విజయవాడలో 26వ పుస్తక ప్రదర్శన మహోత్సవం - దేవగుప్తం శ్రీనివాస చక్రవర్తి

Book Festival  2015

అంతర్జాల మాయాజాలంలో పడి చదువరులు కొట్టుకుపోతున్నారని ఎవరైనా అపోహలో ఉంటే, వారు ఒకసారి విజయవాడ స్వరాజ్ మైదానం సందర్శించాల్సిందే ! మధ్యాహ్నం 2గం.  నుండి రాత్రి 9గం. వరకు ప్రైమ్ టైం లో పొటెత్తుతున్న పుస్తక ప్రియులని పలకరించాల్సిందే.
ఏటేటా జనవరిలో వచ్చే ఈ చదువరుల పండగ (జనవరి1 నుండి11 వరకు)ను గత 25 సం. గా పుస్తకప్రియులు ఆదరిస్తూనే ఉన్నారు.

సింగల్ టీకయ్యే ఖర్చు నుండి, స్టార్ హోటల్ లో అయ్యే ట్రీట్ ఖర్చు వరకు విలువయిన పుస్తకాలు కొలువు తీరి భావి తరాలకు అక్షర నిదులై  విజ్ఞానార్ధులకు తరగని గనులై గృహాలను అలంకరించే మధుర జ్ఞాపికలై మనతో మమేకవడానికి ఎదురు చూస్తుంటాయి ..!

విజ్ఞానం, వినోదం, బాల సాహిత్యం, గృహఅవసరాలు, వైద్యం, సాంకేతికం, శాస్త్రీయం, సరదాలు, దైవార్చన ఇలా ఎన్నో రంగాలకి చెందిన పుస్తక స్టాళ్లు  దాదాపు 380 వరకు అందరినీ అలరిస్తున్నాయి ..

ఈ సారి కీ. శే. నవరత్న మూర్తి ప్రాంగణంలో ... స్వర్గీయ బాపు సాహిత్య వేదిక పై వివిధ పుస్తకావిష్కరణలు, చాసోజయంతి (3. 1.15), పాలగుమ్మి పద్మరాజు గారి శత జయంతి (5. 1. 15), విద్వాన్ విశ్వం గారి శతజయంతి (10.1.15) లు శోభిల్లనున్నాయి.

26 వ పుస్తక మహోత్సవం సందర్భంగా విద్యార్ధిని విద్యార్ధులకు "శ్రీ ఎల్లా ప్రగడ సుబ్బా రావు ప్రతిభా వేదిక" వద్ద పద్యాలు, జాతీయాలు, క్విజ్జులు, వక్తృత్వ పోటీలు నిర్వహించి విద్యార్ధులలో చక్కని స్ఫూర్తిని నింపడానికి ఏర్పాట్లు జరిగాయి.

సింహద్వారం వద్ద స్టాళ్ళ వివరాలతో కూడిన క్యాటలాగు అందుబాటులో ఉంచడం ఎంతో ఉపయుక్తంగా వుంది.

విదేశాల నుండి ఈ బుక్ ఫెస్టివల్ కు అనుగుణంగా తమ కుటుంబ కార్యక్రమాలను ప్లాన్ చేసుకొని వచ్చే వారి నుండి ... పోపుల డబ్బాలో దాచుకున్న చిల్లరతో  సంవత్సరానికి ఒకసారి పిల్లలకి చక్కని పుస్తకాలు కొనిచ్చి వారికి అభిరుచిని పెంచే గృహిణులు ... బాసును ఐసు చేసే పుస్తకాల కోసం వెదికే చిరుద్యోగులు .. ఈసారి నెచ్చెలికి  చక్కని పుస్తకం అందించి ప్రసన్నం చేసుకోవాలనే (పుస్తక ) ప్రేమికులు ... తమ తమ రంగాలలో మరింత ముందుకు తీసుకెళ్ళే కరదీపికల కోసం వెదికే జ్ఞానార్దులు ... భార్య పూజలకి పనికొచ్చే పుస్తకాలు తిరగేసే భర్తలు.. వరకూ అందరిని ఆకట్టు కొనే ఈ పుస్తక మహోత్సవం ... సందర్శనమ్ .. ఒక అనిర్వచనీయమైన మధుర జ్ఞాపకాలని పంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు .. !