కన్నూ మిన్నూ గానని నీలాంటివారిని శిష్యులుగా చేసుకొనడంకంటే వేరే నేరమేమన్నా ఉన్నదా? ఆట్టే మాట్లాడుతూ నాకు కోపం తెప్పించక ఇక్కడినుండి వెళ్ళిపో అన్నాడు ఆయన!

అచటన్ ‘ద్వేష్టి గతాయు

శ్చ చికిత్సక’ మను నయోక్తి చర్చను నుచ్చా

వచ వచనంబులఁ గోపము

ప్రచురము గానీక మౌనిపతి కి ట్లంటిన్

ఆయుష్షు లేనివాడికి చికిత్స అనే నానుడిలాగా నా పలుకులు ఆయనకు ద్వేషాన్ని కలిగించాయి అని తెలుసుకుని, నా కోపాన్ని దాచుకుని కపటత్వముతో, అనునయ వాక్యాలతో ఆ మునితో యిలా అన్నాను నేను.

నీవు సదివింతు వనుచు నిన్నియును విడిచి

బిచ్చ మెత్తంగ రాదుగా బేలతపసి!

కడవ నాడకు చాలు నీ గొడవ యేల?

వెజ్జుఁదన మేల? యని మది లజ్జవొడమి

నువ్వు చదివిస్తావు అనే నమ్మకంతో, ఆ విద్యమీద కోరికతో అన్నీ వదులుకుని, నా మానము, అభిమానము, దర్పము అన్నీ వదిలిపెట్టి, బిచ్చమెత్తడం అవసరము లేదు కదా మహానుభావా! సర్లెండి, నాకు మీతో ఎందుకు, మీ గురుత్వం ఎందుకులెండి అని, మనసులో నోరు తెరిచి యాచించి కూడా నా కోరికను తీర్చుకోలేక పోయాను, ఆ విద్యను నేర్చుకోలేకపోయాను అనే అవమానంతో...

కంటే బ్రాహ్మణుఁ డెన్ని కారు లరచెన్ గర్వించి?

వీ రెల్ల నా కంటెం బాత్రులె విద్య? కెట్లు నిది నేఁ గై కొందునంచున్ మది

న్గెంటెంపుంజల ముప్పతిల్లఁ గపటాంతేవాసి నై శాంబరిన్

గొంటుంజందము మీర శిష్యులగెడం గూర్చుండి చర్చారతిన్

ఈ బ్రాహ్మణుడు గర్వంతో ఎన్ని కారుకూతలు కూశాడు! ఈ విద్యార్థులందరూ నాకంటే పాత్రులా నేర్చుకోడానికి? ఎలాగైనా సరే ఆ విద్యను నేర్చుకుంటాను అని పంతముతో కపట విద్యార్థినై, శాంబరీ విద్యతో అదృశ్యరూపంతో ఉండి  ఆయన శిష్యుల నడుమ కూర్చుని ...

కాయ బాల గ్రహోర్ధ్వాంగకములు నాల్గు

శల్య దంష్ట్రా జరా వృష సంజ్ఞ నాల్గు

నైన యష్టాంగకము ఠావు లారఁ గల్గు

వైద్య మెనిమిది నెలల సర్వమును నేర్చి

కాయ, బాల, గ్రహ, ఊర్ధ్వాంగకములు, శల్య, దంష్ట్ర, జరా, వృషలనే నాలుగు, మొత్తం ఎనిమిది అంగములు కలిగిన ఆయుర్వేద విద్యను సంపూర్ణముగా ఎనిమిది నెలల్లో నేర్చుకుని,

ఇరుమూఁడు రుచుల దోషపు

విరసత మానన్ జ్వరాది వృష్యాంతం బై

పరఁగు చికిత్సయుఁ గని శాం

బరిఁ బాసి తపస్వితోడ మదమున నంటిన్   

షడ్రుచుల తాలూకు దోషపు ఆహార విరక్తి, జ్వరము, వృషాదికములైన వివరణలతో కూడిన చికిత్సను కూడా నేర్చుకుని నా శాంబరీ మాయను విడిచి, నా నిజస్వరూపాన్ని ధరించి మదముతో ఆ మునిని చూసి యిలా పలికాను!

(కొనసాగింపు వచ్చే వారం)

వనం వేంకట వరప్రసాదరావు