సాహితీవనం - వనం వేంకట వరప్రసాదరావు

sahiteevanam

అల్లసాని పెద్దన విరచిత స్వారోచిష మనుసంభవము

(గతసంచిక తరువాయి)

స్వరోచి, మనోరమ సుగంధ జలాలతో స్నానమాడి, మేలైనవలువలు ధరించి, వివాహమంటపానికి బయలుదేరారు. ఇక్కడ ‘ఆంధ్ర సాహిత్యంలో అద్భుతమైన వర్ణనలలో శ్రేష్ఠమైన వర్ణనల సమాహారం’ అనదగ్గ వర్ణన చేశాడు పెద్దన.  పదకొండు పద్యాలలో ఆ రాచనగరిలోని రమణీమణులు స్వరోచిని చూడడానికి ఎలా త్వరపడ్డారో, ఎలా ఎగబడ్డారో, ఎలా విరగబడ్డారో, ఆతని అందచందాలను చూసి ఎలా కలవరపడ్డారో వర్ణించాడు. సరసమైన, శృంగారభరితమైన చిలిపివర్ణనలు, మహోన్నతమైన వర్ణనలు చేశాడు. ఇది ప్రబంధం కనుక శృంగార రసానికి ప్రత్యేకమైన, ప్రథానమైన స్థానం ఉన్నది కనుక ఇలా చేశాడు అని మాత్రమే అనుకోడానికి వీల్లేదు.  పదకొండు పద్యాలలో పదకొండుమంది స్త్రీల శారీరక, మానసిక స్థితిని రసమయంగా, సరసమయంగా, నవరసమయంగా, చివరిలో పవిత్రంగా, పెద్దరికంగాకూడా, వర్ణన చేశాడు.

త్వక్ చక్షు శ్శోత్ర రసన ఘ్రాణేంద్రియాలు ( చర్మము కనులు చెవులు జిహ్వ నాసిక) అనేవి పంచ జ్ఞానేంద్రియాలు.

వాక్ పాణి పాద పాయు ఉపస్థలు ( పలికే పెదవులు మొదలైనవి, చేతులు, పాదాలు, విసర్జకావయవము,

కామసుఖాన్ని పొందడానికి ఉపయోగించే అవయవము) యివి పంచ కర్మేంద్రియాలు. ఈ పది ఇంద్రియములకు

నేత మనసు అనే మహా ఇంద్రియం. ఈ పదకొండు ఇంద్రియాలను లగ్నం చేసి పరమాత్మను సేవించడమే ఏకాదశీ వ్రతం ఆధ్యాత్మికంగా. ఇక్కడ ఇందీవరాక్షుని రాచనగరిలోని స్త్రీలు ఈ ఏకాదశేంద్రియ వ్యాపారాన్ని స్వరోచికి అప్పజెప్పి, ఇతర ప్రపంచ ధ్యాసను కోల్పోయి, ఉనికి అన్నది మొత్తమును స్వరోచికే అంకితం చేసి ఆతని అందానికి ముగ్ధులై చూశారు అని చెప్పడానికే ప్రతీకాత్మకంగా (‘సింబాలిక్’గా) పదకొండు పద్యాలలో ఈ వర్ణనలు చేశాడు పెద్దన. మనుచరిత్ర అంటే ‘వరూథినీ ప్రవరాఖ్యుల కథ’ తప్ప ఏమున్నది అనుకునేవారు ఎక్కువ. దానికి కారణం పండితులు, సాహితీవేత్తలు ఎక్కువగా ఆ ఘట్టాన్ని గురించి మాత్రమే ప్రసంగించడం, ఆ ఘట్టంలోని నాటకీయత, వరూథినీ, ప్రవరుల పాత్ర పోషణం, కథలోని నీతి ఇవన్నీ. కానీ మనుచరిత్ర అంటే వరూథినీ ప్రవరాఖ్యుల కథ మాత్రమే అనుకుంటే పెద్దన పెద్దరికాన్ని గుర్తించకపోవడం అనే దోషము, అద్భుతమైన ప్రబంధంలోని అందచందాలను పూర్తిగా అందుకోలేకపోవడం అనే లోపము వాటిల్లుతాయి కనుక ఆ దోషాన్ని, లోపాన్ని నివారించడం కోసమే ఈ వ్యాసకర్త వరూథినీ ప్రవరాఖ్యులకథలో ముఖ్యమైన పద్యాలను  మాత్రమే స్పృశించి, ప్రబంధంలో మిగిలిన

ఆశ్వాసాలను దాదాపూ ప్రతి పద్యాన్నీ పూర్తిగా పరామర్శ చేస్తున్నాడు, ‘గో తెలుగు’ పత్రిక వారి పూర్తి సహకారం ఇందుకు లభిస్తున్నందుకు వారికీ ధన్యవాదాలు! అద్భుతమైన ఈ ఘట్టములోని పదకొండు పద్యాలనూ రుచిచూడడానికి మన ఏకాదశేంద్రియాలను కూడా లగ్నం చేద్దాం, బ్రహ్మానంద సహోదరమైన సాహిత్య రసానందాన్ని పొందుదాం.

అత్తఱిఁ బట్టణంబు వికచాంబురుహాక్షులు కౌతుకంబునం
జిత్తము లుల్లసిల్లఁ గయిసేసి గృహాంగన సౌధ మాలికల్‌
హత్తి నరేంద్రవీథిఁ జతురంగబలంబులుఁ గొల్వఁగా మరు
న్మత్తగజంబుపైఁ జను కుమార శిరోమణిఁ జూచి రుబ్బునన్‌.

ఆ సమయంలో ఆ పట్టణంలోని వికసించిన పద్మములవంటి కనులున్న అందగత్తెలు కుతూహలంతో సంబరంగా అలంకరించుకుని( అలంకరించుకోవడం ఎందుకూ అంటే ఆతని దృష్టిలో పడడం కోసము, తర్వాత వివాహ వేడుకలకు ఎలాగూ వెళ్తారు గనుక కూడా) ఇళ్ళ మేడలమీద అలంకరణగా వ్రేలాడదీసిన మాలికలకు హత్తుకుపోయి, రాజవీథిలో చతురంగబలాలు సేవిస్తుండగా, ఐరావతము అనే మదగజముమీద ఊరేగి వెళ్తున్న శ్రేష్ఠుడైన పెళ్లికుమారుడిని (కుమార శిరోమణిని) అబ్బురపడుతూ ఉబ్బపోతూ చూశారు.  

అంచెలు గట్టి కాలి తొడుపై చననీవు గదమ్మ ప్రోదిరా
యంచ లివేటి సంగడము లయ్యెను? దయ్యమ! యేటివేడ్క నా
కంచుఁ బదంబునన్‌ మొరయు నందియ యూడఁగఁ దన్నిపోయి వీ
క్షించె లతాంగి యోర్తు మురజిన్నిభు సాగరమేఖలావిభున్‌.

ఒక ఇంట్లో సుందరీమణి రాయంచలను పెంచుకుంటున్నది. పెంపుడు జంతువులు ఏవైనా తమ యజమానులు ఎటు వెళ్తే అటు కాళ్ళల్లో కాళ్ళల్లో తిరుగుతూ ఉంటాయి. ఈ రాజహంసలు కూడా ఆ సుందరి ఊరేగింపు కోలాహాలాన్ని విని, చప్పున లేచి చూడడానికి వస్తుంటే, కాళ్ళకు ఆడుపడ్డాయి, అవికూడా ఆమెను అనుసరించి రావడానికి ప్రయత్నం చేస్తూ. ‘ బారులు గట్టి గుంపులు గుంపులుగా, కాళ్ళకు బంధాలై, అడుగేయనీయవు కదా ఈ రాయంచలు, ఎక్కడి గుంపు పోగైంది నాకు, దైవమా! నాకు ఇదెక్కడి సంబరం! అంటూ కాలికి ఉన్న ఆభరణములోని (కాలిపట్టె) అందె ఊడిపడేట్టు ఆ హంసలను ఒక్క తన్ను తన్ని, గబగబా వెళ్లి మురాంతకుడైన శ్రీకృష్ణునితో సమానుడైన అందగాడైన స్వరోచిని, సాగరం వడ్డాణంలా కలిగిన విశాలమైన పృథ్వికి రాజైన స్వరోచిని చూసింది ఆ సుందరి. 

వలపులపల్లవుం డొకఁడు వట్టిచలంబున నేఁప దీనయై
యలుకలు తీర్చితీర్చి యొక యచ్చర వచ్చి నృపాలు నన్నగ
ర్వెలువడి చూచెఁ గాముకుఁడు వెంటనె రా నపుడాత్తఘర్మయై
వెలవెలఁబాఱె దన్ముఖము వెల్వెలఁబాఱె విటాననాబ్జమున్‌.

మరొక ఇంట్లో మరొక కథ! ఆ ఇంట్లో ఉన్న అప్సరకు ఆమె ప్రియుడికీ ప్రణయకలహం నడుస్తున్నది, ఎప్పటినుండో మరి! ఆ ప్రియుడు ఉత్తుత్తిగానే, కోపంతో వేధిస్తుంటే, దీనయై, వాణ్ని సాగదీసి, సాగదీసి, వాడి అలకలు తీర్చి వచ్చి, రాచనగరు బయల్వెడలి ఊరేగి వెళ్తున్న స్వరోచిని చూసింది అబ్బురపడుతూ. ఆమెనే వెన్నంటి వచ్చిన ఆమె ప్రియుడు కూడా ఆ ఊరేగింపును, స్వరోచిని చూడగానే, ఆమెకు ముచ్చెమటలు పోశాయి, ముఖం తెల్లబోయింది, ఆమె ప్రియుడికి కూడా తెల్లముఖం అయ్యింది.భార్యాభర్తలమధ్య ఉన్న అనుమానాలకన్నా ఎక్కువగా ప్రేయసీ ప్రియులమధ్య అనుమానాలు ఉంటాయి, బహుశా అలాంటి అనుమానాలతోనే ఆమెను వేధిస్తూ ఉన్నాడు ఆమె ప్రియుడు. ‘నేనలాంటిదాన్ని కాను, ఇలాంటిదాన్ని కాను’ అని ఏవేవో చెప్పి, నీకంటే నాకెవరూ లేరు అని నచ్చజెప్పి వచ్చి, మైమరచి స్వరోచిని చూస్తున్నదామె, వెనకనే వచ్చి చూస్తున్న ప్రియుడిని చూసి ‘ ఏంటి? నాకన్నా అందగాడు అని మైమరచి, ఎగా దిగా చూస్తున్నావా, యిందుకేనా ఇంత అలంకరించుకున్నావు? ఇప్పటిదాకా నువ్వు చెప్పిన కల్లబొల్లి కబుర్లను నమ్మాను అనుకుని సంబరపడ్డావా?నీ సంగతి తెలియదనుకున్నావా?’ అని మరలా ఆ అనుమానపు పక్షి తన వేధింపులు మొదలెడతాడేమో అన్న భయముతోనో, లేదూ అంటే స్వరోచి అందాన్ని చూసి మన్మథ భావంతోనో ఆమెకు ముచ్చెమటలు పోశాయి, ముఖము తెల్లబడ్డది, వివర్ణమైపోయింది. గురుదేవుడు, దేవుడు, ప్రభువు కనికరించినపుడు, ప్రియుడిని, ప్రియురాలిని కలిసినపుడు, కోరిన కోరికలు తీరినప్పుడు హర్షం కలుగుతుంది. ఆ హర్షం ఎనిమిది విధాలుగా వ్యక్తమవుతుంది. వీటిని సాత్విక భావాలు అన్నారు. ప్రళయము, స్తంభము, కంపము, రోమాంచము, స్వేదము, వైవర్ణ్యము, వైస్వర్యము, అశ్రుపాతము అనే ఎనిమిది విధాలైన భావాలు అవి. ప్రళయం వచ్చినట్టు తీవ్రంగా ఉద్వేగంతో చలించిపోవడం, స్థాణువై నిశ్చలమైపోవడం, శరీరము కంపించిపోవడం, రోమాంచమైపోవడం, చెమటలు పోయడం, శరీరము-ముఖము వివర్ణమై పాలిపోవడం, గొంతు జీరబోయి డగ్గుత్తిక పడడం, అశ్రుధారలు కారడం-ఇవీ ఆ ఎనిమిది భావాలు. యిలా ఆమె స్వరోచిమీది మోహంతో మన్మథ భావముతోనో, ప్రియుడిపట్ల భయముతోనో తెల్లబోయింది. ఆ ప్రియుడు మాత్రం కోపంతోనో, ‘రాజును చూసిన మొహంతో మొగుణ్ణి చూస్తే మొట్టబుద్ధైంది అన్నట్టు ఇంకా నేనేం ఈమె చూపులకు నచ్చుతాను?’ అనుకోవడంవల్లనో అతని ముఖం కూడా తెల్లబోయింది.    

చిలుకలకొల్కి కల్కి యొక చేడియ నాటకసాల మేడపై
నిలువున నాడుచుండి ధరణీపతిఁ జూడఁ దలంచి యంచునన్‌
నిలిచి రహిం గనుంగొనుచు నెయ్యమునం దనువల్లి యుబ్బి కం
చెల తెగిపడ్డఁ గేతనము చీరచెఱంగున మూసెఁ జన్నులన్‌.

మరొక మదవతి కథ మరొక రకంగా ఉంది. ఆ చిలుకలకొల్కి తన మేడపై నాట్యశాలలో నాట్యం చేస్తున్నదల్లా స్వరోచిని చూడాలనుకుని, మేడచివరికి వచ్చి మైమరచి స్వరోచినే చూడడంతో మన్మథభావముతో తీగవంటి శరీరము, వక్షోజములు ఉబ్బి, రవిక బొందులు తెగిపోయి ఊడిపోగా, చప్పున ఆ మేడమీద ఉన్న జెండాకొయ్యకున్న గుడ్డచాటున తన వక్షోజములను కనబడకుండా దాచుకున్నది! కొలకులు అంటే చివరలు, అంచులు, కనుకొలకులు అంటే కనులకొసలు. చిలుకల కళ్ళు ఎర్రగా ఉండడం తెలిసిందే, అలా ఎర్రని కనుకొలకులు ఉన్న కల్కి చిలుకలకొల్కి! చిలుకముక్కులాగా ఎర్రగా ఉన్న కనులున్న స్త్రీకూడా చిలుకలకొల్కి అని మరొక భావన. మన్మథభావముతో, కోరికతో కనులు ఎర్రబడ్డాయి కనుక అంతకుముందు సంగతి తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఆమె చిలుకలకొల్కి అనడంలో తప్పేమీ లేదు!

కీరమనోజ్ఞవాణి యొక కిన్నరి కిన్నెర మీటి మీటి యొ
య్యారపులీల నేఁగి వసుధాధిపుఁ గన్గొనె జిల్గుపయ్యెదన్‌
హారముఁ జక్కఁ బెట్టెడు కుచాహితహస్తముపైఁడిగోళ్ళు హిం
సారతిసేయు (హింసారతి నేయు)దర్పకుని సంపెఁగముల్కులుఁబోలె మించఁగన్‌.

చిలుకల పలుకుల్లా ముద్దుపలుకులు పలికే మరొక కిన్నెరచిన్నది, ముద్దులొలికే మోమున్నది, అప్పటిదాకా కిన్నెర వీణ మీటి మీటి, ఊరేగింపు కోలాహాలాన్ని విని, వయ్యారంగా నడుస్తూ వెళ్లి, స్వరోచి చక్రవర్తిని చూసింది. గుండెల్లో ఏదో గుబులు కలుక్కుమంది. నాజూకైన బంగారుపైట (జిల్గు పయ్యెద) తొలిగిపోయింది. దాన్ని సరిజేసుకోడానికి అన్నట్లు వక్షోజములపై చేర్చిన చేతికి అప్పటిదాకా వీణ వాయించడంకోసం పెట్టుకున్న బంగారపు గోళ్ళు అలాగే ఉన్నాయి. వీణ వాయించేప్పుడు వ్రేళ్ళు తీగలకు తగిలి గాయపడకుండా కృత్రిమమైన గోళ్ళు పెట్టుకోవడం సహజమే కదా. ఆమె తన స్తనములపై చేతిని పెట్టుకున్నప్పుడు, ఆ చేతి వ్రేళ్ళకున్న బంగారు గోళ్ళు ‘హింసారతి చేస్తున్న’ మోటుశృంగారచేష్ట చేస్తున్న మన్మథుని సంపెంగములుకుల్లా ఉన్నాయి చూడడానికి! పరవశదైన్య మాడుకొను ప్రౌఢలఁ గానదు, ఘర్మవారిచేఁ

గరఁగి స్రవించుచిత్రకము గాన, దనాదృత వీటి పాటలా
ధరమున సున్న మంటిన విధంబును గానదు, నవ్వుటాల కా
భరణము గొన్నఁ గాన దొక బాల నృపాలుని జూచి నివ్వెఱన్‌.

మరొక బాల గోల మరీ వింతగా ఉంది. పదహారేళ్లలోపు స్త్రీ బాల అని, ఆపైన ముప్పై దాకా తరుణీ అని, ఆపైన యాభై ఐదు దాకా ప్రౌఢ అని, ఆపైన వృద్ధురాలు అని అనబడుతుంది. పదహారేళ్ళ పడుచుపిల్ల గనుక మరీ పరవశించింది స్వరోచి అందానికి. ఆ పరవశంతో, స్వరోచివశం ఐన మనసుతో, దీనురాలై, తనతో వెక్కిరింతల పలుకులతో ఆడుకుంటున్న ప్రౌఢలను చూడలేదు, ముచ్చెమటలు పట్టి, కారిపోతున్న తిలకాన్ని పట్టించుకోలేదు, నిరాసక్తంగా వేసుకున్న తాంబూలపు సున్నము ఎర్రబడిన క్రిందిపెదవికి అంటుకున్న సంగతీ చూసుకోలేదు, నవ్వుటాలకు తన ఆభరణాన్ని వేరొకర్తె లాక్కున్న సంగతీ పట్టించుకోలేదు, అలాగే నివ్వెరపోయి ‘ప్రవరుడిని చూసిన వరూథినిలా’ అలా చూస్తుండిపోయింది.  

అలికులవేణి యొక్కతె రతాంతమునం దనయంగవల్లికంబులకలు
చొక్కు లేఁజెమరుఁ బుట్టఁగ నేఁగి నరేంద్రుఁ జూడ నా
పులకలు చొక్కు లేఁజెమరుఁ బోవక యట్టుల యుండె నట్టి దౌఁ
జెలు వగువానిఁ గన్గొనిన చెల్వకుఁ జూపుల కావె కూటముల్‌?

తుమ్మెదలబారువంటి నల్లని కేశపాశములున్న ‘నవల’ ఒకతె రతికేళిముగించి, పులకలు రేగి, లేత చెమటలు పోసి, ఇంతలో ఆ ఊరేగింపు సంరంభాన్ని విని, వెళ్లి స్వరోచిని అలా చూస్తుండిపోయింది, ఆమె శరీరంపై రేగిన పులకలు, పుట్టిన చెమటలు అలాగే ఉండిపోయాయి, అంతేకదా, చూడచక్కనివాడిని, మక్కువైనవాడిని చూసే చూపులే దరిదాపులై తనువంతా తీయని తీపులైపోతాయి కాదా?

అలరులబంతి జృంభికకు నడ్డము సేయుచుఁ గర్ణపాళిపై
కలకలఁ ద్రోయుచుం దరఁగ లౌ ప్రమదాశ్రులు గోట మీటుచుం
జెలి భుజపీఠి నొత్తగిలి చిల్కను దువ్వుచు వాలుఁగన్నుఁ గ్రే
వల కుదధార చేర నొక వారవిలాసిని చూచె రాసుతున్‌.

ఒక అలరుబోడి, ఒక వారకాంత ఆవులింత వస్తుంటే నోటికి అడ్డుగా పెట్టుకున్న చేత్తోనే ముంగురులను చెవులమీదికి తోసుకుంటూ, స్వరోచిని చూసి కలిగిన పారవశ్యపు ఆనందబాష్పాలను గోటితో మీటుతూ, ప్రక్కన ఉన్న చెలికత్తె భుజముమీద తలవాల్చి, తన భుజము మీద ఉన్న చిలుకను దువ్వుతూ, వాలుగన్నులనుండి చెక్కిళ్ళమీదికి కారుతున్న (మద)జలముతో స్వరోచిని చూసింది.

జిలుఁగులఁ బెట్టుచుం దొడలఁ జెంద్రికపావడ యంట మైతడిం
బెళపెళ లేనిచీరఁ గటి బింకపుఁజన్నులఁ జేర్చికొంచు వే
జలకము లాడియాడి యొక చాన కరస్థితకేశ యై నృపు
న్వెలువడి చూచె లోఁబడితి నీ కని బాసకు నిల్చెనో యనన్‌.

ఒక వనిత అప్పటిదాకా స్నానం చేసీ చేసీ ఒళ్లంతా నాని నాని ఉన్నది, ఆత్రుతగా తుడుచుకోడానికి పెట్టుకున్న సన్న వస్త్రాన్ని, చిన్న వస్త్రాన్ని ఆదరా బాదరా చుట్టుకుంటూ, చంద్రకావి రంగులోనున్న లోపటి పావడా(లోపటి లంగా, గాగర/గాగ్రా) తడిసి తొడలకు అలాగే అంటుకుపోయి, ఫెళ ఫెళలాడకుండా, తడిసి మెత్తబడ్డ వస్త్రాన్ని, కేవలం తుడుచుకోడానికి పెట్టుకున్న చిన్నవస్త్రముతో ఉండీ లేనట్టున్న పొంకపు నడుమును, బిరుసైన బింకపు స్తనములను కప్పుకోడానికి సతమతమౌతూ, నీళ్ళుకారుతున్న కేశపాశాన్ని అలాగే చేత్తో పట్టుకుని బయటకొచ్చి, ‘నీకు లొంగిపోయాను, ప్రమాణం చేసి చెబుతున్నాను’ అంటున్నట్లు అలానే చూస్తూ నిలబడిపోయింది. భగవంతునిముందు, రాజుముందు, న్యాయస్థానములో స్నానం చేసి, తడిబట్టలతో, తడి జుట్టుతో ప్రమాణం చేయడం ప్రాచీన సాంప్రదాయం, దాన్ని ధ్వనిస్తున్నాడు పెద్దన, ఆ వనిత స్వరోచికి లోబడిపోయినట్లు ప్రమాణం చేస్తున్నట్లు ఉన్నది చూడడానికి అని!

ఒకనేత్రాంబుజ మొక్కగల్ల మొకచన్నొయ్యారపున్‌లీల వీ
థికిఁ దోఁపన్‌ దలుపోరఁగా నొక పురంధ్రీరత్న మీక్షించె రా
జకిశోరంబుఁ దదీయలై వెలయుభాషాలక్ష్ములం జూచి త్ర్యం
బకభాగంబు మొఱంగి మైత్రికి శివాభాగంబ యేతెంచెనాన్‌.
 

మరొక స్త్రీ ప్రసన్నభావముతో, ప్రేమతో, పెద్దరికంతో, పాతివ్రత్యముతో, బిడియము కుతూహలము కలగొని, ఇంటి తలుపులను వారగా తీసి, సగము శరీరము తలుపుల వెనుక దాగి ఉండగా సగము శరీరము బయటకు కనిపించేట్లుగా, ఒక పద్మమువంటి కన్ను, ఒక చెంప, ఒక వక్షోజము వయ్యారముగా వీథిలో వెళ్లేవారికి కనిపించేట్లుగా రాజకిశోరాన్ని, స్వరోచిని చూసింది. అలా చూస్తుంటే శివునిఅర్థభాగమైన పార్వతీదేవి ‘స్వరోచికి వశులైన సరస్వతీదేవిని, లక్ష్మీదేవిని(దదీయలై వెలయుభాషాలక్ష్ములం)మైత్రీ భావముతో చూడడంకోసం, చేరడంకోసం, తన అర్థభాగమైన ముక్కంటి భాగాన్ని మరుగుపరచి (త్ర్యంబకభాగంబు మొఱంగి)ముక్కంటికి సగభాగమైన సగము శరీరముతో వచ్చిన పార్వతీదేవిలా ఉన్నది. అనంతమైన ‘ పెద్దన కవితాకాశము ఈ పద్యం’. ఆ కవితాగగనంలోని అందమైన మెరుపు రాజకిశోరుడిని చూసింది(ఈక్షించెన్ రాజకిశోరంబున్) అన్న పదం!  కిశోరుడు అంటే బాలుడు, కుమారుడు. ఆమె పురంధ్రీరత్నము, పతివ్రతల మేలుబంతి ఐన పార్వతీదేవి, ఆదిమంగళ, సర్వమంగళ, సకలజగములను కన్నతల్లి, కనుక మాతృభావముతో, అర్థనారీతత్త్వముతో, శుభదృష్టితో కుమారుడైన స్వరోచిని చూస్తున్నది! ఈ ఒక్క పద్యం చాలు, ఆముక్తమాల్యద’ను రచించినచేతులు తొడిగిన గండపెండేరమునుధరించిన పాదములను ఆనందాశ్రువులు నిండిన కనులతో సాష్టాంగవందనం చేసి స్పృశించడానికి! కవిసోదరులకులానికి పెద్దన్నా! నీకు వందనములు!  

గండపెండేరమునుధరించిన పాదములను ఆనందాశ్రువులు
నిండిన కనులతో సాష్టాంగవందనం చేసి స్పృశించడానికి
కవిసోదరులకులానికి పెద్దన్నా! నీకు వందనములు!
కలయం గూర్మిఁ జెమర్చునంగముల లగ్నంబైన సన్నంపుమం
జుల కౌశేయమునందు మించు కమల స్తోమంబుచేఁ జూచె నొ
క్కలతాతన్వి చెలంగి పొంగుమదికాంక్షల్‌ దీఱ మే నెల్లఁ గ
న్నులు గావించి కుమారుజవ్వనము చెన్నుం జూచుచందంబునన్‌.

మరొక స్త్రీ ప్రేమతో నిలువెల్లా చెమరుస్తున్న శరీరంతో, తను ధరించిన పట్టుచీరకున్న పూలబుటాలలో అద్దకం చేసిన పెద్ద పెద్ద పూలను మించిన పూవులవంటి విశాలమైన తన కన్నులతో, చెలగి, పొంగే మనసులోని కోరికలన్నీ తీరేట్లు, ఒళ్లంతా కన్నులు చేసుకుని, కుమారుని యవ్వనాన్ని, సొగసును, అందాన్ని చూస్తున్నట్లు, తల్లిలా మురిపెంగా చూసింది, తమ ప్రభువైన ఇందీవరాక్షుని గారాలపట్టి ఐన మనోరమకు సరైన వరుడు లభించాడు అని సంబరంగా చూసింది, ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న కోరిక తీరినట్లు సంతృప్తిగా చూసింది. ఇలా చూస్తున్న చూపులధారలలో తడుస్తూ, దేవేంద్రుని పట్టపు ఏనుగైన ఐరావతముమీద ఊరేగుతూ కళ్యాణవేదికను చేరుకున్నాడు స్వరోచి!

(కొనసాగింపు వచ్చేవారం)

***వనం వేంకట వరప్రసాదరావు  

మరిన్ని వ్యాసాలు