పర్యాటకం - శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం - లాస్య రామకృష్ణ

Lakshmi Narasimha Swamy Temple - Mangalagiri

ఆంధ్రప్రదేశ్ లో ని గుంటూరు జిల్లాలోని ఒక మండలం మంగళగిరి. భారత దేశం లో ని అష్టమహాక్షేత్రము ల లో ఒకటైన ప్రదేశంగా మంగళగిరి ప్రసిద్ది. హైదరాబాద్ నుండి 280 కిలోమీటర్ల దూరం లో ఈ ప్రాంతం ఉంది. మంగళగిరిలో ఉన్న ప్రముఖమైన ఆలయం శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం. ఈ ఆలయానికి చేరుకునే మెట్ల మార్గం లో కుడి వైపున విజయనగర రాజు శ్రీ కృష్ణదేవరాయ వారి శాసనాలు కనబడతాయి. ఇంకా ముందుకి వెళుతున్న కొద్దీ మహాప్రభు చైతనైయా వారి పాద ముద్రలు కనిపిస్తాయి. ఈ ఆలయానికి వెళ్ళే దారిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది.

పానకాల లక్ష్మీ నరసింహ స్వామీ ఆలయం లో కేవలం నోరు విశాలంగా తెరిచిన స్వామి వారి ముఖం మాత్రమే ఉంటుంది. ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశిపుణ్ణి వధించిన నరసింహ స్వామి అవతారం లో ఇక్కడ విష్ణుమూర్తి వెలిసారు. సుదర్శన నరసింహస్వామి గా కూడా భక్తులు స్వామి వారి ని కొలుస్తారు. ఈ ఆలయం వెనుక శ్రీ లక్ష్మీ ఆలయం ఉంటుంది. ఈ ఆలయానికి పశ్చిమాన ఉన్న సొరంగ మార్గం ద్వారా కృష్ణా నది ఒడ్డున ఉన్న ఉండవల్లి గుహలకు చేరుకోవచ్చని నమ్ముతారు.

పురాణాల ప్రకారం నముచి అనే రాక్షసుడు ఘోర తపస్సు తరువాత బ్రహ్మ దేవుడి నుండి ఒక వరం పొండుతాడు. ఆ వరం ప్రకారం పొడిగా లేదా తడిగా ఉన్న వాటితో అతనికి మరణం కలుగకూడదు. ఆ తరువాత నుండి ఇంద్రుడిని అలాగే దేవతల్ని ఆ రాక్షసుడు హింసించడం ప్రారంభిస్తాడు. మహా విష్ణువు సహకారం తో ఇంద్రుడు ఆ రాక్షసుడిని సంహరించడానికి సిద్దపడతాడు. సుక్ష్మాకారం లో ఒక గుహలో దాక్కున్న ఆ నముచిపైకి ఇంద్రుడు సముద్రపు నురుగు లో ముంచబడిన విష్ణువు యొక్క సుదర్శన చక్రాన్ని పంపుతాడు. ఆ సుదర్శన చక్రం మధ్య లో దాగి ఉన్న విష్ణుమూర్తి ఆ గుహలోకి వెళ్లి అక్కడ తన ఉపిరి ద్వారా వచ్చిన వేడితో ఆ రాక్షసుడి యొక్క ప్రాణవాయువుని నాశనం చేస్తాడు. అందువల్ల సుదర్శన నరసింహ గా పేరు వచ్చింది. ద్వాపర యుగం లో పాలవల్ల, త్రేతాయుగం లో నెయ్యి వల్ల అలాగే కలియుగం లో పానకం వల్ల స్వామి వారు శాంతి చెందుతారు అని అంటారు.

మరి యొక గాధ ప్రకారం, తన అవతారం చాలించి  వైకుంఠానికి చేరుకోబోతున్న రాముడు ఆంజనేయ స్వామి ని మంగళగిరి లో నివసించమని కోరుతాడు. ఆ తరువాత రాముల వారి ఆశీస్సులతో మంగళగిరి లో నే ఆంజనేయ స్వామి ఉంటారు. మంగళగిరి క్షేత్రపాలకుడిగా ఆంజనేయ స్వామిని కొలుస్తారు. అందువల్ల ఈ ప్రాంతాన్ని ముక్త్యాద్రి గా కూడా పిలుస్తారు. అంటే, ముక్తి ని ప్రసాదించే కొండ అని అర్ధం.

నరసింహుని(సగం సింహం సగం మనిషి) అవతారం లో ఉన్న స్వామి వారి ప్రతిమ ఇంకా స్వామి వారికి ఎడమ వైపు ఉన్న లక్ష్మీ అమ్మవారి విగ్రహాలు రాతివి. స్వామి వారికి 108 సాలిగ్రామాలతో చేసిన దండ ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. భారత, భాగవత రామయణాలలోంచి వర్ణించబడిన కొన్ని ముఖ్య సంఘటనలతో చెక్కబడిన స్వామి వారి రథం ఈ ఆలయం లో ని ప్రధాన ఆకర్షణ.  విజయనగర పరిపాలకుల ముఖ్య సేనాధిపతి అయిన తిమ్మరాజు దేవరాజు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసారు. ప్రాకారాలు, మండపాలు, గోపురాలు, భైరవ స్వామి యొక్క అయిదు ప్రతిమలు, ఊరేగింపు రధం, వివిధ వార్షికోత్సవ వేడుకల కోసం పది రకాల కోర్టులు, పూల తోటలు, సరస్సులు ఇంకా ట్యాంకుల వంటివి ఇతనే ఏర్పాటు చేశారు. ఈ ఆలయంలో ఉత్సవ విగ్రహాలను కూడా ప్రతిష్టించారు. ఈ ఆలయానికి ఉత్తరాన శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయం, దక్షిణాన సీతా రామ లక్ష్మణుల ఆలయం, పశ్చిమాన వాహనశాల ఉన్నాయి. ఈ నగరం లో  పెద్దబజార్ ఉన్న లక్ష్మీనారాయణ ఆలయం ఇంకా ఆంజనేయ మందిరం ఈ ప్రాంతం లో ఉన్న మరికొన్నిఆలయాలు.

ఈ ఆలయం లో సంవత్సరానికి ఒకసారి జరిగే పెద్ద పండుగ శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవ వేడుకలు. శ్రీకృష్ణుడి అజ్ఞ ప్రకారం ఈ వేడుకలు ధర్మరాజు చేత ప్రారంభించబడినవని అంటారు. ఫిబ్రవరి లేదా మార్చ్ నెలలలో వచ్చే ఫాల్గుణ శుద్ధ షష్టి నుండి పదకొండు రోజుల పాటు ఈ వేడుకలు జరుగుతాయి.  ఈ ఆలయం లో ని విశిష్టత ఏంటంటే పానకాన్ని స్వామి వారి నోటిలో భక్తులు పోస్తారు. ఎంత పానకం పోస్తే అందులో సగం పానకం మాత్రమే స్వామి వారు సేవిస్తారు. మిగతా పానకం బయటకి పడిపోతుంది. పానకాన్ని స్వామి వారు సేవిస్తున్న  శబ్దాన్ని ఇక్కడ గమనించవచ్చు. ఆశ్చర్యకరంగా స్వామి వారి దగ్గర ఒక్కటంటే ఒక్క చీమ కనపడదు. స్వామి వారికీ పానకం నివేదించే ఆచారం ఉండటం వల్ల పానకాల స్వామి గా ప్రాచుర్యం పొందారు. శ్రీరామ నవమి, హనుమత్జయంతి, నరసింహజయంతి మరియు ఏకాదశి పండుగలను  ఇక్కడ పెద్ద ఎత్తున నిర్వహిస్తారు.

మరిన్ని వ్యాసాలు

కృష్ణణ్ - పంజు .
కృష్ణణ్ - పంజు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సప్త బద్రి.
సప్త బద్రి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాటల పల్లకి
పాటల పల్లకి
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Idi koodaa marpe
ఇది కూడా మార్పే
- మద్దూరి నరసింహమూర్తి