
మొత్తానికి ట్రైన్ టైమ్ కంటే ముందుగానే స్టేషన్ కి చేరాం. రాత్రి నుండి ఒకటే హడావుడి. నేను నా భార్య , అన్నయ్య, వదిన అమ్మతో కలిసి తిరుపతి ప్రయాణం పెట్టుకున్నాం. నిజానికి ఇది నా పెళ్లి మొక్కు. నాకు ఎంతకీ పెళ్లి కాకపోవడం తో అమ్మ తిరుపతి కి ముడుపు కట్టింది. దాని తర్వాతే అతి కష్టం మీద ఓ నాలుగు సంబంధాలు దగ్గర దాక వచ్చి జరిపోయిన తర్వాత నిర్మల తో నాకు పెళ్లి జరిగినది. అప్పటికే నాకు ముప్పైనాలుగు ఏళ్లు. ఇక నా పెళ్లి తంతు, నేను చూసిన సంబంధాలు ఇవన్నీ చెప్పాలంటే ఒక భారతమే అవుతుంది. మొత్తానికి పెళ్లి కుదిరింది. దానితో పాటు మా ఇంట్లో అందరి దిగులు కూడా తీరిపోయింది. పెళ్లి అయిన తొమ్మిది నెలల తర్వాత తిరుపతికి ప్రయాణం కట్టాం. నాతో పాటు నా భార్య, నాకు పిల్లనిచ్చిన మామయ్య నారాయణ, అత్తయ్య శేషమ్మ, ఇంకా మా అమ్మ, అన్నయ్య వదిన అందరం కలిసి ట్రైన్ లో తిరుపతి బయలుదేరాం . ఖర్చు అంతా నాదే. చిన్నపాటి ఉద్యోగం కావడం వల్ల అన్ని సమకూర్చుకోవడానికి తొమ్మిది నెలలు పట్టింది..
ఇంతలో ట్రైన్ ప్లాట్ఫాం మీదకు వచ్చింది. అందరం జాగ్రత్తగా ట్రైన్ ఎక్కి మా బెర్తులు జాగ్రత్తగా సరి చూసుకొని కూర్చున్నాము. ఇంతలో ట్రైన్ కదిలింది..
"వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మీ మామ గారి నోటికి రెస్ట్ లేదు. ఒకటే వాగుడు . చచ్చిపోతున్నా రా కామేశం. నీ పెళ్ళానికి చెప్పి ఆయన నోరు కాస్త మూయించరా " అంది అమ్మ నాతో చిన్నగా. నిజమే అనిపించింది నాకు
ఇంతలో అన్నయ్య ప్రసాద్ కల్పించుకొని " అమ్మ అన్నది నిజమేరా కాముడు. ఒకటే నస. పోనీ విషయం ఏమైనా ఉందా అంటే ఏమి ఉండదు. అసలు ఏమైనా తెలిస్తే కదా. ప్రతి విషయానికి స్వంత కవిత్వం. భరించలేక పోతున్నాం. అన్నిట్లో జోక్యం చేసుకుంటాడు. కాస్త నోరు మూయించరా " అన్నాడు. వదిన ఏమి అనలేక నవ్వింది.
ఏమి చేయాలో నాకు అస్సలు అర్ధం కాలేదు. ఏమైనా చెబుదామా అంటే ఆ ఫ్యామిలీ మొత్తానికి ఒకటే వాగుడు జబ్బు. నా భార్య నిర్మల ని రోజు భరిస్తున్నగా. ఇంట్లో ఉన్నంత సేపు మన నోటికి పని ఉండదు. అంతా చెవులకే పని. పోనీ ఏమైనా విలువైన విషయాలు మాట్లాడతారా అంటే అది లేదు. ఒక దానికి ఒకటి సంబంధం లేకుండా.. ఒక విషయం లో నుండి మరో విషయానికి, కోతి ఒక కొమ్మ మీద నుండి మరో కొమ్మకు మారినట్లు జంప్ చేస్తారు. ఎప్పటికో గాని వారు టాపిక్ ని మార్చారు అని అర్ధం గాదు మనకి. నా పెళ్ళాం అచ్చం వాళ్ళ అయ్య నారాయణ పోలికే. వచ్చిన దగ్గర నుండే నేను గమనిస్తున్నా నారాయణ గాడి వాగుడ్ని. విషయం ఏమైన ఉందా అంటే ఏమి ఉండదు. కంట్లో పడిన ప్రతిదీ ఒక టాపిక్ లా మారిపోతుంది. ఇక దానికి చిలవలు పలవలుగా అల్లుతాడు. పోనీ కంఠం ఏమైనా మధురమా అంటే అది లేదు. డబ్బాలో రాళ్ళు వేసినట్లు గా ఒకటే సౌండ్. వాగుడు తగ్గించమని చెబుదామా అంటే పిల్ల నిచ్చిన మామ.
పిల్ల నిచ్చిన మామ కడు స్వతంత్రుడు, ఫాలాక్షుడి తో సమానం కదా|.
పెళ్ళయిన మూడు నెలలకే నా పెళ్ళాం వాగుడు భరించలేక విడాకులు ఇద్దామనుకున్నా, ఇక ఇది పోతే నా ముఖానికి ఏ దిక్కు ఉండదు కనుకఅతి కష్టం మీద భరిస్తున్నా. తండ్రి ,బిడ్డలు ఇద్దరు ఒకే సమయంలో ఒకే ఇంట్లో ఉంటే ఆ ఊరికి దయ్యాలు రావు దొంగలు కూడా రారు. వీళ్ళ వాగుడికి ఎంత పెద్ద దయ్యమైనా పారిపోవల్సిందే.
"మీ నాన్న ను నెమ్మదిగా మాట్లాడమను .. అందరూ మన కేసే చూస్తున్నారు.. ఎదురుగా ఉన్న చిన్న పిల్లలు చూడు ఎలా అయిపోయారో. ఈ వాగుడు ఇలాగే ఉంటే మన మీద కంప్లయింట్ ఇస్తారు " అని చిన్నగా మా ఆవిడ చెవిలో చెప్పాను.
ఏ మూడ్ లో ఉందో మా ఆవిడ నా మాట విని వాళ్ల నాన్నకి చెవిలో ఏదో చెప్పింది. మా మామ సరే లే అని తల ఆడించినట్లుగా నాకు అనిపించింది.
మా ఆవిడ చెప్పిన తరువాత మా మామగారు శ్రీ నారాయణ గారు గొంతుని కాస్త తగ్గించారు. వాగుడయితే ఆపలేదు. నిజానికి మా మామ వాగుడు తగ్గడం అంటే కాటికి పోయినపుడే. అంతలో రాత్రి భోజనం టైమ్ అయ్యింది. అందరం ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్న అల్పాహారం తీసుకున్నాం. మా అన్న, అమ్మ ఇక లాభం లేదనుకొని దుప్పటి ముసుగెట్టి నిద్ర కు ఉపక్రమించారు.. నేను కూడా ..
నా భార్య ఫ్యామిలీ మాత్రం వాగుడు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. వీళ్ళ సిగ తరగ పొద్దుటి నుండి వాగితే ఎవరైనా అలసిపోతారు. ఇది రాక్షస జాతిగా|| ఎంత వాగినా అలసిపోరు. రాత్రికి ఇంకా బలమోస్తుంది. ఎందుకంటే రాక్షసులు రాత్రి పూట అధిక బలవంతులు కదా||
మా మామను వూళ్ళో అందరూ CBN అని పిలుస్తారు. CBN అని అడిగితేనే మామ ఇంటి అడ్రస్ చెప్తారు ఆ వూళ్ళో. నారాయణ గారి ఇల్లు అని అడిగితే ఎవ్వరికి తెలీదు. ఇక్కడ మీరో విషయం గమనించాలి CBN అంటే చంద్రబాబు గారు కాదు. అంతటి గొప్పవారితో మా మామకి పోలిక ఎక్కడ. ఇక్కడ CBN అని అంటే "చాటర్ బాక్స్ నారాయణ" అని అర్ధం. ఎప్పుడు వాగుతూనే ఉంటాడు కాబట్టి వూళ్ళో వాళ్ళు చాటర్ బాక్స్ నారాయణ అని ముద్దుగా పిలుస్తారు. నా భార్య కూడా మరో CBN. ఎలా అంటే దాని పేరు నిర్మల, ఇంకా ఆనకట్ట లేని వాక్ ప్రవాహం దాని స్వంతం. అందువల్ల అది జూనియర్ CBN. అంటే చాటర్ బాక్స్ నిర్మల. నేను పూర్వ జన్మ లో రాళ్ళ తో దేవునికి పూజ చేసి ఉంటాను. అందుకే ఈ దిక్కు మాలిన సంత నా పాలిట పడింది.
రైలు చిన్నగా తిరుపతికి చేరింది. ముందుగానే అన్ని ఆన్లైన్ బుకింగ్ ఉండడం వల్ల రూమ్ దొరకడం, స్వామి వారి కళ్యాణం చేయించడం అన్నిసకాలం లో జరిగిపోయాయి. అయ్యా కూతురు మాత్రం తమ వాక్ నైపుణ్యాన్ని చూపుతూనే ఉన్నారు.
"ఇక్కడ దాకా వచ్చాంగా, ఇక్కడ అన్ని చూసుకొని పోదాం రా చిన్నోడా" అని మా అన్నయ్య అడిగేటప్పటికి అందరం ఇంకో రెండు రోజులు ఇక్కడే ఉందాం అనుకున్నాం.
సాయంత్రం అందరమూ డిన్నర్ కోసం హోటల్ కు వెళ్ళాం. అందరం సరదాగా మాట్లాడుతూ ఉన్నాం. మా మామ ఏదో పని మీద బయటకు వెళ్ళాడు. అంతలో
"ఒరే ప్రసాద్ " అనే కేక వినిపించింది. అందరం అటు తిరిగి చూశాం. అంతలో ఒక మనిషి మా దగ్గరకు రావడం మా అన్నయ్య ప్రసాద్ భుజం మీద చేయి వేయడం జరిగింది
"శ్రీను , నువ్వా .. ఎంత కాలం అయిందిరా చూసి " అన్నాడు మా అన్న సంతోషం గా.
మా వైపు తిరిగి..
"వీడు శ్రీనివాస్. నా క్లాస్ మెట్ ఇంకా రూమ్మేట్. ఇద్దరం కలిసి దాదాపు ఉద్యోగం వచ్చేదాకా హైదరాబాద్ లో కలిసి ఉన్నాం. వీడి ని చూసి దాదాపు పదేళ్లయింది." అని చెప్పాడు.
"ఏరా శ్రీను ఏమి చేస్తున్నావ్. ఉద్యోగం రాలేదుగా. పిల్లలు ఎంతమందిరా" చనువుగా అడిగాడు మా అన్న ప్రసాద్.
"చిన్న వ్యాపారం చేస్తున్నాను. కిరాణా అండ్ జనరల్. మేరేజ్ బ్యూరో కూడా ఉంది. నేను మా తోడల్లుడు ప్రభాకర్ కలిసి చేస్తున్నాము. ఒక్కడే బాబు" అని చెప్పాడు. శ్రీనివాస్
అంతలో మా మామ నారాయణ వచ్చాడు. శ్రీనివాస్ ని చూసి కొంచెం తడబాటు పడ్డట్లుగా మాకు అనిపించింది.
"CBN గారు నమస్తే . బాగున్నారా " అడిగాడు మా మామను శ్రీనివాస్.
ఇంతలో మా అన్న కల్పించుకొని ..
" శ్రీను ఆయన మా తమ్ముడు మామ గారు. ఇదిగో మా తమ్ముడు , మా మరదలు " అని మా కేసి చూపించాడు.
"అదా సంగతి. నిర్మల నీకు మరదలా. అయితే ఈ పెళ్లి మేము కుదిరించిందే. మా తోడల్లుడు ప్రభాకర్ మీకు బాగా పరిచయం ఉండే ఉంటుంది. ఈ పెళ్లి కుదిరే సమయంలో ఎక్కువ సార్లు మీ దగ్గరకు వచ్చాడుగా . వేరే పని ఉండడం వల్ల ఈ పెళ్ళికి నేను రాలేదు " అన్నాడు. శ్రీనివాస్
"ప్రభాకర్ మాకు బాగా తెలుసు" అన్నాం నేను మా అన్నయ్య.
శ్రీను ఉండడం వల్ల మా మామ, నా భార్య నిర్మల కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతు న్నట్లుగా నాకు అనిపించింది.
అసలు ఆశ్చర్య మైన విషయం ఏమంటే ఇద్దరు అస్సలు మాట్లాడడం లేదు. ఏదో మంత్రం వేసినట్లుగా మౌనంగా, కొంచెం కంగారుగా ఉన్నారు. ఈ విషయం నేను కొంత టైమ్ తర్వాతే గమనించాను. వీళ్ళకి ఏమైనా అయిందేమోనని కొంచెం కంగారుపడ్డాను . ఎందుకంటే వాళ్ళు మాట్లాడడం ఆపి అప్పటికి 10 నిముషాలు అయ్యింది.
"అంతా బాగానే ఉందా . ఏమైనా ఇబ్బంది ఉందా " అని మా ఆవిడని అడిగాను. అంతా బాగేనే ఉంది . ఇబ్బంది ఏమి లేదని మా ఆవిడ తేల్చిచెప్పింది.
మా మామ నారాయణ శ్రీను ని పక్కకి తీసుకెళ్ళి ఏదో మాట్లాడుతున్నాడు. మాకు ఏమి అర్ధం కాలేదు. మనకెందుకని అందరం మౌనంగా ఉన్నాం.
ఆరోజు మా అందరికీ చాలా హాయిగా ఉంది. జూనియర్, సీనియర్ CBN లు ఇద్దరు మౌనం గా ఏదో ఆలోచన లో ఉన్నారు. నోటివెంట మాట లేదు. కొంచెం కలవరంగా ఉన్నట్లు మాకు అనిపించింది. మా ఆవిడని ఏదైనా ఇబ్బంది ఉందా అని చాలా సార్లు అడిగాను. మా మామ ను కూడా అడిగాను . ఏమి చెప్పలేదు. అంతా బాగానే ఉంది అని బదులిచ్చారు.
ఇంతలో తెల్లారింది. అందరం కాణిపాకం బయలుదేరాం . అందరం బయలుదేరే సమయం లో శ్రీను వచ్చాడు..
" ప్రసాద్ నేను హైదరాబాద్ వెళ్తున్నాను. నీ ఫోన్ నెంబర్ ఇవ్వు . హైదరాబాద్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కలువు. నీకు రెగ్యులర్ గా ఫోన్ చేస్తూ ఉంటా " అని అన్నయ్యకు తన అడ్రసు ఫోన్ నెంబర్ ఇచ్చి అన్న దగ్గర ఫోన్ నెంబర్ తీసుకున్నాడు.
ఇంతలో మామ నారాయణ శ్రీను ని పక్కకి తీసుకెళ్ళి ఏదో మాట్లాడాడు. చాలా సేపు మాట్లాడాడు. మా మామ ముఖం లో ఆందోళన కనిపించింది. మా మామ అక్కడి నుండి ప్రక్కకు వెళ్ళాడు. మా అన్న ప్రసాద్ కు డౌట్ వచ్చి
"అరే శ్రీను ఇలా రా" అని శ్రీనుని పక్కకి తీసుకెళ్ళాడు. నేను కూడా వాళ్ళ వెంటనే వస్తుంటే నువ్వు వద్దు అని వారించాడు శ్రీను. అన్నయ్య శ్రీను చాలాసేపు మాట్లాడుకున్నారు. అన్నయ్య కు శ్రీను ఏదో చెప్పినట్లుగా అనిపించింది. అడగడం బాగుండదని నేను అడగలేదు. అన్నయ్య మాత్రం చాలా గంభీరంగా ఉన్నాడు. నాకేసి చూసి ఇలా రా అని పిలిచి అమ్మ దగ్గరకు తీసుకెళ్ళాడు. అక్కడ అమ్మ నేను, అన్నయ్య ఉన్నాము. మిగిలిన వారు వేరే గది లో ఉన్నారు.
"అమ్మా మోసం పోయాం.. తమ్ముడి పెళ్లి విషయం లో మోసపోయాం " అన్నాడు అన్నయ్య కొంచెం కోపంగా
"ఏమైందిరా , అంతా బాగానే ఉంది గా " అంది అమ్మ .
నేను కొంత భయపడ్డాను.
అంతలో మా అన్నయ్య,
" ఏం బాగు. వాళ్ళు పెళ్లి కూతురు వయసు మనకు తక్కువ చేసి చెప్పారు. మూడేళ్లు వయసు తగ్గించి చెప్పారు. " అన్నాడు బాధగా. నా ముఖం లో రంగులు మారాయి. 3 ఏళ్లు వయసు తగ్గించి చెప్పారా, అంటే అమ్మాయి 1988 లో పుట్టిందా. నాకు 1991 లో పుట్టిందని చెప్పారు..
ఇంతలో అమ్మ
"నేను మొదటి నుండి అనుకుంటూనే ఉన్నా, అమ్మాయి పెద్దదానిలా కనిపిస్తుందని మీతో చెప్తూనే ఉన్నా. ఈ సంబంధం వద్దని అప్పుడే చెప్పా. మీరు అసలు నా మాట పడనిస్తేనా, ఒరే కామేశం అమ్మాయి మనకు వద్దు. విడి కాయితాలు ఇద్దాం. అసలు నీ కంటే పెద్దదని నా అనుమానం. వరహీనం మన కుటుంబాల్లో ఎక్కడన్నా ఉందా.. వూళ్ళో తెలిస్తే ఎంత అవమానం" అంటూ మా CBN ని తిడుతూనే ఉంది.
అసలే అవ్వక అవ్వక 34 ఏళ్ళకి పెళ్లి అయ్యింది. ఇప్పుడు దీనికి విడాకులు ఇస్తే నా గతేం కాను. నేను విడాకులు అంటే మా CBN దేశం అంతా ఉన్నవి లేనివి చెప్పిగబ్బు లేపి మరో పెళ్లి కూడా కానివ్వడు. ఇప్పుడు ఎలా రా దేవుడా అనుకుంటూ..
" అన్నయ్య ఇలా రా" అని మా ఆన్నయ్యని పక్కకి తీసుకెళ్ళి..
"ఏంట్రా ఈ గోల . ఏదైనా విషయం ఉంటే డైరెక్ట్ గా నాకు చెప్పకుండా అమ్మకు ఎందుకు చెప్పావు . అసలు ఈ విషయం నీకేలా తెలిసింది " అని అడిగా
"శ్రీను చెప్పాడు. మీ మామ మాములోడు కాదంట. వాళ్ళకి పెళ్లి కమిషన్ ఎగ్గొట్టాడంట ఇంతవరకు ఇవ్వలేదంట . ఎప్పుడు అడిగినా ఇదిగో అదిగో అంటూ మాట దాటేస్తున్నాడంట. శ్రీను మొన్నీ మధ్య గట్టిగా అడిగితే వాడి గురించి అందరి దగ్గర వరష్టుగా మాట్లాడుతున్నాడంట . ఇప్పుడు నా దగ్గర లేవు. నా దగ్గర ఉన్నప్పుడే డబ్బు ఇస్తా అని ఎదురు తిరిగాడంట . అమ్మాయి ఏజ్ తగ్గించిన విషయం ఎవ్వరికీ చెప్పొద్దు. మీ డబ్బు వెంటనే సర్దుతా అని శ్రీను ని ఇప్పుడు బ్రతిమాలు తున్నాడంట. శ్రీను కూడా నీకు ఈ విషయం చెప్పొద్దన్నాడు. కానీ నాకు మనసు ఆగలేదు. అందుకే చెప్పేసా " అన్నాడు తాపీగా, మా అన్న
మా అన్నయ్య, మా అమ్మ ఒకటే గోల మీ మామ ని అడుగు అని . నాలుగు మాటలు దులుపుదాం అని మా అమ్మ ఒకటే గోల. తిరుమల చుట్టూ ప్రక్కల అన్నీ చూసి మళ్ళీ కాటేజ్ కి చేరాం. మా అమ్మ , అన్నయ్యలు శాంతించ లేదు. మీ మామ ని పిలిచి అడుగుదాం అని ఒకటే నస. నాకు అసలు శాంతి లేదు. ఆ రాత్రి నిద్రా లేదు.
శ్రీను వచ్చి వెళ్ళినప్పటి నుండి మా మామ, నా భార్య మౌనంగా ఉన్నారు. నోట మాట లేదు. ఎవరో మంత్రం వేసి నోరు కట్టేసినట్లుగా సైలెంట్ గా ఉన్నారు.
ఇక ప్రొద్దున్నే నిద్ర లేచాక మా అమ్మ గోల ఇంకా ఎక్కువ అయ్యింది.
"నువ్వు మీ మామ ను దులపక పోతే నేను చావనైనా చస్తాను గాని ఇంటి రాను. ఒరే పెద్దోడా ఇక్కడే ఎక్కడన్నా వృద్ద ఆశ్రమం ఉందేమో చూడు. నా వాటా ఆస్తి ఆశ్రమం కు ఇచ్చి ఇక్కడే ఉంటా. నా మాట అంటే అస్సలు విలువ లేదు." అంది నిష్టూరంగా.
మా అన్నయ్య కూడా కల్పించుకొని
" నా మాటకు విలువ లేనప్పుడు నేను మాత్రం ఎందుకు కలిసి ఉండాలి . నా వాటా ఇంటిని అమ్మేసి వేరే ఊరికి ట్రాన్సఫర్ చేయించుకొని వెళతా " అన్నాడు.
ఇద్దరు కోపంలో అన్నంత పని చేసేటట్లుగా ఉన్నారు.
ఇక లాభం లేదనుకొని నేను..
"మా CBN ని ఆడగలేను. అడిగితే చాలా ప్రమాదం. అమ్మాయి ఏజ్ తగ్గించారని అని మనం గొడవ పడితే సమస్య ఇంకా పెద్దది అవుతుంది. దయచేసి సైలెంట్ గా ఉండండి" అన్నాను.
"అంత భయం ఎందుకురా నీకు. ప్రమాదం ఎట్లా? మేమింకా చావలేదుగా. ప్రమాదం లేదు కాకరకాయ లేదు. వాడి ని పిల్చి కడిగేసెయ్ " అంది అమ్మ.
"నీకు తెలీదు. నా మాట విను" అన్నాను .
"ఏం కాదు . నువ్వు నడు నేను మీ మామ ని పిల్చుకొస్తా " అని కుర్చీలో నుండి లేవబోయాడు మా అన్నయ్య
"వద్దన్నా నా మాట విను. ఇప్పుడు అటువంటి పంచాయితీ లు పెట్టొద్దు. అసలు సంగతి ఏంటంటే పెళ్లి టైమ్ లో నా వయసు కూడా నేను ఒక 2 ఏళ్లు తగ్గించి చెప్పాను. అది ప్రమాదం " అన్నాను చిన్నగా.
అన్నయ్య, అమ్మ ఒక్కసారి ముఖ ముఖాలు చూసుకున్నారు.
" నీకేం పోయేకాలం వచ్చిందిరా. వయసు ఎందుకు తగ్గించి చెప్పావ్" అంది అమ్మ కోపంగా .
"ఏం చేయను 30 దాటినా పెళ్లి అవ్వడం లేదు. నిజమైన డేట్ ఆఫ్ బర్త్ చెప్తే ఎవ్వరూ ముందుకు రావట్లేదు. అందుకే నేను ఆ ప్రభాకర్ గాడి సలహా తో ఏజ్ ఒక రెండు ఏళ్లు తగ్గించి చెప్పాను. పెళ్లి వెంటనే కుదిరింది." అన్నాను చిన్నగా
"మరి పిల్ల నీ కంటే పెద్దదేమో రా.. వరహీనం అంటూ " అమ్మ మళ్ళీ మొదలెట్టింది.
" అమ్మాయి నా కంటే ఒక ఐదు నెలలు చిన్నది . వరహీనం కాదు. ఇక నోర్మూసుకో " అని గట్టిగా అరిచాను .
నిజానికి నేనుకూడా 1988 లోనే పుట్టాను. నా భార్య నా కంటే పెద్దదో ,చిన్నదో కూడా నాకు తెలీదు. ఒకవేళ పెద్దదైనా నేను ఇప్పుడు ఆమెని ఏమి చేయలేని స్థితి. అమ్మ బెంగ పెట్టుకుంటుందని నిర్మల నా కంటే చిన్నదని చెప్పా.
అప్పటి నుండి అన్నయ్య ,అమ్మ కూడా సైలెంట్ గా ఉన్నారు. వాళ్ళ నోటి వెంట ఒక్క మాట కూడా రాలేదు. క్షేమంగా ఇంటికి చేరాం. CBN వాళ్ళ వూరికి వెళ్ళాడు.
నేను 2 ఏళ్లు తక్కువ చేసి చెప్పిన విషయం నా భార్యకు తెలీదు కాబట్టి సరిపోయింది. 3 ఏళ్లు తగ్గించి ఎందుకు చెప్పారని నా భార్యని గాని , వాళ్ళ నాన్న ని గాని అడిగితే .. మా మామ రచ్చ రచ్చ చేసి పరువు తీస్తాడు. ఈ గోల లో నా వయసు రహస్యం కూడా బయటకు వస్తుంది. అప్పుడు జీవితాంతం ఇద్దరి CBN ల చేతుల్లో నాకు భజనే. కాబట్టి నేను మా అమ్మ అన్నయ్య అందరూ నోరు మూసుకొని ఉన్నాం.
నా వయసు రహస్యం నిర్మలకు తెలీదు. ఇంకా చెప్పాల్సిన అవసరం కూడా రాదు.
నా దైనందిన కార్యక్రమాలలో మునిగిపోయా..
అసలు రహస్యం ఏమంటే, కామేశం వయసు రెండు ఏళ్లు తక్కువ చేసి చెప్పారన్న విషయం నిర్మలకు ఆల్రెడీ తెలుసు. నిర్మలను చూడడానికి వచ్చేటప్పుడు నిజమైన డేట్ ఆఫ్ బర్త్ చెప్పొద్దనీ, అలా చెపితే పెళ్లి అవ్వడం కష్టం అని శ్రీను, నిర్మలను ను ఒప్పించి నిర్మల వయసుని 3 ఏళ్లు తగ్గించి చెప్పాడు.
పెళ్లి అయ్యాక ఏదైనా సమస్య వస్తుందేమో అనే సందేహాన్నినిర్మల వెలిబుచ్చింది . అప్పుడు శ్రీను..
"భయం అవసరం లేదు. అబ్బాయి కూడా తన ఏజ్ ని 2 ఏళ్లు తగ్గించి చెప్పాడు." అని అసలు విషయాన్ని నెమ్మదిగా చెప్పాడు.
నిర్మలకు తన వయసు రహస్యం తెలీదన్న భ్రాంతిలో కామేశం ఉన్నాడు. నిర్మల కూడా తన వయసు రహస్యం కామేశానికి తెలీదు అన్న ధైర్యం తో ఉంది. కామేశం వయసు రహస్యం నిర్మలకు తెలిసినా, తెలియనట్లుగానే ఉంది. ఎందుకంటే అసలు విషయం బయటకు వస్తే తన కాపురానికే ఎసరు రావొచ్చు మరి..
ఇక
వరహీనం అంటారా ఆ విషయం దేవునికే ఎరుక. కామేశం తల్లి గారికి మాత్రం కోడలు తన కొడుకు కంటే పెద్దదన్న అనుమానం రోజు రోజుకు బలపడింది. తన మనశ్శాంతిని కోల్పోయింది. ఇప్పుడు ఏమి చేయలేని స్థితి .. ఏమైనా అందామా అంటే కొడుకు విషయం బయటకు వస్తుందని లోలోపలే CBN ని, కోడల్ని తిట్టుకుంటూనే కాలం గడుపుతోంది.
ఇక CBN విషయానికి వస్తే షరా మామూలే|||
అడ్డు అదుపు లేకుండా వాగుతూ ఊరి జనాలకు వినోదం పంచుతూనే ఉన్నాడు. ఇక చిన్న CBN అంటే నిర్మల మాత్రం కామేశాన్ని అర్ధం పర్ధం లేని పిచ్చి వాగుడుతో విసిగిస్తూనే ఉంది.
నిజానికి ఈ ఇద్దరి CBN ల నోరు మూయించడం బ్రహ్మ గారి తరం కూడా కాదేమో||
దాంపత్యం బాగుంది కాబట్టి. ఈ విషయాలు ఏమి ఇక చర్చకు రావు. ఇక ఎప్పటికీ రావు. .
సమాప్తం